సింగరేణిని వేజ్‌బోర్డు నుంచి తప్పించే కుట్ర
ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి వి. సీతారామయ్య
శ్రీరాంపూర్ : వేజ్‌బోర్డు నుంచి సింగరేణిని వేరుచేసే కుట్ర జరుగుతోందని ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి వి సీతారామయ్య తెలిపారు. ఆదివారం నస్పూర్‌లోని నర్సయ్య భవన్‌లో ఆర్కే 7 గని ఫిట్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేజ్‌బోర్డులో ఉంటేనే కార్మికులకు మేలు జరుగుతుందని దాని నుంచి విడగొట్టితే రాష్ట్ర ప్రభుత్వ చేతిలో కీలుబొమ్మగా మారి కార్మికులకు తీవ్ర నష్టం జరుగుతుందన్నారు. దీని వెనుక కున్న కుట్రదారులు బయటికి రావాలని డిమాండ్ చేశారు. సింగరేణి యాజమాన్యం, ప్రభుత్వం, గుర్తింపు సంఘం కలిసి కేంద్రానికి వేజ్‌బోర్డులోనే సింగరేణి ఉండేలా లేఖ రాసి వారి నిర్ధోశిత్వాన్ని నిలుపుకోవాలన్నారు.
ఇదిలా ఉంటే జూన్ 2న జరిగిన ఆవిర్భావ దినోత్సవం రోజును సింగరేణి కార్మికుల డిమాండ్లపై సీఎం ప్రసంగిస్తారని కార్మికులు ఎంతో ఆశగా ఎదురుచూస్తే నిరాశే మిగిలిందన్నారు. తదితర డిమాండ్లపై కలిసి వచ్చే సంఘాలతో కలిసి రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు. అవసరమైతే సమ్మెకు కూడా సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు.
ఈ డిమాండ్లపై జరిగే ఆందోళనల్లో కార్మికులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. సమావేశంలో ఆయూనియన్ బ్రాంచీ సెక్రెటరీ కొట్టె కిషన్‌రావు, కేంద్ర కార్యదర్శి ముస్కె సమ్మయ్య, నాయకులు అశోక్, పీ రాజేందర్, రావుల కృష్ణమూర్తి, మల్లేశ్, కోడి వెంకటేశ్‌లు పాల్గొన్నారు.