సర్వే జాప్యంపై రైతుల ఆగ్రహం
వ్యవసాయ అధికారుల నిలదీత
సుర్జాపూర్(ఖానాపూర్), న్యూస్‌లైన్ : అకాల వర్షాలతో నష్టపోయిన పంటలను సర్వే చేయాల్సిన అధికారులు జాప్యం చేయడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం గ్రామానికి వచ్చిన ఏఈవో ఖాజామోహినొద్దీన్‌పాటు సిబ్బందిని రైతులు నిలదీశారు. మండలంలోని సుర్జాపూర్, బాదన్‌కూర్తి గ్రామపంచాయతీల పరిధిలో అకాల వర్షాలకు పంటలు నష్టపోయాయి. అయినా అధికారులు సర్వే చేపట్టడం లేదు.
మండల వ్యవసాయఅధికారి రైతుల సమస్యలను పట్టించుకోవడం లేదని సూర్జాపూర్ సర్పంచ్ అంగోతు సునీతాలింబాజీ, వ్యవసాయ మార్కెట్ కమిటీ డైర్‌క్టర్ మాసుల రాజేశ్వర్, సుర్జాపూర్ మాజీ ఉపసర్పంచ్ బిక్కి చిన్నరాజన్న తెలిపారు. అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించకుండానే ఆఫీసులోనే కూర్చొని అంచనాలు వేస్తున్నారని మండిపడ్డారు. పంట నష్టంపై ఉన్నతాధికారులు పరిశీలించి అంచనా వేయాలని రైతులు కోరారు.