2016-17 నాటికి 10% వాటా లక్ష్యంయం : కెనిచిరో యోమురా
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహనరంగ కంపెనీ నిస్సాన్ మోటార్ ఇండియా 2016-17 నాటికి ప్యాసింజర్ కార్ల మార్కెట్లో 10 శాతం వాటా సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. దేశంలో కంపెనీకి ప్రస్తుతం 1-2 శాతం వాటా ఉంది. ప్రస్తుతం కార్ల మార్కెట్ మందగమనంలో ఉన్నా, ఎన్నికల తర్వాత పుంజుకుంటుందని నిస్సాన్ భారత కార్యకలాపాల ప్రెసిడెంట్ కెనిచిరో యోమురా సోమవారం తెలిపారు. కార్ల కంపెనీలకు దేశంలో అపార అవకాశాలున్నాయని పేర్కొన్నారు. ఇక్కడి నాగో ల్‌లో లక్ష్మీ నిస్సాన్ 3ఎస్ ఫెసిలిటీని ప్రారంభించిన అనంతరం మీడియాతో మాట్లాడారు. వినూత్న మోడళ్లతో కొత్త విభాగాల్లోకి ప్రవేశించడం ద్వారా లక్ష్యానికి చేరుకుంటామని చెప్పారు. 2012-13లో దేశీయంగా 37,000 కార్లు విక్రయించామని, ఈ ఏడాది రెండంకెల వృద్ధి నమోదు చేస్తామని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
వచ్చే ఏడాది డాట్సన్ గో..
గ్రూపు కంపెనీ డాట్సన్ తయారీ ‘గో’ మోడల్ కారును నిస్సాన్ 2014 తొలి నాళ్లలో దేశీయ మార్కెట్లోకి తీసుకురానుంది. ధర రూ.4 లక్షలలోపే ఉంటుంది. కంపెనీ నుంచి ప్రస్తుతం మైక్రా యాక్టివ్ ఒక్కటే రూ.4 లక్షల లోపు ధర ఉంది. ఎస్‌యూవీ కాష్‌కై కూడా వచ్చే ఏడాది మార్కెట్లోకి అడుగు పెట్టనుంది. ఏటా 1 లక్ష కార్లను ఎగుమతి చేస్తున్నట్టు కంపెనీ తెలిపింది. కాగా, మరిన్ని ఫ్రాంచైజీలను ఏర్పాటు చేస్తామని లక్ష్మి నిస్సాన్ డెరైక్టర్ కె.జైరామ్ ఈ సందర్భంగా తెలిపారు.