బావిలో శవమై కన్పించిన సెక్యూరిటీ గార్డు రమణయ్య
ప్రత్యేక హోదా వస్తే అందరం బాగుంటామంటూ లేఖ
గూడూరు: శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో ఇటీవల ఓ ప్రైవేటు ఉద్యోగి ప్రత్యేకహోదా కోసం ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన మరువక మునుపే జిల్లాలోని గూడూరు మండలం చెన్నూరులో గురువారం మరొక వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. చెన్నూరు రెండో దళితవాడకు చెందిన పల్లం రమణయ్య(40) గూడూరు సమీపంలోని ఇంజనీరింగ్ కళాశాలలో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు. అతను రెండురోజులుగా తనలోతానే మథనపడుతూ ఆందోళన చెందుతుండడాన్ని కుటుంబసభ్యులు గమనించి అడుగగా ఏమి లేదంటూ దాటవేశాడు. ఈ క్రమంలో బుధవారం రాత్రి ఇంటి నుంచి బయటకు వెళ్ళిన రమణయ్య ఎంతకు తిరిగి రాకపోవడంతో గురువారం కుటుంబసభ్యులు గాలింపు చేపట్టారు.
ఇంటికి ఫర్లాంగు దూరంలో ఉన్న బావిలో రమణయ్య మృతదేహం కనిపించింది. కుటుంబసభ్యులు అనుమానంతో ఇంట్లో రమణయ్యకు సంబంధించిన బ్యాగులను తనిఖీ చేయగా మరణ వాంగ్మూలంతో పాటు రాష్ట్రానికి ప్రత్యేకహోదా కావాలంటూ రాసిన ఉత్తరం, గ్రామసమస్యలపైన మరో ఉత్తరం, ఇతర లేఖలు కన్పించాయి. రాష్ట్రానికి ప్రత్యేకహోదా ఇవ్వాలని, వ్యవసాయ, డ్వాక్రా రుణాలు మాఫీ చేయాలని లేఖలో రమణయ్య రాశాడు. ప్రత్యేక హోదా వస్తే అందరం బాగుంటామని పేర్కొన్నాడు. అతనికి భార్య, ముగ్గురు కుమారులు ఉన్నారు.