విజయవాడ: ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా కల్పించాలన్న డిమాండ్ తో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి పిలుపు మేరకు చేపట్టిన బంద్ విజయవంతమైంది. శ్రీకాకుళం నుంచి చిత్తూరు జిల్లా వరకు అన్ని జిల్లాల్లోనూ ప్రజల నుంచి పెద్దఎత్తున స్పందన లభించింది. ఆంధ్రప్రదేశ్ సమగ్రాభివృద్ధికి ముడిపడి ఉన్నందున ప్రత్యేక హోదా ఆకాంక్షను ప్రజలు బంద్ ను విజయవంతం చేయడం ద్వారా స్పష్టం చేశారు. ఎక్కడికక్కడ వైఎస్సార్ కాంగ్రెస్ నాయకులు, పార్టీ శ్రేణులు వీధుల్లోకి వచ్చి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనంటూ నినదించారు. వ్యాపారస్తులు, కార్మికులు, కర్షకులు, ఉద్యోగస్తులు, మహిళలు పెద్ద ఎత్తున బంద్ లో పాల్గొని సంపూర్ణ మద్దతు తెలియజేశారు. ఉదయం నుంచే ప్రజలు గుంపులుగా వీధుల్లోకి వచ్చి బంద్ లో పాల్గొన్నారు. ప్రతి పట్టణంలోనూ తమదైన శైలిలో నిరసనలు వ్యక్తం చేశారు.
(మరిన్ని ఫోటోల కోసం..)
బంద్ ను విఫలం చేయడానికి ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులను ఉపయోగించి నాయకులను ఎక్కడికక్కడ అరెస్టులు చేయించింది. ఇళ్లల్లోంచి బయటకు వస్తూనే కొందరు నేతలను అరెస్టులు చేసి సాయంత్రం వరకు వదిలిపెట్టలేదు. బస్సు డిపోల వద్ద భారీ సంఖ్యలో పోలీసు బలగాలను మొహరించి బస్సులు నడపడానికి శతవిధాలా ప్రయత్నాలు చేశారు. రోడ్లపై యువకులు, విద్యార్థులు, పార్టీ శ్రేణులు నిర్వహించే భారీ ర్యాలీలను పోలీసుల ద్వారా అడ్డుకున్నారు. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా కల్పించలేమని కేంద్రం స్పష్టం చేయగా దాన్ని సాధించుకోవాలన్న డిమాండ్ కోసం బంద్ పాటిస్తుండగా, ఆ బంద్ ను నీరుగార్చాలని అధికార తెలుగుదేశం పార్టీ ప్రయత్నించడం పట్ల అనేక చోట్ల ప్రజల నుంచి తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. అధికార పార్టీ పెద్దల ఒత్తిళ్లు ఉండటంతో పోలీసుల మాత్రం పలు చోట్ల మహిళలని కూడా చూడకుండా చితకబాదారు. వేలాది మందిని అరెస్టులు చేసి నిర్భంధించారు.
ఎంతగా ప్రయత్నించినప్పటికీ ప్రజలు పెద్దఎత్తున స్పంధించి బంద్ ను విజయవంతం చేసిన పరిణామం అధికార తెలుగుదేశం పార్టీ నేతలకు మింగుడుపడటం లేదు. ప్రత్యేక హోదా డిమాండ్ కోసం ఒకరు పోరాటం చేస్తుంటే దానికి మద్దతునివ్వకపోగా ఆ ఉద్యమాన్ని నీరుగార్చడానికి ప్రయత్నించి తప్పు చేశామని పలువురు నేతలు ప్రైవేటు సంభాషణల్లో చెప్పుకుంటున్నారు. టీడీపీ చర్యల పట్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. మరోవైపు బంద్ ను విజయవంతం చేయడం పట్ల రాష్ట్ర ప్రజలకు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రత్యేక హోదా విషయంలో రాజీ పడేది లేదని నొక్కి చెప్పారు.
ఈరోజు ఉదయం నుంచి అరెస్టుల పర్వం కొనసాగుతూనే ఉంది. పలు చోట్ల రాత్రి అయ్యే వరకు కూడా పోలీసులు విడిచిపెట్టలేదు. రాష్ట్ర వ్యాప్తంగా ఉదయం నుంచే రోడ్లపైకి పట్టణాల్లోని ప్రధాన కూడళ్ల వద్ద భారీ సంఖ్యలో పోలీసులను, సీఆర్పీఎఫ్ బలగాలను మొహరించారు. ఈరోజు ఉదయం ఆరు గంటల నుంచే అరెస్టుల పర్వం మొదలైంది. కార్యకర్తలను చెదరగొట్టడానికి అనేక చోట్ల లాఠీ ఛార్జీలు చేశారు.
బంద్ జరుగుతున్న తీరును ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎప్పటికప్పుడు సమీక్షించారు. పోలీసు ఉన్నతాధికారుల నుంచి నివేదికలు తెప్పించుకుంటూ అవసరమైన మేరకు అధికారులకు ఆదేశారు ఇచ్చారు. తెలుగుదేశం పార్టీ బలంగా ఉందని భావిస్తున్న కొన్ని నియోజకవర్గాల్లోనూ ప్రజలు స్పచ్చంధంగా ముందుకొచ్చి బంద్ ను విజయవంతం చేయడంపై ముఖ్యమంత్రి అధికారులపై మండిపడినట్టు తెలిసింది. బంద్ జరగకుండా నిరోధించే విషయంలో ఆయా నియోజకవర్గాల్లో కార్యక్రమాలు చేయాలంటూ ఎమ్మెల్యేలను పురమాయించారు. దాంతో చేసేది లేక ప్రత్యేక హోదా కల్పించాలని తామూ కోరుతున్నామని చెప్పడానికి టీడీపీ నేతలు పలు చోట్ల చీపుర్లు చేతబట్టి రోడ్లు ఊడ్చుతూ నిరసన వ్యక్తం చేస్తున్న దృశ్యాలు అక్కడక్కడ కనిపించాయి.