బంద్ సంపూర్ణం | AP Bandh successful | Sakshi
Sakshi News home page

బంద్ సంపూర్ణం

Published Wed, Aug 3 2016 3:33 AM | Last Updated on Sat, Mar 23 2019 9:10 PM

బంద్ సంపూర్ణం - Sakshi

బంద్ సంపూర్ణం

ప్రత్యేక హోదా సాధన కోసం యావత్ ఆంధ్రావని స్తంభించిపోయింది. కనీవినీ ఎరుగని రీతిలో విద్యార్థులు, యువకులు కదం తొక్కారు. ‘ప్రత్యేక హోదాయే మా భవిష్యత్’ అని నినదించారు. విద్యార్థులు, నిరుద్యోగులు, ఉద్యోగులు, వ్యాపారులు, కార్మికులు, కర్షకులు, మహిళలు ఇలా.. అన్ని వర్గాల ప్రజలు తమ ఆశ.. శ్వాస ప్రత్యేక హోదాయే అని ముక్తకంఠంతో చాటి చెప్పారు. వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపుతో 13 జిల్లాల్లోనూ బంద్ సంపూర్ణంగా జరిగింది.  
 
ప్రత్యేక హోదా కోసం స్తంభించిన ఏపీ

రాష్ట్ర చరిత్రలో కనీవినీ ఎరగని రీతిలో బంద్
హోదా ఆకాంక్షను దృఢంగా చాటిన ప్రజలు
వామపక్షాలు, కాంగ్రెస్, ప్రజాసంఘాల సంఘీభావం
రాష్ర్టవ్యాప్తంగా వేలాది మంది నాయకుల అరెస్టు
సాయంత్రం వరకు నిర్బంధంలోనే వైఎస్సార్‌సీపీ ముఖ్యనేతలు
పలుచోట్ల లాఠీచార్జీ.. వందలాదిమందికి గాయాలు
తిరుపతిలో పోలీసుల దాష్టీకం
మహిళల పుస్తెలు తెంపి.. చీరలు చింపిన ఖాకీలు

హోదా కోసం స్తంభించిన ఆంధ్రావని

సాక్షి, నెట్‌వర్క్: ప్రత్యేక హోదా సాధన కోసం యావత్ ఆంధ్రావని స్తంభించిపోయింది. కనీవిని ఎరుగని రీతిలో విద్యార్థులు, యువకులు కదం తొక్కారు. ‘ప్రత్యేక హోదాయే మా భవిష్యత్’ అని నినదించారు. విద్యార్థులు, నిరుద్యోగులు, ఉద్యోగులు, వ్యాపారులు, కార్మికులు, కర్షకులు, మహిళలు ఇలా.. అన్ని వర్గాల ప్రజలు తమ ఆశ.. శ్వాస ప్రత్యేక హోదాయే అని ముక్తకంఠంతో చాటి చెప్పారు. ప్రత్యేక హోదా వస్తేనే నిరుద్యోగ సమస్య తీరిపోయి తమ బిడ్డల భవిష్యత్ బాగుంటుందని, తమ జీవితాలు బాగుపడతాయంటూ ప్రజలు స్వచ్ఛందంగా బంద్ పాటించారు.

ప్రతిపక్షనేత, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపుతో 13 జిల్లాల్లోనూ బంద్ సంపూర్ణంగా జరిగింది.  బంద్‌ను విఫలం చేయడం కోసం ప్రభుత్వం పోలీసులను ప్రయోగించినా... అరెస్టులకు, లాఠీచార్జిలకు దిగినా వెరవకుండా మొక్కవోని దీక్షతో అన్నివర్గాల ప్రజలు ఒక్కతాటిపై నిలబడి జయప్రదం చేశారు. బంద్‌ను విచ్ఛిన్నం చేయడానికి అధికారపార్టీ సాగించిన కుట్రలను ప్రతిపక్షాలు తిప్పికొట్టాయి. పోలీసులు తెల్లవారుఝాము నుంచే వైఎస్సార్సీపీ నాయకులను అరెస్టు చేసి పోలీస్‌స్టేషన్లలో నిర్బంధించారు. విద్యాసంస్థలన్నీ మూతపడ్డాయి. షాపులను స్వచ్ఛందంగా మూసేయడంతో రోడ్లు నిర్మానుష్యంగా మారాయి. బస్సులు రోడ్లెక్కలేదు.  బలవంతంగా షాపులను తెరిపించడానికి, బస్సులను తిప్పడానికి పోలీసులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ప్రత్యేకహోదా సాధన కోసం కేంద్రంతో పోరాటం ఒక్కటే సరిపోదని... రాష్ర్టంలోని తెలుగుదేశం ప్రభుత్వ నిర్బంధాన్నీ తట్టుకుని ఉద్యమించాల్సి ఉందని ప్రజలు చర్చించుకోవడం కనిపించింది.
 
అరెస్టులు, లాఠీచార్జిలు..
రాష్ర్టంలోని 13 జిల్లాల్లోనూ ఆందోళనకారులపై పోలీసులు ఉక్కుపాదం మోపడానికి ప్రయత్నించారు. పోలీసుల సాయంతో బస్సులను తిరిగేలా చేయాలని, తద్వారా బంద్ విఫలమైందని చూపాలని అధికారపార్టీ నాయకులు ప్రయత్నించారు. బంద్ పిలుపులో భాగంగా శాంతియుతంగా రాస్తారోకోలు, ధర్నాలు, బైఠాయింపులు చేస్తున్న ప్రతిపక్ష పార్టీల నాయకులను, కార్యకర్తలను ఎక్కడికక్కడ అరెస్టు చేసి పోలీస్‌స్టేషన్లకు తరలించారు. వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌చార్జిలు, పార్టీ ముఖ్యనేతలను లక్ష్యంగా చేసుకుని ఆందోళనకారులపై దాడిచేశారు. ముఖ్యనేతలందరినీ అరెస్టు చేయడంపైనే పోలీసులు దృష్టిపెట్టారు.

నాయకుల అరెస్టులను అడ్డుకోవడానికి ప్రయత్నించిన కార్యకర్తలపై పోలీసులు విచక్షణా రహితంగా లాఠీలు ఝళిపించారు. అనేక చోట్ల పోలీసుల తీరుకు నిరసనగా కార్యకర్తలు పోలీస్‌స్టేషన్ల వెలుపల బైఠాయించారు. జిల్లాకు వెయ్యిమంది పైనే అరెస్టులు జరిగినట్లు సమాచారం. అనేక జిల్లాల్లో బంద్‌లో పాల్గొన్న వైఎస్సార్సీపీ, వామపక్షాల నాయకులపైన, కార్యకర్తలపైన కేసులు మోపారు.
 
స్వచ్ఛందంగా పాల్గొన్న ప్రజలు
మునుపెన్నడూ కనీవిని ఎరుగని రీతిలో అనేక చోట్ల ప్రజలు స్వచ్ఛందంగా బంద్ పాటించారు. పలుచోట్ల యువజన, విద్యార్థి సంఘాలకు చెందిన యువకులు బైక్ ర్యాలీల్లో పాల్గొన్నారు. విజయవాడ బస్టాండులో వైఎస్సార్సీపీ నాయకులు గాంధీగిరి పద్ధతిలో ప్రయాణీకులకు పూలు పంపిణీ చేశారు. అన్నిజిల్లాల్లోనూ కిరాణా, ఫ్యాన్సీ, రెడీమేడ్ దుస్తుల దుకాణాలను సైతం మధ్యాహ్నం వరకు బంద్ పాటించారు.
 
తిరుపతిలో పోలీసుల ఓవరాక్షన్
బంద్‌లో పాల్గొన్న వైఎస్సార్‌సీపీ మహిళా నాయకులు, కార్యకర్తలపై తిరుపతి పోలీసులు అమానుషంగా వ్యవహరించారు. పైశాచికత్వాన్ని ప్రదర్శించారు. మహిళలన్న ఆలోచన లేకుండా ఈడ్చివేశారు. ఈ క్రమంలో శాంతారెడ్డి అనే మహిళ మంగళసూత్రం తెగి కిందపడగా, మరో నలుగురు మహిళా కార్యకర్తల చీరలు చిరిగాయి. పోలీసులు బలవంతంగా రోడ్డుపై ఈడ్చుకెళ్లడంతో మహిళల మోచేతులకు గాయాలయ్యాయి.

తిరుపతిలో  వైఎస్సార్సీపీ శ్రేణులు పెద్ద ఎత్తున తరలి వచ్చి పూర్ణకుంభం సర్కిల్ దగ్గర మానవహారం నిర్వహిస్తున్న సందర్భంగా ఈ సంఘటన చోటు చేసుకుంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తోన్న వీరిపై ఉదయం 7.30 గంటలకు ఒక్కసారిగా పోలీసులు విరుచుకు పడి అరెస్టులు చేయడం ప్రారంభించారు.ఈ సందర్భంగా రోడ్డుపై బైఠాయించిన పార్టీ రాష్ర్ట ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్‌రెడ్డిని అరెస్టు చేయడానికి పోలీసులు వచ్చినపుడు అక్కడున్న సుమారు 10 మంది మహిళా నాయకులు అడ్డు పడ్డారు. భూమన అరెస్టు కాకుండా రక్షణగా నిలబడ్డారు, దీంతో రెచ్చిపోయిన పోలీసులు ఒకరిద్దరు మహిళా కానిస్టేబుళ్లతో కలిసి అక్కడున్న మహిళా కార్యకర్తలు, నాయకురాండ్రపై విరుచుకుపడ్డారు. మహిళల పట్ల పోలీసుల వైఖరికి నిరసనగా బుధవారం తిరుపతి సబ్‌కలెక్టరేట్ ఎదుట నిరసన కార్యక్రమం నిర్వహించడానికి పార్టీ మహిళా విభాగం నిర్ణయించింది.
 
పోలీస్‌స్టేషన్‌లో కొనసాగుతున్న సీపీఐ నేతల నిరసన
 ప్రత్యేక హోదా కోసం శాంతియుతంగా ఆందోళన చేస్తున్న తమను అక్రమంగా అరెస్టు చేయించిన  ప్రభుత్వ తీరుకు నిరసనగా మంగళవారం రాత్రి కూడా పోలీస్ ఠాణాలోనే సీపీఐ రాష్ర్ట కార్యదర్శి కె.రామకృష్ణ నిరసనను కొనసాగిస్తున్నారు. విజయవాడ లెనిన్ సెంటర్‌లో మోటార్ సైకిల్ ర్యాలీ ప్రారంభించిన రామకృష్ణ బృందాన్ని పోలీసులు అరెస్టు చేసి సత్యనారాయణపురం పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు నిర్బంధించిన పోలీసులు అటుతరువాత వెల్లిపోవాలని చెప్పడంపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము రాష్ట్రం కోసం శాంతియుతంగా ఆందోళన చేస్తున్న తమను ఎందుకు అరెస్టు చేశారో చెప్పాలని, అప్పటి వరకు పోలీస్ ఠాణా విడిచివెళ్లేది లేదని భీష్మించారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement