గవర్నర్ వద్దకు ఏపీ మంత్రుల పంచాయితీ
ఆంధ్రప్రదేశ్ మంత్రులు తమ పంచాయితీని రాష్ట్ర గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ వద్దకు తీసుకెళ్లారు. సాయంత్రం 6.15 గంటలకు గవర్నర్ వద్దకు గంటా శ్రీనివాసరావు, రావెల కిశోర్ బాబు సహా పలువురు మంత్రులు వెళ్లనున్నారు. ఈ మేరకు అపాయింట్మెంట్ కూడా ఫిక్సయింది. ప్రధానంగా ఫోన్ ట్యాపింగ్, సెక్షన్ 8 అంశాలపై వాళ్లు ఫిర్యాదు చేయనున్నట్లు సమాచారం.
హైదరాబాద్ నగరం ఉమ్మడి రాజధానిగా ఉన్నందున ఇక్కడ విభజన చట్టంలోని 8వ సెక్షన్ అమలుచేయాలని, గవర్నరే శాంతిభద్రతల బాధ్యతలను తీసుకోవాలని వాళ్లు కోరనున్నారు. అలాగే, బహిరంగ సభల్లో ఏపీ మంత్రులు, సీఎంపై కేసీఆర్ చేస్తున్న వ్యాఖ్యలపైనా ఫిర్యాదు చేయనున్నారు. ఉమ్మడి సంస్థలను విభజించాలని, కొన్ని సవరణలు చేయాలని ప్రతిపాదించబోతున్నారు. కౌంటర్ గేమ్ ద్వారా ఒత్తిడి వ్యూహాన్ని అమలు చేయాలనుకుంటున్నారు.