గొంతుకు శస్త్ర చికిత్స చేయించుకోనున్న సీఎం
న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ గొంతుకు శస్త్ర చికిత్స చేయించుకోనున్నారు. ఆయన కొంతకాలంగా తీవ్రమైన దగ్గుతో బాధపడుతున్న విషయం తెలిసిందే. ఇందుకోసం గతంలో విపాసన, న్యూరోపతి ట్రీట్ మెంట్లకు కూడా కేజ్రీవాల్ హాజరయ్యారు. అయితే దగ్గు మాత్రం తగ్గకపోవడంతో అందుకోసం ఈ నెల 13న బెంగళూరులోని ఓ ఆసుపత్రిలో సీఎం ఆపరేషన్ చేయించుకోనున్నట్లు సమాచారం. ఈ మేరకు ఢిల్లీ ప్రభుత్వం ఓ ప్రకటన విడుదల చేసింది.
పంజాబ్ లో జరగనున్న నాలుగురోజుల ప్రచార కార్యక్రమాలను ముగించుకున్న తర్వాత కేజ్రీవాల్ 12న రాత్రికి బెంగుళూరు చేరుకుంటారు. సర్జరీ తర్వాత 10రోజుల పాటు సీఎం ఆసుపత్రిలోనే విశ్రాంతి తీసుకోనున్నారు. తిరిగి సెప్టెంబర్ 22న కేజ్రీవాల్ ఢిల్లీకి చేరుకునే అవకాశాలు ఉన్నాయి. ఈ సమయంలో ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా ప్రభుత్వ బాధ్యతలు నిర్వహించనున్నారు. వచ్చే ఏడాది జరగనున్న గోవా ఎన్నికల్లో కూడా ఆప్ పోటీ చేయనుండటంతో సిసోడియా ఈ నెల 7న గోవా వెళ్లే అవకాశాలు ఉన్నాయి.