బంగారం అక్రమ రవాణా పెరిగింది
న్యూఢిల్లీ: పసిడి అక్రమ రవాణా పెరిగిందని కేంద్ర ప్రభుత్వం లోక్‌సభకు తెలిపింది. దిగుమతి సుంకాల పెంపు వల్ల అంతర్జాతీయ మార్కెట్‌తో పోల్చితే మన దేశంలో పసిడి ధర అధికంగా ఉండడం, ప్రపంచ మార్కెట్ ధరల్లో హెచ్చుతగ్గులు దీనికి కారణమని పేర్కొంది. లోక్‌సభకు ఇచ్చిన ఒక లిఖిత పూర్వక సమాధానంలో ఆర్థికశాఖ సహాయమంత్రి జేడీ శీలం ఈ విషయాన్ని తెలిపారు. క్యాపిటల్ ఫ్లోస్ అంటే ఎఫ్‌ఐఐ, ఎఫ్‌డీఐ,ఈసీబీలు మినహా దేశంలోకి వచ్చీ-పోయే మొత్తం విదేశీ మారకద్రవ్య నిల్వల మధ్య వ్యత్యాసానికి సంబంధించి కరెంట్ అకౌంట్ లోటు (క్యాడ్) కట్టడి ప్రధాన ధ్యేయంతో కస్టమ్స్ సుంకాన్ని 10 శాతం, ఆభరణాల దిగుమతులపై సుంకాన్ని 15 శాతం పెంచిన సంగతి తెలిసిందే. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం అక్టోబర్ వరకూ గడచిన ఏడు నెలల కాలంలో అక్రమంగా రవాణా అవుతున్న రూ.208 కోట్ల విలువైన బంగారాన్ని పట్టుకున్నట్లు వివరించారు.
ఇందుకు సంబంధించి 664 కేసులు నమోదయినట్లు కూడా వెల్లడించారు. అంతకుముందు గడచిన మూడు ఆర్థిక సంవత్సరాల కాలంలో ఇలా అక్రమంగా రవాణా అవుతున్న బంగారం పట్టివేత పరిమాణం వరుసగా 107.51 కోట్లు, రూ.42.38 కోట్లు, రూ. 17.22 కోట్లుగా ఉన్నట్లు మంత్రి వెల్లడించారు. బంగారం అక్రమ రవాణా యూఏఈ, సింగపూర్, శ్రీలంక, బంగ్లాదేశ్, నేపాల్, హాంకాంగ్ వంటి దేశాల నుంచి ప్రధానంగా జరుగుతున్నట్లు సైతం వెల్లడించారు.
7 పీఎస్‌యూల నుంచి 18వేల కోట్ల డిజిన్వెస్ట్‌మెంట్
కాగా ఇప్పటికే ఆమోదించిన డిజిన్వెస్ట్‌మెంట్ ప్రతిపాదనల ప్రకారం ఏడు ప్రభుత్వ రంగ సంస్థలు (పీఎస్‌యూ), ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ (ఈటీఎఫ్) నుంచి రూ.18,000 కోట్లను సమీకరించనున్నట్లు మంత్రి శీలం మరో ప్రశ్నకు సమాధానంగా తెలిపారు. ఆయన తెలిపిన సమాచారం ప్రకారం ఇంజనీర్స్ ఇండియా నుంచి రూ.500 కోట్లు, ఆయిల్ ఇండియా నుంచి రూ. 5,000 కోట్లు, హిందుస్తాన్ ఎయిరోనాటిక్స్ నుంచి రూ.3,000 కోట్లు, విశాఖ ఉక్కు నుంచి రూ. 1,000 కోట్లు, ఎన్‌హెచ్‌పీసీ నుంచి రూ.2,000 కోట్లు సమీకరించనున్నట్లు తెలిపారు. బీహెచ్‌ఈఎల్‌లో 5 శాతం వాటా విక్రయం ద్వారా రూ.2,000 కోట్లు, పవర్ గ్రిడ్‌లో 4 శాతం వాటా విక్రయం ద్వారా రూ. 1,500 కోట్లు సమీకరించాలన్నది తాజా ప్రణాళిక లక్ష్యమని వివరించారు. వీటితోపాటు ఈటీఎఫ్ విక్రయ ప్రక్రియ ద్వారా మరో రూ.3,000 కోట్లు సమీకరించాలన్నది లక్ష్యమని వివరించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రూ. 40వేల కోట్ల డిజిన్వెస్ట్‌మెంట్ లక్ష్యం.
ఎస్‌టీసీ, ఎంఎంటీసీ లావాదేవీల్లో అవకతవకలు
ప్రభుత్వ రంగంలోని ఎంఎంటీసీ, ఎస్‌టీసీల్లో గడచిన రెండు ఆర్థిక సంవత్సరాల్లో కొన్ని అక్రమ లావాదేవీల వ్యవహారాలు జరిగినట్లు గుర్తించగలిగినట్లు వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి ఈఎం సుదర్శన నాచప్పన్ లోక్‌సభకు తెలిపారు. సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటున్నట్లు కూడా తెలిపారు.