అభిమానుల సంబరాలు
ముంబై: హిట్ అండ్ రన్ కేసులో సల్మాన్ ఖాన్ ను బాంబే హైకోర్టు నిర్దోషిగా ప్రకటించడంతో ఆయన కుటుంబ సభ్యులు, బాలీవుడ్ తారలు, అభిమానులు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. కోర్టు తీర్పు విన్నవెంటనే సల్మాన్ ను ఆయన కుటుంబ సభ్యులు చుట్టుముట్టి ఆనంద భాష్పాలు రాల్చారని పీటీఐ వెల్లడించింది.
తమ హీరో కేసు నుంచి బయటపడడంతో అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. తమ ఆనందాన్ని పంచుకునేందుకు సల్మాన్ నివాసానికి భారీ సంఖ్యలో తరలివచ్చారు. పరస్పరం మిఠాయిలు పంచుకుని డాన్సులు చేశారు. దీంతో ముందుజాగ్రత్తగా భద్రతను కట్టుదిట్టం చేశారు.
కోర్టు తీర్పు పట్ల సల్మాన్ తరపు న్యాయవాది అమిత్ దేశాయ్ సంతృప్తి వ్యక్తం చేశారు. హైకోర్టు తీర్పుతో సల్మాన్ గొప్ప ఊరట లభించిందని, అతడు చాలా సంతోషంగా ఉన్నాడని తెలిపారు. త్వరలో అతడి పాస్ పోర్టును కూడా తిరిగి ఇచ్చేస్తారని చెప్పారు. సల్మాన్ ను నిర్దోషిగా కోర్టు ప్రకటించడం పట్ల పలువురు బాలీవుడ్ ప్రముఖులు హర్షం వ్యక్తం చేశారు.