నిరసనలకు తలొగ్గిన సర్కారు.. ప్రాజెక్టు రద్దు
నిరసనలకు తలొగ్గిన సర్కారు.. ప్రాజెక్టు రద్దు
Published Thu, Mar 2 2017 1:52 PM | Last Updated on Tue, Sep 5 2017 5:01 AM
ప్రజలు గట్టిగా పోరాడితే ప్రభుత్వాలు తల వంచాల్సిందే. ఆ విషయం మరోసారి కర్ణాటకలో రుజువైంది. బెంగళూరు నగరంలో రూ. 1761 కోట్ల వ్యయ అంచనాతో నిర్మించాలని తలపెట్టిన స్టీల్ ఫ్లైఓవర్ ప్రాజెక్టును ఆ రాష్ట్ర ప్రభుత్వం విరమించుకుంది. ఈ ప్రాజెక్టు కోసం 800కు పైగా చెట్లను నరికేస్తారని, దానివల్ల నగరంలో పర్యావరణానికి హాని కలుగుతుందని పర్యావరణవేత్తలు, సామాన్య ప్రజలు నిరసనలు వ్యక్తం చేయడంతో ప్రభుత్వం వెనకడుగు వేయక తప్పలేదు.
నగరంలో స్టీల్ ఫ్లై ఓవర్‌ను నిర్మించబోవడం లేదని బెంగళూరు అభివృద్ధి శాఖ మంత్రి కేజే జార్జి ప్రకటించారు. ఈ ప్రణాళికను పూర్తిగా రద్దు చేశామన్నారు. నగరంలో ట్రాఫిక్ ఇబ్బందులను తొలగించేందుకు 6.72 కిలోమీటర్ల మేర స్టీల్ ఫ్లైఓవర్ నిర్మించాలని బెంగళూరు అభివృద్ధి మండలి (బీడీఏ) తలపెట్టింది. దీనికి పర్యావరణవేత్తలు, ప్రజలతో పాటు రైతులు కూడా తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేశారు. ఫ్లైఓవర్ నిర్మాణ కాంట్రాక్టును 2016 అక్టోబర్ నెలలో ఎల్అండ్‌టీ కంపెనీకి ఇచ్చారు. నగరంలో ట్రాఫిక్ సమస్యలు పోవాలంటే ఈ ఫ్లైఓవర్ తప్పనిసరిగా రావాల్సిందేనని సీఎం సిద్దరామయ్య, మంత్రి కేజే జార్జ్ ఇంతకుముందు అన్నారు. కానీ ఇప్పుడు మాత్రం ప్రజల నిరసనలకు తలొగ్గి ప్రాజెక్టు నిర్మాణాన్ని విరమించుకున్నారు.
Advertisement