చిదంబరంతో ఆర్‌బీఐ గవర్నర్ రాజన్ భేటీ
న్యూఢిల్లీ: రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ రఘురామ్ రాజన్ గురువారంనాడు ఆర్థికమంత్రి పీ చిదంబరంతో సమావేశమయ్యారు. దేశ స్థూల ఆర్థిక అంశాలపై వీరు ఇరువురు చర్చించారు. ఈ నెల 29న ఆర్‌బీఐ రెండవ త్రైమాసిక పరపతి విధాన సమీక్ష నేపథ్యంలో వీరిరువురి సమావేశానికి ప్రాధాన్యత సంతరించుకుంది. సమావేశం అనంతరం రాజన్ విలేకరులతో మాట్లాడుతూ పలు ఆర్థిక అంశాలపై తాము చర్చించినట్లు తెలిపారు.
రెపో పావుశాతం పెరగవచ్చు: మోర్గాన్ స్టాన్లీ
ఆహార ద్రవ్యోల్బణం సామాన్యునికి భారంగా ఉన్న నేపథ్యంలో- అక్టోబర్ 29 పాలసీ సమీక్ష సందర్భంగా రిజర్వ్ బ్యాంక్ కీలక రెపో రేటు (బ్యాంకులకు తానిచ్చిన రుణాలపై రిజర్వ్ బ్యాంక్ వసూలు చేసే వడ్డీరేటు)ను మరో పావు శాతం పెంచే అవకాశం ఉందని అమెరికా బ్రోకరేజ్ సంస్థ మోర్గాన్ స్టాన్లీ అంచనావేసింది. ఇదే జరిగితే ప్రస్తుతం 7.5 శాతంగా ఉన్న ఈ రేటు 7.75 శాతానికి చేరుతుంది.