జయలలిత ఉథ్తాన పథనాలు
జయలలిత ఉథ్తాన పథనాలు
Published Tue, Dec 6 2016 12:49 AM | Last Updated on Tue, Aug 14 2018 2:14 PM
న్యూఢిల్లీ: తమిళనాడు ముఖ్యమంత్రిగా ఆరవ సారి బాధ్యతలు స్వీకరించిన జయలలితా రామన్ జీవితం పూల బాటతో ప్రారంభమైనప్పటికీ అందులో ముళ్ల మలుపులు ఎన్నో వున్నాయి. తెలివితేటలు, జాగురూకత, విధేయత, పట్టుదల అనే నాలుగు అంశాలను ఆమె ఆయుధాలుగా మార్చుకొని ముళ్ల మలుపులను అధిగమించి పూల వనంలోకి అడుగుపెట్టారు. కానీ ఆనారోగ్యమనే ముళ్ల పాన్పులోనే శాశ్వత నిద్రలోకి వెళ్లాల్సి వస్తుందని ఆమె ఊహించలేదు.
1. రాజకీయ రంగప్రవేశం...
జయలలితతో జోడీగా పది సినిమాల్లో హీరోగా నటిచించిన ఎంజీ రామచంద్రన్ ఆమెను 1982లో రాజకీయాల్లోకి తీసుకొచ్చారు. ఆయన ప్రోత్సాహంతోనే ఏఐఎడీఎంకేలో చేరారు. అయితే ఈ విషయాన్ని ఆమె ఎప్పుడూ బహిరంగంగా ఒప్పుకోలేదు. తనంతట తానే ఇష్టంగా రాజకీయాల్లోకి వచ్చానని చెప్పారు. పార్టీలో ఎంతో మంది సీనియర్ నాయకులను కాదని 1983లో ఆమెను పార్టీ ప్రచార కార్యదర్శిగా నియమించారు.
2. రాజ్యసభ ఎంపీగా...
1984లో ఎంజీ రామచంద్రన్ కిడ్నీల ఆపరేషన్ నిమిత్తం అమెరికాకు వెళ్లేముందు జయలలిత రాజ్యసభ ఎంపీగా ఎన్నికయ్యారు. ఇది ఆమె రాజకీయ జీవితంలో పెద్ద ముందడుగు. పార్టీలో చాల మంది సీనియర్ నాయకులు ఆమె ఎన్నిక పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. 1984 రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఎంజీఆర్‌లేని లోటు కనిపించకుండా జయలలిత, అమెరికాలో ఎంజీఆర్ చికిత్స పొందుతున్న ఫొటోలను పట్టుకొని పార్టీ తరఫున విస్తృతంగా ప్రచారం చేశారు. పార్టీలో ఆమె వ్యతిరేకులు చాలా మంది ఆమె పట్ల ఎంజీఆర్ విశ్వాసాన్ని దెబ్బతీయాలని చూశారు. సున్నితంగా వ్యవహారలను చక్కబెట్టడంలో చాకచక్యం కలిగిన జయలలిత వారి ప్రయత్నాలను వమ్ము చేశారు.
3. ఎంజీఆర్ కన్నుమూత...
1987లో ఎంజీఆర్ చనిపోవడంతో తమిళనాడు రాజకీయాల్లో, ముఖ్యంగా ఏఐఏడీఎంకే పార్టీలో సంక్షోభ పరిస్థితులు ఏర్పడ్డాయి. ఎంజీఆర్ భార్య జానకి రామచంద్రన్, జయలలిత మధ్య పార్టీ రెండు వర్గాలుగా చీలిపోయింది. వారిద్దరి మధ్య ఎంత అఘాతం ఏర్పడిదంటే ఎంజీఆర్ అంత్యక్రియలకు జయలలితను జానకి రామచంద్రన్ అనుమతించలేదు. ఆ తర్వాత 1988, జనవరి ఏడవ తేదీన జానకి రామచంద్రన్‌ను శాసన సభలో ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నారు. ఈ విషయంలో స్వీకర్ రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరించారన్న కారణంగా ఆ ప్రభుత్వాన్ని అప్పటి కేంద్రంలోని రాజీవ్ గాంధీ ప్రభుత్వం రద్దు చేసి, రాష్ట్రపతి పాలనను విధించింది.
4. జయ కేతనం....
1989లో జరిగిన అసెంబ్లీ మధ్యంతర ఎన్నికల్లో జయలలిత గెలిచినప్పటికీ పార్టీ అంతర్గత కుమ్ములాటల వల్ల పార్టీ అధికారంలోకి రాలేకపోయింది. డీఎంకే గెలవడంతో కరుణానిధి ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు. పార్టీలోని రెండు వర్గాలు విలీనం కావడంతో జయలలిత ప్రతిపక్ష నాయకురాలిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అలాగే పార్టీ రెండాకుల గుర్తును కూడా తిరిగి సాధించారు.
5. వీరనారిగా శపథం....
1989, మార్చి 25వ తేదీ తమిళనాడు రాజకీయాల్లోనే ఓ చీకటి అధ్యాయం. అసెంబ్లీలో జయలతిను డీఎంకే సభ్యులు ఘోరంగా పరాభవించారు. సభ నుంచి బయటకు వెళుతుండగా, కొంతమంది డీఎంకే సభ్యులు ఆమె చీరను పట్టుకొని లాగగా ఆమె చీర చిరిగిపోయింది. అలాగే ఆమె చిరగిన చీర, రేగిన జుట్టు, ఎరుపెక్కిన ముఖంతో మీడియా ముందుకు వచ్చి మాట్లాడారు. తాను ముఖ్యమంత్రి అయ్యేవరకు అసెంబ్లీలో అడుగు పెట్టనని శపథం చేశారు. మహా భారతంలో ద్రౌపతికి జరిగిన పరాభవం నిండు సభలో జయలలితకు జరిగిందంటూ మీడియాలో వార్తలు విస్తృతంగా వచ్చాయి. ఆమెకు ప్రజల నుంచి సానుభూతి పవనాలు వీచాయి.
6. తొలిసారి ముఖ్యమంత్రిగా...
మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్యానంతరం ఎన్నికలు జరగడం వల్ల, కాంగ్రెస్ పార్టీలో పొత్తు పెట్టుకోవడం వల్ల 1991లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో 234 సీట్లకుగాను 225 సీట్లలో జయలలిత పార్టీ ఘన విజయం సాధించింది. ఆమె తొలిసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. 1996 వరకు పూర్తి కాలంపాటు అధికారంలో కొనసాగారు. అనంతరం జరిగిన ఎన్నికల్లో అవినీతి ఆరోపణల కారణంగా ఆమె పార్టీ ఘోరంగా ఓడిపోయింది. తన సొంత సీటును కూడా ఆమె నిలబెట్టుకోలేపోయారు. తన దత్త పుత్రుడు సుధాకరన్ పెళ్లిని 1995లో అంగరంగ వైభవంగా చేయడంలో ఆమె భారీ అవినీతికి పాల్పడ్డారనే ఆరోపణలు వెల్లువెత్తడం తీవ్ర ప్రభావాన్ని చూపాయి.
7.2001లో జయకు మరిన్ని సమస్యలు
2001లో ఆమె నాలుగు నియోజక వర్గాల నుంచి దాఖలు చేసిన నామినేషన్లు చెల్లకుండా పోయాయి. అయినప్పటికీ ఆమె పార్టీ ఎన్నికల్లో విజయం సాధించడంతో, పార్టీ నాయకురాలిగా ఎన్నికై మరోసారి ముఖ్యమంత్రి బాధ్యతలు స్వీకరించారు. అవినీతి కేసులో ఆమెను ముఖ్యమంత్రిగా అనర్హురాలిగా సుప్రీం కోర్టు ప్రకటించడంతో పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది.
8. మళ్లీ ముఖ్యమంత్రిగా ....
జయలలితపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసును సుప్రీం కోర్టు రద్దు చేస్తూ బెయిల్ మంజూరు చేయడం, ఆ తర్వాత కర్ణాటక హైకోర్టు ప్రత్యేక బెంచీ అంతకుముందు ట్రయల్ కోర్టు విధించిన శిక్షను కొట్టివేసి ఆమెకు క్లీట్ చిట్ ఇవ్వడంతో జయలలిత మరోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. 2011లో అసెంబ్లీ ఎన్నికల్లో ఆమె పార్టీ విజయం సాధించడంతో ఆమె మరోసారి ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టారు. పలు అవినీతి కేసుల్లో పలుసార్లు జైలు కెళ్లిన ఆమె, కేసు కొట్టేసునప్పుడల్లా ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరిస్తూ వచ్చారు. 2015లో ఐదవ సారి, 2016లో ఆరోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. తమిళనాడులో వరుసగా రెండు పర్యాయాలు ముఖ్యమంత్రిగా కొనసాగిన తొలి మహిళగా, రెండవ వ్యక్తిగా రికార్డు సృష్టించారు. అంతకుముందు వరుసగా రెండుసార్లు గెలిచిన రికార్డు ఎంజీ రామచంద్రన్ పేరుతో ఉంది.
Advertisement
Advertisement