ఈ నగరాలకు కునుకు కరువు
స్కూల్‌ఎడిషన్: రోజంతా పనిచేయటం..పొద్దుపోకముందే ఇంటికి చేరుకోవటం..ఓ ముద్ద తినటం..త్వరత్వరగా నిద్రకు ఉపక్రమించటం..కోడి కొక్కరొక్కో అనకముందే లేవడం..! ఇదీ ఒకప్పటి భారతీయుల జీవనశైలి. బ్రిటిష్ వారు అడుగుపెట్టి వెళ్లిపోయాక సీన్ మారిపోయింది. పల్లెటూర్లను పక్కన బెడితే, ఇప్పటి భారతీయుడి దినచర్య పూర్తిగా మారిపోయింది. ఆలస్యంగా అల్పాహారం... నాలుగు దాటిన తర్వాత భోజనం.. ఇక అర్ధరాత్రికి కాస్త ముందు రాత్రి భోజనం. దీంతో నగరవాసి జీవనశైలికి అనుగుణంగా వివిధ ప్రాంతాలు కూడా తమ రూపురేఖల్ని మార్చుకుంటున్నాయి.
దుకాణాలు, హోటళ్లు, షాపింగ్ మాల్స్ తమ తలుపులను తెల్లవారేదాకా బార్లా తెరిచిపెట్టి వెల్‌కమ్ చెబుతున్నాయి. డ్యాన్స్ బార్‌లు, పబ్‌ల సంస్కృతి వచ్చాక నైట్‌కల్చర్ మరింత పెరిగింది. దీంతో నగరాలకు నిద్రే కరువైంది. ప్రపంచంలో ఇలా అసలు కునుకు తీయని నగరాలు ఎన్నో ఉన్నాయి. ఈ సంస్కృతి భారతదేశానికి కూడా వ్యాపించడంతో ఇక్కడా ఈ నగరాల జాబితా పెరుగుతోంది. లండన్, న్యూయార్క్, పారిస్ వంటి నగరాలే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కునుకు కరువైన నగరాలు చాలానే ఉన్నాయి. వాటిల్లో కొన్నింటి గురించి ఈ రోజు తెలుసుకుందాం!
ముంబై
ఒకప్పుడు బొంబాయి అని పిలిచే ఈ నగరాన్ని ఇప్పుడు ముంబై అంటున్నారు. భారతదేశ వాణిజ్య రాజధాని. అరేబియా సముద్రంలోని పశ్చిమ తీరప్రాంతమైన సాష్టీ ద్వీపంలో వెలసింది. మరాఠాల ఆరాధ్యదైవమైన ముంబ్రాదేవి పేరును ఈ నగరానికి పెట్టారు. ప్రచురణ సంస్థలకు, దూరదర్శన్, రేడియో కేంద్రాలకు ముంబై పుట్టినిల్లు. అంతేకాక భారతదేశంలోని మొత్తం పారిశ్రామిక ఉద్యోగుల్లో పదిశాతం ముంబైలోనే ఉన్నారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు ఇక్కడ స్థిరపడడంతో అన్నిరకాల సంస్కృతులు, సంప్రదాయాలు ఇక్కడ కనిపిస్తాయి. అన్ని మతాలకు చెందిన పండుగలు, ఉత్సవాలు, వేడుకలతో ఈ నగరం ఎప్పుడూ సందడిగా కనిపిస్తుంది. దీంతో ఈ నగరానికి కూడా కునుకు కరువైంది. భారత్‌లోని గోవా, ఢిల్లీ, బెంగళూరు, పుణే, హైదరాబాద్, కోల్‌కతా, చెన్నై, చండీగఢ్, జైపూర్ నగరాలు కూడా క్రమక్రమంగా నిద్రకు దూరమవుతున్నాయి.
బార్సిలోనా
మలాగా, జారాగొజా, మాడ్రిడ్ వంటి నగరాలున్న స్పెయిన్‌లో బార్సిలోనా కూడా ప్రముఖమైందే. స్పెయిన్‌లో రెండో అతిపెద్ద నగరం. ఐక్కరాజ్య సమితి గుర్తించిన ఎన్నో ప్రపంచ చారిత్రక కట్టడాలకు ఈ నగరం చిరునామా. పర్యాటక, వాణిజ్య, వర్తక, సాంస్కృతిక క్రీడారంగాల్లో బార్సిలోనాకు ప్రముఖమైన స్థానమే ఉంది. మధ్యదరా సముద్ర తీరంలో ఉన్న ఈ నగరంలో నేషనల్ మ్యూజియమ్ ఆఫ్ ఆర్ట్ క్యాటలోనియా, రోమన్‌స్క్యూ ఆర్ట్, ఒరెనెటా క్యాస్టల్ పార్క్, మార్బెల్లా, నోవా బార్బెల్లావంటి బీచ్‌లు చూడదగిన ప్రదేశాలు. ఫ్యాషన్ రంగానికి పెట్టింది పేరైనా ఈ నగరంలో ఎక్కువశాతం ప్రదర్శనలు రాత్రిపూట మాత్రమే జరుగుతాయి.
మాంటివిడియో
ఉరుగ్వే దేశ రాజధాని మాత్రమే కాదు.. దేశంలోనే అతిపెద్ద నగరం. స్పానిష్ సైనికులు 1724లో దీనిని నిర్మించారు. మొట్టమొదటి ఫిఫా ప్రపంచ కప్‌కు ఆతిథ్యమిచ్చిన నగరమిదే. అట్లాంటిక్ తీరంలో, శాంటా లూసియా నది తీర ప్రాంతంలో వెలసింది. మిగతా రోజుల్లో చల్లగా ఉన్నా వేసవిలో అసౌకర్యంగా ఉంటుంది. ఏడాదంతా తరచూ వర్షం పడుంది. బ్యాంకింగ్.. ఈ దేశంలో బాగా అభివృద్ధి చెందిన రంగం. సముద్ర తీరప్రాంతం కావడంతో పర్యాటకరంగానికి పెద్దపీట వేసిన ఈ నగరంలో అనేక నైట్ క్లబ్బులు, సరాండీ స్ట్రీట్ వంటి ప్రాంతాలు, ప్లాజా ఇండిపెండెన్సికా వంటి వ్యాపారసముదాయాలతో మాంటివిడియో ఎల్లప్పుడూ సందడిగా ఉంటుంది.
బీరుట్
లెబనాన్ రాజధాని ఇది. దేశంలోకెళ్ల అతిపెద్ద నగరం కూడా. దాదాపు 5000 సంవత్సరాలకుపైగా చరిత్ర ఉంది. బీరుట్ నది కారణంగా ఆ పేరు వచ్చింది. సేవారంగానికి ప్రాధాన్యతనిచ్చే బీరుట్ బ్యాంకింగ్, ఫైనాన్స్ రంగాల్లో కూడా దూసుకుపోతోంది. అమెరికన్ యూనివర్సిటీ ఆఫ్ బీరుట్, జోసెఫ్, నోటర్‌డామ్ యూనివర్సిటీలు ప్రముఖమైనవి. గ్రీకులు, రోమన్లు, అరబ్బులు, తురుష్కుల సంస్కృతి ఇక్కడ కనిపిస్తుంది. కార్నిక్ బీరుట్, సెయింట్ జార్జ్ బే, హర్మా స్ట్రీట్ వంటి పర్యాటకప్రాంతాలు పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. షాపింగ్, స్టోర్స్, బొటిక్స్, రెస్టారెంట్‌లు, బ్యాంకులు, హాకర్లు, ఫుట్‌పాత్‌లపై వెలసిన కేఫ్‌లతో అలరారుతోంది.
కైరో
అరబ్బు దేశాల్లోనే కైరో అతిపెద్ద నగరం. ఈజిప్టు రాజధాని కూడా. నైలు నది తీరంలోని ఈ నగర వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. దుమ్ము, ధూళితో కూడిన గాలులు ఈ నగరాన్ని తరచూ అతలాకుతలం చేస్తుంటాయి. విద్య, వైద్యానిది ఇక్కడ ఫస్ట్ ప్లేస్. పేరెన్నికగల ఆస్పత్రుల్లో ప్రముఖమైనవి కైరో నగరంలోనే ఉన్నాయి. అల్ జహర్, కైరో, అమెరికన్, హెల్వాన్ విశ్వవిద్యాలయాలు ఇక్కడ ఉన్నాయి. ప్రచురణాసంస్థలకు, ఫిల్మ్ స్టూడియోలకు కైరో పెట్టింది పేరు. గ్రీకులు, బాబీలోనియన్లు, రోమన్లు, ముస్లింలకు సంబంధించిన నాగరికత ఇక్కడ కనిపిస్తుంది. దీంతో ఎప్పుడు చూసినా ఈ నగరం సర్వసంస్కృతుల సమ్మేళనంతో సందడిగా కనిపిస్తుంది.