సాక్షి, హైదరాబాద్: నవంబర్ నెలాఖరు కల్లా తెలంగాణ బిల్లు పార్లమెంట్‌లో తప్పక ఆమోదం పొందగలదని టీఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షుడు కె.చంద్రశేఖర్‌రావు భరోసాతో ఉన్నారు. మంగళవారం పార్టీ నేతలు కే కేశవరావు, వినోద్‌కుమార్, ఈటెల రాజేందర్, కడియం శ్రీహరి సహా పలువురు నేతలు కేసీఆర్‌తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కేసీఆర్ పార్టీ నేతల వద్ద తెలంగాణ బిల్లు విషయం ప్రస్తావించారు.
నవంబర్ 17వ తేదీ నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం కావచ్చని, సమావేశాలు ప్రారంభమైన వారం రోజుల్లోపే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ బిల్లు సభలో ప్రవేశపెట్టే అవకాశం ఉందని ఆయన వారితో చెప్పారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించిన బిల్లు ప్రక్రియ ఆగిపోయినట్లు పైకి కనిపిస్తున్నా.. ఇందుకు సంబంధించిన ప్రక్రియ కేంద్రంలో వేగంగానే సాగుతోందని కేసీఆర్ చెప్పారు. బిల్లుకు సంబంధించిన మొత్తం పనులు చాపకింద నీరులా పూర్తవుతున్నాయన్నారు.
బుధవారం నాటి కేంద్ర మంత్రి వర్గ సమావేశంలో తెలంగాణ బిల్లు ప్రస్తావనకు వచ్చే అవకాశం లేదని, ఏదో ప్రత్యేక అంశంపై చర్చిం చేందుకు ఆ భేటీ జరుగుతోందన్నారు. బుధవారం తరువాత ఏ రోజు కేంద్ర మంత్రివర్గం సమావేశం జరిగినా తెలంగాణ బిల్లు ప్రస్తావనకు వస్తుందన్నారు. ఏది ఏమైనా అక్టోబర్ నెలలో ఈ బిల్లు ప్రక్రియకు సంబంధించిన పనులన్నీ పూర్తవుతాయని తెలిపారు. మరోపక్క రాష్ట్రంలో రాష్టప్రతి పాలన వచ్చే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని కేసీఆర్ పార్టీ నేతలతో వ్యాఖ్యానించారు. తెలంగాణ బిల్లు పార్లమెంట్‌లో ఆమోదం పొందిన వెంటనే రెండు రాష్ట్రాలు ఏర్పడినప్పటికీ... ఉద్యోగులు, నీళ్ల వాటా, ఆదాయపంపిణీ వంటి అంశాలు రాష్ట్ర విభజన తరువాతే మొదలవుతాయని, ఆ ప్రక్రియ పూర్తవడానికి దాదాపు ఐదు నెలల సమయం పట్టే అవకాశం ఉందని కేసీఆర్ పార్టీ నేతలకు వివరించారు.
నవంబర్‌లో తెలంగాణ బిల్లుకు ఆమోదం: కేసీఆర్
Published Wed, Oct 2 2013 2:43 AM | Last Updated on Sat, Aug 18 2018 4:13 PM
Advertisement
Advertisement