రఫెల్ జెట్ లతో చైనాకు చెక్!
న్యూఢిల్లీ: రఫెల్ జెట్ విమానాల కొనుగోలుకు భారత్-ఫ్రాన్స్ ల మధ్య ఒప్పందం కుదిరింది. మొత్తం 36 ఫైటర్ విమానాలను 7.87 బిలియన్ యూరోలకు భారత్ కొనుగోలు చేయనుంది. భారత వాయుదళంలో రఫెల్ జెట్స్ చేరండంతో ప్రపంచంలో అత్యంత శక్తిమంతమైన ఎయిర్-టు-ఎయిర్ మిస్సైల్ 'మెటిఓర్' భారత అమ్ములపొదిలో చేరనుంది. దాదాపు 100 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరంలో ఉన్న ప్రత్యర్ధుల ఫైటర్ జెట్లను మెటిఓర్ ను ఉపయోగించి ధ్వసం చేయొచ్చు.
దీంతో దక్షిణ ఆసియాలో మిస్సైల్ టెక్నాలజీ కలిగిన తొలి దేశంగా భారత్ అవతరించనుంది. పాకిస్తాన్, చైనాలకు ఈ కోవకు చెందిన మిస్సైల్ టెక్నాలజీ అందుబాటులో లేదు. మెటిఓర్ తో పాటు ఎయిమ్-120డీ అనే అమెరికన్ మిస్సైల్ కు మాత్రమే 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న శత్రువుల జెట్ లను చేధించే సామర్ధ్యం ఉంది. అయితే, మెటిఓర్ కలిగివున్న 'నో ఎస్కేప్ జోన్' టెక్నాలజీ ఎయిమ్-120డీలో లేదు.
నో ఎస్కేప్ జోన్ అంటే ఏంటి?
మెటిఓర్ మిస్సైల్లో ఉన్న మరో సదుపాయం 'నో ఎస్కేప్ జోన్'. శత్రు ఫైటర్ పై మిస్సైల్ ను ప్రయోగించే ముందు.. నో ఎస్కేప్ జోన్ ను యాక్టివేట్ చేయడం వల్ల శత్రువుల ఫైటర్ మిస్ అవకుండా నాశనం చేయవచ్చు. మెటిఓర్ దాడి నుంచి తప్పించుకోవాలంటే శత్రువుల ఫైటర్లు మిస్సైల్ ను జామ్ చేయగలగాలి. అంటే మిస్సైల్ రాడార్ పై దాడి చేసి నాశనం చేయాలి.
కాగా, ప్రస్తుతం భారత్-ఫ్రాన్స్ దేశాల మధ్య రఫాలే జెట్ల కొనుగోలు కాంట్రాక్ట్ పై విస్తృతంగా చర్చలు జరుగుతున్నాయి. ఢిల్లీలో ఉన్న ఫ్రెంచ్ టీం కాంట్రాక్ట్ కు సంబంధించిన పత్రాలను క్షుణ్ణంగా పరిశీలిస్తోంది. పరిశీలన అనంతరం ఒప్పంద పత్రాలు ఆమోదం కోసం కేబినెట్ కమిటీ ముందుకు రానున్నాయి. 2019లో భారత్ ఫ్రాన్స్ నుంచి రఫెల్ ఫైటర్లను అందుకోనుంది. గత ఏడాది ఏప్రిల్ లో ఫ్రాన్స్ పర్యటనకు వెళ్లిన ప్రధానమంత్రి నరేంద్రమోదీ రఫెల్ జెట్ కొనుగోలుపై ప్రకటన చేసిన విషయం తెలిసిందే.