ఎయిర్‌హోస్టెస్ శిక్షణ పొందాలంటే...
టి. మురళీధరన్
టి.ఎం.ఐ. నెట్వర్క్
ఏరోస్పేస్ ఇంజనీరింగ్ కోర్సును ఆఫర్ చేస్తున్న సంస్థల వివరాలు తెలపగలరు?
- రామస్వామి, ఖమ్మం.
విమానాలు, హెలికాప్టర్లు, అంతరిక్ష నౌకలు, ఉపగ్రహాలు, రాకెట్లు, క్షిపణులు తదితరాల డిజైన్, నిర్మాణం, నిర్వహణలకు సంబంధించిందే ఏరోస్పేస్ ఇంజనీరింగ్. ఇది విమానయానం, అంతరిక్ష యాత్రలు, రక్షణ వ్యవస్థలకు వెన్నెముక వంటిది.
కోర్సుల వివరాలు:
జేఎన్టీయూ - హైదరాబాద్..
ఏరోస్పేస్ ఇంజనీరింగ్‌లో ఎంటెక్‌ను అందిస్తోంది. ఈ కోర్సులో ప్రవేశానికి సంబంధిత అంశంలో బీఈ/బీటెక్ పూర్తిచేసిన వారు అర్హులు.
వెబ్సైట్: www.jntuh.ac.in.
ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్సీ), బెంగళూరు.. ఏరోస్పేస్లో మాస్టర్ ఆఫ్ ఇంజనీరింగ్‌ను ఆఫర్ చేస్తోంది.
వెబ్సైట్: www.iisc.ernet.in.
డిఫెన్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ, పుణే..
ఎంటెక్-ఏరోస్పేస్ ఇంజనీరింగ్ కోర్సును ఆఫర్ చేస్తోంది.
వెబ్సైట్:www.diat.ac.in
కెరీర్ అవకాశాలు
ఏరోస్పేస్ ఇంజనీరింగ్ కోర్సులు పూర్తిచేసిన వారికి విమానయాన రంగం; వివిధ ప్రభుత్వ విభాగాలు; విద్య, పరిశోధన సంస్థల్లో ఉన్నత ఉద్యోగావకాశాలు ఉంటాయి.
నేను ప్రస్తుతం బీటెక్- బయోటెక్నాలజీ చేస్తున్నాను. దీనికి సంబంధించి ఉన్నత విద్యావకాశాల వివరాలు తెలపగలరు? - మంజు, వరంగల్.
జేఎన్టీయూ, హైదరాబాద్..
బయోటెక్నాలజీలో ఎంటెక్‌ను ఆఫర్ చేస్తోంది. ప్రవేశపరీక్ష లేదా గేట్లో ప్రతిభ ఆధారంగా కోర్సులో ప్రవేశాలు కల్పిస్తున్నారు.
వెబ్సైట్: www.jntuh.ac.in.
ఐఐటీ-హైదరాబాద్..
మెడికల్ బయోటెక్నాలజీలో ఎంటెక్‌ను ఆఫర్ చేస్తోంది. ఈ కోర్సులో ఇమ్యునాలజీ, జీన్ టెక్నాలజీ, ప్రొటీన్ టెక్నాలజీ, సెల్ టెక్నాలజీ, వైరాలజీ, బయోకెమిస్ట్రీ, మెడికల్ మైక్రోబయాలజీ, సెల్ సిగ్నలింగ్ వంటి అంశాలను బోధిస్తారు.
వెబ్సైట్:http://biotech.iith.ac.in.
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ..
ఎంటెక్- బయో ఇన్ఫర్మాటిక్స్‌ను ఆఫర్ చేస్తోంది.
వెబ్సైట్:www.uohyd.ac.in.
కెరీర్ అవకాశాలు: బయోటెక్నాలజీ, హార్టికల్చర్, అగ్రికల్చర్, కెమికల్స్, బయో ప్రొడక్ట్స్, టెక్స్టైల్స్, హెల్త్ కేర్ అండ్ ఫుడ్ ప్రాసెసింగ్ రంగాల్లో అవకాశాలుంటాయి. వివిధ ప్రభుత్వ విభాగాలు, పరిశోధన సంస్థలు, విద్యాసంస్థల్లోనూ ఉద్యోగాలు లభిస్తాయి.
ఎకనామిక్స్‌లో పీజీ కోర్సులను అందిస్తున్న సంస్థలేవి? - శ్రీ చరణ్, హైదరాబాద్.
శ్రీవేంకటేశ్వర యూనివర్సిటీ, తిరుపతి..
ఎంఏ ఎకనామిక్స్‌ను ఆఫర్ చేస్తోంది. అర్హత: బీఏ ఎకనామిక్స్. ఎంట్రన్స్‌లో ప్రతిభ ఆధారంగా కోర్సులో ప్రవేశాలు కల్పిస్తారు.
వెబ్సైట్: www.svuniversity.ac.in
ఆంధ్రా యూనివర్సిటీ, విశాఖపట్నం..
ఎంఏ ఎకనామిక్స్, ఎంఏ అప్లైడ్ ఎకనామిక్స్‌ను ఆఫర్ చేస్తోంది. ఎకనామిక్స్ ఒక సబ్జెక్టుగా గ్రాడ్యుయేషన్ పూర్తిచేసిన వారు కోర్సులో ప్రవేశానికి అర్హులు.
వెబ్సైట్: www.andhrauniversity.edu.in.
ఉస్మానియా యూనివర్సిటీ, హైదరాబాద్..
అప్లైడ్ ఎకనామిక్స్‌లో ఐదేళ్ల కాలవ్యవధితో ఇంటిగ్రేటెడ్ కోర్సును ఆఫర్ చేస్తోంది. ఇందులో ప్రవేశానికి ప్లస్ 2 అర్హత ఉండాలి.
డిపార్ట్మెంట్ ఆఫ్ హ్యుమానిటీస్ అండ్ సోషల్ సెన్సైస్, ఐఐటీ-కాన్పూర్..
ఎకనామిక్స్‌లో ఐదేళ్ల కాలవ్యవధితో ఇంటిగ్రేటెడ్ ఎంఎస్సీ కోర్సును ఆఫర్ చేస్తోంది.
వెబ్సైట్: www.iitk.ac.in.
నేను ఎయిర్‌హోస్టెస్ కావాలనుకుంటున్నాను. శిక్షణకు సంబంధించిన వివరాలు తెలపగలరు?
- చందన, కాకినాడ.
ఎయిర్‌హోస్టెస్ శిక్షణ పొందేందుకు అభ్యర్థి వయసు 18-24 ఏళ్ల మధ్య ఉండాలి. ఎత్తు కనీసం 160 సెం.మీ. ఉండాలి. తప్పనిసరిగా 10 ప్లస్ 2లో ఉత్తీర్ణత సాధించాలి.
శిక్షణ కోర్సుల వివరాలు
ఫ్రాంక్ఫిన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎయిర్‌హోస్టెస్.. ఏడాది కాల వ్యవధితో ఎయిర్‌హోస్టెస్, హాస్పిటాలిటీ ట్రావెల్ మేనేజ్మెంట్ కోర్సును ఆఫర్ చేస్తోంది.
వెబ్సైట్: www.frankfinn.com
కేతన్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హాస్పిటాలిటీ మేనేజ్మెంట్, దిల్సుఖ్నగర్.. ఆర్నెల్ల ఎయిర్‌హోస్టెస్ శిక్షణ ఇస్తోంది.
వెబ్సైట్: www.ketansinstitute.com
ఆప్టెక్ ఏవియేషన్ అండ్ హాస్పిటాలిటీ, మాసబ్‌ట్యాంక్.. ఏడాది కాల వ్యవధితో ఎయిర్‌హోస్టెస్ శిక్షణ అందిస్తోంది.
వెబ్సైట్: www.aptechaviationacademy.com
సృజనకు చిరునామా ఐఐటీ రూర్కీ..
క్యాంపస్
సువిశాల ప్రాంగణం
అందమైన భవిష్యత్తుకు సృజనాత్మక
ఆలోచనలు సోపానాలు.. అలాంటి
సృజనాత్మక ఆలోచనలు చేసేలా ఇండియన్
ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ)లు
విద్యార్థులకు మార్గనిర్దేశనం చేస్తున్నాయి.
ఇంజనీరింగ్ విద్య, పరిశోధనలో అత్యున్నత
సంస్థలుగా వెలుగొందుతూ సాంకేతిక
ప్రపంచానికి సుశిక్షితులైన మానవ వనరులను
అందిస్తున్నాయి. అలాంటి విద్యా సంస్థల్లో
ఒకటైన ‘ఐఐటీ-రూర్కీ’ నుంచి ఎంటెక్
పూర్తిచేసిన దోర పవన్‌కుమార్ ‘భవిత’
పాఠకులకు అందిస్తున్న క్యాంపస్ కబుర్లు..
బ్రిటిష్ ప్రభుత్వం 1847లో రూర్కీలో ‘ఇంజనీరింగ్ కళాశాలను ఏర్పాటు చేసింది. ఈ కళాశాలలో మొదట్లో సివిల్ ఇంజనీరింగ్ కోర్సు మాత్రమే ఉండేది. ఇది తర్వాత కాలంలో ‘థామ్సన్ కాలేజ్ ఆఫ్ సివిల్ ఇంజనీరింగ్’గా, యూనివర్సిటీ ఆఫ్ రూర్కీగా సేవలందించి చివరకు 2001లో ఐఐటీ హోదాను పొందింది.
ఉత్తరాఖండ్‌లోని ఐఐటీ-రూర్కీ క్యాంపస్ 400 ఎకరాల స్థలంలో విస్తరించి ఉంది. ఇక్కడికి కొద్ది దూరం నడిచివెళ్తే గంగా నది అందాలు విద్యార్థులను పలకరిస్తాయి. సంస్థ ఏర్పాటైన తొలినాళ్లలో సివిల్ ఇంజనీరింగ్ తరగతులకు నెలవైన భవనమే ఇప్పటికీ ఠీవిగా నిలబడి ఐఐటీ క్యాంపస్‌కు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. రూర్కీకి సమీపంలో సిమ్లా, ముస్సోరి, రిషికేష్, హరిద్వార్ వంటి ప్రఖ్యాత పర్యాటక ప్రాంతాలున్నాయి.
మా తరగతి.. మినీ భారత్:
నేను చదువుకున్న ఎంటెక్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ క్లాస్‌లో మొత్తం 53 మంది విద్యార్థులుఉండేవారు. వీరిలో ఆరుగురు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వారు. ఉదయం ఎనిమిది గంటలకు క్లాస్‌లు ప్రారంభమవుతాయి. తరగతి వాతావరణం సృజనాత్మక ఆలోచనల్ని ఆచరణలో పెట్టి కొత్త కొత్త ఆవిష్కరణలు చేసేలా విద్యార్థులను ప్రోత్సహించేదిగా ఉంటుంది. ఎంటెక్ ఫస్టియర్‌లో 12 సబ్జెక్టులతో రెండు సెమిస్టర్లుంటాయి. ఇక రెండో ఏడాది మొత్తం రీసెర్చ్ కేంద్రంగా సాగుతుంది. నచ్చిన అంశాలను కొన్నింటిని ఎంచుకోవడం, వాటిలో ఒకదాన్ని ప్రాజెక్టుగా తీసుకొని వర్క్ చేయాలి. చివరగా పరిశోధన పత్రాన్ని సమర్పించాలి. నేను ప్యారెలల్ కంప్యూటింగ్‌పై ప్రాజెక్టు చేశాను. ఫ్యాకల్టీలో చాలా వరకు అనుభవజ్ఞులు. విసుగనేది లేకుండా ఓ అంశానికి సంబంధించి ఎన్నిసార్లయినా చెప్పడానికి సిద్ధంగా ఉంటారు. క్యాంపస్ సెంట్రల్ లైబ్రరీలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం నుంచి ఆధ్యాత్మికత వరకు అనేక అంశాలకు సంబంధించిన వేలాది పుస్తకాలున్నాయి. దీంతో పాటు ప్రతి విభాగానికీ ప్రత్యేకంగా లైబ్రరీలున్నాయి.
మేమంతా ‘గంగా భవన్’ హాస్టల్లో ఉండేవాళ్లం. ఇక్కడ రోటీ వంటి నార్త్ ఇండియన్ ఆహారం ఉంటుంది. ఇలాంటి ఆహారంతో మొదట్లో ఇబ్బందిపడినా తర్వాత అలవాటైంది. హాస్టల్లో జిమ్‌తో పాటు బ్యాడ్మింటన్ కోర్ట్, టేబుల్ టెన్నిస్, బిలియర్డ్స్ ఆడుకోవడానికి ఏర్పాట్లున్నాయి. మెయిన్ క్యాంపస్‌లో చాలా పెద్ద స్విమ్మింగ్‌పూల్ కూడా ఉంది. ఇంకో విషయమేమిటంటే రూర్కీ ఎకో ఫ్రెండ్లీ సిటీ. విద్యార్థులు హాస్టళ్ల నుంచి క్లాస్‌లకు సైకిళ్లపైనే వెళ్తారు.
‘ఫెస్ట్‌లతో సందడే సందడి:
విద్యార్థిని అన్నివిధాలుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా కరిక్యులం ఉంటుంది. ఐఐటీ రూర్కీలో ఏడాదిలో ఒక కల్చరల్ ఫెస్ట్, మరొక టెక్నికల్ ఫెస్ట్‌లు జరుగుతాయి. నవంబర్‌లో కల్చరల్ ఫెస్ట్ (THOMSO), మార్చిలో టెక్నికల్ ఫెస్ట్ (COGNIZANCE) జరుగుతాయి. ఈ ఫెస్ట్‌లకు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి విద్యార్థులు హాజరవుతారు. ఫెస్ట్‌ల్లో రోబో వార్స్, 3డీ పెయింటింగ్ వంటి ఆసక్తికర కార్యక్రమాలు నిర్వహిస్తారు. విద్యార్థులు రూపొందించిన రోబో కార్ల రేసింగ్ మరొక ప్రధాన ఆకర్షణ. 2003 నుంచి టెక్నికల్ ఫెస్టివల్‌ను నిర్వహిస్తున్నారు. ఇందులో ప్రముఖ శాస్త్రవేత్తలు, టెక్నాలజిస్టులు, పారిశ్రామికవేత్తల గెస్ట్ లెక్చర్స్ ఉంటాయి. రోబోటిక్స్, విజువల్ ఎఫెక్ట్స్, ఏరో మోడలింగ్ తదితర అంశాలపై వర్క్‌షాప్‌లు నిర్వహిస్తారు. రూర్కీ ఐఐటీలో ఏటా నిర్వహించే కల్చరల్ ఫెస్ట్ దేశంలో నిర్వహించే గొప్ప యూత్ ఫెస్టివల్స్‌లో ఒకటిగా చెప్పొచ్చు. విద్యార్థుల్లో దాగున్న సాంస్కృతిక ప్రతిభను వెలికితీసేందుకు కల్చరల్ ఫెస్ట్ వేదికగా నిలుస్తోంది. డ్యాన్స్, డ్రామా, మ్యూజిక్ ఈవెంట్లతో ఫెస్ట్ సందడిగా సాగుతుంది.
కొలువుల కలలకు వేదికలు:
ఏటా డిసెంబర్లో ప్లేస్మెంట్ హడావుడి మొదలవుతుంది. 15 రోజుల పాటు సాగే ప్లేస్మెంట్ సెషన్‌కు గూగుల్, మైక్రోసాఫ్ట్, ఫేస్బుక్, డీఆర్డీవో, శ్యాంసంగ్, యాహూ వంటి పెద్ద పెద్ద కంపెనీలు క్యాంపస్‌ను సందర్శిస్తాయి. ఈ 15 రోజుల్లో పగలు, రాత్రి అనే తేడా లేకుండా ప్లేస్మెంట్ ఆఫీస్ సందడిగా ఉంటుంది. నాకు శ్యాంసంగ్-ఇండియాలో మంచి ఆఫర్ వచ్చింది.