Candidates General Election
-
బాబ్బాబు.. పోటీ చేయండి
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: జిల్లాలోని లోక్‌సభ, అసెంబ్లీ స్థానాల నుంచి పోటీ చేసేందుకు అధికార టీడీపీ అభ్యర్థులు కరువయ్యారు. ఒక వైపు నామినేషన్ల గడువు సమీపించడంతో టీడీపీ అధిష్టానం నానా తంటాలు పడుతోంది. ఒంగోలు పార్లమెంటుతో పాటు దర్శి, కనిగిరి, యర్రగొండపాలెం నియోజకవర్గాలకు అభ్యర్థులు దొరకని పరిస్థితి నెలకొంది. దీంతో టీడీపీ అధిష్టానం తలపట్టుకుంటోంది. ఎమ్మెల్సీ మాగుంట శ్రీనివాసులరెడ్డి గురువారం టీడీపీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. మరోవైపు నెల్లూరు జిల్లా కావలి మాజీ ఎమ్మెల్యే బీదా మస్తాన్‌రావు, ప్రకాశం జిల్లాకు చెందిన మాజీ డీజీపీ సాంబశివరావులలో ఒకరిని పోటీలో నిలపాలని ఆపార్టీ అధిష్టానం ఆలోచించింది. అయితే ఒంగోలు నుంచి పోటీ చేసేందుకు ఇరువురు నేతలు అంగీకరించలేదు. దీంతో మరోమారు అభ్యర్థి కోసం చంద్రబాబు గాలింపు మొదలుపెట్టారు. బయటి నుంచి ఎవరూ వచ్చే పరిస్థితి లేకపోవడంతో మంత్రి శిద్దా రాఘవరావునే ఒంగోలు బరి నుంచి పార్లమెంటుకు పోటీ చేయించాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. ఈ మేరకు పోటీకి సిద్ధంగా ఉండాలని సీఎం శిద్దాను ఆదేశించారు. తాను దర్శి నుంచి అసెంబ్లీకి పోటీ చేస్తానని, ఒంగోలు పార్లమెంటుకు పోటీ చేయలేనని మంత్రి శిద్దా ముఖ్యమంత్రికి పలుమార్లు విన్నవించారు. అయితే ఒంగోలు పార్లమెంటుకు టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసేందుకు ఎవరూ ముందుకు రాలేదు. దీంతో శిద్దా తప్ప గత్యంతరం లేని పరిస్థితి ఏర్పడింది. ఒంగోలు పార్లమెంటు నుంచి పోటీ చేసేందుకు మంత్రి శిద్దా అంగీకరించకపోవడంతో ముఖ్యమంత్రి మూడు రోజులుగా శిద్దాను బుజ్జగించారు. ఎట్టకేలకు బుధవారం జరిగిన సమావేశంలో సీఎం పోటీకి శిద్దాను ఒప్పించారు. మరోవైపు శిద్దా ప్రాతినిధ్యం వహిస్తున్న దర్శి అసెంబ్లీకి అభ్యర్థి దొరకని పరిస్థితి ఏర్పడింది. దర్శి నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్‌పార్టీ మరింత బలంగా ఉండడంతో అక్కడి నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసేందుకు ఎవరూ ముందుకు వచ్చే పరిస్థితి కానరావడం లేదు. సామాజిక సమీకరణాల నేపథ్యంలో తొలుత కనిగిరి సిట్టింగ్ ఎమ్మెల్యే కదిరి బాబూరావును దర్శి నుంచి పోటీ చేయాలని టీడీపీ అధిష్టానం కోరింది. అయితే బాబూరావు ఇందుకు ససేమిరా అన్నారు. దర్శి నుంచి పోటీ చేయాల్సిందేనంటూ మాజీ కేంద్రమంత్రి సుజనా చౌదరితో పాటు మరి కొందరు నేతలు బాబూరావుపై ఒత్తిడి తెచ్చినా ఆయన వినలేదు. దర్శి నుంచి పోటీ చేసేది లేదని అవసరమైతే కనిగిరి నుంచి ఇండిపెండెంట్‌గా అయినా పోటీ చేస్తానని బాబూరావు టీడీపీ నేతలకు స్పష్టం చేశారు. దీంతో టీడీపీ అధిష్టానం వెనక్కు తగ్గింది. మరో వైపు ఇటీవల టీడీపీలో చేరి కనిగిరి సీటు ఆశిస్తున్న కనిగిరి మాజీ ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నర్సింహారెడ్డిని దర్శి అభ్యర్థిగా పోటీ చేయాలని టీడీపీ అధిష్టానం కోరింది. బుధవారం టీడీపీ ముఖ్యనేతలు ఉగ్ర ముందు ఈ ప్రతిపాదనను ఉంచారు. తనకు కనిగిరి సీటు ఇస్తానంటేనే పార్టీలో చేరానని, దర్శి సీటు అవసరం లేదని ఉగ్ర తేల్చి చెప్పినట్లు సమాచారం. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు దర్శి నుంచి పోటీ చేయాలని అన్ని రకాలుగా పార్టీ ఆదుకుంటుందని టీడీపీ ముఖ్యనేతలు ఉగ్రకు నచ్చచెప్పే ప్రయత్నం చేసినట్లు తెలుస్తోంది. తన సొంత నియోజకవర్గం కాకుండా పక్క నియోజకవర్గంలో పోటీ చేయడం తనకు ఇబ్బందని, తాను దర్శి నుంచి పోటీ చేయలేనని ఉగ్ర నర్సింహారెడ్డి టీడీపీ నేతలకు తేల్చి చెప్పినట్లు తెలుస్తోంది. ముందు సీఎంతో మాట్లాడాలని టీడీపీ ముఖ్యనేతలు ఉగ్రకు సూచించారు. ఇందుకు అంగీకరించని ఉగ్ర సెల్‌ఫోన్ స్విచ్చాఫ్ చేసుకుని ఇంటికి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. ఉగ్రతో మాట్లాడేందుకు టీడీపీ అధిష్టానం రాత్రి వరకు ప్రయత్నించినా ఆయన అందుబాటులోకి రాలేదని తెలుస్తోంది. దీంతో ఏం చేయాలో పాలుపోక టీడీపీ అధిష్టానం తలపట్టుకుంటోంది. మరో వైపు తనకు కనిగిరి సిట్టింగ్ స్థానం ఇస్తేనే టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తానని దర్శి లేది ఇతర నియోజకవర్గాలకు వెళ్లేది లేదని కనిగిరి సిట్టింగ్ ఎమ్మెల్యే కదిరి బాబూరావు టీడీపీ అధిష్టానానికి తేల్చి చెప్పినట్లు తెలుస్తోంది. మరోవైపు చంద్రబాబు వియ్యంకుడు బాలకృష్ణ ద్వారా కదిరి బాబూరావు కనిగిరి అభ్యర్థిగా పోటీ ఉండేందుకు అన్ని ప్రయత్నాలు సాగిస్తున్నట్లు సమాచారం. ఇంకో వైపు యర్రగొండపాలెం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీలో నిలిచేందుకు సరైన అభ్యర్థి దొరికే పరిస్థితి కనిపించడం లేదు. సిట్టింగ్ ఎమ్మెల్యే డేవిడ్ రాజుపై ఆ నియోజకవర్గంలో తీవ్ర వ్యతిరేకత ఉండడంతో అతను పోటీ చేసే పరిస్థితి కానరావడం లేదు. మరోవైపు సంతనూతలపాడు నియోజకవర్గ ఇన్చార్జ్గా ఉన్న బీఎన్ విజయ్‌కుమార్‌ను నియోజకవర్గానికి చెందిన కొందరు ముఖ్యనేతలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. బీఎన్‌ను కాదనుకుంటే ఇక్కడ కూడా అధికార పార్టీకి అభ్యర్థి దొరికే పరిస్థి«తి లేదు. దీంతో ఏం చేయాలో పాలుపోక చంద్రబాబు తలపట్టుకుంటున్నారు. ప్రకాశం జిల్లాలో ఒంగోలు పార్లమెంటుతో పాటు పై నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాలకు సరైన అభ్యర్థి దొరికే పరిస్థితి లేక అధికార టీడీపీ కొట్టుమిట్టాడుతోంది. నామినేషన్లకు మరో 5 రోజులు మాత్రమే గడువు ఉండడంతో ఏం చేయాలో వారికి పాలుపోవడం లేదు. -
సాధారణ ఎన్నికల్లో అభ్యర్థుల ఖర్చు 10.07 కోట్లు
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్ : సాధారణ ఎన్నికల్లో అభ్యర్థులు ప్రచారానికి చేసిన ఖర్చు లెక్క తేలింది. అభ్యర్థులంతా ఎన్నికల కమిషన్ నిర్ణయించిన పరిమితికి లోపే వ్యయాన్ని చూపారు. అయితే, మరో 36మంది ఇంకా లెక్కలే ఇవ్వలేదు. వీరు ఖర్చు చేసిన మొత్తం కూడా కలుపుకుంటే ఈ లెక్క మరింత పెరిగే అవకాశముంది. కొందరు అభ్యర్థులు ఎన్నికల సంఘం విధించిన గరిష్ట పరిమితిని కూడా మించి ఖర్చు చేసినట్లు మానిటరింగ్ కమిటీ నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఏప్రిల్‌లో జరిగిన సాధారణ ఎన్నికల్లో జిల్లాలో అభ్యర్థులు రూ.10.07 కోట్లు ప్రచార వ్యయం చేసినట్లు లెక్కలు చూపారు. మీడియా సర్టిఫికేషన్, మానిటరింగ్ కమిటీ (ఎంసీఎంసీ) లెక్కలను కూడా పరిగణనలోకి తీసుకుంటే అభ్యర్థులు చేసిన ప్రచార వ్యయం రూ.10.83 కోట్లు. లోక్‌సభ స్థానానికి పోటీచేసిన అభ్యర్థులు గరిష్టంగారూ.70లక్షలు, అసెంబ్లీ స్థానాల్లో పోటీచేసే అభ్యర్థులు రూ.25లక్షలకు మించకుండా ప్రచారం కోసం ఖర్చు చేయాలి. లోక్‌సభ అభ్యర్థుల్లో అత్యధికంగా మహబూబ్‌నగర్ ఎంపీగా టీఆర్ఎస్ నుంచి పోటీ చేసిన ఏపీ జితేందర్‌రెడ్డి రూ.43.60 లక్షలు ఖర్చు చేశారు. తర్వాతి స్థానాల్లో ఎస్.జైపాల్‌రెడ్డి (కాంగ్రెస్) రూ.37.86 లక్షలు, మంద జగన్నాథం (టీఆర్ఎస్) రూ.32.74 లక్షలు, నాగం జనార్దన్‌రెడ్డి (బీజేపీ) రూ.28.45లక్షల చొప్పున ఖర్చు చేశారు. నాగర్‌కర్నూలు లోక్‌సభ స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేసి గెలుపొందిన నంది ఎల్లయ్య మాత్రం రూ.18 లక్షలు మాత్రమే ఖర్చు చేసినట్లు లెక్క చూపారు. అసెంబ్లీ స్థానాలకు పోటీచేసిన అభ్యర్థుల్లో 22మంది రూ.20లక్షల పైనే ఖర్చు చేశారు. ఎంసీఎంసీ లెక్కలను కూడా పరిగణనలోకి తీసుకుంటే కల్వకుర్తి టీఆర్ఎస్ అభ్యర్థి జైపాల్‌యాదవ్ అత్యధికంగా రూ.33లక్షలు ఖర్చు చేసినట్లు నివేదిక వెల్లడిస్తోంది. స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేసిన సయ్యద్ ఇబ్రహీం (మహబూబ్‌నగర్), నారాయణరెడ్డి (కల్వకుర్తి) కూడా ప్రధాన పార్టీల అభ్యర్థులకు ధీటుగా ఖర్చు చేశారు. 36మందికి నోటీసులు జారీ జిల్లాలోని రెండు లోక్‌సభ స్థానాలు, 14 అసెంబ్లీ స్థానాలకు ఈ యేడాది ఏప్రిల్‌లో సాధారణ ఎన్నికలు జరిగాయి. లోక్‌సభ బరిలో 15, అసెంబ్లీ బరిలో 149మంది అభ్యర్థులు పోటీ చేశారు. ఎన్నికల సంఘం నిబంధనల మేరకు ఎన్నికల్లో పోటీచేసిన అభ్యర్థులు పోలింగ్ ముగిసిన 45 రోజుల్లో ప్రచార వ్యయానికి సంబంధించిన లెక్కలను సమర్పించాలి. అభ్యర్థుల ఎన్నికల వ్యయం లెక్కలు తేల్చేందుకు ఎన్నికల సంఘం జిల్లాస్థాయిలో ప్రత్యేక యంత్రాంగాన్ని కూడా ఏర్పాటు చేసింది. మరోవైపు అభ్యర్థులు వ్యయాన్ని మదింపు, పర్యవేక్షించేందుకు జిల్లాస్థాయిలో మీడియా సర్టిఫికేషన్, మానిటరింగ్ కమిటీ (ఎంసీఎంసీ)ని కూడా ఏర్పాటు చేశారు. ఎన్నికల ముగిసిన తర్వాత ఎన్నికల సంఘం వ్యయ పరిశీలకులు జిల్లాలో సుమారు వారం రోజుల పాటు మకాం వేసినా చాలామంది అభ్యర్థులు స్పందించలేదు. ప్రచార వ్యయం వివరాలు సమర్పించని 36మంది అభ్యర్థులకు నోటీసులు జారీ చేసినట్లు అధికారులు వెల్లడించారు.