సాధారణ ఎన్నికల్లో అభ్యర్థుల ఖర్చు 10.07 కోట్లు | Candidates General Election Cost 10.07 crore | Sakshi
Sakshi News home page

సాధారణ ఎన్నికల్లో అభ్యర్థుల ఖర్చు 10.07 కోట్లు

Published Wed, Dec 31 2014 3:38 AM | Last Updated on Mon, Oct 8 2018 5:04 PM

సాధారణ ఎన్నికల్లో అభ్యర్థుల ఖర్చు  10.07 కోట్లు - Sakshi

సాధారణ ఎన్నికల్లో అభ్యర్థుల ఖర్చు 10.07 కోట్లు

సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్ : సాధారణ ఎన్నికల్లో అభ్యర్థులు ప్రచారానికి చేసిన ఖర్చు లెక్క తేలింది. అభ్యర్థులంతా ఎన్నికల కమిషన్ నిర్ణయించిన పరిమితికి లోపే వ్యయాన్ని చూపారు. అయితే, మరో 36మంది ఇంకా లెక్కలే ఇవ్వలేదు. వీరు ఖర్చు చేసిన మొత్తం కూడా కలుపుకుంటే ఈ లెక్క మరింత పెరిగే అవకాశముంది. కొందరు అభ్యర్థులు ఎన్నికల సంఘం విధించిన గరిష్ట పరిమితిని కూడా మించి ఖర్చు చేసినట్లు మానిటరింగ్ కమిటీ నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఏప్రిల్‌లో జరిగిన సాధారణ ఎన్నికల్లో జిల్లాలో అభ్యర్థులు రూ.10.07 కోట్లు ప్రచార వ్యయం చేసినట్లు లెక్కలు చూపారు. మీడియా సర్టిఫికేషన్, మానిటరింగ్ కమిటీ (ఎంసీఎంసీ) లెక్కలను కూడా పరిగణనలోకి తీసుకుంటే అభ్యర్థులు చేసిన ప్రచార వ్యయం రూ.10.83 కోట్లు. లోక్‌సభ స్థానానికి పోటీచేసిన అభ్యర్థులు గరిష్టంగారూ.70లక్షలు, అసెంబ్లీ స్థానాల్లో పోటీచేసే అభ్యర్థులు రూ.25లక్షలకు మించకుండా ప్రచారం కోసం ఖర్చు చేయాలి.
 
 లోక్‌సభ అభ్యర్థుల్లో అత్యధికంగా మహబూబ్‌నగర్ ఎంపీగా టీఆర్‌ఎస్ నుంచి పోటీ చేసిన ఏపీ జితేందర్‌రెడ్డి రూ.43.60 లక్షలు ఖర్చు చేశారు. తర్వాతి స్థానాల్లో ఎస్.జైపాల్‌రెడ్డి (కాంగ్రెస్) రూ.37.86 లక్షలు, మంద జగన్నాథం (టీఆర్‌ఎస్) రూ.32.74 లక్షలు, నాగం జనార్దన్‌రెడ్డి (బీజేపీ) రూ.28.45లక్షల చొప్పున ఖర్చు చేశారు. నాగర్‌కర్నూలు లోక్‌సభ స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేసి గెలుపొందిన నంది ఎల్లయ్య మాత్రం రూ.18 లక్షలు మాత్రమే ఖర్చు చేసినట్లు లెక్క చూపారు. అసెంబ్లీ స్థానాలకు పోటీచేసిన అభ్యర్థుల్లో 22మంది రూ.20లక్షల పైనే ఖర్చు చేశారు. ఎంసీఎంసీ లెక్కలను కూడా పరిగణనలోకి తీసుకుంటే కల్వకుర్తి టీఆర్‌ఎస్ అభ్యర్థి జైపాల్‌యాదవ్ అత్యధికంగా రూ.33లక్షలు ఖర్చు చేసినట్లు నివేదిక వెల్లడిస్తోంది. స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేసిన సయ్యద్ ఇబ్రహీం (మహబూబ్‌నగర్), నారాయణరెడ్డి (కల్వకుర్తి) కూడా ప్రధాన పార్టీల అభ్యర్థులకు ధీటుగా ఖర్చు చేశారు.
 
 36మందికి నోటీసులు జారీ
 జిల్లాలోని రెండు లోక్‌సభ స్థానాలు, 14 అసెంబ్లీ స్థానాలకు ఈ యేడాది ఏప్రిల్‌లో సాధారణ ఎన్నికలు జరిగాయి. లోక్‌సభ బరిలో 15, అసెంబ్లీ బరిలో 149మంది అభ్యర్థులు పోటీ చేశారు. ఎన్నికల సంఘం నిబంధనల మేరకు ఎన్నికల్లో పోటీచేసిన అభ్యర్థులు పోలింగ్ ముగిసిన 45 రోజుల్లో ప్రచార వ్యయానికి సంబంధించిన లెక్కలను సమర్పించాలి. అభ్యర్థుల ఎన్నికల వ్యయం లెక్కలు తేల్చేందుకు ఎన్నికల సంఘం జిల్లాస్థాయిలో ప్రత్యేక యంత్రాంగాన్ని కూడా ఏర్పాటు చేసింది. మరోవైపు అభ్యర్థులు వ్యయాన్ని మదింపు, పర్యవేక్షించేందుకు జిల్లాస్థాయిలో మీడియా సర్టిఫికేషన్, మానిటరింగ్ కమిటీ (ఎంసీఎంసీ)ని కూడా ఏర్పాటు చేశారు. ఎన్నికల ముగిసిన తర్వాత ఎన్నికల సంఘం వ్యయ పరిశీలకులు జిల్లాలో సుమారు వారం రోజుల పాటు మకాం వేసినా చాలామంది అభ్యర్థులు స్పందించలేదు. ప్రచార వ్యయం వివరాలు సమర్పించని 36మంది అభ్యర్థులకు నోటీసులు జారీ చేసినట్లు అధికారులు వెల్లడించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement