Chief siddaramayya
-
ఎమ్మెల్యే వద్ద 120 కోట్ల అప్రకటిత ఆదాయం
-
ఎమ్మెల్యే వద్ద 120 కోట్ల అప్రకటిత ఆదాయం
రూ. 1.10 కోట్ల నగదు, 10 కేజీల బంగారం స్వాధీనం బెంగళూరు: కర్ణాటక సీఎం సిద్దరామయ్య సన్నిహితుడు, హోస్కేటే కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎంటీబీ నాగరాజ్‌కు చెందిన ఇళ్లు, స్థలాల్లో ఐటీ శాఖ జరిపిన దాడుల్లో రూ. 120 కోట్ల అప్రకటిత ఆదాయం బయటపడింది. బెంగళూరు, హోస్కేటేల్లో గురువారం నుంచి శనివారం వరకు ఈ దాడులు జరిగాయి. ‘రూ. 120 కోట్లకుపైగా లెక్కల్లో చూపని ఆదాయం ఉన్నట్లు తేలింది. రూ. 1.10 కోట్ల నగదు, 10 కేజీల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నాం. నాగరాజ్, ఆయన సహాయకులకు చెందినవిగా భావిస్తున్న 560 ఎకరాల భూములకు సంబంధించి పత్రాలను సీజ్ చేశాం. ఆస్తులపై పెట్టుబడులు, వాణిజ్య భవనాలు, ఆస్పత్రుల నిర్మాణం తదితర మార్గాల్లో ఆదాయం సమకూరింది’అని అధికారులు చెప్పారు. నాగరాజ్‌తో సంబంధమున్న భూయజమానులకు అందిన రూ. 70 కోట్లు, సెజ్ కోసం పొందిన రూ. 125 కోట్ల మినహాయింపుపైనా దర్యాప్తు చేస్తున్నారు. -
ప్రజలకు అండగా ఉంటాం
► కరువుతో రూ.16వేల కోట్ల మేర పంటలు దెబ్బతిన్నాయి ► కరువు నివారణకు నిధుల కొరత లేదు ► పావగడలో 2వేల మెగావాట్ల సామర్థ్యంతో సోలార్ ప్లాంట్ తుమకూరు : కరువు ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టి ప్రజలకు అండగా ఉంటామని రాష్ట్ర రెవెన్యూశాఖ మంత్రి శ్రీనివాస ఆర్.ప్రసాద్ అన్నారు. ఇంధనశాఖ మంత్రి శాఖ మంత్రి నేతృత్వంలో ఏర్పడిన మంత్రులు బృందం ఉపసమితి సభ్యులు బుధవారం తుమకూరు జిల్లా, పావగడ తాలూకాలో పర్యటించారు. ర్యాప్టె గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న బుగడూరు గ్రామాన్ని సందర్శించి కరువు పరిస్థితులను అంచనా వేశారు. స్థానికులతో కలిసి వారు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వాటర్‌ప్లాంట్, నరేగా పథకం కింద నిర్మించిన భవనాన్ని, ఇతర అభివృద్ధి పనులను పరిశీలించారు. తర్వాత మీడియాతో మంత్రి శ్రీనివాస ఆర్.ప్రసాద్ మాట్లాడారు. కరువు పరిస్థితులను అంచనా వేసేందుకు సీఎం సిద్దరామయ్యతోపాటు మంత్రులు నాలుగు బృందాలుగా ఏర్పడి రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తున్నారన్నారు. దాదాపు 16 వేల కోట్ల మేర రైతులు పంటలు నష్టపోయారన్నారు. మూడు రోజుల్లో సీఎంతో సమావేశమై నివేదికను సమర్పిస్తామన్నారు. తుమకూరు జిల్లాలో 9 కరువు తాలూకాలు గుర్తించగా అందులో పావగడలో పరిస్థితి మరింత తీవ్రంగా ఉందన్నారు. తాగు నీటి సమస్యను తీర్చడాకి 85 కోట్లు మంజూరు చేసినట్లు తెలిపారు. ఇంధనశాఖ మంత్రి కె.శివకుమార్ మాట్లాడుతూ పావగడ తాలూకాలో 2000 మెగావాట్ల సామర్థ్యం కలిగిన సోలార్ యూనిట్ ఏర్పాటు చేస్తున్నామని, ఇప్పటికే 8400 ఎకరాలు సేకరించామన్నారు. ప్రతి తాలూకాలో 20 నుంచి 30 మెగా వాట్ల సౌర ప్లాంట్లు ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. -
పెంచిన పన్ను రద్దు చేయకపోతే ఉద్యమబాట
బెంగళూరు(బనశంకరి) : నగరంలో పెంచిన ఆస్తిపన్నును ఉపసంహరించుకోవాలని, లేని పక్షంలో తీవ్రపోరాటం చేస్తామని మాజీ డిప్యూటీసీఎం ఆర్.అశోక్ హెచ్చరించారు. బీజేపీ నగర శాఖ అధ్యక్షుడు సుబ్బణ్ణ, బీబీఎంపీ విపక్షనేత పద్మనాభరెడ్డి, మాజీ మేయర్లు కట్టెసత్యనారాయణ, శాంతకుమారి తదితరులతో కలిసి గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. మూడేళ్లులో నగరప్రజలపై ఆరుసార్లు పన్ను భారం మోపిన సీఎం సిద్దరామయ్య తుగ్లక్‌లా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. బెంగళూరు నగర ప్రజలు మండేఎండలకు భయపడటం లేదని బీబీఎంపీ విధించిన ఆస్తిపన్నుతో భయపడుతున్నారని ఆరోపించారు. ఇప్పటికే నీరు, విద్యుత్, పాలు, బస్‌చార్జీలు పెంచారని ప్రస్తుతం ఆస్తిపన్ను పెంచడం కేఎంసీ చట్టానికి వ్యతిరేకంగా ఉందన్నారు. గతంలో రూ.10 వేలు ఆస్తిపన్ను చెల్లించేవారు ఇక రూ.50 వేలు చెల్లించాల్సిన పరిస్దితి ఏర్పడిందన్నారు. మొత్తం మీద 200 శాతం పైగా ఆస్తిపన్ను పెంచారని, దీంతో స్లం ప్రాంతాల్లో నివసించే పేదలపై కూడా భారం పడుతోందన్నారు. సిద్దరామయ్య ఉపముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో స్టాంపు డ్యూటీ నుంచి వచ్చే ఆదాయాన్ని పాలికెకు లభించకుండా చేశారన్నారు. దీంతో పాలికె కు వచ్చే రూ.300, 400 కోట్లు ఆదాయం నిలిచిపోయిందన్నారు. ప్రస్తుతం పెంచిన ఆస్తిపన్నును ఉపసంహరించకపోతే శుక్రవారం నిర్వహించే పాలికె సమావేశంలో నిరంతర ధర్నా చేపడతామని హెచ్చరించారు. అప్పటికీ స్పందించకపోతే మే 3 తేదీన బీజేపీ రాష్ట్రాద్యక్షుడు బీఎస్.యడ్యూరప్ప నేతృత్వంలో భారీ ఉరేగింపు ద్వారా పాలికెను ముట్టడిస్తామని అశోక్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. జేడీయస్తో పొత్తు స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ అఖండవిజయం సాధించిందని ఇది రానున్న రాజకీయాలకు దిక్సూచి అని ఆర్.అశోక్ అన్నారు. జిల్లాపంచాయతీ అధ్యక్ష స్థాన ఎన్నికల్లో జేడీఎస్‌తో కలిసి పొత్తు పెట్టుకోవాలని తీర్మానించామన్నారు. దీనికోసం ఆ పార్టీ సీనియర్నేతలైన హెచ్డీ.కుమారస్వామి, కుమారస్వామి కూడా గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారని తెలిపారు. బెంగళూరునగర, తుమకూరు, మైసూరు, రాయచూరు జిల్లాల్లో పొత్తు పై చర్చలు జరిపామని, శివమొగ్గ ఇతర ప్రాంతాల్లో పొత్తుపై చర్చలు కొనసాగుతున్నాయన్నారు. 30 జిల్లా పంచాయతీ స్దానాల్లో 15 స్ధానాలకు దక్కించుకుంటామని ఆర్.అశోక్ తెలిపారు. జేడీఎస్, బీజేపీ పొత్తుతో బీబీఎంపీలో కూడా అధికారంలోకి వస్తారా అని లేకరులు అడిగిన ప్రశ్నకు అర్.అశోక్ సమాధానమిస్తూ దీనిపై కూడా చర్చలు జరిపామన్నారు. ఇప్పటికే జేడీఎస్ ఎమ్మెల్యే గోపాలయ్యతో మాట్లాడామని నూతన మేయర్ ఎన్నికకు ఇంకా నాలుగునెలలు సమయం ఉందని జేడీఎస్ తో పొత్తు పెట్టుకుంటామని ఆర్.అశోక్ తెలిపారు. -
కరువు పట్టని సర్కార్
కరువుపై చర్చించాలని చెప్పినా పట్టించుకోలేదు అసంతృప్తి వ్యక్తం చేసిన స్పీకర్ కాగోడు తిమ్మప్ప శివమొగ్గ : శాసన సభ స్పీకర్ కాగోడు తిమ్మప్ప రాష్ట్ర ప్రభుత్వం, సీఎం సిద్దరామయ్య తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. చాలా జిల్లాల్లో కరువు విలయతాండవం చేస్తున్నా దాని నివారణకు విడుదల చేసిన నిధులను సక్రమంగా వ్యయం చేయడం లేదని, ప్రజల కష్టాలను ప్రభుత్వం విస్మరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. శివమొగ్గ నగరంలో ప్రభుత్వ ఉద్యోగుల సంఘం సమావేశ భవనంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సంఘం వార్షిక అవార్డుల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. రాష్ట్రంలోని సుమారు 133 తాలూకాల్లో కరువు పరిస్థితులు నెలకొన్నాయని, తాగేందుకు కూడా నీరు లభించక దాహం కేకలు మిన్నంటుతున్నాయన్నారు. అయితే ప్రభుత్వం ప్రజల కష్టాలకు అర్థం చేసుకోవడం లేదన్నారు. అధికారులు సైతం నిజాయతీతో పనిచేయడం లేదన్నారు. ఓ వైపు నిధుల కొరత ఉండగా మరో వైపు ఉన్న నిధులను వ్యయం చేయలేని దుస్థితిలో అధికారులు ఉన్నారన్నారు. కరువు పరిస్థితులపై శాసనసభ సమావేశాల్లో ప్రస్తావించాలని తాను కొంత మంది ఎమ్మెల్యేలకు సలహా కూడ ఇచ్చానన్నారు. అయితే ఏఒక్క ఎమ్మెల్యే కూడా స్పందించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అన్ని వర్గాల సంక్షేమానికి కృషి చేస్తానని పదవిని అధిష్టించిన సీఎం..రెండేళ్లు గడిచినా పాలనలో మార్పు రాలేదన్నారు. మాటలు చెబితే సరిపోదని, చేతల్లో చూపాలని సీఎంకు చురక అంటించారు. ప్రస్తుతం రాజకీయాల్లో గెలుపు సాధించడం కోసం గెలుపు గుర్రాలను బరిలో దించి విజేతలకు టోపీలు పెడుతున్నారని, తాను అలా టోపీ పెట్టుకోవడం కోసం రాజకీయాల్లోకి రాలేదన్నారు. లోహియా, శాంతవేరి, గోపాలగౌడ లాంటి పోరాట యోదుల మార్గాల్లో తాను పోరాటాలు చేసి రాజకీయాల్లోకి రావడం జరిగిందన్నారు. పత్రిక అనేది ఒక ఉద్యయం లాంటిదని, విలేకరులు సమాజ సంక్షేమానికి పాటుపడాలన్నారు. ఎక్కడ సమస్యలున్నా స్పందించి ప్రభుత్వం దృష్టికి తీసుకురావాల్సిన బాధ్యత విలేకరులపై ఉందన్నారు.