పెంచిన పన్ను రద్దు చేయకపోతే ఉద్యమబాట
బెంగళూరు(బనశంకరి) : నగరంలో పెంచిన ఆస్తిపన్నును ఉపసంహరించుకోవాలని, లేని పక్షంలో తీవ్రపోరాటం చేస్తామని మాజీ డిప్యూటీసీఎం ఆర్.అశోక్ హెచ్చరించారు. బీజేపీ నగర శాఖ అధ్యక్షుడు సుబ్బణ్ణ, బీబీఎంపీ విపక్షనేత పద్మనాభరెడ్డి, మాజీ మేయర్లు కట్టెసత్యనారాయణ, శాంతకుమారి తదితరులతో కలిసి గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. మూడేళ్లులో నగరప్రజలపై ఆరుసార్లు పన్ను భారం మోపిన సీఎం సిద్దరామయ్య తుగ్లక్‌లా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. బెంగళూరు నగర ప్రజలు మండేఎండలకు భయపడటం లేదని బీబీఎంపీ విధించిన ఆస్తిపన్నుతో భయపడుతున్నారని ఆరోపించారు. ఇప్పటికే నీరు, విద్యుత్, పాలు, బస్‌చార్జీలు పెంచారని ప్రస్తుతం ఆస్తిపన్ను పెంచడం కేఎంసీ చట్టానికి వ్యతిరేకంగా ఉందన్నారు.
గతంలో రూ.10 వేలు ఆస్తిపన్ను చెల్లించేవారు ఇక రూ.50 వేలు చెల్లించాల్సిన పరిస్దితి ఏర్పడిందన్నారు. మొత్తం మీద 200 శాతం పైగా ఆస్తిపన్ను పెంచారని, దీంతో స్లం ప్రాంతాల్లో నివసించే పేదలపై కూడా భారం పడుతోందన్నారు. సిద్దరామయ్య ఉపముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో స్టాంపు డ్యూటీ నుంచి వచ్చే ఆదాయాన్ని పాలికెకు లభించకుండా చేశారన్నారు. దీంతో పాలికె కు వచ్చే రూ.300, 400 కోట్లు ఆదాయం నిలిచిపోయిందన్నారు. ప్రస్తుతం పెంచిన ఆస్తిపన్నును ఉపసంహరించకపోతే శుక్రవారం నిర్వహించే పాలికె సమావేశంలో నిరంతర ధర్నా చేపడతామని హెచ్చరించారు. అప్పటికీ స్పందించకపోతే మే 3 తేదీన బీజేపీ రాష్ట్రాద్యక్షుడు బీఎస్.యడ్యూరప్ప నేతృత్వంలో భారీ ఉరేగింపు ద్వారా పాలికెను ముట్టడిస్తామని అశోక్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
జేడీయస్‌తో పొత్తు
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ అఖండవిజయం సాధించిందని ఇది రానున్న రాజకీయాలకు దిక్సూచి అని ఆర్.అశోక్ అన్నారు. జిల్లాపంచాయతీ అధ్యక్ష స్థాన ఎన్నికల్లో జేడీఎస్‌తో కలిసి పొత్తు పెట్టుకోవాలని తీర్మానించామన్నారు. దీనికోసం ఆ పార్టీ సీనియర్‌నేతలైన హెచ్‌డీ.కుమారస్వామి, కుమారస్వామి కూడా గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారని తెలిపారు. బెంగళూరునగర, తుమకూరు, మైసూరు, రాయచూరు జిల్లాల్లో పొత్తు పై చర్చలు జరిపామని, శివమొగ్గ ఇతర ప్రాంతాల్లో పొత్తుపై చర్చలు కొనసాగుతున్నాయన్నారు. 30 జిల్లా పంచాయతీ స్దానాల్లో 15 స్ధానాలకు దక్కించుకుంటామని ఆర్.అశోక్ తెలిపారు.
జేడీఎస్, బీజేపీ పొత్తుతో బీబీఎంపీలో కూడా అధికారంలోకి వస్తారా అని లేకరులు అడిగిన ప్రశ్నకు అర్.అశోక్ సమాధానమిస్తూ దీనిపై కూడా చర్చలు జరిపామన్నారు. ఇప్పటికే జేడీఎస్ ఎమ్మెల్యే గోపాలయ్యతో మాట్లాడామని నూతన మేయర్ ఎన్నికకు ఇంకా నాలుగునెలలు సమయం ఉందని జేడీఎస్ తో పొత్తు పెట్టుకుంటామని ఆర్.అశోక్ తెలిపారు.