కరువుపై చర్చించాలని చెప్పినా పట్టించుకోలేదు
అసంతృప్తి వ్యక్తం చేసిన స్పీకర్ కాగోడు తిమ్మప్ప
శివమొగ్గ : శాసన సభ స్పీకర్ కాగోడు తిమ్మప్ప రాష్ట్ర ప్రభుత్వం, సీఎం సిద్దరామయ్య తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. చాలా జిల్లాల్లో కరువు విలయతాండవం చేస్తున్నా దాని నివారణకు విడుదల చేసిన నిధులను సక్రమంగా వ్యయం చేయడం లేదని, ప్రజల కష్టాలను ప్రభుత్వం విస్మరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. శివమొగ్గ నగరంలో ప్రభుత్వ ఉద్యోగుల సంఘం సమావేశ భవనంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సంఘం వార్షిక అవార్డుల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. రాష్ట్రంలోని సుమారు 133 తాలూకాల్లో కరువు పరిస్థితులు నెలకొన్నాయని, తాగేందుకు కూడా నీరు లభించక దాహం కేకలు మిన్నంటుతున్నాయన్నారు. అయితే ప్రభుత్వం ప్రజల కష్టాలకు అర్థం చేసుకోవడం లేదన్నారు. అధికారులు సైతం నిజాయతీతో పనిచేయడం లేదన్నారు. ఓ వైపు నిధుల కొరత ఉండగా మరో వైపు ఉన్న నిధులను వ్యయం చేయలేని దుస్థితిలో అధికారులు ఉన్నారన్నారు.
కరువు పరిస్థితులపై శాసనసభ సమావేశాల్లో ప్రస్తావించాలని తాను కొంత మంది ఎమ్మెల్యేలకు సలహా కూడ ఇచ్చానన్నారు. అయితే ఏఒక్క ఎమ్మెల్యే కూడా స్పందించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అన్ని వర్గాల సంక్షేమానికి కృషి చేస్తానని పదవిని అధిష్టించిన సీఎం..రెండేళ్లు గడిచినా పాలనలో మార్పు రాలేదన్నారు. మాటలు చెబితే సరిపోదని, చేతల్లో చూపాలని సీఎంకు చురక అంటించారు. ప్రస్తుతం రాజకీయాల్లో గెలుపు సాధించడం కోసం గెలుపు గుర్రాలను బరిలో దించి విజేతలకు టోపీలు పెడుతున్నారని, తాను అలా టోపీ పెట్టుకోవడం కోసం రాజకీయాల్లోకి రాలేదన్నారు. లోహియా, శాంతవేరి, గోపాలగౌడ లాంటి పోరాట యోదుల మార్గాల్లో తాను పోరాటాలు చేసి రాజకీయాల్లోకి రావడం జరిగిందన్నారు. పత్రిక అనేది ఒక ఉద్యయం లాంటిదని, విలేకరులు సమాజ సంక్షేమానికి పాటుపడాలన్నారు. ఎక్కడ సమస్యలున్నా స్పందించి ప్రభుత్వం దృష్టికి తీసుకురావాల్సిన బాధ్యత విలేకరులపై ఉందన్నారు.