Chinaganjam
-
ప్రకాశంలో బర్డ్ ఫ్లూ కలకలం
సాక్షి, చినగంజాం(ప్రకాశం): బర్డ్ ఫ్లూ వ్యాధి ప్రబలుతోందనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో జిల్లాలో సోమవారం చెట్ల కింద పక్షులు చనిపోయి ఉండటం తీవ్ర కలకలం రేపింది. ఒకే చెట్టు కింద ఎనిమిది పక్షుల కళేబరాలు ఉండటంతో జనం ఆందోళనకు గురయ్యారు. చినగంజాం మండలంలోని పెదగంజాం పల్లెపాలెం సముద్ర తీరం వెంబడి వేప చెట్టు కింద 5 కాకులు, 3 గోరింకలు చనిపోయి ఉండటాన్ని సోమవారం స్థానికులు గమనించారు. గ్రామంలోకి సమాచారం చేరవేయడంతో బర్డ్ ఫ్లూ వల్లే అలా జరిగి ఉంటుందని అనుమానాలు వ్యక్తం కావడంతో అధికారులు సత్వరం స్పందించారు. పెదగంజాం గ్రామ కార్యదర్శి భారతి సంఘటన స్థలాన్ని పరిశీలించారు. పక్షుల కళేబరాలను అక్కడి నుంచి తొలగించి వెంటనే పూడ్చి వేయించారు. విషయం తెలుసుకున్న పలు మీడియా చానళ్లు బర్డ్ ఫ్లూ అంటూ.. ప్రచారం చేశాయి. ఈ విషయమై రెవెన్యూ, పోలీసు అధికారులు, పశు వైద్యాధికారులతో ‘సాక్షి’ మాట్లాడి వివరణ తీసుకుంది. తీరం వెంబడి చెట్ల వద్ద పక్షులు నిత్యం నివాసం ఉంటుంటాయని, ఆ సమీప ప్రాంతాలలో వేరుశనగ సాగవుతున్న నేపథ్యంలో రైతులు పంటకు సత్తువ కోసం గుళికల మందు వాడుతుంటారని, అది కలిసిన నీటిని తాగి పక్షులు చెట్టు మీద సేదతీరిన సందర్భల్లోనూ ఇలాంటి సంఘటన చోటు చేసుకొనే అవకాశం ఉందని అభిప్రాయం వ్యక్తం చేశారు. అపోహలు, ఆందోళన వద్దు: డాక్టర్ బసవశంకర్, ప్రాంతీయ పశువైద్య సహాయ సంచాలకులు పల్లెపాలెంలో పక్షులు చనిపోయిన విషయం మా దృష్టికి వచ్చింది. మేం వెళ్లేలోగా అధికారులు వాటిని పూడ్చి పెట్టారు. పంచాయతీ కార్యదర్శి, వీఆర్వో నుంచి సమాచారం సేకరించాం. గుంటూరు, విజయవాడ, ఒంగోలు ప్రాంతాల్లో పక్షుల కళేబరాలు పరీక్షించే ల్యాబ్ రేటరీలున్నాయి. బర్డ్ ఫ్లూకు సంబంధించి దేశంలో భోపాల్‌లో నేషనల్ ఇనిస్టిట్యూట్‌లో మాత్రమే నిర్దారణ చేస్తారు. పరీక్షిస్తేనే ఏవిషయం తెలుస్తుంది. భవిష్యత్‌లో ఇలా పక్షులు చనిపోతే సత్వరం తమకు సమాచారం ఇవ్వాలని సూచించాం. బర్డ్ ఫ్లూ గురించి ఆందోళన అవసరం లేదు. మన దేశంలో 150 నుంచి 200 డిగ్రీల ఉష్ణోగ్రత వరకు చికెన్‌ను ఉడికిస్తారు చికెన్ తినడం వల్ల వ్యాధులు ప్రబలే అవకాశం లేదు. -
ఏమైందో.. ఏమో?
చినగంజాం సమీపంలో ఇద్దరు యువకుల అనుమానాస్పద మృతి సంఘటన స్థలంలో తాగి పడేసిన మద్యం బాటì ళ్లు, కూల్‌డ్రింక్ సీసాలు మృతులు ప్రాణ స్నేహితులు.. మద్యం తాగే అలవాటు లేదంటున్న బంధువులు ఎక్కడో చంపి ఇక్కడ పడేసి హంతకులు కట్టుకథ అల్లారని ఆరోపణలు కానిస్టేబుళ్ల ఎంపిక కోసం శిక్షణ పొందుతున్న యువకులు ఇంతలోనే ఘోరం చినగంజాం : ఏమైందో ఏమోగానీ ఇద్దరు యువకులు.. పైగా మంచి మిత్రులు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. సంఘటన స్థలంలో తాగి పడేసిన మద్యం సీసాలు, కూల్‌డ్రింక్ బాటిళ్లు ఉన్నాయి. ఈ సంఘటన చినగంజాం నుంచి పల్లెపాలేనికి వెళ్లే మార్గంలో నార్త్ సాల్ట్ ఫ్యాక్టరీ వెనుక భాగంలోని ముళ్ల పొదల్లో సోమవారం వెలుగు చూసింది. పోలీసుల కథనం ప్రకారం.. మండలంలోని మున్నంవారిపాలేనికి చెందిన సూరిన వెంకట రమణారెడ్డి(22), చినగంజానికిS చెందిన పల్లపోలు శ్రీనాథ్(22)లు మంచి స్నేహితులు. ఏం జరిగిందో తెలియదుగానీ చినగంజాం నుంచి పల్లెపాలేనికి వెళ్లే మార్గంలో నార్త్ సాల్ట్ ఫ్యాక్టరీ వెనుక భాగంలోని ముళ్ల పొదల్లో ఇద్దరూ నిర్జీవంగా కనిపించారు. సంఘటన స్థలంలో ఖాళీ మద్యం సీసాలు, కూల్‌డ్రింక్ బాటిళ్లు, గ్లాసులు ఉన్నాయి. వారిద్దరికి మద్యం తాగే అలవాటు లేదని, ఎక్కడో చంపి మృతదేహాలను ఇక్కడకు తెచ్చి పడేశారని బంధువులు ఆరోపిస్తున్నారు. అక్కడి ఆనవాళ్లను పరిశీలించిన పోలీసులు కూడా అదే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కట్టుకథకు పథక రచన యువకులిద్దరూ పూటుగా మద్యం తాగి ఆత్మహత్యకు పాల్పడినట్లు హంతకులు కట్టుకథకు పథక రచన చేశారని బంధువులతో పాటు పోలీసులు కూడా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇద్దరి ముఖాలపై దెబ్బలు తగిలిన ఆనవాళ్లు ఉన్నాయి. మృతుల జేబుల్లోని సెల్ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎటువంటి దురలవాట్లు లేని వారికి ఈ విధంగా చనిపోవాల్సిన అవసరం ఏమిటని బంధువులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భాగ్యనగర్‌లో జ్ఞానోదయ స్టడీ సర్కిల్ నిర్వహిస్తున్న ద్వారం రామిరెడ్డి మేనల్లుడు వెంకట రమణారెడ్డి డిగ్రీ పూర్తి చేసి ప్రస్తుతం చీరాల సక్సెస్ స్టడీ సర్కిల్లో కానిస్టేబుల్ ఎంపిక కోసం శిక్షణ పొందుతున్నాడు. పల్లపోలు వెంకటరావు కుమారుడు శ్రీనాథ్ డిగ్రీ పూర్తి చేసి ఇటీవల జరిగిన సీఐఎస్ఎఫ్కు ఎంపికయ్యారు. రోజూ వీరిద్దరు కలిసి ప్రాక్టీసుకు వెళ్లేవారని బంధువులు తెలిపారు. చావులోనూ వీడని బంధం మృతులు చిన్నప్పటి నుంచి ప్రాణ స్నేహితులు. ఒకరికొకరు కష్ట సుఖాల్లో పాలుపంచుకునేవారిని ఇరువురి బంధువులు కన్నీటిపర్యంతమయ్యారు. ఇతరులతో సఖ్యతగా ఉండేవారిని, ఎవరితోనూ వారికి విభేదాలు లేవని చెబుతున్నారు. సంఘటన స్థలాన్ని పరిశీలించిన డీఎస్పీ సంఘటన స్థలాన్ని చీరాల డీఎస్పీ డాక్టర్ ప్రేమకాజల్, ఇంకొల్లు సీఐ శ్రీనివాసరావు పరిశీలించారు. మృతుల బంధువులను విచారించారు. ఎస్సై నరసింహారావు తన సిబ్బందితో కలిసి సంఘటన స్థలంలో ఆధారాలు సేకరించారు. గ్రామ రెవెన్యూ అధికారి సుబ్రహ్మణ్యం సమక్షంలో పంచనామా నిర్వహించారు. పోస్టుమార్టం కోసం మృతదేహాలను చీరాల ఏరియా వైద్యశాలకు తరలించారు. ఒంగోలు నుంచి వచ్చిన క్లూస్ టీం వచ్చి ఆధారాలు సేకరించింది. -
చిన్నగంజాం వద్ద రోడ్డుప్రమాదం
చిన్నగంజాం (ప్రకాశం జిల్లా) : చిన్నగంజాం మండలం కడవకుదురు సమీపంలో మంగళవారం మధ్యాహ్నం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కడవకుదురు నుంచి చీరాల వైపు వెళుతున్న ఆటో ఎదురుగా వస్తున్న లారీని ఢీకొంది. ప్రమాద సమయంలో ఆటోలో డ్రైవర్‌తోపాటు మొత్తం 9 మంది ఉండగా... ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. మిగిలిన ఏడుగురికి గాయలు కాగా, వారిలో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. వారిని చీరాల ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. -
నిండు గర్భిణి ఆత్మహత్య
చిన్నగంజాం (ప్రకాశం) : ఓ నిండు గర్భిణి.. స్థల విషయంలో జరిగిన వివాదంతో మనస్తాపం చెంది ఆత్మహత్యకు పాల్పడింది. ప్రకాశం జిల్లా చిన్నగంజాం మండలం పెద్దగంజాం గ్రామంలో ఈ ఘటన జరిగింది. మరతాల శ్రీలక్ష్మి (25)కి శనివారం మధ్యాహ్నం ఓ స్థలం విషయంలో బంధువులతో గొడవ జరిగింది. మనస్తాపం చెందిన ఆమె సాయంత్రం పురుగుల ముందు సేవించింది. అయితే మందు తాగినట్టు ఎవరికీ చెప్పకపోవడంతో రాత్రి 11 గంటల తర్వాత ఆమె ఇంటి వద్దే ప్రాణాలు కోల్పోయింది. శ్రీలక్ష్మికి భర్త రామాంజనేయులు, రెండేళ్ల బాబు ఉన్నాడు. ప్రస్తుతం 9 నెలల గర్భిణి. -
చెడుగుడు విజేత చినగంజాం
ముగిసిన రాష్ట్రస్థాయి చెడుగుడు పోటీలు పెడన రూరల్ : క్రీడలతో యువతలో మనోవికాసం పెంపొందుతుందని పెడన ఎమ్మెల్యే కాగిత వెంకట్రావు పేర్కొన్నారు. మండల పరిధిలోని లంకలకలవగుంట గ్రామంలో దసరా నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని సర్వయువజన అభివృద్ధి సేవా సంఘం ఆధ్వర్యంలో జరుగుతున్న రాష్ట్రస్థాయి చెడుగుడు పోటీలు శుక్రవారంతో ముగిశాయి. ప్రకాశం జిల్లా చినగంజం నరేష్, లంకలకలవగుంట పల్లాలమ్మ ఏర్పులు-1 జట్ల మధ్య హోరాహోరీగా ఫైనల్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో చినగంజం నరేష్ జట్టు టోర్నమెంట్ విజేతగా నిలిచింది. పల్లాలమ్మ ఏర్పులు-1 జట్టు ద్వితీయ బహుమతి గెలుచుకుంది. లంకలకలవగుంట పల్లాలమ్మ ఏర్పులు-2, కైకలూరు మండలం నుచ్చుమిల్లి జట్లు మూడు, నాలుగు స్థానాల్లో నిలిచాయి. ఎమ్మెల్యే కాగిత, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి కొనకళ్ల జగన్నాథరావు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త ఉప్పల రాంప్రసాద్ సోదరులు ఉప్పాల నెహ్రు ముఖ్యఅతిథులుగా హజరై టోర్నమెంట్లో గెలుపోందిన విజేతలకు బహుమతులు అందజేశారు. టోర్నమెంట్ విజేతలకు 11 వేలు, 9వేలు, 7వేలు, 5వేల రూపాయల ప్రోత్సాహక బహుమతులతో పాటు షీల్డ్‌లను బహూకరించారు. దీంతో పాటు విజేతలకు నెహ్రు యువకేంద్ర వారి ధృవీకరణ పత్రాలను అందజేశారు. చెడుగుడు పోటీల టోర్నమెంట్‌కు రీఫరీలుగా వ్యవహరించిన మేకా వెంకట సుబ్బారావు, రమేష్ నాయుడు, ఫ్రాన్సిస్, కాగిత సత్యప్రసాద్, కట్టా సూర్యచంద్రరావుకు సర్వ యువజన అభివృద్ధి సేవా సంఘం జిల్లా అధ్యక్షుడు ముత్యాల వెంకటస్వామి (ఏసుబాబు) సత్కరించి జ్ఞాపికలు బహూకరించారు. చెడుగుడు పోటీల ఫైనల్ మ్యాచ్‌ను తిలకించేందుకు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. క్రీడాపోటీలు జరిగే ప్రాంగణం జనంతో కిటకిటలాడింది. సర్పంచులు గరికిపాటి వీర వెంకట్రావు, కట్టా అంజమ్మ, చెన్నూరు పీఏసీఎస్ అధ్యక్షుడు యర్రంశేట్టి చంద్రశేఖర్, బీసీ నాయకులు బొర్రా నటేష్ పాల్గొన్నారు.