ఏమైందో.. ఏమో?
-
చినగంజాం సమీపంలో ఇద్దరు యువకుల అనుమానాస్పద మృతి
-
సంఘటన స్థలంలో తాగి పడేసిన మద్యం బాటì ళ్లు, కూల్‌డ్రింక్ సీసాలు
-
మృతులు ప్రాణ స్నేహితులు.. మద్యం తాగే అలవాటు లేదంటున్న బంధువులు
-
ఎక్కడో చంపి ఇక్కడ పడేసి హంతకులు కట్టుకథ అల్లారని ఆరోపణలు
-
కానిస్టేబుళ్ల ఎంపిక కోసం శిక్షణ పొందుతున్న యువకులు
-
ఇంతలోనే ఘోరం
చినగంజాం :
ఏమైందో ఏమోగానీ ఇద్దరు యువకులు.. పైగా మంచి మిత్రులు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. సంఘటన స్థలంలో తాగి పడేసిన మద్యం సీసాలు, కూల్‌డ్రింక్ బాటిళ్లు ఉన్నాయి. ఈ సంఘటన చినగంజాం నుంచి పల్లెపాలేనికి వెళ్లే మార్గంలో నార్త్ సాల్ట్ ఫ్యాక్టరీ వెనుక భాగంలోని ముళ్ల పొదల్లో సోమవారం వెలుగు చూసింది.
పోలీసుల కథనం ప్రకారం.. మండలంలోని మున్నంవారిపాలేనికి చెందిన సూరిన వెంకట రమణారెడ్డి(22), చినగంజానికిS చెందిన పల్లపోలు శ్రీనాథ్(22)లు మంచి స్నేహితులు. ఏం జరిగిందో తెలియదుగానీ చినగంజాం నుంచి పల్లెపాలేనికి వెళ్లే మార్గంలో నార్త్ సాల్ట్ ఫ్యాక్టరీ వెనుక భాగంలోని ముళ్ల పొదల్లో ఇద్దరూ నిర్జీవంగా కనిపించారు. సంఘటన స్థలంలో ఖాళీ మద్యం సీసాలు, కూల్‌డ్రింక్ బాటిళ్లు, గ్లాసులు ఉన్నాయి. వారిద్దరికి మద్యం తాగే అలవాటు లేదని, ఎక్కడో చంపి మృతదేహాలను ఇక్కడకు తెచ్చి పడేశారని బంధువులు ఆరోపిస్తున్నారు. అక్కడి ఆనవాళ్లను పరిశీలించిన పోలీసులు కూడా అదే అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
కట్టుకథకు పథక రచన
యువకులిద్దరూ పూటుగా మద్యం తాగి ఆత్మహత్యకు పాల్పడినట్లు హంతకులు కట్టుకథకు పథక రచన చేశారని బంధువులతో పాటు పోలీసులు కూడా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇద్దరి ముఖాలపై దెబ్బలు తగిలిన ఆనవాళ్లు ఉన్నాయి. మృతుల జేబుల్లోని సెల్‌ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎటువంటి దురలవాట్లు లేని వారికి ఈ విధంగా చనిపోవాల్సిన అవసరం ఏమిటని బంధువులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
భాగ్యనగర్‌లో జ్ఞానోదయ స్టడీ సర్కిల్ నిర్వహిస్తున్న ద్వారం రామిరెడ్డి మేనల్లుడు వెంకట రమణారెడ్డి డిగ్రీ పూర్తి చేసి ప్రస్తుతం చీరాల సక్సెస్ స్టడీ సర్కిల్‌లో కానిస్టేబుల్ ఎంపిక కోసం శిక్షణ పొందుతున్నాడు. పల్లపోలు వెంకటరావు కుమారుడు శ్రీనాథ్ డిగ్రీ పూర్తి చేసి ఇటీవల జరిగిన సీఐఎస్‌ఎఫ్‌కు ఎంపికయ్యారు. రోజూ వీరిద్దరు కలిసి ప్రాక్టీసుకు వెళ్లేవారని బంధువులు తెలిపారు.
చావులోనూ వీడని బంధం
మృతులు చిన్నప్పటి నుంచి ప్రాణ స్నేహితులు. ఒకరికొకరు కష్ట సుఖాల్లో పాలుపంచుకునేవారిని ఇరువురి బంధువులు కన్నీటిపర్యంతమయ్యారు. ఇతరులతో సఖ్యతగా ఉండేవారిని, ఎవరితోనూ వారికి విభేదాలు లేవని చెబుతున్నారు.
సంఘటన స్థలాన్ని పరిశీలించిన డీఎస్పీ
సంఘటన స్థలాన్ని చీరాల డీఎస్పీ డాక్టర్ ప్రేమకాజల్, ఇంకొల్లు సీఐ శ్రీనివాసరావు పరిశీలించారు. మృతుల బంధువులను విచారించారు. ఎస్సై నరసింహారావు తన సిబ్బందితో కలిసి సంఘటన స్థలంలో ఆధారాలు సేకరించారు. గ్రామ రెవెన్యూ అధికారి సుబ్రహ్మణ్యం సమక్షంలో పంచనామా నిర్వహించారు. పోస్టుమార్టం కోసం మృతదేహాలను చీరాల ఏరియా వైద్యశాలకు తరలించారు. ఒంగోలు నుంచి వచ్చిన క్లూస్ టీం వచ్చి ఆధారాలు సేకరించింది.