the education system
-
విద్యార్థులను రోబోలుగా మార్చకండి
► మానవ విలువలు పెంపొందించండి ►ప్రధానోపాధ్యాయులకు గవర్నర్ సూచన హైదరాబాద్: ‘ర్యాంకుల పందెంలో పరిగెడుతూ పాఠశాలల యాజమాన్యాలు విద్యార్థులను రోబోల్లా మార్చేస్తున్నాయి. దేశ భవిష్యత్తుకు ఇది మంచిది కాదు. వారిలో మానవ విలువలను పెంపొందించండి. పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములను చేయండి’అని రాష్ట్ర గవర్నర్ నరసింహన్ పబ్లిక్ స్కూళ్ల ప్రధానోపాధ్యాయులకు సూచించారు. సోమవారం ఇండియన్ పబ్లిక్ స్కూల్స్ సదస్సులో ఆయన పాల్గొన్నారు. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో ప్రారంభమైన ఈ మూడు రోజుల సదస్సులో గవర్నర్... ప్రస్తుత విద్యా వ్యవస్థ తీరుపై ఆవేదన వ్యక్తం చేశారు. సాంకేతిక రంగంలో వచ్చిన మార్పులతో విద్యార్థుల్లో జ్ఞాపకశక్తి నశించిపోతుందన్నారు. సంస్కారానికి దూరం చేస్తోంది: ‘నేటి విద్యా వ్యవస్థ సంస్కారానికి విద్యార్థులను దూరం చేస్తోంది. నమస్కారం నుంచి హాయ్ అనే సంస్కృతి పెరిగిపోయి, విలువలు అంతరించిపోతున్నాయి. తల్లిదండ్రులు ఉద్యోగ, ఇతరత్రా పనులపై బిజీ అయిన నేపథ్యంలో పిల్లల్లో నైతిక విలువలను పెంపొందించాల్సిన బాధ్యత గురువులదే. పాఠశాలలు విద్యార్థులను మిషిన్లుగా తయారుచేస్తూ, మానవ విలువలను చంపేస్తున్నాయి. విలువలు చంపే పోటీ వద్దు. విదేశీయులు భారతీయ సంస్కృతిని పొగుడుతుంటే.. మన పబ్లిక్ పాఠశాలలు పరదేశీ భాషలు, సంస్కృతిని నూరిపోయడం సరికాదు’ అని గవర్నర్ అన్నారు. పిల్లలతో మాట్లాడే సమయం లేదు: తల్లిదండ్రులు తమ పిల్లలకు మాట్లాడే సమయం కూడా ఇవ్వడం లేదని, ఎస్ఎంఎస్లతోనే సరిపెట్టేయడం ద్వారా మానవ సంబంధాలు దెబ్బతింటున్నాయని గవర్నర్ అన్నారు. విజయానికి షార్ట్‌కట్స్ లేవనే విషయాన్ని విద్యార్థులకు వివరించి, ఉపాధ్యాయులు రోల్‌మోడల్‌గా నిలవాలన్నారు. ఐపీఎస్సీ చైర్మన్ వీకే బంగా, కార్యదర్శి ఏజే సింగ్ పాల్గొన్నారు. మార్కులు ప్రామాణికం కాదు... భారత్‌లోనే యోగా పుట్టిందని, అలాంటి యోగాప్రాముఖ్యతను విదేశీయులు గుర్తించి, వారి ద్వారా మనం తెలుసుకోవాల్సి రావడం దురదృష్టకరమని నరసింహన్ అన్నారు. భారతీయ సంస్కృతీవైభవాన్ని విద్యార్థులకు తెలియజెప్పాల్సిన బాధ్యత గురువులదేనన్నారు. బాలికా విద్యను ప్రోత్సహించి వారి పట్ల గౌరవప్రదంగా నడుచుకునేలా విద్యార్థులను తీర్చిదిద్దాలని... సమాజం అంటే అందరం అని, దేశ ఉన్నతికి ఏవిధమైన సేవలు చేయాలో చిన్నారులకు తెలియజేయాల్సిన బాధ్యత గురువులదేనన్నారు. పాఠశాలల్లో కొద్దిమందికి వచ్చిన ర్యాంకులను ప్రచారం చేసుకోవడం సరికాదని, ప్రతిఒక్క విద్యార్థినీ ఉన్నత స్థానానికి చేర్చేలా పాఠశాల స్థాయిలోనే పునాది పడాలన్నారు. మార్కులు విద్యకు ప్రామాణికం కాదని, విద్యార్థుల అభిరుచులు, ప్రతిభ గుర్తించి ప్రోత్సహించడమే నిజమైన విద్యకు ప్రామాణికతన్నారు. -
విద్యాభివృద్ధికి ప్రాధాన్యం
► రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి జోగు రామన్న ► అదనపు తరగతి గదుల నిర్మాణం ప్రారంభం బేల : గత ప్రభుత్వాల్లో ఎన్నడూ లేని విధంగా రాష్ట్ర ప్రభుత్వం విద్యాభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తోందని రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి జోగు రామన్న అన్నారు. సోమవారం మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళశాలలో నాబార్డు ఆర్ఐడీఎఫ్–21 నిధులు రూ.కోటి వ్యయంతో అదనపు తరగతి గదుల నిర్మాణ పనుల ప్రారంభానికి శిలాఫలకం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెండున్నర ఏళ్ల పాలనలో ప్రభుత్వం 250 గురుకులాలను ఏర్పాటు చేయడం విద్యా వ్యవస్థ పటిష్టతకు నిదర్శనమని పేర్కొన్నారు. జనాభాలో 52శాతం ఉన్న బీసీలకు ప్రత్యేకంగా 109 గురుకులాలు త్వరలోనే మంజూరు కానున్నాయని తెలిపారు. బేలలో డిగ్రీ కళశాల మంజూరుకు కృషి చేస్తానని చెప్పారు. స్థానిక జూనియర్ కళశాలలో ప్రహరీ నిర్మాణానికి రూ.30 లక్షలు త్వరలోనే మంజూరు చేస్తామని తెలిపారు. ప్రతి ఒక్కరూ పట్టుదలతో చదువుకోవాలని, లక్ష్యంతో భవిష్యత్‌లో గమ్యం చేరాలని తెలిపారు. ప్రతి సంవత్సరం మండలంలో మొత్తంగా ఏవైనా రెండు సంఘాల కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి రూ.5లక్షల చొప్పున మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ రుణాల సబ్సిడీ నిధుల విడుదలలో వాస్తవంగా జాప్యం జరిగిందని, ఈ నెలాఖరులోపు నిధులన్నీ తప్పనిసరిగా ప్రభుత్వం నుంచి విడుదలవుతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఇంటర్మీడియెట్ విద్యాధికారి నాగేందర్, జెడ్పీటీసీ సభ్యుడు నాక్లే రాందాస్, మాజీ జెడ్పీటీసీ సభ్యుడు రావుత్ మనోహార్, ఎంపీపీ అధ్యక్షుడు కుంట రఘుకుల్‌రెడ్డి, కళశాల ప్రిన్సిపాల్ కన్నం మోహన్ బాబు, కస్తూరిబా ప్రత్యేక అధికారి గేడాం నవీన, మండల పరిషత్ ఉపాధ్యక్షుడు నిపుంగే సంజయ్, సర్పంచ్ మస్కే తేజ్‌రావు, ఉప సర్పంచ్ వట్టిపెల్లి ఇంద్రశేఖర్, టీఆర్ఎస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు టాక్రే గంభీర్, మండల అధ్యక్షుడు ఓల్లఫ్వార్ దేవన్న, ప్రధాన కార్యదర్శి టాక్రే మంగేష్ పాల్గొన్నారు. వినతుల వెల్లువ బేల : అదనపు తరగతుల నిర్మాణ పనుల ప్రారంభోత్సవానికి వచ్చిన మంత్రి జోగు రామన్నకు వినతులు వెల్లువెత్తాయి. రజక, కుమ్మర, కమ్మరి, మేదరి, ప్రధాన్ పురోహిత్, గున్ల, తదితర సంఘాల వారు మంత్రిని ఘనంగా సన్మానించి.. కమ్యూనిటీ హాల్లు మంజూరు చేయాలని వినతిపత్రాలు అందజేశారు. కస్తూరిబా బృందం, కాంట్రాక్ట్ లెక్చరర్లు, గిరిజన సంక్షేమ, ఆశ్రమోన్నత పాఠశాలల్లో పనిచేస్తున్న సీఆర్టీలు క్రమబద్ధీకరణ, 10వ పీఆర్ఎసీ అమలు చేసి, ఉద్యోగ భద్రత కల్పించాలని వినతిపత్రం సమర్పించారు. ఆ సంఘాల అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, ఉపాధ్యక్షులు, సభ్యులు పాల్గొన్నారు. -
నేటి నుంచి బడిబాట
వెయ్యికి పైగా శిథిల భవనాల్లోనే పాఠాలు బితుకుబితుకుమంటున్న పిల్లలు, టీచర్లు నిధుల్లేక మధ్యలోనే నిలిచిన స్కూలు భవనాలు ‘విద్యా వ్యవస్థలో ఎన్ని మార్పులో తీసుకొస్తున్నాం.. ప్రైవేటు స్కూళ్లకు దీటుగా సర్కారు బడులను తీర్చిదిద్దుతున్నాం.. అన్ని సదుపాయాలూ సమకూరుస్తున్నాం.. సమస్యలు పరిష్కరిస్తున్నాం..’ అంటూ తరచూ ముఖ్యమంత్రి నుంచి మంత్రుల వరకూ ఊదరగొడుతున్నారు. కానీ వాస్తవ పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ముందుకు పోతున్నామంటూ తరచూ వల్లించే ముఖ్యమంత్రి పాలనలో, విద్యాశాఖ మంత్రి ఇలాకాలో నేటికీ చెట్ల కింద, వీధి అరుగులపైన, పూరి గుడిసెల్లోనూ, శిథిల భవనాల్లో, వరండాల్లో పాఠాలు సాగుతున్నాయంటే ఎంత ముందుకు పోతున్నామో తేటతెల్లమవుతోంది. అమాత్యులు దత్తత తీసుకున్న గ్రామాల్లో సైతం నేలపై చదువు సాగుతోందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. సవాలక్ష సమస్యల నడుమ సోమవారం నుంచి సర్కారు బడులు ఎప్పటిలాగే మళ్లీ తెరుచుకుంటున్నాయి. - సాక్షి నెట్వర్క్