తొలిసారి ఫైనల్లో ఇంగ్లండ్
సిడ్నీ: మహిళల ఫుట్‌బాల్ ప్రపంచకప్ టోర్నమెంట్లో ఈసారి కొత్త జట్టు చాంపియన్‌గా అవతరించనుంది. బుధవారం జరిగిన రెండో సెమీఫైనల్లో ఇంగ్లండ్ 3–1 గోల్స్ తేడాతో ఆతిథ్య ఆ్రస్టేలియాపై విజయం సాధించింది. తద్వారా మూడో ప్రయత్నంలో ఆ జట్టు తొలిసారి ఫైనల్ బెర్త్‌ను దక్కించుకుంది. 2015, 2019 టోర్నీల్లో ఇంగ్లండ్ జట్టు సెమీఫైనల్లో ఓడిపోయింది.
ఇంగ్లండ్ తరఫున ఎల్లా టూన్ (36వ ని.లో), లౌరెన్ హెంప్ (71వ ని.లో), అలెసియా రుసో (90+4వ ని.లో) ఒక్కో గోల్ చేయగా... ఆస్ట్రేలియా జట్టుకు సామ్ కెర్ (63వ ని.లో) ఏకైక గోల్‌ను అందించింది. ఆదివారం జరిగే ఫైనల్లో స్పెయిన్‌తో ఇంగ్లండ్ తలపడుతుంది. మంగళవారం జరిగిన తొలి సెమీఫైనల్లో స్పెయిన్ 1–0తో స్వీడన్ జట్టును ఓడించింది.
ఇప్పటి వరకు ఎనిమిదిసార్లు ప్రపంచకప్ టోర్నీ జరగ్గా... నాలుగుసార్లు అమెరికా (1991, 1999, 2015, 2019)... రెండుసార్లు జర్మనీ (2003, 2007), ఒక్కోసారి నార్వే (1995), జపాన్ (2011) జట్లు టైటిల్ సాధించాయి.