టెన్త్ ఇంగ్లీష్-2లోనూ తప్పులు
తెనాలి అర్బన్ (గుంటూరు జిల్లా) : పదో తరగతి ప్రశ్నాపత్రాల్లో తప్పులు దొర్లుతున్నాయి. సిలబస్లో లేని ప్రశ్నలు ఇస్తుండడంతో విద్యార్థులు అందోళన చెందుతున్నారు. సోమవారం జరిగిన ఇంగ్లీష్-2 పేపర్లోనూ మూడు ప్రశ్నలు ఇదే విధంగా వచ్చాయి. దీని వల్ల విద్యార్థులు మూడు మార్కులు కోల్పోయే అవకాశం ఉంది. పదో తరగతి ఇంగ్లీష్-2 ప్రశ్నాపత్రంలో 2, 4, 5 ప్రశ్నలు ఇంగ్లీష్ పేపర్-1 సిలబస్లోవి ఇచ్చారు.
గమనించిన విద్యార్థులు ఆ మేరకు ఇన్విజిలేటర్ల దృష్టికి తీసుకువెళ్లారు. ఇదే విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళతామని వారు పేర్కొన్నారు. శనివారం జరిగిన ఇంగ్లిష్ పేపర్-1 ప్రశ్నాపత్రంలోనూ ఇదేవిధంగా తప్పులు దొర్లాయి. ప్రభుత్వం, విద్యాశాఖ ఉన్నతాధికారులు స్పందించి ఇలాంటి తప్పులు దొర్లకుండా చూడడంతోపాటు విద్యార్థులకు అన్యాయం జరగకుండా చూడాల్సిన అవసరం ఉందని పలువురు పేర్కొంటున్నారు.