fake jobs
-
అక్రమ ఆఫర్లు.. ఇన్‌కం ట్యాక్స్ వార్నింగ్..
న్యూఢిల్లీ: అక్రమ పద్ధతిలో ఉద్యోగ అవకాశాలను కల్పిస్తున్న ప్రకటనలను నమ్మవద్దంటూ ప్రజలను ఆదాయపన్ను శాఖ తాజాగా హెచ్చరించింది. ఉద్యోగార్థులు ఎస్ఎస్సీ లేదా సంబంధిత శాఖకు చెందిన అధికారిక వెబ్సైట్లను మాత్రమే విశ్వసించమంటూ సూచించింది. వీటిలో వెలువడే ఆఫర్లకు మాత్రమే స్పందించవలసిందిగా సలహా ఇచ్చింది. కొంతమంది మోసగాళ్లు ఉద్యోగాలు ఆశిస్తున్నవారికి తప్పుడు అవకాశాలు సృష్టిస్తున్నట్లు పేర్కొంది. నకిలీ అపాయింట్మెంట్ లేఖలు అందించే ఇలాంటి మోసగాళ్ల వలలో చిక్కుకోవద్దని ట్వీట్ ద్వారా హెచ్చరించింది. ఆదాయపన్ను(ఐటీ) శాఖలో ఉద్యోగాలంటూ కొంతమంది వంచిస్తున్నట్లు ప్రజలనుద్దేశించి జారీ చేసిన నోటీసులో పేర్కొంది. గ్రూప్ బి, గ్రూప్ సి ఉద్యోగాలన్నింటినీ ప్రత్యక్షంగా ఎస్ఎస్సీ ద్వారానే భర్తి చేస్తామని ఐటీ శాఖ స్పష్టం చేసింది. ఎస్ఎస్సీ వెబ్సైట్లో ఉద్యోగ సంబంధ నోటిఫికేషన్లు, ఫలితాలు తదితర వివరాలు అందుబాటులో ఉంటాయని తెలియజేసింది. -
తల్లి, కుమారుడు.. మధ్యలో భార్య
సాక్షి హైదరాబాద్: పదేళ్ల క్రితం లండన్ నుంచి తక్కువ ధరకు బంగారం బిస్కెట్లు తెప్పిస్తామని మాయమాటలు చెప్పి రూ.12 కోట్లతో పరారైన ఓ తల్లీ కొడుకులు.. తాజాగా భార్యతో కలిసి జాబ్ చీటింగ్‌లు చేయడం మొదలుపెట్టారు. రైల్వే, మెట్రోలలో ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మించి నిరుద్యోగులకు రూ.2 కోట్ల మేర కుచ్చుటోపీ పెట్టారు. బాధితులు పోలీసులను ఆశ్రయించడంతో కటకటాలపాలయ్యారు... ఇదీ ఓ తల్లి–కొడుకు– మధ్యలో భార్య చీటింగ్ కహానీ! కాకరపర్తి సురేంద్ర అలియాస్ పుట్టా సురేష్ రెడ్డి (37), తల్లి కాకరపర్తి భాగ్యలక్ష్మి (60)తో కలిసి ఖమ్మం జిల్లా మధిరలో ఉండేవాడు. 2012లో లండన్‌లోని తన స్నేహితుల నుంచి తక్కువ ధరకు బంగారం బిస్కెట్లు తెప్పిస్తానని మాయమాటలు చెప్పి రూ.12 లక్షలు వసూలు చేసి అక్కడ్నుంచి పరారయ్యాడు. దీంతో బాధితులు స్థానిక ఠాణాలో ఫిర్యాదు చేయడంతో సురేంద్ర, అతని తల్లి భాగ్యలక్ష్మి మీద మధిర పోలీస్ స్టేషన్లో కేసు నమోదయింది. అక్కడ్నుంచి పరారయిన తల్లి కొడుకులు 2013లో హైదరాబాద్‌కు వచ్చారు. పేరు, గుర్తింపు కార్డ్‌లు అన్నీ మార్చేశాడు. తన పేరును పుట్టా సురేష్ రెడ్డిగా మార్చుకొని... సికింద్రాబాద్‌లో నకిలీ ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, ఓటర్ కార్డులను తీసుకున్నాడు. వీటి సహాయంతో ఐసీఐసీఐ, హెచ్‌డీఎఫ్‌సీలో బ్యాంకు ఖాతాలను తెరిచాడు. భానోత్ నాగలక్ష్మి (30)ని పెళ్లి చేసుకొని బోడుప్పల్లో స్థిరపడ్డాడు. ఈ క్రమంలో సురేంద్రకు సికింద్రాబాద్‌కు చెందిన ఆలం, ఖమ్మంకు చెందిన శ్రీనివాస్ రావులతో పరిచయం ఏర్పడింది. రైల్వే, మెట్రోలలో బ్యాక్‌డోర్ ఎంట్రీ ద్వారా ఉద్యోగాలు ఇప్పిస్తామని, రూ.5–10 లక్షల వరకు చెల్లించే స్థోమత ఉన్న నిరుద్యోగులను తీసుకొస్తే మంచి మొత్తం వస్తుందని ఆశ చూపించారు. 20 మంది విద్యార్థుల వద్ద నుంచి రూ.2 కోట్ల వరకు వసూలు చేశారు. నిరుద్యోగులను నమ్మించేందుకు రైల్ నిలయంలోనే సురేంద్ర మోసగాళ్లను పరిచయం చేశాడు. మెడలో రైల్వే గుర్తింపు కార్డ్‌లు, రైల్వే నిలయంలోని సెక్షన్ ఆఫీస్ నుంచి బయటకు వచ్చిన శ్రీనివాస్ రావు, ఆలంలను కలిసిన విద్యార్థులు నిజంగానే వీరు ఉద్యోగులని భ్రమపడ్డారు. డబ్బు చెల్లించి నెలల పాటు ఎదురుచూసినా ఆఫర్ లెటర్ రాకపోవటంతో అనుమానం వచ్చిన నిరుద్యోగులు ఇచ్చిన డబ్బు వెనక్కి ఇవ్వాలని లేదా ఆర్డర్ ఇప్పించాలని సురేంద్రపై ఒత్తిడి తేవటం ప్రారంభించారు. ప్రెషర్ వస్తుందని గమనించిన నిందితులు నకిలీ అపాయింట్మెంట్ ఆర్డర్లను విద్యార్థులకు అందించి... సెల్ఫోన్లు స్విచాఫ్ చేసి పరారయ్యారు. నకిలీ ఆర్డర్లు పట్టుకొని రైల్వే నిలయానికి ఉద్యోగానికి వెళ్లిన నిరుద్యోగులకు అవి బోగస్ నియామక ఉత్తర్వులని తెలిసిపోయింది. దీంతో సురేంద్రను నిలదీశారు. నిరుద్యోగులు సురేంద్రను వదిలిపెట్టకుండా వెంటపడుతుండటంతో జూన్‌లో సురేంద్ర, తన భార్యతో కలిసి ఫోన్లు స్విచాఫ్ చేసి పరారయ్యాడు. దీంతో బాధితులు అక్టోబర్‌లో మేడిపల్లి, ఉప్పల్ పోలీస్‌లను ఆశ్రయించారు. సురేంద్ర, అతని భార్య నాగలక్ష్మి మీద కేసులు నమోదు చేశారు. అప్పట్నుంచి వాళ్లను ట్రాకింగ్‌లో పెట్టారు. బోడుప్పల్‌లోని తన ఫ్లాట్‌లోని ఖరీదైన గృహోపకరణాలను తరలించేందుకు మంగళవారం ఉదయం సురేంద్ర, అతని భార్య నగరానికి వచ్చారు. సమాచారం అందుకున్న పోలీసులు వీళ్లతో పాటు దాచిపల్లి సురేష్లను అరెస్ట్ చేసినట్లు రాచకొండ కమిషన్ మహేశ్ భగవత్ తెలిపారు. సొమ్మొకరిది.. సోకొకరిది.. రూ.2 కోట్లు మోసం చేసిన సొమ్ముతో సురేంద్ర, అతని భార్య లగ్జరీ లైఫ్‌ను గడుపుతున్నారు. నాలుగు వాహనాలు కొనుగోలు చేసి ఉప్పల్‌లో ఓం సాయి ట్రావెల్స్‌ను, ఓ ప్రైవేట్ సెక్యూరిటీ సర్వీస్ కార్యాలయాన్ని ప్రారంభించాడు. జడ్చర్లలో రూ.25 లక్షల పెట్టుబడితో క్యాంటీన్ తెరిచాడు. రూ.40 లక్షలు పెట్టి బోడుప్పల్లో తన తల్లి భాగ్యలక్ష్మి పేరు మీద అపార్ట్మెంట్ కొన్నాడు. ఇంట్లో ఖరీదైన గృహోపకరణాల కొనుగోలు చేశాడు. సురేంద్ర వ్యాపార కార్యకలాపాలను ఉప్పల్, స్వరూప్‌నగర్ కాలనీకి చెందిన దాచిపల్లి సురేష్ (33) చూసుకునేవాడు -
డూప్లి ‘కేటు’ హోంగార్డులు!
చిత్తూరు అర్బన్: పోలీసు శాఖలో భాగమైన హోంగార్డుల్లో ఇద్దరు అతి తెలివి ప్రదర్శించి అడ్డంగా దొరికిపోయారు. హోంగార్డులుగా పని చేస్తూనే లొసుగులను పసిగట్టి మరో ఇద్దరికి హోంగార్డు ఉద్యోగాలను కట్టబెట్టిన బాగోతం వెలుగుచూసింది. ఒక్కో పోస్టుకు రూ.3లక్షల చొప్పున వసూలు చేయడం గమనార్హం! వివరాలు.. చిత్తూరులోని ఆర్మ్డ్ రిజర్వు(ఏఆర్) విభాగంలో 11 మంది హోంగార్డులు రైల్వేలో డిప్యూటేషన్‌పై పనిచేస్తున్నారు. అయితే ఈ ఏడాది జూలైకు సంబంధించి వేతనాల కోసం 13 మంది పేర్లతో డ్యూటీ సర్టిఫికెట్ రావడంతో ఏఆర్ ఇన్స్పెక్టర్ మురళీధర్ ఈనెల 19న టూటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. చదవండి: 8 కిలోల బంగారంతో వ్యాపారి అదృశ్యం కేసు నమోదు చేసిన పోలీసులు చిత్తూరు మండలంలోని తుమ్మిందకు చెందిన డి.రాఘవేంద్ర(46), మిట్టూరు వాసి జె.కె.గురుభూషన్(34), ఓటిచెరువు వాసి టి.యువరాజ్ (39), మురకంబట్టుకు చెందిన ఆర్.మణిగండన్(39ను 20వ తేదీన అరెస్టు చేశారు. వీరిలో యువరాజ్, మణిగండన్ ఇద్దరూ కూడా ఆర్మ్డ్ రిజర్వు విభాగంలో హోంగార్డులుగా పనిచేస్తున్నారు. మిగిలిన ఇద్దరికీ గుంతకల్లు డివిజన్లోని గవర్నమెంట్ రైల్వే పోలీస్ స్టేషన్లలో ఉద్యోగాలిస్తున్నట్లు నకిలీ రిక్రూట్మెంట్ ఆర్డర్లు సృష్టించి డ్యూటీలు కేటాయించారు. ఇందుకోసం ఒక్కో పోస్టుకు రూ.3 లక్షల వరకు వసూలు చేసినట్లు తెలుస్తోంది. హోంగార్డు విభాగానికి డీఎస్పీ స్థాయి అధికారితో పాటు ఏఆర్ఐ, ముగ్గురు పర్యవేక్షకులున్నా ఇవేమీ పట్టకుండా పనిచేస్తుండటం వారి నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది. బయటపడిందిలా... జూలైకు సంబంధించి తమవద్ద ఉన్న జాబితా కాకుండా అదనంగా ఇద్దరి డ్యూటీ సర్టిఫికెట్లు రావడాన్ని జిల్లా పోలీసు కార్యాలయంలో పనిచేసే ఓ కంప్యూటర్ ఆపరేటర్ గుర్తించారు. వీళ్లకు జీతాలు ఎలా ఇవ్వాలో తెలియక అధికారులకు విషయాన్ని చెప్పడంతో నకిలీ బాగోతం బయటపడింది. అసలు రెగ్యులర్ హోంగార్డులు ఎందరు ఉన్నారు? పేమెంట్ హోంగార్డులు ఎందరు ఉన్నారనే పక్కా సమాచారం అధికారుల వద్ద లేదనే గుసగుసలు వినిపిస్తున్నాయి. దీన్ని ఆసరాగా చేసుకుని నిందితులు నకిలీ రిక్రూట్మెంట్ ఆర్డర్లు, డ్యూటీ పాస్‌పోర్టులు ఇచ్చి మోసాలకు పాల్పడ్డారు. గతంలో ఎన్నో.. హోంగార్డుల నియామకానికి సంబంధించి జిల్లా పోలీసుశాఖ పలుమార్లు నవ్వులపాలైంది. పదేళ్ల క్రితం 34 మంది హోమ్‌గార్డులను అక్రమంగా నియమించినందుకు అప్పట్లో జిల్లా పోలీసు కార్యాలయంలో పనిచేసే ఓ ఉద్యోగిని అరెస్టు చేశారు. మూడేళ్ల క్రితం చిత్తూరు ట్రాఫిక్ స్టేషన్లో పనిచేసే హోమ్‌గార్డు.. పలువురికి ఉద్యోగాలిప్పిస్తామంటూ భారీగా వసూళ్లకు పాల్పడడంతో అతడ్ని కూడా అరెస్టు చేశారు. తాజా ఘటనలో ఇద్దరు హోమ్‌గార్డులు అరెస్టు కావడం ఈ వ్యవస్థలో లోపాలను ఎత్తిచూపుతోంది. ఉన్నతాధికారులు హోమ్‌గార్డులను ఆర్డర్లీ వ్యవస్థకే పరిమితం చేయకుండా వారి సాధక బాధలపై కూడా దృష్టిపెట్టి, హోంగార్డు విభాగాన్ని ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంటోంది. చర్యలు తీసుకున్నాం నకిలీ పత్రాలతో హోంగార్డు పోస్టు రిక్రూట్మెంట్, డ్యూటీ పాస్‌పోర్టు ఇచ్చిన ఇద్దరితో పాటు క్రైమ్ జరుగుతోందని తెలిసి డ్యూటీలకు వెళ్లిన వారిని అరెస్టు చేశాం. ఇంకా ఎవరైనా డబ్బులిచ్చి మోసపోయి ఉంటే డయల్–100కు ఫోన్‌చేసి చెప్పండి. విచారణ చేసి బాధ్యులపై చర్యలు తీసుకుంటాం. – సెంథిల్‌కుమార్, ఎస్పీ, చిత్తూరు చదవండి: రాహుల్ హత్యకేసు కొలిక్కి -
ఉద్యోగాల పేరిట టోకరా.. రూ.10 కోట్ల వసూలు!
సాక్షి,విశాఖపట్నం: జీవీఎంసీలో ఉద్యోగాలంటూ నిరుద్యోగుల నుంచి వసూళ్లకు ఓ ప్రైవేట్ ఏజెన్సీ తెగబడుతోంది. స్వచ్ఛాంధ్ర కింద జీవీఎంసీకి రానున్న వాహనాల డ్రైవర్ పోస్టుల భర్తీ ప్రక్రియ జరగనుందని.. ఇందుకోసం పోస్టుకు లక్షన్నర నుంచి రూ.2 లక్షల మేర వసూలు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ విధంగా మొత్తం 600 పోస్టుల భర్తీకి నిరుద్యోగుల నుంచి దరఖాస్తులను కూడా సదరు ప్రైవేటు ఏజెన్సీ తీసుకుంటున్నట్టు సమాచారం. తద్వారా ఏకంగా రూ.10 కోట్ల మేర వసూలుకు తెగబడినట్టు విమర్శలు వినిపిస్తున్నాయి. మురళీనగర్‌లోని ఒక ఇంటి అడ్రస్ ఇచ్చి.. కొన్ని ఫోన్ నంబర్లను మార్కెట్లోకి సదరు ప్రైవేటు సంస్థ వదిలింది. అడ్రస్‌లో ఉన్న ఇంటికి వెళ్తే అక్కడ ఎవరూ ఉండడంలేదు.. కానీ పక్కింటిలో ఉన్నారనే సమాచారం వస్తోంది. అక్కడకు వెళ్లి ఫోన్ నంబర్లు పనిచేయడం లేదని ఆరా తీస్తే.. మరో ఫోన్ నంబర్ ఇస్తున్నారు. ఆ తర్వాత వసూలు ప్రక్రియ సాగుతోంది. జీవీఎంసీలో ఉద్యోగాలని, భవిష్యత్తులో పరి్మనెంటు అవుతాయనే భ్రమలను నిరుద్యోగులకు కల్పిస్తున్నారు. ఫలితంగా నిరుద్యోగులు కూడా నగదును సమర్పించుకునేందుకు సిద్ధమవుతున్నారు. ఒక్కో ఉద్యోగానికి లక్షన్నర! జీవీఎంసీలో చెత్త సేకరణ కోసం త్వరలో స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ద్వారా 600 చెత్త సేకరణ వాహనాలు రానున్నాయి. ఇందులో 300 మేరకు ఈ నెలాఖరులోగా వచ్చే అవకాశం ఉంది. దీనిని సదరు ప్రైవేటు ఏజెన్సీ తన వసూలుకు అవకాశంగా మలచుకున్నట్టు తెలుస్తోంది. చెత్త సేకరణ కోసం వచ్చే వాహనాలకు డ్రైవర్ పోస్టుల భర్తీ కాంట్రాక్టు తమ సంస్థకే వచ్చిందని చెబుతున్నట్టు సమాచారం. అందువల్ల తామే పోస్టులను భర్తీ చేస్తామని, దరఖాస్తులను ఆహ్వనిస్తున్నామని చెబుతోంది. ఒక్కో ఉద్యోగానికి లక్షన్నర నుంచి రూ.2 లక్షల వరకూ వసూలుకు తెగబడుతోంది. ఈ విధంగా నగదు ఇచ్చిన వారికే ఉద్యోగాలని, దరఖాస్తుల ప్రక్రియ అంతా కేవలం ప్రొసిజర్ కోసమని సదరు ప్రైవేటు ఏజెన్సీ నిర్వాహకులు చెబుతున్నారు. ఈ విధంగా మొత్తం 600 మంది నుంచి లక్షన్నర నుంచి రెండు లక్షల వరకూ వసూలు చేయడం ద్వారా రూ.10 కోట్ల మేర ఆర్జనకు స్కెచ్ వేసినట్టు తెలుస్తోంది. -
లక్షలు దండుకున్న టీడీపీ నాయకుడు..చీటింగ్ కేసు నమోదు
సాక్షి,కర్నూలు: బనగానపల్లె మార్కెట్ యార్డు మాజీచైర్మన్, టీడీపీ నాయకుడు కోడి నాగరాజు యాదవ్‌పై బనగానపల్లె పోలీసులు చీటింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బనగానపల్లె మండలం బత్తులూరుపాడుకు చెందిన పసుపుల మధుసూదన్‌రెడ్డి, సోముల ప్రసాద్‌రెడ్డి బావ, బావమరుదులు. వీరు హైదరాబాద్‌లో ఉంటారు. తెలంగాణ ప్రభుత్వంలో వీరికి మంచి పలుకుబడి ఉందని, ఉద్యోగాలు ఇప్పిస్తారని కోడి నాగరాజు యాదవ్ బనగానపల్లెకు చెందిన షేక్ అర్షద్ బాషా సోదరులను పరిచయం చేయించారు. షేక్ అర్షద్‌బాషా హైదరాబాద్‌లోని ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. ఆయన తమ్ముడు అబిద్‌బాషా కూడా హైదరాబాద్‌లో హోంగార్డుగా పనిచేస్తున్నాడు. కోడి నాగరాజు యాదవ్ చెప్పిన మాటలు నమ్మి పసుపుల మధుసూదన్‌రెడ్డి ఖాతాలో రూ. 10.60 లక్షలు, సోముల ప్రసాద్‌రెడ్డి ఖాతాల్లో రూ.లక్ష జమ చేశారు. కాగా ఇప్పటివరకు ఉద్యోగం ఇప్పించకపోగా తీసుకున్న డబ్బులు కూడా తిరిగి ఇవ్వక పోవడంతో బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఉద్యోగాల పేరుతో ఇంకా ఎంతమందితో ఇలా డబ్బులు వసూలు చేశారనే కోణంలో విచారిస్తున్నారు. తెలంగాణతో పాటు ఏపీలో కూడా కొంతమంది నిరుద్యోగ యువకుల నుంచి భారీ మొత్తంలో వారు డబ్బులు వసూలు చేసినట్లు ప్రాథమికంగా పోలీసులు అంచనాకు వచ్చినట్లు సమాచారం. దళారుల మాటలు నమ్మి నిరుద్యోగులు మోసపోవద్దు : ఎస్పీ ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లో పోలీసు ఉద్యోగాలు, జూనియర్ అసిస్టెంట్, అటెండర్ వంటి ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తామని మంచి అవకాశమంటూ కొందరు దళారులు మోసాలకు పాల్పడుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని, అలాంటి వారి మాటలు నమ్మి మోసపోవద్దని ఎస్పీ సుధీర్‌కుమార్‌రెడ్డి పేర్కొన్నారు. ఉద్యోగాలు ఇప్పిస్తామని మోసం చేసే వారిపై కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో హెచ్చరించారు. ప్రతిభ ఆధారంగానే ఉద్యోగాలు వస్తాయని నిరుద్యోగ యువతకు ఎస్పీ సూచించారు. ఉద్యోగాల పేరుతో ఎవరైనా మోసపోయింటే స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయాలని పేర్కొన్నారు. బనగానెపల్లె మార్కెట్‌యార్డ్ మాజీ చైర్మన్ కోడి నాగరాజుయాదవ్తో పాటు మరో ఇద్దరిపై నమోదైన కేసులో దర్యాప్తు కొనసాగుతోందని తెలిపారు. -
నకిలీ ఉద్యోగాలు కు c/o సుధాకర్
సాక్షి, శ్రీకాకుళం: జిల్లాలో పలాస కేంద్రంగా కార్యాలయం పెట్టి.. రూర్బన్ పేరుతో నకిలీ అపా యింట్మెంట్లు ఇచ్చి, ఒక్కొక్కరి వద్ద రూ.4లక్షల నుంచి రూ.5లక్షల వరకు వసూలు చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న విశాఖపట్నం సుధాకర్ తెరవెనుక ఉండి పెద్ద కథే నడుపుతున్నాడు. రూర్బన్ పేరుతో జరిగిన మోసాలపై ‘సాక్షి’లో వరుస కథనాలు ప్రచురితమవ్వడంతో సుధాకర్ అక్రమార్జన కథ అడ్డం తిరిగింది. దీనితో అసలుకే ఎసరు వస్తోందని భావించిన సుధాకర్ కొత్త ఎత్తుగడల్ని సిద్ధం చేసుకున్నాడు. తీగ దొరికినా డొంక కదలకుండా అడ్డుకుంటున్నాడు. విచారణకు దొరక్కుండా ఎత్తులు వేస్తున్నాడు. మీడియాలో రాకుండా మూడో వ్యక్తుల ద్వారా ప్రలోభాలకు గురిచేస్తున్నట్లు సమాచారం. అధికార వర్గాలకు కూడా కొంతమందితో ఫోన్ చేయించి విషయం బయటకు రాకుండా చూడాలని కోరుతున్నట్లు తెలుస్తోంది. ►పలాస, అంబుగాంలోని తన నకిలీ కార్యాలయాల బోర్డులు తీసేశాడు. నకిలీ ఉద్యోగాల జిల్లా కోఆర్డినేటర్‌ను బయటకు కనిపించకుండా దాచిపెట్టాడు. ►విచారణ ముందుకు సాగనీయకుండా తనదైన శైలిలో రెండురోజులుగా జిల్లాలో తిష్ట వేసి ప్రయత్నాలు ముమ్మరం చేశాడు. ►నకిలీ అపాయింట్మెంట్లు పొందిన నిరుద్యోగుల్ని అంతర్గతంగా బెదిరింపులకు గురి చేయడంతో వారు నేరుగా ఫిర్యాదు చేసేందుకు భయపడుతున్నారు. అక్రమమని తెలిసినా... జిల్లాలో నకిలీ అపాయింట్మెంట్లతో నిరుద్యోగులను మోసగిస్తున్న సుధాకర్ గురించి యంత్రాంగం తూతూమంత్రంగానే వ్యవహరిస్తోంది. సాక్షాత్తూ రాష్ట్ర పంచాయతీరాజ్ కమిషనర్ గిరిజా శంకర్ నేరుగా నకిలీ అపాయింట్మెంట్లు జారీ అవుతున్నాయని నోట్ విడుదల చేశారు. మరో వైపు పాలకొండ పోలీస్ స్టేషన్లో అక్కడి ఎంపీడీఓ ఫిర్యాదు కూడా చేశారు. పలాస కేంద్రంగా వ్యవహారాలు నడుపతున్నట్లుగా పోలీసులకు సమాచారం ఉంది. అక్కడ కార్యాలయంలో రూర్బన్ మిషన్‌కు సంబంధించిన మెటీరియల్ పోలీసులకు కనిపించింది. ఇన్ని ఉన్నా విచారణ మాత్రం ముందుకు సాగడం లేదు. ►పోలీసుల వద్ద సుధాకర్ నంబర్ ఉన్నా ట్రేస్ చేయడంలో అలసత్వం ప్రదర్శిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. సందేహాలెన్నో.. ఈ నకిలీ బాగోతం వెనుక ఏమీ లేనప్పుడు అక్కడి కార్యాలయాల్లో రూర్బన్ మిషన్, కేంద్ర గ్రామీణ అభి వృద్ధిశాఖ బోర్డులు వంటివి ఎందుకు ఉన్నట్లు.. అక్కడి ఉద్యోగులు ఏం చేస్తున్నారో.. అధికారులు తెలుసుకోకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. ►నకిలీ అపాయింట్మెంట్ పొందిన నిరుద్యోగులు నేరుగా ఫిర్యాదు చేయలేదనే ఒకే ఒక్క కారణంగా అధికారులు ఈ వ్యవహారాన్ని తేలిగ్గా తీసుకుంటున్నారు. అంబుగాం, పలాసలో బోర్డులు కూడా తీసేయడంతో నిరుద్యోగులు నిండా మునిగినట్లు కనిపిస్తోంది. ►పలాసలో పోలీసులు కొంతమందిని విచారించారు. విచారణ తూతూ మంత్రంగా సాగినట్లు సమాచారం. గతంలో మోసాలివే... ►మూడేళ్ల క్రితం రాజాం, తాలాడ, మందరాడ కేంద్రాలుగా ఓ యువకుడు ఇండీట్రేడ్ పేరుతో షేర్‌మార్కెట్ పెట్టి, రూ.లక్షకు ప్రతి నెలా రూ.10 వేల అధిక ఆదాయాన్ని చూపించి వందలాదిమందిని నమ్మించాడు. తొలుత ఈ యువకునిపై ఒకరిద్దరు ఫిర్యాదులు చేసిన అధికార యంత్రాంగం పట్టించుకోలేదు. ►ఏడాదిన్నర క్రితం పొందూరులో ఓ వ్యాపారి మినీ స్కీమ్ పేరుతో పెద్ద స్కామ్‌కే తెరలేపాడు. వస్తువు ధరలో 33 శాతం చెల్లిస్తే చాలు నెలరోజుల్లో ఆ వస్తువు ఇస్తామని నమ్మబలికాడు. 300 మందిని చేర్పించుకుని రూ.కోటి వరకూ వసూలయ్యాక రాత్రికిరాత్రే బోర్డు తిప్పేశాడు. అధికారులు పట్టించుకోలేదు. నేరుగా ఫిర్యాదు రాలేదని వదిలేశారు. ►తాజాగా రూర్బన్ మిషన్ పేరుతో సుధాకర్ నకిలీ అపాయింట్మెంట్లు ఇచ్చి నిరుద్యోగుల్ని మోసగించాడు. జిల్లాలో ఇలాంటి ఘటనలు పునరావృతమవుతున్నా అధికార యంత్రాంగం చూసీచూడనట్లుగా వ్యవహరిస్తోంది. నేరుగా బాధితుల ఫిర్యాదు లేదని పట్టించుకోని పరిస్థితి. ఫలితంగా వేలాదిమంది నిరుద్యోగులు, పేదలు నష్టపోతున్నారు. కోట్లు కొల్లగొడుతున్న కేటుగాళ్లు తప్పించుకు తిరుగుతున్నారు. ఇకనైనా అధికారులు ఇలాంటి ఘటనలపై ప్రత్యేక దృష్టిసారించాల్సిన అవసరం ఉంది. -
నిరుద్యోగులూ జర భద్రం..ఉద్యోగాల పేరుతో భారీ మోసం
సాక్షి,శ్రీకాకుళం: జిల్లాలో మరో నకిలీ వ్యవహారం బయటపడింది. ఆ మధ్య ఫార్మసిస్టు పోస్టుల కోసం పెట్టిన నకిలీ సర్వీసు సర్టిఫికెట్ల బాగోతం వెలుగు చూడగా, ఇప్పుడు నకిలీ అపాయింట్మెంట్ల వ్యవహారం నడిచింది. అయితే ఇందులో సూత్రధారులెవరో, పాత్రదారులెవరో తెలీని పరిస్థితి ఉంది. ఎక్కడ కేంద్రం చేసుకుని దందా నడపారో కూడా తెలియకుండా మోసగాళ్లు జాగ్రత్త పడ్డారు. అక్రమార్కులెవరో తెరవెనక ఉండి నిరుద్యోగ యువతను మోసగించారు. పంచాయతీరాజ్ ఉన్నతాధికారుల అప్రమత్తతతో ఇప్పుడీ రాకెట్ చేధించే పనిలో పోలీసు వర్గాలు నిమగ్నమయ్యాయి. జిల్లాలో కొందరి పేరిట జారీ అయిన నియామకాల పత్రాలపై విజయవాడ రూర్బన్ మిషన్‌కు చెందిన జోనల్ ప్రాజెక్టు డైరెక్టర్ డి.ప్రవీణ్ సంతకం ఉంది. రీజనల్ మేనేజర్ ఇండిపుడి సుధాకర్‌కు రిపోర్టు చేయాలని ఉంది. అయితే, వాస్తవంగా రూర్బన్ మిషన్ లేదు. జోనల్ ప్రాజెక్టు డైరెక్టర్ డి.ప్రవీణ్ ఎవరో తెలియదు. రీజినల్ మేనేజర్ ఇండిపుడి సుధాకర్ ఆచూకీ లేదు. కానీ వీరి పేరున నియామక పత్రాలు కొందరి పేరున వచ్చేశాయి. ఇప్పటివరకు పంచాయతీరాజ్ అధికారుల దృష్టికి మూడు నియామక పత్రాలు వచ్చాయి. ఇంకా ఎన్ని ఉన్నాయో తెలియదు. అయితే, ఇవన్నీ బోగస్ నియామకాలే (ఫేక్ అపాయింట్మెంట్లు). అలాంటి సంస్థే లేదు. అమాయక నిరుద్యోగులను బుట్టలో వేసుకుని తెరవెనుక ఉండి ఎవరో నడిపిస్తున్న బాగోతమిది. అధికారుల దృష్టికి వెళ్లి.. కేంద్ర గ్రామీణ మంత్రిత్వ శాఖ అధికారులకు ఈ ఫేక్ వ్యవహారం వెళ్లింది. అక్కడి నుంచి పంచాయతీరాజ్, రూరల్ డెవలప్మెంట్ ఉన్నతాధికారులకు సమాచారం అందింది. క్షుణ్ణంగా పరిశీలించాక అలాంటి నియామకాలేవీ జరగలేదని, ఎవరో చేస్తున్న అవినీతి కార్యక్రమమని నిర్ధారణకొచ్చారు. తక్షణ చర్యలు తీసుకోవాలని జిల్లా పరిషత్ సీఈఓలను అప్రమత్తం చేశారు. ఫేక్ నియామకాలతో నిరుద్యోగులు మోసపోవద్దని, ప్రజలు ఎవరూ నమ్మవద్దని మీడియా ద్వారా పబ్లిసిటీ ఇవ్వడమే కాకుండా పోలీసు స్టేషన్లలో కేసు నమోదు చేయాలని పీఆర్,ఆర్డీ కమిషనర్ గిరిజాశంకర్ శుక్రవారం సాయంత్రం యుద్ధ ప్రాతిపదికన ఆదేశాలు జారీ చేశారు. దీంతో జెడ్పీ సీఈఓ లక్ష్మీపతి వెంటనే సంబంధిత ఎంపీడీఓలను అప్రమత్తం చేశారు. పోలీసు స్టేషన్లలో ఫిర్యాదు చేయాలని ఆదేశించారు. ఇప్పటికే పాలకొండ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు కూడా చేశారు. అంతేకాకుండా పంచాయతీల వరకు ఈ సమాచారాన్ని చేరవేశారు. రంగంలోకి నిఘా సంస్థలు ఇదే విషయమై ‘సాక్షి’లో శనివారం ప్రాథమిక సమాచారంతో వార్త రావడంతో స్పెషల్ బ్రాంచ్, ఇంటెలిజెన్స్ సిబ్బంది రంగంలోకి దిగారు. అపాయింట్మెంట్లు ఇచ్చిందెవరు, నియామక పత్రాలు పొందినదెవరు? తదితర వివరాలను సేకరించే పనిలో పడ్డారు. రహస్యంగా ఏదో జరిగిందని, తెరవెనుక ఉన్నదెవరో తేలాలని సంబంధిత వర్గాలు చెప్పుకొచ్చాయి. ప్రస్తుతానికి పోలీసులు నకిలీ నియామక పత్రాల గుట్టు రట్టు చేసే పనిలో నిమగ్నమయ్యారు. ఇలా మోసం చేశారు.. గ్రామీణ ప్రాంతాల్లో పట్టణ సదుపాయాలు కల్పించేందుకు ఉద్దేశించిన రూర్బన్ మిషన్ కింద వివిధ హోదాల్లో పోస్టులను భర్తీ చేసినట్టుగా నియామక పత్రాలు జారీ చేశారు. జోనల్ ప్రాజెక్టు డైరెక్టర్ ప్రవీణ్ పేరుతో సుధాకర్ అనే వ్యక్తి పేరుతో నియామక పత్రాలు జారీ అయ్యాయి. 15 రోజుల్లోగా జాయిన్ కావాలని ఆ నియామక పత్రాల్లో పేర్కొని ఉంది. వాస్తవంగా రూర్బన్ మిషన్ కింద ఎలాంటి నియామకాలు జరగలేదు. ఇదంతా చూస్తుంటే స్మార్ట్ విలేజ్, రూర్బన్ మిషన్ పేరుతో నియామకాలు చేపడుతున్నట్టు డ్రామాలాడి, నిరుద్యోగుల నుంచి పెద్ద ఎత్తున డబ్బులు వసూలు చేసి, కొన్నాళ్లు రహస్యంగా శిక్షణ పేరుతో కాలయాపన చేసి ఉండొచ్చని, ఇదేదో పెద్ద నకిలీ బాగోతమని అధికార వర్గాలు భావిస్తున్నాయి. కచ్చితమైన అడ్రస్సు లేకుండా జారీ చేసిన నియామక పత్రాలతో నిరుద్యోగ యువతను పెద్ద ఎత్తున మోసం చేసినట్టు స్పష్టమవుతోంది. ఒక్క శ్రీకాకుళంలోనే కాదు విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాల్లో కూడా ఇదే రకమైన నకిలీ నియామక పత్రాలు జారీ చేసి, అక్రమార్కుడెవరో సొమ్ము చేసుకున్నట్టు స్పష్టమవుతోంది. ఇలా మోసం చేశారు.. గ్రామీణ ప్రాంతాల్లో పట్టణ సదుపాయాలు కల్పించేందుకు ఉద్దేశించిన రూర్బన్ మిషన్ కింద వివిధ హోదాల్లో పోస్టులను భర్తీ చేసినట్టుగా నియామక పత్రాలు జారీ చేశారు. జోనల్ ప్రాజెక్టు డైరెక్టర్ ప్రవీణ్ పేరుతో సుధాకర్ అనే వ్యక్తి పేరుతో నియామక పత్రాలు జారీ అయ్యాయి. 15 రోజుల్లోగా జాయిన్ కావాలని ఆ నియామక పత్రాల్లో పేర్కొని ఉంది. వాస్తవంగా రూర్బన్ మిషన్ కింద ఎలాంటి నియామకాలు జరగలేదు. ఇదంతా చూస్తుంటే స్మార్ట్ విలేజ్, రూర్బన్ మిషన్ పేరుతో నియామకాలు చేపడుతున్నట్టు డ్రామాలాడి, నిరుద్యోగుల నుంచి పెద్ద ఎత్తున డబ్బులు వసూలు చేసి, కొన్నాళ్లు రహస్యంగా శిక్షణ పేరుతో కాలయాపన చేసి ఉండొచ్చని, ఇదేదో పెద్ద నకిలీ బాగోతమని అధికార వర్గాలు భావిస్తున్నాయి. కచ్చితమైన అడ్రస్సు లేకుండా జారీ చేసిన నియామక పత్రాలతో నిరుద్యోగ యువతను పెద్ద ఎత్తున మోసం చేసినట్టు స్పష్టమవుతోంది. ఒక్క శ్రీకాకుళంలోనే కాదు విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాల్లో కూడా ఇదే రకమైన నకిలీ నియామక పత్రాలు జారీ చేసి, అక్రమార్కుడెవరో సొమ్ము చేసుకున్నట్టు స్పష్టమవుతోంది. -
ఘరాన మోసం... సాఫ్ట్వేర్ ఉద్యోగాలంటు యువతకు టోకరా!
ఖమ్మం: సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగాలు, వాటాలు ఇప్పిస్తానంటూ మోసాలకు పాల్పడుతున్న అంకిరెడ్డి నరేష్‌కుమార్‌రెడ్డిని బుధవారం సత్తుపల్లి కోర్టుకు రిమాండ్‌కు తరలించినట్లు సత్తుపల్లి రూరల్ సీఐ టి.కరుణాకర్ తెలిపారు. ఆయన వెల్లడించిన వివరాలు ఇలా ఉన్నాయి. కల్లూరు మండలం పేరువంచ గ్రామానికి చెందిన అంకిరెడ్డి నరేష్‌కుమార్‌రెడ్డి గత ఏడాది ఏపీ రాష్ట్రంలోని కృష్ణా జిల్లా విసన్నపేటలో టిమాటిక్ టెక్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ పేరుతో సాఫ్ట్వేర్ కంపెనీ ప్రారంభించి, అందులో నిరుద్యోగ యువతీ యువకులకు సాఫ్ట్వేర్ ఉద్యోగులుగా చేర్చుకున్నాడు. ఈ క్రమంలో ఆ కంపెనీలో పనిచేస్తున్న ఉద్యోగులతోపాటు పలువురు వద్ద కంపెనీలో వాటాలు ఇస్తానంటూ నమ్మబలికి పెద్ద ఎత్తున సొమ్ము వసూలు చేశాడు. విసన్నపేటకు చెందిన తిరుమల జయరాం అనే బాధితుడు రూ.15 లక్షలు ఈ కంపెనీలో పెట్టుబడి పెట్టి, మోసపోవడంతో వీఎం బంజర్ ఠాణాలో ఫిర్యాదు చేశాడు. దీంతోపాటు కల్లూరుకు చెందిన బీటెక్ విద్యార్థి వద్ద రూ.3.5లక్షలు మోసం చేయడంతో అక్కడ కూడా కేసు నమోదు చేసినట్లు తెలిపారు. అప్పటి నుంచి నరేష్‌కుమార్‌రెడ్డి వీరితోపాటు పలువురిని మోసగించి మలేషియాకు పారిపోయాడు. ఇటీవల ఇండియాకు తిరిగొచ్చి, తిరిగి మలేషియా వెళ్తుండగా పోలీసులు లుక్ అవుట్ జారీ చేసి ఉండటంతో తమిళనాడులోని తిరుచురాపల్లి ఎయిర్ పోర్టు అథారిటీ అధికారులు గుర్తించి వీఎం బంజర్ పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఎస్సై తోట నాగరాజు, కానిస్టేబుళ్లు కనకారావు, శ్రీనివాస్, వెంకటేశ్వరరావులతో కలిసి తిరుచురాపల్లి వెళ్లి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అక్కడి న్యాయస్థానంలో హాజరుపరిచిన అనంతరం ప్రాంషీట్ వారెంట్‌తో ఇక్కడికి తరలించి సత్తుపల్లి కోర్టులో బుధవారం హాజరుపరిచినట్లు సీఐ తెలిపారు. నిందితుడి వద్ద నుంచి ల్యాప్‌టాప్, సెల్‌ఫోన్, కొన్ని బ్యాంక్ అకౌంట్‌్లను సీజ్ చేసి, పోలీస్ కస్టడీకి తీసుకొని మరిన్ని వివరాలు రాబడతామని సీఐ తెలిపారు. బాధితులు ఎవరైనా ఉంటే సంప్రదించాలని కోరారు. -
కోరిన కంపెనీ లో ఉద్యోగాలంటూ నిరుద్యోగులకు ఎర
ఒడిశా : దేశంలో పెట్రోల్ రేట్లు పెరిగినట్లు నిరుద్యోగుల సంఖ్య కూడా పెరుగుతోంది. ఉద్యోగం ఇప్పిస్తామంటే చాలు నిరుద్యోగులకు అదో పండుగే. దీన్నిఆసరాగా చేసుకొని కొందరు మోసగాళ్ల నిరుద్యోగులకు ఉద్యోగం ఇప్పిస్తామంటూ అశ చూపి అందినంత వరకు దోచుకుంటున్నారు. అలాంటి వాళ్లను టార్గెట్ చేస్తున్న ఓ గ్యాంగ్‌కి ఒడిశా పోలీసులు చెక్ పెట్టారు. జార్ఖండ్‌లోని జంషెడ్పూర్ టాటా పరిశ్రమల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ యువతను మోసం చేస్తున్నఐదుగురు అంతర రాష్ట్ర మోసగాళ్లను ఒడిశా పోలీసులు అరెస్ట్ చేశారు. అంతా ప్లాన్ ప్రకారం చేస్తారు అంగూల్ పోలీసు సూపరింటెండెంట్ జగ్మోహన్ మీనా మాట్లాడుతూ, ఈ ముఠా ఒడిశా, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, మహారాష్ట్ర, బీహార్లలో నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మబలికి వారి వద్ద 8 లక్షల వరకు తీసుకుంటారు. అనంతరం వారికి ఎలాంటి అనుమానం రాకుండా నకిలీ నియామక పత్రాలను జారీ చేస్తుంటారు. తాము మోసపోయినట్లు నిరుద్యోగులు తెలుసుకునే సమయానిక అక్కడి నుంచి మకాం మార్చేస్తారు. ఈ దందా 2018 నుంచి జరుగుతోందని పోలీసులు దర్యాప్తులో బయటపడింది. అయితే గత నెలలో ఈ మోసగాళ్ల భాగోతం మొదట పోలీసుల దృష్టికి వచ్చింది. అంగూల్ జిల్లాకు చెందిన 59 ఏళ్ల ప్రణబంధు జెనా తన కొడుకుకి ఉద్యోగం ఇప్పిస్తానంటూ మిశ్రా అనే వ్యక్తికి 4,50,000 నగదుని తీసుకున్నాడు. నెలలు గడిచిన తన కొడుకుకు ఎలాంటి ఉద్యోగం రాకపోయేసరకి మోసపోయాడని గ్రహించి జెనా పోలీసులను ఆశ్రయించాడు. ఐతే... పోలీసులు ఇంకైనా ప్రజలు ఇలాంటి మోసగాళ్లను నమ్మొద్దనీ, అడ్డదారుల్లో ఉద్యోగాల కోసం ప్రయత్నించవద్దని సూచిస్తున్నారు. ఒడిశా రాష్ట్రంలో సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ నిర్వహించిన ఓ సర్వేలో నిరుద్యోగిత రేటు 10.7 శాతం పాయింట్లు పెరిగి 2020 ఏప్రిల్‌కు 23.8 శాతం నిరుద్యోగులు ఉన్నారని తేలింది. ( చదవండి : లక్నో కేంద్రంగా కాల్ సెంటర్.. నిరుద్యోగులకు వల ) -
ఫేక్ కాల్స్.. మోసగాళ్లు ముంచేస్తారు
కరోనా కాలంలో కొలువులు కటకట! ఇదే అదనుగా ఉద్యోగాల పేరిట నిరుద్యోగులను మోసం చేస్తున్నారు. వాస్తవానికి ఉద్యోగం కోసం క్యాంపస్ సెలక్షన్స్‌కు వెళుతుంటారు. క్యాంపస్ ప్లేస్‌మెంట్స్‌లో కొలువు దక్కని ఫ్రెషర్స్.. మెరుగైన అవకాశాల కోసం సీనియర్స్... ఉద్యోగాలు కోల్పోయిన వారు.. జాబ్ పోర్టల్స్‌లో తమ వివరాలను అప్లోడ్ చేస్తుంటారు. ఇక్కడే టెక్నాలజీని తమకు అనువుగా మార్చుకొని ఉద్యోగార్థులను ముంచుతున్నారు మోసగాళ్లు! జాబ్ పోర్టల్స్ డేటాబేస్ నుంచి అభ్యర్థుల సమాచారం తస్కరించి.. ప్రలోభాలకు గురిచేస్తున్న సంఘటనలు ఇటీవల కాలంలో పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో.. జాబ్ ఆఫర్ మోసాలు గుర్తించడం ఎలాగో తెలుసుకుందాం. అధికారిక మెయిల్స్ ఉద్యోగాలు కల్పించే సంస్థలు ఏ సమాచారమైనా కంపెనీ అధికారిక ఈమెయిల్ నుంచే పంపిస్తాయి. కంపెనీ మెయిల్స్ వచ్చినప్పుడు అందులో తమ సంస్థ గురించిన సమాచారం తప్పనిసరిగా పేర్కొంటారు. అందుకు అవసరమైన వెబ్సైట్, ల్యాండ్‌లైన్ ఫోన్ నంబర్‌తో సహా పొందుపరుస్తారు. అభ్యర్థుల వివరాలను కంపెనీ అధికారిక మెయిల్‌కే పంపాలని కోరతారు. స్కామర్ల నుంచి వచ్చే ఈమెయిల్స్ ప్రొఫెషనల్‌గా ఉండవు. అందులో చాలా తప్పులు కనిపిస్తాయి. ఒకవేళ మీకు ఆఫర్ లెటర్’ పేరుతో అటాచ్మెంట్స్ కూడా మెయిల్లో వచ్చినట్టయితే.. వాటిని తెరవకపోవడమే ఉత్తమం. ఇలాంటి లింక్స్/అటాచ్మెంట్స్ ద్వారా కంప్యూటర్‌కు హాని కలిగించే మాల్వేర్ (వైరస్) కూడా పంపిస్తారు. టెలిఫోన్ నంబర్ లేదా కంపెనీ అడ్రస్ లాంటి సమాచారం లేకుండా మెయిల్ వచ్చిందంటే.. అది పూర్తిగా నకిలీదని గుర్తించాలి. ఫ్రీ మెయిల్స్ సంస్థలు ఎప్పుడూ ‘గూగుల్.కామ్/హాట్ మెయిల్.కామ్’ వంటి ఫ్రీ మెయిల్స్ నుంచి ఇంటర్వూ్యలు, ఆఫర్ లెటర్స్∙పంపించవు. స్కామర్లు చాలా తెలివిగా కంపెనీ రిజిస్టర్ ఈమెయిల్ ఐడీలను తయారు చేసి.. మరీ మోసాలకు తెరతీస్తున్నారు. కానీ వారు సూక్ష్మమైన మార్పు చేస్తుంటారు. లెటర్స్, స్పెల్లింగ్ మార్చడం, ఐఫన్, అండర్ స్కోర్ వంటి వాటివి అదనంగా జోడించడమో, లేదా ఒరిజినల్లో ఉంటే వాటిని తీసివేసి కొత్త మెయిల్ ఐడీని సృష్టిస్తారు. వీటిని జాగ్రత్తగా గుర్తించాలి. వచ్చిన మెయిల్‌ను కాపీ–పేస్ట్ ద్వారా సెర్చ్ చేయాలి. ఆన్లైన్ చాట్ ఇంటర్వ్యూ మీకు అద్భుతమైన ఉద్యోగ ఆఫర్ వచ్చింది. మెసెంజర్‌పై ఇంటర్వూ్యకు హాజరు కావాలని కోరుతుంటారు. వాళ్లు చెప్పినట్టు చేస్తే అభ్యర్థి వ్యక్తిగత వివరాలను చోరీ చేస్తారు. అందుకోసం స్కామర్లు తరచుగా యాహూ ఐఎం ఖాతాను సెటప్ చేయడానికి కొన్ని సూచనలు చేస్తారు. వాస్తవానికి కంపెనీలు ఉద్యోగులను తీసుకునేటప్పుడు ఇలాంటి చాట్ ఇంటర్వూ్యలు, ఆన్లైన్లో వివరాలు తీసుకోవని గర్తించాలి. కంపెనీలు సాధారణంగా అభ్యర్థిని ముఖాముఖి ఇంటర్వూ్య చేస్తాయి. మీరు కంపెనీ ఉన్న దేశంలో కాకుండా.. విదేశాల్లో ఉంటేనే స్కైప్ వీడియో చాట్ ఇంటర్వూ్య నిర్వహిస్తాయి. కంపెనీ వివరాలు తప్పనిసరి ఏదైనా కంపెనీ నుంచి ఇంటర్వూ్య ఉందని మెయిల్ వచ్చిందంటే.. ముందు ఆ సంస్థ వివరాలు తెలుసుకోవాలి. అది నిజమో కాదో పరిశీలించాలి. అందుకోసం మొదట సదరు సంస్థ అధికారిక వెబ్సైట్లో సమాచారాన్ని చూడాలి. కంపెనీ ఎంతకాలంగా పనిచేస్తుందో ఆరా తీయాలి. కొంతమంది స్కామర్లు ఆయా కంపెనీల వెబ్సైట్లను సృష్టిస్తున్నారు. కానీ కొద్దిగా పరిశోధన చేస్తే అది నిజమైనదో కాదో ఇట్టే తెలిసిపోతుంది. ఇందుకోసం మోసపూరిత మెయిల్స్‌పై సమాచారం ఇచ్చే స్కామ్వార్నర్స్.కామ్‌ను కూడా ఉపయోగించుకోవచ్చు. ఒక సంస్థ రిజిస్టర్ అయి ఏడాది మాత్రమే అయితే అప్రమత్తంగా ఉండాలి. బ్యాంక్ వివరాలు అడిగితే ఉద్యోగం ఇచ్చే కంపెనీలు ఏవీ అభ్యర్థి బ్యాంక్ ఖాతా వివరాలు అడగవు. స్కామర్లు మాత్రం ఈ వివరాలనే అడుగుతారు. ఉద్యోగి వేతనం నేరుగా బ్యాంక్ ఖాతాలో జమచేస్తామని.. పుట్టిన తేదీ వివరాలు, పాన్‌కార్డు, ఆధార్ వంటి సమాచారం తీసుకునేందుకు ప్రయత్నిస్తారు. ఒక్కోసారి మీ క్రెడిట్ కార్డ్ వివరాలు నింపాలని లింక్ పంపిస్తారు. ఈ వివరాలు చెప్పినట్టయితే మన ఖాతాను ఖాళీ చేసేస్తారు. ఆన్‌లైన్‌లోకి వెళ్లే ముందు వెబ్సైట్ సురక్షితమైనదో కాదో చూసుకోవాలి. వెబ్ అడ్రస్ ‘http://’ లిస్టెడ్ సైట్ అయి ఉండాలి. ఇంటర్వ్యూ పేరుతో నగదు డిమాండ్ స్కామర్లు ఇంటర్వూ్య పేరుతో కాల్ చేస్తారు. కొన్ని ప్రశ్నలు అడిగిన తర్వాత ఏవేవో ఫీజులు పేరుతో డబ్బులు చెల్లించాలని చెబుతారు. చెప్పిన మొత్తం చెల్లించకుంటే అవకాశం పోతుందని.. కొంత మొత్తమైనా చెల్లించి రిజర్వ్ చేసుకోమంటారు. ఇలాంటి మోసాలే ప్రస్తుతం అధికంగా జరుగుతున్నాయి. రిక్రూటర్ రిజిస్ట్రేషన్ ఫీజు, అప్లికేషన్ ఫీజు వంటివి చెల్లించాలంటారు. ఇంటర్వూ్య పూర్తయ్యాక డిపాజిట్ సొమ్ము తిరిగి ఇచ్చేస్తామని చెబుతారు. వాస్తవానికి ఏ కంపెనీ కూడా ఇలాంటి ఫీజులు తీసుకోదని గుర్తించాలి. చాలావరకు కంపెనీలు వ్యక్తిని తమ కార్యాలయానికి రమ్మని ఫేస్ టు ఫేస్ ఇంటర్వూ్య మాత్రమే చేస్తాయి. పేరున్న జాబ్ పోర్టల్స్ ఉద్యోగ ఆఫర్లను కాల్ చేసి చెప్పవు. కేవలం ఎస్ఎంఎస్ లేదా ఈమెయిల్ రూపంలోనే సంప్రదిస్తాయి. భారీ వేతనం ఆఫర్ కొత్తగా ఉద్యోగంలోకి తీసుకుంటున్నప్పుడు ఉద్యోగికి కంపెనీ ఇచ్చే వేతనానికి సంబంధించిన అంశాలు మాత్రమే మెయిల్లో పేర్కొంటారు. ఇందులో బీమా, ఇతర సౌకర్యాల గురించి ప్రస్తావించరు. ఫేక్జాబ్స్ వేతనం కూడా భారీగా ఆశపెట్టే విధంగా ఉంటుంది. అర్హతకు మించి వేతనాలు, అతి ప్రయోజనాలు ఆఫర్ చేస్తుంటే.. మోసమని అనుమానించాలి అంటున్నారు నిపుణులు! స్కామర్లు ఉద్యోగ అవసరాలను సరిగా చెప్పరు. వాళ్లు చెప్పే విధులకు, ఉద్యోగానికి ఎలాంటి సంబంధం ఉండదు. అప్లయ్ చేయకున్నా ఆఫర్లు మీ ఐడీకి చాలా జాబ్ ఇంటర్వూ్య మెయిల్స్ వస్తుంటాయి. కానీ వాటిలో మీరు దరఖాస్తు చేసింది ఏదీ ఉండదు. అలాంటి వాటికి స్పందించకపోవడమే మేలు. ఒకవేళ మీరు ఒకటికి మించి సంస్థలకు దరఖాస్తు చేసినట్టయితే.. ఆయా కంపెనీల పేర్లు గుర్తుంచుకోవాలి. దరఖాస్తు చేయకుండా ఆఫర్ వచ్చిందంటే.. అది మోసం చేసేందుకు స్కామర్లు వేసిన ఎరగా భావించాలి. ఒకవేళ దరఖాస్తు చేసిన సంస్థ నుంచి ఇంటర్వూ్య పేరుతో కాల్స్ వస్తే.. సంస్థ గురించి, యజమాని గురించి వివరాలను అడగండి. వారు వివరాలు చెప్పేందుకు సంశయించినట్లయితే అది నకిలీగా భావించాలి!! -
‘నౌకరీ’లో రెజ్యూమ్‌లను తీసుకొని..
సాక్షి, హైదరాబాద్ : మల్టీ నేషనల్ కంపెనీ(ఎంఎన్సీ)లో ఉద్యోగాలిప్పిస్తామంటూ నకిలీ వెబ్సైట్ ((httpr://careerryte.com/) ద్వారా నిరుద్యోగులను మోసం చేస్తున్న ఉత్తరప్రదేశ్‌కు చెందిన ముగ్గురు సభ్యుల ముఠాను సైబరాబాద్ సైబర్‌క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. వీరి నుంచి 13 సెల్ఫోన్లు, రెండు ల్యాప్‌టాప్‌లు, ఎనిమిది డెబిట్‌కార్డులు, రెండు క్రెడిట్ కార్డులు, పాస్‌బుక్‌లు స్వాధీనం చేసుకున్నారు. శుక్రవారం గచ్చిబౌలిలోని సైబరాబాద్ పోలీసు కమినరేట్‌లో సీపీ సజ్జనార్ వివరాలు వెల్లడించారు. నకిలీ సైట్‌తో.. బీసీఏ చదివిన యూపీకి చెందిన షానూ అన్సారీ, యుగంతర్ శ్రీవాత్సవ్ స్నేహితులు. సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో వీరు కెరీర్సైట్.కామ్ పేరుతో ముంబై చిరునామాతో నకిలీ వెబ్‌సైట్‌ను రిజిస్టర్ చేశారు. దీనికి సంబంధించిన లక్నోలోని ఇందిరానగర్‌లో కార్యాలయాన్ని ప్రారంభించారు. అబ్జల్యూట్ సొల్యూన్ పేరుతో బోర్డును ఏర్పాటు చేసి ఏడుగురు టెలీకాలర్లను నియమించుకున్నారు. వీరిలో తుషార్ శ్రీవాత్సవ టెలిఫోనిక్ ఇంటర్వ్యూలు చేసేవాడు. షానూ అన్సారీ టైమ్స్‌జాబ్.కామ్ ద్వారా నిరుద్యోగుల డాటాను సంపాదించేవాడు. అనంతరం టెలికాలర్లు ఆయా అభ్యర్థులకు ఫోన్‌కాల్స్ చేసి డెలాయిట్, అక్సెంచర్, విప్రో, టాటా కన్సల్టెన్సీ సర్వీస్‌లో ఉద్యోగాలిప్పిస్తామని నిరుద్యోగులకు పోన్లు చేసేవారు. బ్యాంక్ ఎండ్ పద్ధతిలో భారీ వేతనాలు ఇస్తామని నమ్మించేవారు. ఆసక్తి చూపిన అభ్యర్థులకు తుషార్ శ్రీవాత్సవ టెలిఫోనిక్ ఇంటర్వ్యూలు నిర్వహించి మీరు ఎంపికయ్యారంటూ నకిలీ ఆఫర్ లెటర్‌ను పంపేవారు. తొలుత రిజిస్ట్రేషన్ ఫీజు వసూలు చేసిన వీరు...ఆ తర్వాత ప్రాసెసింగ్, ఇన్సూరెన్స్ ఫీజుల పేరుతో రూ.లక్షలు వసూలు చేసేవారు. బాధితులకు వల వేసింది ఇలా... నానక్‌రామ్‌గూడకు చెందిన మౌనిక సిన్హా ఉద్యోగ ప్రయత్నాల్లో భాగంగా 2020 మార్చిలో నౌకరీ.కామ్‌లో రెస్యూమ్ ఆప్‌లోడ్ చేసింది. ఏప్రిల్‌లో కెరీర్ సైట్ నుంచి రిషబ్ మల్హోత్రా అనే పేరుతో ఫోన్ చేసిన వ్యక్తి డెలాయిట్, అక్సెంచర్‌లో ఉద్యోగం ఉందంటూ నమ్మించాడు. దీంతో రిజిస్ట్రేషన్‌కు గాను కొంత నగదును ఆన్లైన్ ద్వారా చెల్లించింది. మరో రెండు నెలల తర్వాత రిషబ్ మల్హోత్రా ఫోన్ చేసి డెలాయిట్ కంపెనీ నుంచి వైభవ్ మహజన్‌కు కాన్ఫరెన్స్ కలిపి ఇంటర్వ్యూ నిర్వహించాడు. ఆ తర్వాత ఉద్యోగానికి ఎంపికయ్యారంటూ నమ్మించాడు. ఆ తర్వాత దశల వారీగా రూ14,50,000లు వసూలు చేశారు. ఆ తర్వాత స్పందన లేకపోవడంతో సెప్టెంబర్ 2న సైబరాబాద్ సైబర్‌క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇదే తరహాలో మరో యువతి దశలవారీగా రూ.38,18,000 చెల్లించింది. చివరకు తాను మోసపోయినట్లు గుర్తించి సైబరాబాద్ సైబర్‌క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు టెక్నికల్ డాటా సహకారంతో ప్రత్యేక పోలీసులు నిందితులు యూపీలో ఉన్నట్టుగా గుర్తించి అక్కడికెళ్లి వారిని అదుపులోకి తీసుకుని ట్రాన్సిట్ వారంట్‌పై నగరానికి తీసుకొచ్చారు. కేసును చేధించిన సైబర్‌క్రైమ్ సిబ్బందిని సీపీ సజ్జనార్ రివార్డులతో సత్కరించారు. ఎస్సై పేరుతో టోకరా పంజగుట్ట పోలీస్‌స్టేషన్‌లో ఎస్సైగా విధులు నిర్వహిస్తున్న షఫీ తన్వీ పేరుతో నకిలీ ఫేస్బుక్ అకౌంట్ ఓపెన్ చేసి సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారు. ఎస్సై షఫీ పేరుతో ఫేస్బుక్ అకౌంట్ క్రియేట్ చేసి ఫ్రెండ్ రిక్వెస్ట్ లు పంపుతున్నట్లు తేలింది. డబ్బులు పంపాలంటూ ఆయన అకౌంట్ నుంచి మెసెజ్‌లు పెడుతున్నారు. దీంతో ఎస్సై షఫీ తన్వీ స్పందించారు. తన ఫేస్బుక్ అకౌంట్ హ్యాక్ అయిందని.. డబ్బులు పంపాలంటూ ఏదైనా మెసేజ్ వస్తే నమ్మవద్దంటూ తెలిపారు. ఇప్పటికే ఈ విషయమై సైబర్‌క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. -
పరిటాల శ్రీరామ్ తనకు కజిన్ అంటూ..
జల్సాల కోసం ఓ ప్రబుద్ధుడు మోసాల బాటపట్టాడు. మాయమాటలతో యువతీ యువకులకు టోపీ పెట్టాడు. తనకు ఎంతో పరపతి ఉందని, పరిటాల శ్రీరామ్ కజిన్ అవుతాడని, బెంగళూరులో రిసార్టులు ఉన్నాయని సోషల్ మీడియాలో ప్రచారం చేసుకున్నాడు. ఉద్యోగాలిప్పిస్తానని యువకులకు...సినిమాల్లో వేషాలిప్పిస్తానని యువతులకు గాలం వేశాడు. వారి నుంచి రూ.కోట్లు దండుకున్నాడు. సాక్షి, హైదరాబాద్ : ఖరీదైన అద్దెకార్లలో తిరుగుతూ.. సూటు బూటు వేసుకొని స్టార్ హోటళ్లలో బస చేస్తూ.. తాను పరపతి ఉన్న వాడినని ప్రముఖ సినీ, రాజకీయ, అధికారులతో దిగిన ఫొటోలతో సోషల్ మీడియాలో ప్రచారం చేసుకుంటూ, ఉద్యోగాలు ఇప్పిస్తానని యువకులను, సినిమాల్లో వేషాలు ఇప్పిస్తానని పలువురు యువతులకు టోకరా వేసిన మాటల మాంత్రికుడిని మంగళవారం జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ మేరకు వెస్ట్‌జోన్ డీసీపీ ఏఆర్ శ్రీనివాస్, బంజారాహిల్స్ ఏసీపీ కేఎస్‌రావు, జూబ్లీహిల్స్ ఇన్స్పెక్టర్ కె.బాలకృష్ణారెడ్డితో కలిసి వివరాలు వెల్లడించారు. అనంతపురం జిల్లా, పుట్టపర్తి మండలం, రాచవారిపల్లి గ్రామానికి చెందిన కొండూరి రాజేష్ అలియాస్ కె.రమేష్‌బాబు, అలియాస్ విష్ణువర్ధన్‌రెడ్డి బికాం చదివి ఖాళీగా ఉండేవాడు. తన తెలివితేటలను పెట్టుబడిగా పెట్టి రూ. కోట్లు సంపాదించాలని పథకం పన్నాడు. ఈ నేపథ్యంలో ప్రశాసన్‌నగర్‌కు చెందిన కోగంటి నౌషిక అనే ఫ్యాషన్ డిజైనర్‌తో గత ఏడాది ఫిబ్రవరిలో ఫేస్బుక్ ద్వారా పరిచయం చేసుకున్న అతను తానో సినీ నిర్మాతనని, కొత్త సినిమా తీస్తున్నానని, కాస్ట్యూమ్ డిజైనర్ కావాలని పరిచయం పెంచుకున్నాడు. తనకు అనంతపురంలో చాలా స్థలాలు ఉన్నాయని, పరిటాల శ్రీరామ్ తనకు కజిన్ అవుతాడని, బెంగళూరులో రిసార్ట్లు ఉన్నట్లు నమ్మించాడు. బీహెచ్ఈఎల్లో జూనియర్ ఇంజినీర్ పోస్టు ఖాళీగా ఉన్నట్లు చెప్పడంతో ఆమె తన తమ్ముడికి ఆ ఉద్యోగం ఇప్పించాలని రూ.4 లక్షలు ఇచ్చింది. అంతటితో ఆగకుండా మరోసారి రూ.10.36 లక్షలు వసూలు చేశాడు. ఉద్యోగం ఇప్పించేందుకు మరింత ఖర్చవుతుందని చెప్పడంతో ఆమె మరోసారి రూ.13.65 లక్షలు ఇచ్చింది. ఇలా ఆమె నుంచి 15 దఫాలుగా రూ.36.44 లక్షలు వసూలు చేశాడు. అయితే ఉద్యోగం ఇప్పించకపోగా కొన్ని రోజులుగా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ముఖం చాటేయడంతో తాను మోసపోయినట్లు గుర్తించిన బాధితురాలు ఈ నెల 3న జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు మంగళవారం నిందితుడిని అరెస్ట్ చేశారు. వందల మందికి బురిడీ నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారించిన పోలీసులు అతను గత మూడేళ్లుగా జల్సాల కోసం పలువురు యువకులను ఉద్యోగాల పేరుతో మోసం చేసినట్లు తేలింది. గతంలో ఇదే తరహా కేసులో మాదాపూర్ పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. వందలాది మంది నిరుద్యోగుల నుంచి రూ.కోటి దాకా వసూలు చేసినట్లు తేలింది. బంజారాహిల్స్‌లో ఆఫీసు నిందితుడు బంజారాహిల్స్ రోడ్ నెంబర్–5లో హలో ‘భారత్ ఎంటర్టైన్మెంట్స్’ పేరుతో ఓ కార్యాలయం తెరిచి తాను సినిమా నిర్మాతనని, ప్రముఖ హీరోలతో దిగిన ఫొటోలు చూపుతూ హీరోయిన్ వేషాలు ఇప్పిస్తానని యువతులను మభ్యపెట్టి డబ్బులు వసూలు చేసినట్లు గుర్తించారు. బెంజ్ కార్లు..ప్రముఖులతో పార్టీలు మోసాల ద్వారా సంపాదించిన సొమ్ముతో రాజేష్ జల్సా జీవితం అనుభవించేవాడు. ఖరీదైన దుస్తులు వేసుకొని, అద్దెకు తీసుకున్న బెంజ్ కార్లలో తిరుగుతూ రూ. లక్షల విలువైన మొబైల్ ఫోన్లు వాడుతూ, స్టార్ హోటళ్లలో బస చేస్తూ, ప్రముఖులతో పార్టీల్లో మునిగి తేలేవాడని పోలీసులు తెలిపారు. అటు యువకులను ఉద్యోగాల పేరుతో, ఇటు యువతులను సినిమా వేషాలు పేరుతో నమ్మించి మోసాలకు పాల్పడుతున్న అతను ఇన్నాళ్లు పోలీసులకు దొరక్కుండా తప్పించుకు తిరిగాడు. నిందితుడిపై వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో మొత్తం 14 కేసులు నమోదై ఉన్నట్లు పోలీసులు తెలిపారు. జూబ్లీహిల్స్, కేపీహెచ్‌బీ, ఎస్ఆర్నగర్, బంజారాహిల్స్, చైతన్యపురి, మాదాపూర్ పోలీస్స్టేషన్లలో కేసులు ఉన్నాయని, ఎఫ్ఐఆర్ కాని కేసులు కూడా ఉన్నట్లు పోలీసులు పేర్కొన్నారు. జూబ్లీహిల్స్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
నకిలీ ఉద్యోగాల ఉచ్చులో భారతీయులు
దుబాయ్: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో నకిలీ ఉద్యోగాల ఉచ్చులో తొమ్మిది మంది భారతీయులు చిక్కుకున్నారు. ప్రకటనల్లో చూపిన రీతిగా డబ్బులు కట్టి ఇప్పుడు వీరంతా యూఏఈలో దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్నారని ‘ఖలీజ్ టైమ్స్’ వెల్లడించింది. కేరళకు చెందిన తొమ్మిది మంది సామాజిక మాధ్యమాల్లో వచ్చిన ఉద్యోగ ప్రకటనలను చూశారు. ఆ ప్రకటన ఇచ్చిన ఏజెంట్ షఫీక్‌ను సంప్రదించారు. దుబాయ్‌లోని ఆల్ ఐన్, అజ్మాన్ ప్రాంతాల్లో ఉన్న ఓ సూపర్ మార్కెట్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని అతడు నమ్మబలికాడు. వీసా కోసం రూ.70 వేలు చెల్లించాలనడంతో అప్పులు చేసి మరీ కట్టారు. వీరందరికీ వాట్సాప్‌లో కాల్‌లెటర్ పంపగా అబుదాబీ వెళ్లారు. అక్కడ వాకబు చేయగా.. సదరు సూపర్ మార్కెట్ యజమాని జైల్లో ఉన్నట్లు తెలిసింది. కంగుతిన్న బాధితులు అక్కడి భారత రాయబార కార్యాలయాన్ని ఆశ్రయించారు. ఇటువంటి మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, ఎటువంటి అనుమానం కలిగిన తమను సంప్రదించాలని కాన్సులేట్ తెలిపింది. ‘15 రోజుల్లో యూఏఈలో ఉద్యోగం ఇప్పిస్తామన్న వాట్సప్ మెసేజ్ కేరళలో బాగా చక్కర్లు కొట్టింది. నాకు కూడా ఈ మెసేజ్ వచ్చింది. చాలా మంది ఆసక్తి చూపించడంతో నేను కూడా ఏజెంట్‌కు డబ్బు కట్టాను. నెలకు రూ. 23 వేల జీతం వచ్చే ఉద్యోగం ఇప్పిస్తాని.. భోజనం, ఉండటానికి గది ఉచితంగా ఇస్తారని ఏజెంట్ చెప్పడంతో మా అమ్మ నగలను తాకట్టు పెట్టి మరీ డబ్బు తెచ్చాను. ఉద్యోగ జీవితం మొదలైందన్న ఆనందంతో దుబాయ్‌లో అడుగుపెట్టిన నాకు మోసపోయానని తెలిసింద’ని మలప్పురం జిల్లాకు చెందిన ఫాజిల్ తెలిపాడు. -
నకిలీ ఐఎఫ్ఎస్ అధికారి అరెస్ట్
రాంగోపాల్‌పేట్: ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తానని యువకులను మోసం చేస్తున్న నకిలీ ఐఎఫ్ఎస్ అధికారిని రాంగోపాల్‌పేట్ పోలీసులు అరెస్టు చేశారు. బుధవారం సైఫాబాద్ ఏసీపీ వేణుగోపాల్‌రెడ్డి వివరాలు వెల్లడించారు. జమ్మూ కాశ్మీర్, పుల్వామా జిల్లా, కంగన్ గ్రామానికి చెందిన ఖుర్షీద్ అహ్మద్ దార్ ఢిల్లీలో డిగ్రీ పూర్తి చేశాడు. అనంతరం అతను కాశ్మీర్ తదితర ప్రాంతాల్లో ఐఎఫ్ఎస్ అధికారిగా చెప్పుకుంటూ ఉద్యోగాలు ఇప్పిస్తానని పలువురిని మోసం చేశాడు. ఇలా వచ్చిన డబ్బుతో జల్సాలు చేసేవాడు. అక్కడ ఇతని మోసాలు బయటపడటంతో హైదరాబాద్‌కు మకాం మార్చాడు. ఈనెల 19న సికింద్రాబాద్ ప్యారడైజ్ ప్రాంతంలోని హోటల్ అన్నపూర్ణలో బస చేసిన అతను అదే రోజు పీజీరోడ్లోని దోసె డిలైట్ సెంటర్‌కు టిఫిన్ చేసేందుకు వచ్చాడు. క్యాష్ కౌంటర్లో ఉన్న బేగంపేటకు చెందిన సిద్దార్థరెడ్డిని కలిసి ఐఎఫ్ఎస్ అధికారిగా పరిచయం చేసుకుని మాటలు కలిపాడు. మాటల సందర్భంగా బీటెక్ పూర్తి చేసి మంచి ఉద్యోగం కోసం వెతుకుతున్నట్లు చెప్పడంతో కేంద్ర ప్రభుత్వంలో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించాడు. అందకు రూ.లక్ష ఖర్చు అవుతుందని చెప్పాడు. అయితే తన వద్ద అంత డబ్బు లేదని చెప్పిన సిద్దార్థరెడ్డి ఖుర్షీద్‌కు రూ.40వేలు ఇచ్చాడు. మిగతా డబ్బు అపాయింట్మెంట్ ఆర్డర్ వచ్చిన తర్వాత ఇవ్వాలని సూచించాడు. తాను ఇక్కడే ఓ హోటల్లో బస చేశానని సర్టిఫికెట్లు తీసుకుని వచ్చి తనకు ఫోన్ చేయాలని సూచించాడు. బుధవారం సర్టిఫికెట్లు తీసుకుని హోటల్‌కు వెళ్లిన సిద్దార్థరెడ్డి నిందితుడు ఇచ్చిన మొబైల్ నంబర్లకు ఫోన్ చేయగా స్విచ్ ఆఫ్ అని వచ్చింది. దీంతో మోసపోయినట్లు గుర్తించిన సిద్దార్థరెడ్డి రాంగోపాల్‌పేట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు హోటల్‌పై దాడి చేసి పారిపోయేందుకు సిద్దంగా ఉన్న నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అతడి నుంచి నకిలీ ఐడీ కార్డు, మొబైల్ ఫోన్, రూ.40వేల నగదు, సింగపూర్‌కు చెందిన రెండు డాలర్లు, కొరియాకు చెందిన 1000వోన్స్ కరెన్సీ స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు ఢిల్లీ, కాశ్మీర్ తదితర ప్రాంతాల్లో ఇలాంటి నేరాలు పాల్పడినట్లు పోలీసులు పేర్కొన్నారు. -
శిక్షణ.. ఉద్యోగం.. అంతా తూచ్
హైదరాబాద్: ఎస్బీఐ.. ఆర్ఆర్బీ.. ఇన్ కంట్యాక్స్ విభాగాల్లో బ్యాక్ డోర్ ఎంట్రీలో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ లక్షల్లో డబ్బులు తీసుకొని కోల్‌కతా కేంద్రంగా 3 నెలలు శిక్షణ ఇచ్చి నకిలీ నియామక పత్రాలు చేతిలో పెట్టి వందల మందిని మోసగించిన ఐదుగురు సభ్యులతో కూడిన అంతర్రాష్ట్ర ముఠాను రాచకొండ పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. నిందితుల నుంచి రూ. 35 లక్షల విలువైన కారు, బంగారం, నకిలీ డాక్యుమెంట్లు, రూ. 10.5 లక్షల నగదు, పాస్‌పోర్టులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ముఠాలోని మరో ఏడుగురు పరారీలో ఉన్నారు. కేసు వివరాలను రాచకొండ పోలీసు కమిషనర్ క్యాంప్ కార్యాలయంలో సీపీ మహేశ్ భగవత్ బుధవారం మీడియాకు వెల్లడించారు. కోల్‌కతా కేంద్రంగా మోసాలు.. ఒడిశాకి చెందిన కళ్లు చరణ్పాండా అలియాస్ అజయ్ అలియాస్ మనోజ్ ఐదేళ్ల క్రితం కోల్‌కతాలో స్థిరపడ్డాడు. కొంతకాలం మార్కెటింగ్ బిజినెస్ చేసి సులువుగా డబ్బులు సంపాదించాలనే ఆలోచనతో తన స్నేహితులైన కలావత్ రాయ్, రాజీవ్ కార్తీక్, హేమంత్, అనిల్‌తో కోల్‌కతాలో జాబ్ కన్సల్టెన్సీ ఏజెన్సీ ఏర్పాటు చేశాడు. ఇందులో యువతకు శిక్షణ ఇచ్చి ఎస్బీఐ, ఆర్ఆర్బీ, ఇన్‌కంటాక్స్ డిపార్ట్మెంట్స్ లో ఉద్యోగాలు ఇప్పిస్తామని ఆన్లైన్లో ప్రకటనలు గుప్పించాడు. అయితే 2015లో వనస్థలిపురంలో నివాసముంటున్న ఆలేరుకు చెందిన శ్రీకాంత్ హైదరాబాద్‌లోని ఓ కన్సల్టెన్సీలో పనిచేస్తున్నప్పుడు చరణ్పాండేకు పరిచయమయ్యాడు. 2017లో శ్రీకాంత్‌కు ఫోన్ చేసి కోల్‌కతాలో ఎస్బీఐ, ఆర్ఆర్బీ, ఇన్‌కంట్యాక్స్ విభాగాల్లో ఉద్యోగావకాశాలు ఉన్నాయని చరణ్పాండే చెప్పడంతో వారి ముఠాలో సభ్యుడిగా చేరాడు. కోల్‌కతాకు నివాసం మార్చుకున్న శ్రీకాంత్ పేరును సుధామ్గా మార్చుకుని తన స్నేహితులైన రాజీవ్ కార్తీక్, ఎం.అశోక్‌రావు, వెంకట్ శిరీష్‌లకు విషయం చెప్పడంతో హైదరాబాద్‌కు చెందిన నలుగురు నిరుద్యోగులు కేతావత్ మోహన్ నాయక్, బానోత్ మోహన్, పి.కిషన్, జె.రమేశ్‌లను కోల్‌కతాకు పంపించారు. వీరి నుంచి రూ. 53.5 లక్షలు తీసుకున్న శ్రీకాంత్ కోల్‌కతాలోని ఎస్బీఐ ట్రైనింగ్ సెంటర్లో 3 నెలలు ఇతర విద్యార్థులతో కలిసి శిక్షణ ఇప్పించాడు. ఆ తర్వాత నకిలీ స్టాంప్‌లు పెట్టి ఎస్బీఐ అధికారులుగా ఫోర్జరీ సంతకాలు చేసి నకిలీ నియామక పత్రాలు ఇచ్చాడు. మిర్యాలగూడ నుంచి మరో నలుగురు మాలోత్ రమేశ్, కేతావత్ అశోక్, కుర్రా విష్ణు, యాతమ్ మహేశ్ నుంచి శ్రీకాంత్ రూ. 43.5 లక్షలు వసూలు చేసి వారికీ నకిలీ నియామక పత్రాలు అంటగట్టాడు. ట్రైనింగ్ సెంటర్లో రోజు తప్పించి రోజు శిక్షణ ఇచ్చేవాడు. శ్రీకాకుళానికి చెందిన మురళీ కృష్ణ భార్య రమా ప్రసన్న కూడా వైజాగ్, విజయనగరం, శ్రీకాకుళం విద్యార్థుల నుంచి లక్షలు వసూలు చేసింది. కన్సల్టెన్సీ నిర్వహిస్తున్న సంధ్యారాణి 35 మంది నుంచి రూ.16 కోట్లు వసూలు చేసింది. రూ.80 లక్షలు శ్రీకాంత్‌కు ఇచ్చి కోల్‌కతాకు పంపింది. ఈ ముఠా 100 మంది నుంచి రూ. 3 కోట్ల నుంచి రూ. 4 కోట్లు వరకు వసూలు చేసింది. పోలీసులు స్వాధీనం చేసుకున్న నగదు, బంగారం, ల్యాప్‌టాప్‌లు మోసపోయిన వారి ఫిర్యాదుతో మోసపోయిన నల్లగొండ జిల్లా మిర్యాలగూడ కు చెందిన రమేశ్, అశోక్, విష్ణు, మహేశ్ తదితరులు ఉప్పల్ పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు 18న శ్రీకాంత్‌ను అరెస్టు చేశారు. ఇక చరణ్పాండా, మురళీకృష్ణ, వీరరాఘవరెడ్డి, సంధ్యారాణిలను బుధవారం అరెస్టు చేశారు. వీరి నుంచి కారు, రూ. 10.5 లక్షల నగదు, మూడు ల్యాప్‌టాప్‌లు, 2 తులాల బంగారం, నకిలీ అపార్ట్మెంట్ల డాక్యుమెంట్లు, ప్రింటర్లు, సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. వీరంతా కలిసి ఇరు రాష్ట్రాల్లో వందల మంది నుంచి రూ. కోట్లలో డబ్బులు వసూలు చేసి మోసానికి పాల్పడ్డారని సీపీ మహేశ్ భగవత్ తెలిపారు. చరణ్పాండ్యా రూ.65 లక్షలతో విలాసవంతమైన అపార్ట్మెంట్ కొన్నాడని విచారణలో తేలింది. -
బయటపడిన రైల్వే ఉద్యోగాల మోసం
సాక్షి, విజయవాడ : రైల్వే ఉద్యోగాల పేరుతో నిరుద్యోగులను బోల్తా కొట్టించిన ఓ ముఠా బాగోతం బుధవారం బయటపడింది. ముంబైకి చెందిన మిత్రా, నాగూర్, వరుణ్ యశ్వంత్ సోలంకి విజయవాడ కేంద్రంగా ఈ మోసానికి తెరలేపారు. ఒక్కో ఉద్యోగాన్ని రూ.8 లక్షలకు అమ్ముతామంటూ బేరం పెట్టిన కేటుగాళ్లు.. నగరంలోని ఓ ప్రముఖ హోటల్లో ఫేక్ ఇంటర్వ్యూలు సైతం నిర్వహించారు. ఈ తతంగంపై అనుమానం వచ్చిన చిరంజీవి అనే వ్యక్తి ఫిర్యాదు చేయడంతో పోలీసులు రంగంలోకి దిగారు. నిందితులను అరెస్టు చేసి విచారణ జరుపుతున్నామని పోలీసులు తెలిపారు. ఇంటర్వ్యూల సందర్భంగా నిరుద్యోగుల నుంచి రెండు లక్షల రూపాయలు వసూలు చేసేందుకు ముఠా సభ్యులు యత్నించినట్టు తెలిసింది. -
ఉద్యోగాల పేరుతో మనుషుల అక్రమ రవాణా
-
ఉద్యోగాల పేరుతో టోకరా
ఉప్పల్: ఎల్అండ్టీ మెట్రో రైల్లో ఉద్యోగాలు ఇప్పిస్తానని మోసాలకు పాల్పడుతున్న ఇద్దరు వ్యక్తులను ఉప్పల్ పోలీసులు గురువారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఉప్పల్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్లు కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. నెల్లూరు జిల్లాకు చెందిన వెలగపూడి రామకృష్ణ హైదరాబాద్‌లోని అంబర్పేట్ తిలక్‌నగర్‌లో ఉంటూ పలు విభాగాల్లో పబ్లిక్ రిలేషన్ అఫీసర్‌గా పని చేస్తున్నాడు. అతను నిజామాబాద్ జిల్లా ఫతేనగర్‌కు చెందిన చిల్లా మహాలక్ష్మి, మిషన్ భగీరథలో డీఈగా పని చేస్తున్న తన బావ బండారు లక్ష్మణ్‌రావు, హైకోర్టు న్యాయవాది గడ్డం శ్రీధర్‌రెడ్డి కలిసి ముఠాగా ఏర్పడ్డారు. ఎల్‌అండ్‌టిలో ఉద్యోగాలు ఇప్పిస్తామని తెలుగు రాష్ట్రాలకు చెందిన 161 మంది నిరుద్యోగులకు ఎర వేశారు. వారి నుంచి రూ 80 లక్షలు వసూలు చేశారు. రామకృష్ణ వారిలో కొందరిని నకిలీ ఆర్డర్ కాపీలు తయారు చేసి ఇచ్చాడు. దిల్సుఖ్నగర్ త్రివేణినగర్‌కు చెందిన లావణ్య అనే యువతి ఫిర్యాదు చేయడంతో ఈ నెల 9న కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన ఉప్పల్ పోలీసులు గురువారం రామకృష్ణ, మహాలక్ష్మిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. వీరిపై నగరంలోని పలు పోలీస్స్టేషన్ల పరిధిలో 15 కేసులు ఉన్నట్లు తెలిపారు. మరో ఇద్దరు నిందితులు గడ్డం శ్రీధర్‌రెడ్డి, బండారు లక్ష్మణ్‌రావు పరారీలో ఉన్నట్లు తెలిపారు. నిందితుల నుంచి కారు, రెండు సెల్ఫోన్లు, నకిలీ ఆర్డర్ కాపీలు, రూ రూ.70వేల నగదును స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. -
దుర్గా ప్రసాద్ దొరికాడు!
సాక్షి, సిటీబ్యూరో: రైల్వేలో ఉద్యోగాల పేరుతో తెలుగు రాష్ట్రాల్లోని దాదాపు వంద మంది నిరుద్యోగుల నుంచి రూ.కోట్లు దండుకున్న ఘరానా మోసగాడు పమ్మిడి దుర్గా ప్రసాద్ రావు నగర నేర పరిశోధన విభాగం (సీసీఎస్) పోలీసులకు చిక్కాడు. భార్యతో కలిసి మోసాలు చేస్తున్న ఇతడిపై ఐదు కేసులు నమోదై ఉండగా... మరో ఏడు కేసుల్లో ఇతడి ప్రమేయం ఉన్నట్లు స్పెషల్ టీమ్–2 అధికారులు గుర్తించారు. డీసీపీ అవినాష్ మహంతి మంగళవారం వివరాలు వెల్లడించారు. బంజారాహిల్స్‌లోని ఎమ్మెల్యే కాలనీకి చెందిన దుర్గా ప్రసాద్ కన్స్ట్రక్షన్ రంగంలో ఉన్నాడు. తేలిగ్గా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో మోసాలకు శ్రీకారం చుట్టాడు. తన భార్య పద్మినితో కలిసే పథకం రచించిన అతను రైల్వేలో తనకు ఉన్న పరిచయాలు వినియోగించుకుని దొడ్డిదారిన గ్రూప్ సీ,డీతో పాటు స్టేషన్ మాస్టర్, టికెట్ కలెక్టర్ ఉద్యోగాలు ఇప్పిస్తానని ప్రచారం చేసుకున్నాడు. ఆసక్తి చూపిన వారి నుంచి అడ్వాన్స్‌గా రూ.10 లక్షల వరకు వసూలు చేశాడు. మోసం చేస్తూ ‘మోసగాళ్లని’... ఈ అభ్యర్థుల్లో కొందరితో బోగస్ పత్రాలపై సంతకాలు చేయించుకోవడంతో పాటు రైల్వే ఉద్యోగాలకు వైద్య పరీక్షలు తప్పనిసరని చెప్పిన అతను కొందరు అభ్యర్థులను లాలగూడలోని రైల్వే ఆస్పత్రికి తీసుకెళ్లి వీరికి రక్త, మూత్ర పరీక్షలు చేయించాడు. ఆ తర్వాత కొన్ని రోజులకు అభ్యర్థులు తమకు ఉద్యోగాలు ఇంకా ఎందుకు రాలేదంటూ ప్రశ్నించడంతో దీంతో తన భార్య సహకారంతో వీరిని సొంత కారులోనే సికింద్రాబాద్‌లోని రైల్ నిలయానికి పంపాడు. అక్కడి ఓ చోట వీరిని కూర్చోబెట్టిన పద్మిని ఈ కార్యాలయం నుంచే అపాయింట్మెంట్ ఆర్డర్లు వస్తాయంటూ నమ్మబలికింది. అయితే ఇటీవల కొందరు మోసగాళ్లు రైల్వేలో ఉద్యోగాల పేరుతో అమాయకులను మోసం చేశారని, దీంతో రైల్ నిలయం అధికారులు వారిని పట్టుకునే ప్రయత్నాల్లో ఉన్నారని, అందుకే నియామక పత్రాల జారీని తాత్కాలికంగా నిలిపేశారని, నెల రోజుల తర్వాత ప్రారంభిస్తారంటూ చెప్పి వారిని నమ్మించి పంపింది. కారు ఇచ్చి మళ్లీ కేసు పెట్టాడు... దుర్గా ప్రసాద్ నగరానికి చెందిన ఓ యువకుడికి హోంగార్డు ఉద్యోగం ఇప్పిస్తానంటూ నమ్మించాడు. పూర్తిగా తన వల్లో పడ్డాడని నిర్ధారించుకున్న తర్వాత వివిధ పేర్లు చెప్పి అతడి నుంచి రూ.10 లక్షలు వసూలు చేశాడు. అయినా ఉద్యోగం రాకపోవడంతో సదరు యువకుడు దుర్గాప్రసాద్‌ను నిలదీయడమేగాక తన డబ్బులు తిరిగి ఇవ్వాలని ఒత్తిడి చేశాడు. దీంతో తన కారును ఇచ్చిన దుర్గాప్రసాద్ ఆపై సదరు యువకుడు తన కారు ఎత్తుకెళ్లాడని కేసు పెట్టి అరెస్టు చేయించాడు. చివరకు అసలు విషయం తెలియడంతో పోలీసులు అవాక్కయ్యారు. ఇతడిపై సీసీఎస్‌లో నమోదైన కేసును ఇన్స్పెక్టర్ ఆర్జీ శివమారుతి నేతృత్వంలోని బృందం దర్యాప్తు చేసింది. ముమ్మరంగా గాలింపు చేపట్టి మంగళవారం బంజారాహిల్స్‌లో దుర్గా ప్రసాద్‌ను అదుపులోకి తీసుకున్నారు. అనేక మందిని మోసం చేసిన ఇతను తన ఇంటి చుట్టూ దాదాపు 80 సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకున్నాడు. బాధితులు, పోలీసులు తన కోసం వస్తే వాటి ద్వారా తెలుసుకుని ఉడాయించేవాడు. అయితే కొన్ని రోజులుగా ఆ సీసీ కెమెరాలు పని చేయట్లేదని తెలిసింది. మరికొన్ని కేసులూ వెలుగులోకి... ఈ కేసును సాంకేతికంగా దర్యాప్తు చేసిన సీసీఎస్ పోలీసులు దుర్గా ప్రసాద్‌పై మరికొన్ని కేసులు ఉన్నట్లు గుర్తించారు. నగరంలోని బంజారాహిల్స్, సైఫాబాద్లతో పాటు విజయవాడలోనూ కేసులు ఉన్నట్లు తేల్చారు. వీటితో పాటు మరో ఏడు కేసుల్లో పరోక్షంగా ప్రమేయం కలిగి ఉన్నట్లు తెలిపారు. రేషన్ షాపులకు బియ్యం తదితరాలు తక్కువ ధరకు ఇప్పిస్తామని, బంగారం వ్యాపారం పేరుతో పలువురిని మోసం చేసిన నేరగాళ్లతో ఇతడికి ప్రమేయం ఉన్నట్లు, ఈ తరహాకు చెందిన ఐదు కేసులు ఉన్నట్లు గుర్తించారు. మరో మూడు కేసుల్లో ఇతర ప్రాంతాలకు చెందిన పోలీసులు నిందితుడు ఎవరనేది తేల్చుకోలేక సతమతమవుతున్నారు. సీసీఎస్ పోలీసులు దుర్గారావును అరెస్టు చేయడంతో వారికి మార్గం సుగమమైంది. ఇంతటి ఘరానా చరిత్ర ఉన్న దుర్గా ప్రసాద్‌కు ఓ కాలు లేకపోవడం, ప్రతి రెండు రోజుకోసారిడయాలసిస్ తప్పనిసరి కావడం గమనార్హం. -
ఫేస్బుక్ పరిచయంతో ఉద్యోగం ఇప్పిస్తానంటూ..
విలాసవంతమైన జీవితం, గుర్రపు పందాలతో జోష్...ఖరీదైన వాహనాల్లో రయ్...రయ్, లగ్జరీ సూట్లలో హల్చల్...చూస్తే వీఐపీ పోజు ... చేసే పనులన్నీ మస్కా... ఇందుకు చేతినిండా డబ్బులు కావాలి...అందుకే ఫేస్బుక్ ద్వారా పరిచయాలు పెంచుకొని అవతలివారిని ‘బుక్’ చేయడం హాబీగా మార్చుకున్నాడు ఆ యువకుడు. అమరావతి సెక్రటేరియట్లో ఉద్యోగిగా ఓ యువతిని పరిచయం చేసుకుని, జ్యుడీషియల్ డిపార్టుమెంట్లో ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి దశలవారీగా రూ.16.50 లక్షలు స్వాహా చేసి చివరకు కటకటాలపాలయ్యాడు. తూర్పుగోదావరి , రాజమహేంద్రవరం రూరల్: ఫేస్బుక్లో పరిచయమైన యువతికి మాయమాటలు చెప్పి రూ.16.50 లక్షలు కాజేసిన తూర్పుగోదావరి జిల్లా కడియం మండలం వేమగిరికి చెందిన మద్దెల దీపుబాబు అలియాస్ దీపక్‌ను బొమ్మూరు పోలీసులు అరెస్ట్ చేశారు. అతడి నుంచి రూ.10 వేలు, ఒక ఏటీఎం కార్డును స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు గతంలోను ప్రజాప్రతినిధులు, పారిశ్రామికవేత్తలకు మొబైల్ ఫ్యాన్సీ నంబర్లు ఇస్తానని చెప్పి రూ.30 లక్షలు కాజేసిన కేసులో జైలు శిక్ష అనుభవించాడు. దీపక్ ఏపీ సెక్రటరీయేట్లో ఉద్యోగం చేస్తున్నానని చెబుతూ ఫేస్బుక్లో పలు పరిచయాలు పెంచుకున్నాడు. శాటిలైట్ సిటీ గ్రామానికి చెందిన దొండపాటి దుర్గ అనే యువతికి దీపక్ ఫేస్బుక్లో పరిచయమయ్యాడు. జనసేన అధినేత పవన్ కల్యాణ్‌తో నిందితుడు(ఫేస్బుక్లో పోస్ట్ చేసిన చిత్రం) ఆమె పిన్నికుమార్తె బోనగిరి శేషారత్నానికి న్యాయశాఖలో ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి ఆమె తల్లిదండ్రుల నుంచి తన అకౌంట్లో రూ.16.50 లక్షలు వేయించుకున్నాడు. సొమ్ములు చెల్లించినా ఉద్యోగం రాకపోవడంతో అనుమానం వచ్చి నిలదీయగా, వారిని నమ్మించేందుకు బెంగళూరులో ఇటీవల జరిగిన న్యాయశాఖ ఉన్నతాధికారులు సమావేశం వద్దకు తీసుకువెళ్లి అపాయింట్మెంట్ లెటర్ తయారవుతోందని, ఉద్యోగం వచ్చేస్తుందని నమ్మించాడు. నెలలు గడుస్తున్నా ఉద్యోగం రాకపోవడంతో ఈ నెల13న శేషారత్నం తాత ఊరా రాముడు బొమ్మూరు పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. తాను వసూలు చేసిన సొమ్మును హైదరాబాద్, బెంగళూరులలో గుర్రపు పందాలు, స్టార్ హోటళ్లలో దిగి వాడేసినట్లు నిందితుడు తెలిపాడు. నిందితుడికి స్కేటింగ్‌లో కుడికాలు పోయిందని..కృత్రిమ కాలును ఏర్పాటు చేసుకుని ఈ ఘాతుకాలకు పాల్పడుతున్నాడని రాజమహేంద్రవరం అర్బన్ జిల్లా తూర్పుమండల డీఎస్పీ యు.నాగరాజు తెలిపారు. -
ఉద్యోగాల పేరుతో వల
కర్నూలు, నంద్యాల: ఉద్యోగాల పేరుతో యువతులు, బాలికలకు వల వేసి..మోసాలకు పాల్పడుతున్న ఓ ముఠా వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఒడిశా రాజధాని భువనేశ్వర్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే ఈ ముఠా కబందహస్తాల్లో రాష్ట్రంలోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, చిత్తూరు,వైఎస్సార్, కర్నూలు జిల్లాలకు చెందిన పలువురు బాధితులు చిక్కుకున్నట్లు పోలీసులు భావిస్తున్నారు. నంద్యాలకు చెందిన ఓ బాలికను ఉద్యోగం ఇప్పిస్తామంటూ తీసుకెళ్లి..అక్కడ చిత్రహింసలకు గురి చేశారు. ఈ విషయం పోలీసులకు తెలియడంతో అక్కడికి వెళ్లి చెర నుంచి విడిపించారు. ఇందుకు సంబంధించిన వివరాలను నంద్యాల డీఎస్పీ గోపాలకృష్ణ శుక్రవారం తన కార్యాలయంలో మీడియాకు వెల్లడించారు. పట్టణంలోని ఆటోనగర్‌కు చెందిన ఓ బాలికకు పట్టణానికే చెందిన సంధ్యా, మందిరా అనే మహిళలు పరిచయమయ్యారు. భువనేశ్వర్‌లోని గ్లేజ్ ట్రేడింగ్ ఇండియా ప్రైవేటు సంస్థలో ఉద్యోగాలు ఉన్నాయని, మంచి వేతనం, కారు, బంగ్లా ఇస్తారని మాయమాటలు చెప్పారు. ముందుగా రూ.30 వేలు కట్టాలనడంతో సదరు బాలిక ఆ మొత్తం చెల్లించింది. తర్వాత భువనేశ్వర్‌కు తీసుకెళ్లి అక్కడ రోజులు గడుస్తున్నా ఏ ఉద్యోగమూ చూపలేదు. కంప్యూటర్ నేర్పిస్తామని చెబుతూ వచ్చారు. కొన్నిరోజుల తర్వాత స్నేహితులకు ఫోన్లు చేసి ఇక్కడ వేతనం బాగుందని చెప్పి..వారినీ రప్పించాలని బలవంతం చేశారు. అంతటితో ఆగకుండా చిత్రహింసలకు గురి చేశారు. దీంతో ఈ విషయాన్ని సదరు బాలిక నంద్యాలలోని తల్లిదండ్రులకు ఫోన్లో తెలియజేసింది. బాలిక తల్లి జిల్లా ఎస్పీ ఫక్కీరప్పను కలిసి ఫిర్యాదు చేసింది. ఎస్పీ ఆదేశాల మేరకు నంద్యాల డీఎస్పీ గోపాలకృష్ణ షీటీంను భువనేశ్వర్‌కు పంపారు. బాలికను చెర నుంచి విడిపించి తీసుకొచ్చారు. ఇలాంటి బాధితులు అక్కడ చాలా మంది ఉన్నట్లు తెలిసిందని డీఎస్పీ చెప్పారు. సదరు కంపెనీపై కేసు నమోదు చేసి.. దర్యాప్తు చేస్తున్నామన్నారు. నిరుద్యోగుల బలహీనతను ఆసరాగా చేసుకొని మోసాలకు పాల్పడే వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. -
నకిలీ ఉద్యోగాల వల.. తప్పించుకునేదెలా!
విదేశాల్లో, ఎంఎన్సీల్లో, ప్రముఖ కంపెనీల్లో కొలువులంటూ ఎరరైల్వేలో, రక్షణ రంగంలో, పీఎస్‌యూల్లో ఉద్యోగాలపేరిట భారీగా మోసంనకిలీ జాబ్ సైట్స్, నకిలీ ఈ–మెయిల్స్, ఫేక్ కన్సల్టెన్సీలతో నిరుద్యోగులను వంచిస్తున్న వైనంఫేక్ ఆఫర్ లెటర్లతో లక్షలు కొల్లగొడుతున్న సైబర్ నేరగాళ్లుఅప్రమత్తంగా ఉండాలంటున్న నిపుణులు ‘నాగేశ్వరరావు ఓ ప్రభుత్వరంగ సంస్థలో శాస్త్రవేత్తగా స్వచ్ఛంద పదవీ విరమణ పొందారు. విశ్రాంత సమయంలోఖాళీగా ఉండలేక తన అనుభవానికి తగ్గ పార్ట్‌టైమ్ ఉద్యోగం కోసం ప్రయత్నాలు ప్రారంభించారు. ఓ జాబ్‌పోర్టల్‌లో రెజ్యూమె అప్లోడ్ చేశారు. కొన్నిరోజుల తర్వాత లండన్‌లో ఓ నిర్మాణ కంపెనీలో జాబ్, భారీవేతనంతో ఉద్యోగమంటూ ఆఫర్ వచ్చింది. అందుకోసం రిజిస్ట్రేషన్ ఫీజు, వీసా ప్రాసెసింగ్ ఫీజులు, పోలీస్ క్లియరెన్స్ ఫీజు, యాంటీ టెర్రరిజం ఫీజు.. మొదలైన పేర్లతో పలు దశల్లో నాగేశ్వరరావు నుంచి డబ్బుగుంజడం మొదలుపెట్టారు. మొత్తంమీద రూ.19 లక్షలు వదిలించుకున్న తర్వాత అసలు మోసంబయటపడింది. మోసపోయానని తెలుసుకున్న తర్వాత పోలీసులను ఆశ్రయించారు నాగేశ్వరరావు.’ ‘సంధ్యారాణి ఎంబీఏ ఫైనాన్స్ పూర్తిచేసింది. ఆమెకు సాఫ్ట్వేర్ ఇంజనీర్‌తో వివాహమైంది. ఐదేళ్ల బాబుఉన్నాడు. భర్త అకాలమరణంతో కుటుంబ పోషణ కోసం సంధ్యారాణి తన చదువుకు తగ్గ ఉద్యోగం కోసం ప్రయత్నాలు ప్రారంభించింది. ఓ జాబ్ పోర్టల్‌లో రెజ్యూమె అప్లోడ్ చేసింది. ప్రముఖ బ్యాంకులో జాబ్ఆఫర్ అంటూ ఓ అగంతకుడు ఫోన్ చేశాడు. టెలిఫోనిక్ ఇంటర్వ్యూ, హెచ్ఆర్ ఇంటర్వ్యూ తీసుకున్నారు. తర్వాత రిజిస్ట్రేషన్ పేరుతో రూ.3,500 చెల్లించాలని చెప్పడంతో ఆమె ఆ మొత్తాన్ని అకౌంట్లోజమచేసింది. బ్యాంకు లెటర్‌ప్యాడ్‌తో ఆఫర్ లెటర్ పంపించారు. ఉద్యోగం సొంతం కావాలంటే.. మరికొంత చెల్లించాలన్నారు. వివిధ దశల్లో రూ.5 లక్షలు వసూలు చేశారు. తీరా జాయినింగ్ లెటర్ తీసుకొని వెళ్లేసరికి..ఆ ఆఫర్ లెటర్‌కు, సంస్థకు ఎలాంటి సంబంధం లేదని సంస్థ ప్రతినిధులు తేల్చిచెప్పారు. దాంతో మోసపోయానని తెలుసుకున్న సంధ్యారాణి సైబర్‌క్రైమ్ పోలీసులను ఆశ్రయించింది. హైదరాబాద్ :ఇవి కొన్ని ఉదాహరణలు మాత్రమే! ఇలా ఎంతోమంది నిరుద్యోగులు ఫేక్ ఉద్యోగ ఆఫర్లతో భారీగా మోసపోతున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు రంగంలో ఉద్యోగాలకు పోటీ నానాటికీ తీవ్ర మవుతోంది. ఉద్యోగాలు లభించడం కష్టమవుతున్న పరిస్థితుల్లో టాప్ కంపెనీ నుంచి ఆఫర్ లెటర్ అనేసరికిæ నిరుద్యోగులు రూ.లక్షలు అప్పుచేసి మరీ చెల్లిస్తు న్నారు. ఆ తర్వాత ఆర్థికంగా చితికి పోతున్నారు. ప్రధానంగా పేద, మధ్యతరగతి వర్గాలను లక్ష్యంగా చేసుకొని సైబర్ నేరగాళ్లు లక్షలు కొల్లగొడుతున్నారు. సంస్థలు విడుదల చేసే ఆఫర్ లెటర్ మాదిరిగానే ఉండే లెటర్ హెడ్‌తో ఉద్యోగార్థులను బురిడీ కొట్టిస్తున్నారు. జాబ్ పోర్టల్స్ నుంచే ♦ నేటి ఆన్లైన్, ఇంటర్నెట్ యుగంలో ఎక్కడి నుంచైనా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఉద్యోగాలను ఒడిసిపట్టుకునే అవకాశముంది. ముఖ్యంగా ఇంటర్నెట్ సహాయంతో దేశ విదేశాల్లో కొలువులు వెతుక్కునే వీలుంది. అందుకోసం జాబ్ పోర్టల్స్‌లో నిరుద్యోగులు రెజ్యూమెలు అప్ లోడ్ చేస్తుంటారు. ఇదే ఇప్పుడు సైబర్ నేరగాళ్లకు వరంలా మారింది. నిరుద్యోగులు జాబ్ పోర్టల్స్ లో అప్లోడ్ చేసిన రెజ్యూమెల నుంచి సైబర్ నేరగాళ్లు అభ్యర్థుల వివరాలు సేకరిస్తున్నారు. అమాయకులకు ఉద్యోగాల ఎరవేసి భారీగా డబ్బులు గుంజి కనిపించకుండా పోతున్నారు. ఫేక్.. గుర్తించండిలా! ♦ కొందరు ముఠాగా ఏర్పడి ఒకరు హెచ్ఆర్గా, మరొకరు టెక్నికల్ పర్సన్‌గా పరిచయం చేసుకొని ఇంటర్వ్యూలు నిర్వహిస్తుంటారు. టీసీఎస్, విప్రో, ఇన్ఫోసిస్ వంటి కంపెనీల పేర్లు చెప్పి... హడావుడి చేస్తుంటారు. కొందరు ఏకంగా రైల్వేలో ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు నిర్వహించి శిక్షణ సైతం ఇస్తూ పోలీసులకు చిక్కడం తెలిసిందే. ఇలాంటి వాళ్లు నిరుద్యోగులకు తరచూ ఫోన్లు చేస్తూ సంభాషణలు కొనసాగిస్తారు. ఆ క్రమంలో ఏదో ఒక సందర్భంలో రిజిస్ట్రేషన్ పేరిటగానీ లేక మరేదైనా కారణం చెప్పి తమ వ్యక్తిగత ఖాతాలో డబ్బులు జమ చేయమని కోరుతారు. వీరు కచ్చితంగా ఫేక్ అని నిర్ధారించుకోవచ్చు. ♦ ఎంపిక ప్రక్రియ ఏ దశలోనైనా ఉద్యోగం ఇచ్చేందుకు డబ్బులు అడుగు తున్నారంటే అది కచ్చితంగా మోసం అని భావించాలి. కంపెనీ పెద్దదైనా, చిన్నదైనా.. అభ్యర్థుల నుంచి డబ్బులు అడగవనే విషయాన్ని గుర్తించుకోవాలి. ♦ ఇంకొందరు మోసగాళ్లు మరో అడుగు ముందుకేసి.. ఆఫర్ల లెటర్లు సైతం జారీ చేస్తారు. ఫలానా తేదీలో కంపెనీలో చేరాలని నమ్మబలుకుతారు. ఈలోపు కొంత మొత్తాన్ని తమ ఖాతాలో వేయమంటారు. వీరు కూడా నకిలీలే! ♦ బ్యాంక్ అకౌంట్స్, టాక్స్ ఫామ్స్, పాన్ నెంబర్, ఆధార్ కార్డ్.. ఇలాంటివి అడుగుతున్నారంటేనే అనుమానించాలి. ♦ ఆఫర్ లెటర్ లేదా ఉద్యోగం నిజమైనదే అని న మ్మించేందుకు ఫోటోలు, ఎక్స్పీరియన్స్ సర్టిఫి కెట్లు, మెడికల్ సర్టిఫికెట్, విద్యార్హతల సర్టిఫికెట్లు సమర్పించమని అడుగుతారు. ♦ నేరగాళ్లు జారీచేసే ఆఫర్ లెటర్లను జాగ్రత్తగా గమనిస్తే ఎన్నో తప్పులు కనిపిస్తాయి. ఒక ప్రొఫెషనల్ సంస్థ జారీచేసే అపాయింట్మెంట్ లెటర్‌కు, నకిలీలు ఇచ్చే లెటర్లకు మధ్య చాలా తేడాలు ఉంటాయి. ఫేక్ ఆఫర్ లెటర్లలో.. ఉద్యోగంలో భాగంగా నిర్వర్తించాల్సిన పాత్ర, విధుల గురించి స్పష్టత ఉండదు. గ్రామర్ తప్పులు, స్పెల్లింగ్ పొరపాట్లు కొట్టొచ్చినట్టు కనిపిస్తాయి. ఆఫర్ లెటర్లలో సంస్థల లోగోలు, హోలోగ్రాంలను క్షుణ్నంగా పరిశీలిస్తే అవి నకిలీ అని తేలుతుంది. ♦ ఇటీవల కాలంలో సైబర్ నేరగాళ్లు ఈ–మెయిల్స్ లోనే ఆఫర్లెటర్స్ ఇస్తున్నారు. విదేశాల్లో జాబ్స్, భారీగా జీతాలు అంటూ ఆకర్షిస్తున్నారు. డిపాజిట్ రూపంలో కొంత మొత్తం, వీసా ప్రాసెసింగ్‌కు మరికొంత చెల్లించమని కోరుతున్నారు. ఈ–మెయిల్స్ డొమైన్ పేరు కూడా సంస్థ పేరుతోనే ఉంటున్నాయి. ♦ మనం చదివిన కోర్సుకు సంబంధం లేని ఉద్యో గాలు కూడా ఈ–మెయిల్స్ ద్వారా వస్తుంటాయి. ఇలాంటివి పట్టించుకోకపోవడం మేలు. ♦ సాఫ్ట్వేర్ కంపెనీల్లో వినిపించే పదం ‘బ్యాక్‌డోర్’. టాప్ ఐటీ కంపెనీలో నేరుగా జాబ్ ఇప్పిస్తామని నమ్మబలికి రూ.లక్షల్లో వసూలు చేస్తాయి కొన్ని నకిలీ కన్సల్టెన్సీలు. సాఫ్ట్వేర్ సంస్థలుగానీ, ఇతర ఏ కంపెనీలు అయినా ప్రతిభ ఉన్న వారికే ఉద్యోగాలు ఇస్తాయి అనే విషయాన్ని గమనించాలి. ♦ మరికొందరు సాఫ్ట్వేర్ ట్రైనింగ్ సంస్థ అని చెప్పి.. శిక్షణ పూర్తయ్యాక ఉద్యోగావకాశం కల్పిస్తామని నమ్మించి డబ్బులు వసూలు చేస్తారు. నిరుద్యోగుల నుంచి డబ్బులు గుంజి ఆ తర్వాత బోర్డు తిప్పేస్తారు. ఇలాంటి కేసులు ఇప్పుడు అనేకం. ♦ ప్రభుత్వ విభాగాల్లో ఉద్యోగాలంటూ.. ఫేక్ జాబ్ నోటిఫికేషన్స్ ఇటీవల కాలంలో ♦ సర్వసాధారణ మయ్యాయి. ఉదాహ రణకు కొద్ది రోజుల క్రితం తెలంగాణ అగ్రి డవలప్ మెంట్ కార్పొరేషన్లో కొలు వులు అంటూ.. నోటి ఫికేషన్ ఇచ్చి అభ్యర్థుల నుంచి దరఖాస్తు ఫీజు వ సూలు చేశారు. ఇలా దరఖాస్తు ఫీజు రూపే ణ కూడా వందల మంది నష్టపోతున్నారు. అప్రమత్తత అవసరం ♦ కంపెనీలు నియామకాల్లో పారదర్శ కత పాటిస్తున్నాయి. తమ అధికారిక వెబ్సైట్లలో ఖాళీల వివరాలను, తమ అవసరాలను పొం దుపరుస్తున్నాయి. అలానే, లింక్డ్ ఇన్ వంటి ప్రొఫెషనల్ వెబ్‌సైట్‌ల్లో సంస్థలు ఉద్యోగ అవ కాశాలను పోస్ట్ చేస్తున్నాయి. కాబట్టి ఇలాంటి నమ్మదగ్గ మార్గాల్లో ఉద్యోగ ప్రయత్నాలు సాగిస్తే మోసపోవడానికి ఆస్కారం తక్కువగా ఉంటుంది. ♦ మీకున్న నెట్‌వర్క్‌ను ఉపయోగించుకొని రిఫరల్ ద్వారా ఉద్యోగ అవకాశాలు వెతుక్కోవచ్చు. కంపెనీ కాకుండా థర్డ్ పార్టీ నుంచి ఉద్యోగ అవకాశం వస్తే నెట్వర్క్ ద్వారా నిజానిజా లను తెలుసుకోవాలి. ♦ టెలిఫోనిక్ ఇంటర్వ్యూ సమయం లో వ్యక్తిగత సమాచారం అవసరమై నంత వరకే చెప్పాలి. కంపెనీలు వ్యక్తిగత వివరాలు కొంతమేరకు అడిగినా..∙మరీ లోతుగా అడిగే అవకాశం ఉండదు. తార్కికంగా ఆలోచించి సమాధానాలు ఇవ్వడం మేలు. ♦ అపరిచిత వ్యక్తుల నుంచి, కన్సల్టెన్సీల నుంచే వచ్చే ఉద్యోగ ఆఫర్లను ఒకటికి రెండుసార్లు సరిచూసుకోవాలి. ఆయా సంస్థల అధికారిక ఈ– మెయిల్స్‌కు, ల్యాండ్‌లైన్ నంబర్‌కు ఫోన్ చేసైనా వివరాలు తెలుసుకోవాలి. నేరుగా వెళ్లి కనుక్కోండి ఉద్యోగాల కోసం నిరుద్యోగులు పడే తాప త్రయాన్ని సైబర్ నేరగాళ్లు సొమ్ము చేసుకుం టున్నారు. ఇప్పుడు ఉద్యోగాల పేరిట అన్ని వయసుల వారు మోసపోతున్నారు. ప్రముఖ బహుళజాతి కంపెనీల్లో ఉద్యోగాలంటూ.. ఎర వేస్తూ రూ.లక్షలు లాగుతున్నారు. కాగ్నిజెంట్, ఐబీఎం, ఇన్ఫోసిస్‌లో ఉద్యోగాలు ఇప్పిస్తామని టోకరా వేస్తున్నారు. కాబట్టి ఉద్యోగార్థులు అప్రమత్తంగా ఉండాలి. మన హైదరాబాద్‌లో ఆయా ప్రముఖ సంస్థల కార్యాలయాలు ఉన్నాయి. నేరుగా అక్కడికి వెళ్లి ఉద్యోగ వకాశాల గురించి వాకబు చేయాలి. సంస్థలు జీతాలు ఇచ్చి నియమించుకుం టాయి. అంతేకానీ డబ్బులు తీసుకొని ఉద్యోగాలు ఇయ్యవు అనే విషయాన్ని గుర్తించాలి. ఆఫర్ లెటర్లో కంపెనీల లోగోలు, లెటర్ హెడ్స్ తదితర వివరాలను ధ్రువీకరించుకోవాలి. అపరిచితులకు డబ్బులు బదిలీచేసే ముందు తార్కికంగా ఆలోచించాలి. – ఎస్.హరినాథ్, ఏసీపీ, సైబర్‌క్రైమ్స్, రాచకొండ. -
ఉద్యోగాల పేరుతో టోకరా
దేవరకద్ర(మహబూబ్‌నగర్): చదువుకున్న నిరుద్యోగులకు ఎర వేసి మంచి ఉద్యోగం ఇప్పిస్తాం, రూ.వేలల్లో జీతం, మంచి భవిష్యత్‌ను కల్పిస్తామంటూ మాయమాటలు చెప్పి పలువురిని ఒడిశాకు తీసుకువెళ్లి శిక్షణ పేరుతో నిర్బంధానికి గురి చేసిన ఘటన ఇది. అక్కడి నుంచి కొందరు యువకులు తప్పించుకుని రావడంతో విషయం వెలుగు చూసింది. మహబూబ్‌నగర్ దేవరకద్రకు చెందిన కొందరు యువకులు, ఒక యువతి ఇప్పటికి అక్కడే వారి నిర్బంధంలో ఉన్నట్లు తప్పించుకుని వచ్చిన వారి ద్వారా తెలిసింది. వివరాలు ఇలా ఉన్నాయి.. ముందుగా కొందరు నిరుద్యోగలకు ఎర వేసి వారి ద్వారా స్నేహితులు, బంధువులు, తెలిసిన వారి వివరాలు, ఫోన్ నంబర్లు తీసుకుని తిరిగి వారి ద్వారామరి కొందరిని చైన్ సిస్టం మాదిరిగా లాగుతున్నట్లు సమాచారం. ఎస్సెస్సీ, ఇంటర్, డిగ్రీ చదివిన వారినే ఎక్కువగా తమ చైన్ సిస్టంలోకి లాగుతున్నారు. సభ్యత్వానికి డబ్బు వసూలు ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి తమ కంపెనీలో చేరడానికి రూ.10,500 చెల్లించాలని, ఆ తర్వాత భోజనం ఖర్చు కింద రూ. 6 వేలు చెల్లిస్తే ఇక రూ.16 వేల నుంచి రూ. 18 వేల వరకు నెలకు వేతనం వస్తుందని మాయమాటలు చెబుతున్నట్లు సమాచారం. ఇలా అంగీకరించిన వారిని ఒడిశాలోని బద్రక్ జిల్లాకు వచ్చేలా చేస్తున్నారు. అక్కడి వెళ్లాక వారి నుంచి రూ. 16,500 తీసుకుని.. ఒక గాల్వే బ్యాగ్ అందులో కొన్నిరకాల క్రీములు, పౌడర్లు, ప్రొటీన్ డబ్బాలు ఇస్తున్నారు. గ్రేజ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ కింద గాల్వే బ్రాండ్ వస్తువులను అంటగడుతున్నారు. అలాగే, ఒడిశాకు వచ్చిన వారికి సూటు వేయించి ఫొటో తీసి పెద్ద కంపెనీలో పనిచేస్తున్నట్లు ఐడెంటిటీ కార్డు జారీ చేస్తున్నారు. ఇదంతా చూసిన నిరుద్యోగులు ఆశతో ఉంటున్నారు. బద్రక్ జిల్లాలో అద్దెకు తీసుకున్న గదుల్లో పది నుంచి ఇరవై మంది వరకు ఉంచి రెండు పూటల భోజనం మాత్రం పెట్టి తరగతులు నిర్వహిస్తూ చివరకు గాల్వే ఉత్పత్తులు ఎలా విక్రయించాలో చెబుతున్నారు. ప్రతీ సభ్యుడు ముగ్గురిని సభ్యత్వం చేయించాలని, ముందుగా తీసుకున్న వారి స్నేహితులు, బంధువులు, ఇతరులకు ఫోన్ చేసేలా ఒత్తిడి తీసుకొస్తున్నారు. అంతేకాకుండా ఒడిశా వెళ్లిన వారెవరూ బయటకు వెళ్లకుండా నిర్వాహకులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. నెల నుంచి రెండు నెలలు పూర్తయ్యాక ఉద్యోగం లేదనే విషయం తెలుసుకుని గ్రామాలకు వెళ్తామని చెప్పినా కంపెనీ ప్రతినిధులు నిరాకరిస్తున్నారు. ఇరుకు గదుల్లో నెలల తరబడి ఉండడం దుర్భరంగా మారిందని యువకులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇక స్టేజీ వన్ నుంచి ఫోర్ వరకు సభ్యత్వాలను చేయిస్తే రూ.74 వేలు అకౌంట్లో వేస్తాం, ఆ తర్వాత రూ.లక్ష, చివరగా రూ.5 లక్షలు వస్తాయని ఆశపెడుతూ ఇతరులకు ఫోన్లు చేయించి మోసం చేయిస్తున్నారని బాధితులు తెలిపారు. పోలీసులకు ఫిర్యాదు దేవరకద్రకు చెందిన ఎరుకలి వెంకట్రాములు, ఎ రుకలి శివ, కురుమూర్తి, బల్సుపల్లి నర్సింహా ఒ డిశాలో నిర్బంధం తప్పించుకుని వచ్చారు. అదే విధంగా మద్దూర్ మండలం నిడ్జింతకు చెందిన ఆంజనేయులు కూడా వీరి వెంట వచ్చారు. ఈ మేరకు వారు మంగళవారం విషయం పోలీసులకు వివరించారు. తమకు జరిగిన అన్యాయమే చాలా జరుగుతోందని తెలిపారు. తన తమ్ముడు రాము, చెల్లెలు రామలక్ష్మీ ఇప్పటికి ఒరిస్సాలోనే వారి నిర్బంధంలో ఉన్నారని ఎరుకలి వెంకట్రాములు తెలిపారు. ఈ మేరకు వారిని విడిపించి తీసుకు రావాలని కోరారు. -
దళారీ గద్దలు
బరిగెల శివకుమార్ అనే యువకుడు ఉద్యోగంపై ఆశతో ప్రశాంత్‌నగర్‌కు చెందిన వ్యక్తిని నమ్మి రూ.4 లక్షలు సమర్పించుకున్నాడు. శివకుమార్ లాంటి బాధితులు సదర వ్యక్తి ఖాతాలో ఎందరు ఉన్నారో లెక్కలేదు. అతడిని డబ్బుల కోసం నిలదీసిన బాధితులపైనే అట్రాసిటీ కేసులు పెట్టి ముప్పుతిప్పలు పెట్టిన ఘన చరిత్ర అతడికి ఉంది. కాజీపేట రహమత్ నగర్‌కు చెందిన తేలు సారంగపాణిది మరో గాథ. అన్న కొడుకు ఇంజనీరింగ్ చదివి ఇంటి వద్ద పనీపాట లేకుండా ఉంటున్నాడు.. ఏదైనా అవకాశం ఉంటే చూడు అంటూ పరిచయం ఉన్న వ్యక్తితో బాధను పంచుకున్నాడు. దీన్ని అవకాశంగా తీసుకున్న సదరు వ్యక్తి నేరుగా విదేశాల్లో సాఫ్ట్వేర్ ఉద్యోగం కోసం పంపిస్తానంటూ రూ.7.50 లక్షలు వసూలు చేసి నట్టేట ముంచాడు. అడగబోతే మాటలతో ఎదురుదాడి చేశాడు. చేసేది లేక పోలీసులను ఆశ్రయించి సగం డబ్బులను వసూలు చేసుకోవడంలో సఫలీకృతుడైన బాధితుడిపై ఇంకా సదరు దళారీ ఎదురుదాడి ఆగకపోవడం గమనార్హం. కాజీపేట (వరంగల్): కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇటీవల వివిధ శాఖల్లోని ఉద్యోగాల భర్తీ కోసం జారీ చేసిన నోటిఫికేషన్లు కొంతమంది దళారులకు వరంగా మారుతున్నాయి. నిరుద్యోగుల అమాయకత్వం, ఎలాగైనా ఉద్యోగం సంపాదించాలన్న ఆశ బ్రోకర్లకు కాసుల వర్షం కురిపిస్తోంది. రెగ్యులర్ ఉద్యోగాలకు ఓ రేటు, ఔట్సోర్సింగ్ ఉద్యోగాలకు మరో రేట్‌ను ఫిక్స్ చేసి మొదట పెద్ద మొత్తంలో అడ్వాన్స్‌గా వసూలు చేస్తున్నట్లు పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు వెల్లు వెత్తుతున్నాయి. ఇటీవల అటవీ శాఖ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్(ఎఫ్బీఓ), సెక్షన్ ఆఫీసర్, అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ జారీ చేయడమేగాక రాతపరీక్ష కూడా నిర్వహించింది. ఈ పరీక్షల్లో ఉత్తీర్ణులైన వారిని 1:3 నిష్పత్తిలో ఎంపిక చేసి వారికి మెడికల్ టెస్ట్‌లు, ఇతర ఈవెంట్లకు అర్హులుగా నిర్ధారించింది. రాతపరీక్ష నెగ్గి ఈ పరీక్షల కోసం వేచి చూస్తున్న వారిలో చాలామంది దళారుల బారినపడినట్లు తెలిసింది. ఎలాగూ రాత పరీక్ష నెగ్గినందున ఎన్ని డబ్బులు పెట్టయినా కొలువు సంపాదించుకుందామని ఆశపడుతున్న వారు దళారుల వలలో చిక్కుకుంటున్నారు. దళారులకు సంబంధిత శాఖలో ఒకరిద్దరు అధికారులతో పరిచయాలు ఉండడం, అధికార పార్టీ నాయకుల అండదండలు ఉండడంతో వారిని నిరుద్యోగులు నమ్ముతూ లక్షలాది రూపాయలు చెల్లించుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది. అలాగే వైద్య, ఆరోగ్యశాఖ, మహిళా శిశు సంక్షేమ శాఖల్లో కూడా ఇటీవల కాంట్రాక్ట్ ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్లు జారీ అయ్యాయి. ఇందులోనూ దళారులు రంగ ప్రవేశం చేసి నిరుద్యోగులకు వల విసిరినట్లు తెలిసింది. దీనికి తో డు ఇటీవల వివిధ శాఖల్లో జరుగుతున్న ఔట్సో ర్సింగ్ ఉద్యోగ నియామకాల వ్యవహారంపై పెద్ద ఎత్తున ఆరోపణలున్నాయి. హైదరాబాద్‌కు చెంది న కొన్ని ఔట్సోర్సింగ్ ఏజెన్సీలు తమకున్న రాజకీయ పలుకుబడితో గుట్టుచప్పుడు కాకుండా నియామకాలు చేస్తున్నాయి. వీరు ఆయా ప్రాంతాల్లోని తమ ఏజెంట్ల ద్వారా అభ్యర్థులను నియమించి వారి నుంచి లక్షలాది రూపాయలు వసూలు చేస్తున్నట్లు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. రైల్వేలో కొలువులపై... రెగ్యులర్ ప్రాతిపదికన రైల్వేశాఖలో భర్తీ చేయబోతున్న ఏఎల్పీ, టెక్నీషియన్, గ్రూప్–డీ ఉద్యోగాల కోసం నిరుద్యోగుల నుంచి పోటీ తీవ్రంగా ఉంది. ఇటీవల రాత పరీక్షలు ప్రారంభం కావడంతో ఫలితాలు అనుకూలంగా రావడం కోసం పైరవీలు చేస్తామంటూ దళారులు అక్రమంగా డబ్బులు వసూలు చేస్తున్నారు. ఒక్కో పోస్టుకు దాదాపు రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు ఒప్పందం కుదుర్చుకొని అడ్వాన్స్‌గా రూ.2 లక్షలు లేదా రూ.3 లక్షలు తీసుకుంటున్నట్లు ప్రచారం. నియామక ప్రక్రియ పకడ్బందీగా జరుగుతున్నప్పటికీ అభ్యర్థుల అత్యాశ, దళారుల మాయమాటల కారణంగా చెల్లింపులు జరుగుతున్నాయంటున్నారు. ఔట్సోర్సింగ్, అంగన్వాడీ కొలువులకు.. వివిధ శాఖల్లో ఔట్సోర్సింగ్ పద్ధతిలో భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు లక్షలాది రూపాయలు డిమాండ్ ఉంది. ఇటీవల వివిధ శాఖల్లో ఉద్యోగాలను భర్తీచేయడానికి కొన్ని ఏజెన్సీలు నిరుద్యోగుల నుంచి లక్షలాది రూపాయలు వసూలు చేసి భర్తీ చేస్తున్నట్లు ఫిర్యాదులు ఉన్నాయి. నిబంధనల ప్రకారం నోటిఫికేషన్లుగానీ, రోస్టర్ విధానం అమలు చేయకుండా ఈ సంస్థలు రహస్యంగా భర్తీ వ్యవహారాలు నడుపుతున్నాయి. అంగన్వాడీ టీచర్లు, ఆయా పోస్టుల భర్తీకి అభ్యర్థుల దరఖాస్తుల పరిశీలన పూర్తికావడంతో తమకు ప్రభుత్వ పెద్దల అండ ఉందని చెబుతూ కొందరు దళారులు అమాయకులను వంచిస్తున్నారు. టీచర్ పోస్టుకు రూ.లక్ష, ఆయా పోస్టుకు రూ.50 వేల చొప్పున ఇప్పటికే కొందరు వసూలు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఇంతపెద్ద ఎత్తున దళారులు సాగిస్తున్న ఈ అక్రమ వ్యవహారాలపై సంబంధిత శాఖల అధికారులు ఇప్పటికైనా దృష్టిసారించి అమాయకులు నష్టపోకుండా చూడాలని ప్రజలు కోరుతున్నారు. ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటాం.. నిరుద్యోగులను ఉద్యోగాల పేరుతో నమ్మించి మోసం చేసే వ్యక్తులపట్ల అందరూ అప్రమత్తంగా ఉండాలి. పారదర్శకంగా ఉద్యోగాల నియామకాల ప్రక్రియ జరుగుతున్నందున దళారులను ఆశ్రయించి మోసపోవద్దు. అలాగే పోలీస్ స్టేషన్లో నిర్దిష్ట ఆధారాలతో ఫిర్యాదు చేస్తే కేసులు నమోదు చేసి విచారణ జరుపుతాం. – సీహెచ్.అజయ్, సీఐ, కాజీపేట -
ఉద్యోగాల పేరుతో భారీ మోసం
సాక్షి, కరీంనగర్ : ఉద్యోగాలు ఇప్పిస్తామని లక్షలాది రూపాయలు వసూలు చేసి మోసం చేసిన ముఠాను చొప్పదండి పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కరీంనగర్, వరంగల్, సిద్దిపేట జిల్లాలకు చెందిన దాదాపు 40 మందికి ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి వారి నుంచి సుమారు 85 లక్షలు వరకు వసూలు చేశారు. అనంతరం వారికి ఉద్యోగాలు ఇప్పించకుండా మోసం చేసి పారిపోయారు. దీంతో బాధితులు ఆ ముఠా సభ్యులపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ముఠాకు చెందిన ముగ్గురిని అరెస్ట్ చేశారు. మరో నలుగురు పరారీలో ఉన్నట్లు పోలీసులు పేర్కొన్నారు. పట్టుబడిన నిందితుల నుంచి నకిలీ రబ్బర్ స్టాంపులు, బాండ్‌పేపర్లు, నాలుగు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు సీపీ కమల్ హాసన్‌రెడ్డి పేర్కొన్నారు.