Gopalapet
-
వ్యక్తి బలవన్మరణం
– ఆర్థిక ఇబ్బందులే కారణం – గౌరిదేవిపల్లిలో విషాదఛాయలు – వీధినపడిన కుటుంబ సభ్యులు వారిది రెక్కాడితేగాని డొక్కాడని పరిస్థితి.. వలస వెళ్లినా కుటుంబ పోషణతోపాటు ఇంటి నిర్మాణానికి చేసిన అప్పులు తీరలేదు.. ఆర్థిక ఇబ్బందులతో జీవితంపై విరక్తి చెంది కుటుంబ యజమాని బలవన్మరణానికి పాల్పడ్డాడు.. దీంతో భార్యాపిల్లలు వీధినపడగా గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. గోపాల్పేట : మండలంలోని గౌరిదేవిపల్లికి చెందిన యాతం నాగరాజు (32), రేణుక దంపతులు స్థానికంగా ఉపాధి కరువై వలస వెళ్లేవారు. వీరికి ఆరేళ్ల కూతురు శ్రావణి, ఐదేళ్ల రాధిక, ఏడు నెలల కొడుకు పద్మశ్రీ ఉన్నారు. వద్ధాప్యంలో ఉన్న తండ్రి చిన్న హన్మంతును కూడా వీరే పోషిస్తున్నారు. మూడేళ్ల క్రితం అప్పులు చేసి ఇంటిని నిర్మించుకున్న వారు ఏడాది క్రితం స్వగ్రామానికి వచ్చారు. అప్పటి నుంచి నాగపూర్‌లోని పైపుల కంపెనీలో భర్త కూలీగా పని చేస్తున్నాడు. తమకున్న 16గుంటల భూమిని అమ్మినా అప్పులు తీరక వడ్డీలు పెరిగిపోయాయి. దీంతో మనస్తాపానికి గురైన అతను శనివారం అర్ధరాత్రి ఇంట్లోనే ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. మంటలకు తాళలేక కేకలు వేయడంతో మేల్కొన్న భార్య, చుట్టుపక్కలవారు ఆర్పడానికి యత్నించగా అప్పటికే మరణించాడు. ఈ ఘటనపై ఆదివారం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సంఘటన స్థలాన్ని ఎస్ఐ సైదులుగౌడ్ పరిశీలించి కేసు దర్యాప్తు జరుపుతున్నారు. అనంతరం అక్కడే వైద్యులతో పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఈ సంఘటనతో బాధిత భార్యాపిల్లలు వీధిపడ్డారని ప్రభుత్వమే ఆదుకోవాలని సర్పంచ్ పాపులు, ఎంపీటీసీ సభ్యుడు రఘుయాదవ్ కోరారు. -
130 మందికి కంటి పరీక్షలు
గోపాల్పేట: స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో బుధవారం ఉదయం జిల్లా అంధత్వ నియంత్రణ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. శిబిరంలో 130 మందికి కంటి పరీక్షలు చేసినట్లు డాక్టర్ ఇస్మాయిల్ తెలిపారు. 23 మందికి కంటి పొరలు ఉన్నట్లు గుర్తించినట్లు ఆప్తాలమిక్ ఆఫీసర్ యుగేంధర్‌ప్రసాద్ తెలిపారు. వీరికి జిల్లా కంటి ఆసుపత్రిలో ఆపరేషన్లు చేయిస్తున్నట్లు చెప్పారు. శిబిరంలో హెల్త్ సూపర్వైజర్ నిరంజన్, స్టాఫ్‌నర్సు శిలివియా, ఫార్మాసిస్టు కవిత, ఏఎన్ఎం పద్మ, జయసుధ, ల్యాబ్ టెక్నిషీయర్ లక్ష్మీకాంత్‌రెడ్డి, గ్రేసీ నర్సింగ్ స్కూల్ ట్రైనీ ఏఎన్ఎంలు తదితరులు పాల్గొన్నారు. -
'ఇంటికో ఉద్యోగం ఇస్తే భూములు ఇస్తాం'
గోపాలపేట (మహబూబ్‌నగర్) : ఇంటికో ఉద్యోగం, ఎకరానికి రూ.15 లక్షలు ఇస్తేనే భూ సేకరణకు సహకరిస్తామని పాలమూరు ప్రాంత రైతులు అంటున్నారు. పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా గోపాల పేట మండలంలో రిజర్వాయర్ నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ప్రస్తుతం ప్రభుత్వం ప్రకటించిన ప్యాకేజీకి భూములు ఇవ్వమని రైతులు తేల్చి చెప్పారు. ఇంటికో ఉద్యోగం, ఎకరానికి రూ. 15 లక్షలు, ఇల్లు కోల్పోతున్న వారికి కొత్త గృహం మంజూరు చేస్తేనే భూములు ఇస్తామని రైతులు పేర్కొన్నారు.