విషాదవదనంలో భార్యాపిల్లలు
వ్యక్తి బలవన్మరణం
Published Sun, Aug 7 2016 10:48 PM | Last Updated on Tue, Oct 9 2018 5:39 PM
– ఆర్థిక ఇబ్బందులే కారణం
– గౌరిదేవిపల్లిలో విషాదఛాయలు
– వీధినపడిన కుటుంబ సభ్యులు
వారిది రెక్కాడితేగాని డొక్కాడని పరిస్థితి.. వలస వెళ్లినా కుటుంబ పోషణతోపాటు ఇంటి నిర్మాణానికి చేసిన అప్పులు తీరలేదు.. ఆర్థిక ఇబ్బందులతో జీవితంపై విరక్తి చెంది కుటుంబ యజమాని బలవన్మరణానికి పాల్పడ్డాడు.. దీంతో భార్యాపిల్లలు వీధినపడగా గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
గోపాల్‌పేట : మండలంలోని గౌరిదేవిపల్లికి చెందిన యాతం నాగరాజు (32), రేణుక దంపతులు స్థానికంగా ఉపాధి కరువై వలస వెళ్లేవారు. వీరికి ఆరేళ్ల కూతురు శ్రావణి, ఐదేళ్ల రాధిక, ఏడు నెలల కొడుకు పద్మశ్రీ ఉన్నారు. వద్ధాప్యంలో ఉన్న తండ్రి చిన్న హన్మంతును కూడా వీరే పోషిస్తున్నారు. మూడేళ్ల క్రితం అప్పులు చేసి ఇంటిని నిర్మించుకున్న వారు ఏడాది క్రితం స్వగ్రామానికి వచ్చారు. అప్పటి నుంచి నాగపూర్‌లోని పైపుల కంపెనీలో భర్త కూలీగా పని చేస్తున్నాడు. తమకున్న 16గుంటల భూమిని అమ్మినా అప్పులు తీరక వడ్డీలు పెరిగిపోయాయి. దీంతో మనస్తాపానికి గురైన అతను శనివారం అర్ధరాత్రి ఇంట్లోనే ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. మంటలకు తాళలేక కేకలు వేయడంతో మేల్కొన్న భార్య, చుట్టుపక్కలవారు ఆర్పడానికి యత్నించగా అప్పటికే మరణించాడు. ఈ ఘటనపై ఆదివారం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సంఘటన స్థలాన్ని ఎస్‌ఐ సైదులుగౌడ్ పరిశీలించి కేసు దర్యాప్తు జరుపుతున్నారు. అనంతరం అక్కడే వైద్యులతో పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఈ సంఘటనతో బాధిత భార్యాపిల్లలు వీధిపడ్డారని ప్రభుత్వమే ఆదుకోవాలని సర్పంచ్ పాపులు, ఎంపీటీసీ సభ్యుడు రఘుయాదవ్ కోరారు.
Advertisement