Harbour line
-
కింగ్స్ సర్కిల్ స్టేషన్‌ను దత్తతివ్వండి..
సెంట్రల్ రైల్వేకు స్థానికుల వినతి సాక్షి, ముంబై: హార్బర్‌లైన్ మార్గంలోని కింగ్స్ సర్కిల్ రైల్వేస్టేషన్‌ను దత్తత తీసుకొనేందుకుగాను సెంట్రల్ రైల్వేకు స్థానికులు ఓ ప్రతిపాదనను సమర్పించారు. ఒకవేళ సెంట్రల్ రైల్వే ఇందుకు అంగీకరిస్తే ముంబై సబర్బన్ నెట్‌వర్క్‌లోనే నగర వాసులు దత్తత తీసుకున్న మొదటి స్టేషన్‌గా ఇది పేరు గాంచనుంది. రైల్వే స్టేషన్‌కు సమీపంలో ఉన్న వారు ఈ స్టేషన్‌ను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుతామ, మౌలిక సదుపాయాల నిర్వహణ బాధ్యతలు చేపడతామని సెంట్రల్ రైల్వేకు ప్రతిపాదన సమర్పించారు. ఈ సందర్భంగా స్టేషన్‌కు సమీపంలో నివాసముంటున్న గౌరంగ్ దమానీ మాట్లాడుతూ... ఈ స్టేషన్ పరిశుభ్రత విషయమై తాము జవాబుదారిగా ఉంటామని ఇందుకు అనుమతిని ఇవ్వాల్సిందిగా సెంట్రల్ రైల్వేకు ఓ లేఖ సమర్పించామన్నారు. ఈ సందర్భంగా సెంట్రల్ రైల్వే చీఫ్ పీఆర్వో నరేంద్ర పాటిల్ మాట్లాడుతూ.. స్థానికులు స్వచ్ఛందంగా రైల్వేస్టేషన్ దత్తత తీసుకునేందుకు ముందుకు వచ్చారని, వారు ప్రకటనల ద్వారా వచ్చే ఆదాయం కోసం ఆశించడం లేదని తెలిపారు. తాము ఈ ప్రతిపాదనను పూర్తిగా అధ్యయనం చేశామని చెప్పారు. ఈ స్టేషన్‌ను ఎలవేటెడ్‌గా నిర్మించారు. అయితే ఈ స్టేషన్‌కు రెండు ద్వారాలు ఉన్నాయి. ఒకటి గాంధీ మార్కెట్ వద్ద ఉండగా, మరొకటి ఎస్ఐఈఎస్ పాఠశాల వద్ద ఉంది. రైల్వే ప్లాన్ ప్రకారం.. దేశవ్యాప్తంగా 50 రైల్వే స్టేషన్లను అభివృద్ధి చేయనున్నారు. అందులో ముంబై సెంట్రల్, ఛత్రపతి శివాజీ టర్మినస్ (సీఎస్టీ) కూడా ఉన్నాయి. ఇందుకు గాను రైల్వే బోర్డు ఇటీవల ప్రైవేట్ సంస్థలను కలిసి పబ్లిక్-ప్రైవేట్ భాగస్వామ్యులుగా రైల్వే స్టేషన్లను నిర్వహించాలని చర్చించింది. అంతేకాకుండా ఒక్కో రైల్వే స్టేషన్‌కు గాను ఇండియన్ రైల్వే రూ.5 కోట్ల నుంచి 15 కోట్ల వరకు ఖర్చు చేసేందుకు నిర్ణయించింది. రైల్వే స్టేషన్ల ఆవరణలు, రైల్వే ట్రాక్స్, మరుగుదొడ్లు, విశ్రాంతి, వెయిటింగ్ రూమ్స్‌తోపాటు బుకింగ్, కార్ పార్కింగ్‌లను కూడా పరిశుభ్రపర్చాలని ప్రైవేట్ కాంట్రాక్టర్లను రైల్వే కోరింది. ఇదిలా ఉండగా, రెండేళ్ల కిందట ప్రకటనల హక్కు కింద రైల్వే స్టేషన్లను దత్తత తీసుకోవాలని సెంట్రల్ రైల్వే అధికారులు ప్రైవేట్ సంస్థలను కోరారు. కానీ ఆ ప్రయోగం ఫలించలేదు. -
హార్బర్ లైన్లో ఆధునికీకరణ పనులు
సాక్షి, ముంబై : నగరంలో రైల్వేస్టేషన్లలల్లో ఆధునికీకరణ పనులు చేపట్టడానికి, ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడానికి అధికారులు కృషి చేస్తున్నారు. ఇందులో భాగాంగా హర్బర్ లైన్ మార్గంలో త్వరలో లిఫ్టులు, ఎస్కలేటర్లు, ఫుట్ ఓవర్ బ్రిడ్జ్‌లను నిర్మించాలని నిర్ణయించారు. డాక్‌యార్డ్ రోడ్, వడాలా, మాన్‌కుర్ద్, రేరోడ్, చెంబూర్, కింగ్స్సర్కిల్లల్లో 11 లిఫ్టులు, ఆరు ఫుట్ ఓవర్ బ్రిడ్జిల కోసం ప్రతిపాదనను తయారు చేశారు. ఈ నిర్మాణాల కోసం కాంట్రాక్టుకు ఇవ్వనున్నారు. ఈ ప్రాజెక్టు మార్చి 2015 వరకు పూర్తి అవుతోందని సంబంధిత అధికారి ఒకరు తెలిపారు. చెంబూర్, కింగ్స్ సర్కిల్ వద్ద ఇప్పటికే పనులు ప్రారంభించారు. అన్ని స్టేషన్లలో ఈ పనులు పూర్తి అయితే ప్రయాణికులు ఫ్లాట్‌ఫాంలకు వెళ్లడానికి సులభమవుతుంది. అంతేకాకుండా ప్రమాదాల నివారణకు తోడ్పడుతోంది. అన్ని స్టేషన్లలో సర్వే హర్బర్ మార్గాంలో రోజుకు 10 లక్షల మంది ప్రయాణికులు రాకపోకలు కొనసాగిస్తారు. ఈ మార్గంలో గల అన్ని రైల్వే స్టేషన్ల సర్వే నిర్వహించారు. ఈ స్టేషన్లలో ప్రయాణికుల అవసరాల మేరకు సదుపాయాలను నవీకరిస్తున్నామని ముంబై రైల్వే వికాస్ కార్పోరేషన్ మేనేజింగ్ డెరైక్టర్ చెర్మైన్ రాకేష్ సక్సేనా తెలిపారు. ఒక్కో లిఫ్టుకు రూ.20 లక్షలు ఖర్చు అవుతాయి. ఎస్కలేటర్లకు రూ.ఒక్క కోటి ఖర్చు అవుతోందని అధికారి తెలిపారు. చెంబూర్‌లో చాలా మంది ప్రయాణికులు రైలు పట్టాలను దాటుతుంటారు. లిఫ్టులను ఏర్పాటు చేయడం ద్వారా వీరిని కొంత మేర అరికట్టవచ్చని తెలిపారు. రద్దీ స్టేషన్లలో..: హర్బర్ మార్గంలో వడాలా రైల్వే స్టేషన్ చాలా రద్దీ గల స్టేషన్. ఈ స్టేషన్ పన్వేల్-సీఎస్టీ హర్బర్ లైన్ నుంచి సీఎస్టీ-అంధేరి లైన్‌ను కలుపనుంది. ఈ స్టేషన్లో మూడు ఎస్కలేటర్లను ఏర్పాటు చేయనున్నారు. మూడు లిఫ్టులు, ప్లాట్‌ఫాం మధ్యలో ఫుట్ ఓవర్ బ్రిడ్జిని నిర్మించనున్నారు. మాన్కూర్డ్ స్టేషన్లో అదనంగా ఫుట్ ఓవర్ బ్రిడ్జిని నిర్మించనున్నారు. ఇక్కడ రెండు లిఫ్టులు, ఒక ఎస్కలేటర్‌ను ఏర్పాటు చేయనున్నారు.