పసిపిల్లల మాంసం తినిపించారు
ఐసిస్ చెర నుంచి బయటపడ్డ ఫాజియా సిడో అనే మహిళ భయంకరమైన విషయాలు వెల్లడించింది. తనతో పాటు ఇతర ఖైదీలతో పసి పిల్లల మాంసం తినిపించారని తెలిపింది! 2014లో ఇరాక్‌లోని సింజార్‌లో దాడి చేసిన ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు సిడోను ఆమె ఇంటి నుంచి ఎత్తుకెళ్లారు. అప్పటికి ఆమెకు 11 ఏళ్లు. ‘‘తీసుకెళ్లాక మమ్మల్ని రోజుల తరబడి ఆకలితో ఉంచారు. తర్వాత అన్నం, మాంసంతో కూడిన భోజనం ఇచ్చారు. చాలా ఆకలితో ఉన్నందున వింత రుచి ఉన్నప్పటికీ తిన్నాం. తర్వాత అంతా అస్వస్థతకు గురయ్యాం. మేం తిన్నది పసి పిల్లల మాంసమని ఆ తర్వాత ఐఎస్ ఉగ్రవాదులు బయటపెట్టారు. యజిదీ పిల్లల మాంసమని చెప్పారు. తలలు నరికిన చిన్నారుల ఫొటోలు చూపించి, ‘ఇప్పుడు మీరు తిన్న మాంసం ఈ పిల్లలదే’ అని చెప్పారు. అది విని మాకు మతిపోయింది. ఓ మహిళ హార్ట్ ఫెయిల్యూర్‌తో మృతి చెందారు. ఓ తల్లి ఆ ఫొటోల్లో తన బిడ్డను గుర్తించి గుండె పగిలేలా ఏడ్చారు’’ అంటూ ఆ భయానక క్షణాలను గుర్తు చేసుకున్నారు. ఐసిస్ తమ బందీలకు మనుషుల మాంసం తినిపించిందని గతంలో వచి్చన ఆరోపణలను సిడో కథనం ధ్రువీకరించింది. ఈ విషయాన్ని 2017లో యాజిదీ పార్లమెంటేరియన్ వియాన్ దఖిల్ తొలిసారి వెలుగులోకి తెచ్చారు. ఇంకా ఐసిస్ చెరలోనే... 2014లో ఉత్తర ఇరాక్‌లో మైనారిటీలైన వేలాదిమంది యాజిదీ మహిళలు, చిన్నారులను ఐసిస్ కిడ్నాప్ చేసింది. వారిలో సిడో ఒకరు. మరో 200 మంది యాజిదీ మహిళలు, పిల్లలతో కలిసి అండర్ గ్రౌండ్ జైలులో తొమ్మిది నెలల పాటు బందీగా ఉన్నారు. కలుíÙత నీటితో కొందరు చిన్నారులు మృతి చెందారు. సిడోను అబూ అమర్ అల్–మక్దీసీతో సహా అనేక మంది జిహాదీ ఫైటర్లకు విక్రయించారు. ఆమెతోపాటు చాలా మందిని బానిసలుగా అమ్మారు. ఏళ్ల తరబడి హింస, దోపిడీ తర్వాత ఇజ్రాయెల్, అమెరికా, ఇరాక్ రహస్య మిషన్ వల్ల ఆమె చెర నుంచి సిడో బయటపడ్డారు. తరువాత ఆమెను ఇజ్రాయెల్‌లోని కెరెమ్ షాలోమ్ క్రాసింగ్‌కు పంపారు. అక్కడినుంచి జోర్డాన్‌కు ప్రయాణించి చివరికి ఇరాక్‌లోని తన కుటుంబాన్ని తిరిగి కలుసుకున్నారు. సిడో ప్రస్తుతం సురక్షితంగా ఉన్నప్పటికీ దశాబ్ద కాలం బందీగా ఉన్నప్పటి మానసిక గాయాలు తీవ్రంగా ఉన్నాయని ఆమె న్యాయవాది తెలిపారు. 2014 యాజిడీ మారణహోమం నుంచి 3,500 మందికి పైగా యాజిదీలను రక్షించారు. సుమారు 2,600 మంది గల్లంతయ్యారు. – సాక్షి, నేషనల్ డెస్క్