ప్రత్యేక మున్సిపల్ కేడర్ ఉంటేనే జేఎన్ఎన్యూఆర్ఎం నిధులు
న్యూఢిల్లీ: రాష్ట్రాల్లోని మున్సిపాలిటీల్లో పాలన, పనులకు ప్రత్యేకంగా మున్సిపల్ కేడర్ (సిబ్బంది) ఉంటేనే ‘జవహర్లాల్ నెహ్రూ జాతీయ పట్టణ నవీకరణ’ పథకం కింద నిధులు ఇచ్చేలా కేంద్ర ప్రభుత్వం నిబంధనలు విధించనుంది. ఢిల్లీలో సోమవారం జరిగిన ‘ఇన్నోవేషన్స్ ఆఫ్ అర్బన్ గవర్నెన్స్’ సదస్సులో కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ మంత్రి కమల్నాథ్ మాట్లాడారు.‘‘దేశంలో పట్టణాలు వేగంగా విస్తరిస్తున్నాయి. అలాంటి పరిస్థితుల్లో భూమిని, వనరులను సమర్థవంతంగా వినియోగించగల అధికారులు, సిబ్బంది కావాలి. ప్రస్తుతం కొందరు ఉద్యోగులకు పట్టణ పాలనలో శిక్షణ ఇచ్చి వినియోగించుకోవచ్చు. కానీ, వారు కొద్దికాలం తర్వాత వేరే శాఖలకు బదిలీ కావొచ్చు. లేక వారే వెళ్లిపోవచ్చు. అందువల్ల మున్సిపల్ పాలనకు సంబంధించి ప్రత్యేక కేడర్ ఉంటేనే జేఎన్ఎన్యూఆర్ఎం నిధులు మంజూరు చేసేలా నిబంధన అమలుచేయనున్నాం’’ అని కమల్నాథ్ తెలిపారు.
మేయర్లకు మరిన్ని అధికారాలు..
పట్టణాల పాలనాధికారులకు సరైన అధికారాలు లేనందున సమస్యలు వస్తున్నాయని, దేశవ్యాప్తంగా మేయర్లు పాలనా సమస్యలు ఎదుర్కొంటున్నారని ప్రధాని సలహాదారు శ్యామ్ పిట్రొడా పేర్కొన్నారు. అందువల్ల మేయర్లకు మరిన్ని అధికారాలు ఇవ్వాలని అభిప్రాయపడ్డారు. పట్టణాలకు సంబంధించిన నిర్ణయాలన్నీ రాష్ట్ర ప్రభుత్వాలే తీసుకుంటున్నాయని, స్థానిక ప్రభుత్వాలకు అసలు భాగస్వామ్యమే ఉండడం లేదని ప్రధాని కార్యదర్శి ఆర్.రామానుజం వ్యాఖ్యానించారు.