గ్రేటర్ ఆర్టీసీకి మరో 150 కొత్త బస్సులు
సాక్షి,సిటీబ్యూరో: హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్‌ను పెంచే లక్ష్యంతో మరో 150 కొత్త మెట్రో డీలక్స్ బస్సులకు ప్రభుత్వం ఈ బడ్జెట్‌లో నిధులు కేటాయించింది. తెలంగాణ రాష్ట్రంలో రూ.345 కోట్లతో బస్సుల కొనుగోళ్లు, ఇతర సదుపాయాలు కల్పించనున్నట్లు ప్రకటించింది. ఇందులో నగరానికి సంబంధించి ఇప్పటికే రూ.80 కోట్లతో 80 వోల్వో బస్సులను అందజేసినట్లు పేర్కొంది. అలాగే జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎం నిధులతో మరో 150 కొత్త బస్సులను కొనుగోలు చేసేందుకు రాష్ర్టం తన వాటాగా అందజేయవలసిన నిధులను ఈ బడ్జెట్‌లో కేటాయించింది.
నగరం ఒకవైపు అనూహ్యంగా విస్తరిస్తోంది. కొత్త కొత్త కాలనీలు వెలుస్తున్నాయి. ఈ క్రమంలో ప్రస్తుతం ఉన్న 3850 బస్సులు ఏ మాత్రం చాలడం లేదు. మరో 1000 బస్సుల కోసం డిమాండ్ ఉండగా, ప్రభుత్వం 150 బస్సుల కోసం మాత్రమే నిధులను అందజేయనున్నట్లు పేర్కొంది. ప్రస్తుతం 34 లక్షల మంది ప్రయాణికులు ఆర్టీసీ సేవలను వినియోగించుకుంటుండగా, సమీప భవిష్యత్తులో మరో 10 లక్షల మంది ప్రయాణికులు పెరిగే అవకాశం ఉంది. ఇందుకు తగిన విధంగా బస్సుల సంఖ్యను పెంచాల్సి ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.