Kabir Khan
-
నాలుగేళ్ల లవ్‌కు బ్రేకప్.. సినిమాకు ఒప్పుకోరేమోనని టెన్షన్!
ప్రేమలో ఉన్నంతసేపు ఒకరిని విడిచి మరొకరు ఉండలేమంటారు. బ్రేకప్ అయ్యాక ముఖం చూడటానికి కూడా ఇష్టపడరు. కానీ ఇక్కడ చెప్పుకునే జంట మాత్రం చాలా ప్రొఫెషనల్. సినిమా కోసం పర్సనల్ విషయాలను పక్కనపెట్టి కలిసిపోయారు, కేవలం సెట్స్‌లోనే! సల్మాన్ ఖాన్, కత్రినా కైఫ్ ఒకప్పుడు ప్రేమపక్షులన్న విషయం తెలిసిందే! అయితే సల్మాన్ ఎంతోమందితో ప్రేమాయణం నడిపాడు, కానీ ఏదీ సక్సెస్ కాలేదు. అలాగే కత్రినాతో నడిపిన ప్రేమ వ్యవహారం కూడా మూణ్నాళ్ల ముచ్చటగానే మారింది. కొంతకాలానికే ఇద్దరూ బ్రేకప్ చెప్పుకున్నారు. అసౌకర్యంగా ఉంటుంది అది జరిగిన కొంతకాలానికే డైరెక్టర్ కబీర్ ఖాన్ 'ఏక్ థా టైగర్' సినిమాను పట్టాలెక్కించే పనిలో పడ్డాడు. కానీ ఈ లవ్ బర్డ్స్ బ్రేకప్ వల్ల ఇద్దరూ సినిమాలో నటించేందుకు ఒప్పుకుంటారో, లేదోనని తెగ టెన్షన్ పడ్డాడు. దాని గురించి అతడు తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. 'కత్రినా, నాకు ఇంట్లో మనిషిలా అనిపిస్తుంది. సినిమా గురించి చెప్పగానే వెంటనే సంతకం చేసింది. తర్వాత సల్మాన్ ఖాన్ ఇంటికి వెళ్లాం. అసలే బ్రేకప్ అయింది. అలాంటి సమయంలో కలిసి పని చేయాలంటే ఎంతో అసౌకర్యంగా ఉంటుంది. కత్రినా అని తెలిసి కూడా ఆయన ఒప్పుకుంటాడో, లేదోనని టెన్షన్ పడుతూనే తన ఇంటికి వెళ్లాం. హీరోయిన్గా కత్రినాను సెలక్ట్ చేశాం అని చెప్పాను. 5-10 నిమిషాలు మౌనంగా ఉన్న తర్వాత సరే చేసేద్దాం అన్నారు. మా గుండె నుంచి పెద్ద భారం దిగిపోయినట్లనిపించింది' అని చెప్పుకొచ్చాడు. కాగా సల్మాన్- కత్రినా నాలుగేళ్లపాటు డేటింగ్ చేశారు. 2009లో విడిపోయారు. తర్వాత కత్రినా రణ్‌బీర్ కపూర్‌తో ప్రేమలో పడింది. కానీ ఈ బంధం కూడా నిలవలేదు. వీళ్లిద్దరూ బ్రేకప్ చెప్పుకున్నాక విక్కీ కౌశల్‌ను లవ్ చేసింది. 2021లో వీరు పెళ్లి చేసుకున్నారు. చదవండి: పదేళ్ల క్రితం ఆశపడ్డాడు.. చివరికి అది నెరవేరకుండానే.. -
ఏకంగా తొమ్మిది చిత్రాలు.. ఆ దర్శకుల్లో టాప్ ఎవరంటే.. రాజమౌళి మాత్రం!
ఒక సినిమా వందకోట్లు కలెక్షన్స్ రావడమంటే అంతా ఈజీ కాదు. స్టార్ హీరోల సినిమాలకైతే వాళ్ల క్రేజ్‌ను బట్టి వసూళ్లు రాబట్టడం జరుగుతూ ఉంటోంది. ఇక హీరోల సంగతి పక్కన పెడితే.. దర్శకుడే సినిమాకు ప్రధాన బలం. వారి కథ, స్క్రీన్ ప్లేను బట్టి సినిమా హిట్టా, ఫ్లాపా అనే టాక్ తెచ్చుకోవడంపై ఆధారపడి ఉంటుంది. అదే కాకుండా కంటెంట్ ఉంటే చిన్న సినిమా అయినా సరే బాక్సాఫీస్ వద్ద వందకోట్లు కొల్లగొట్టడం చూస్తుంటాం. కానీ ఓకే దర్శకుడి తెరకెక్కించిన తొమ్మిదికి పైగా చిత్రాలు వంద కోట్లు రాబట్టమంటే మామూలు విషయం కాదు. అలాంటి అరుదైన ఘనత సాధించిన దర్శకధీరుడి గురించి తెలుసుకుందాం. తొమ్మిది చిత్రాల దర్శకుడు 2000ల మధ్యకాలంలో భారతీయ సినిమాలు.. దేశీయ కలెక్షన్లతో వందకోట్ల మార్కు చేరుకున్న సినిమాలుగా గుర్తించారు. ఆ తర్వాత దేశవ్యాప్తం కలెక్షన్లతో పాటు ప్రపంచవ్యాప్తంగా రూ. 100 కోట్లు దాటిన సినిమాలను వంద కోట్ల క్లబ్లో చేర్చారు. చాలా మంది హీరోల సినిమాలు రూ.100 కోట్ల క్లబ్లో చేరాయి. కానీ వందకోట్ల వసూళ్లు సాధించిన సినిమాలు నిర్మించిన దర్శకుల సంఖ్య మాత్రం ఇలా వేళ్లమీదే లెక్కపెట్టొచ్చు. ఇలాంటి అరుదైన మైలురాయిని అందుకున్న దర్శకుల్లో రోహిత్ శెట్టి ఒకరు. ఆయన నిర్మించిన తొమ్మిది చిత్రాలు ప్రపంచవ్యాప్తంగా రూ.100 కోట్లు వసూళ్లు సాధించాయి. అత్యధికంగా రూ.100 కోట్ల వసూళ్లు సాధించిన సినిమాలు తీసిన భారతీయ దర్శకుడిగా పేరు సంపాదించారు. గోల్మాల్ 3తో మొదలై.. గోల్మాల్ 3 చిత్రంతో మొదలైన రోహిత్ ప్రభంజనం సూర్యవంశీ వరకు కొనసాగింది. అతను నిర్మించిన చిత్రాల్లో రూ. 423 కోట్ల కలెక్షన్స్‌తో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా చెన్నై ఎక్స్‌ప్రెస్ నిలిచింది. ఆ తర్వాత సింగం (రూ. 157 కోట్లు), బోల్ బచ్చన్ (రూ. 165 కోట్లు), సింగం రిటర్న్స్ (రూ. 219 కోట్లు), దిల్వాలే (రూ. 377 కోట్లు), గోల్మాల్ ఎగైన్ (రూ. 311 కోట్లు), సింబా (రూ. 400 కోట్లు) ఉన్నాయి. అయితే అయితే రోహిత్ శెట్టి తెరకెక్కించిన కొన్ని చిత్రాలు నిరాశపరిచనవి కూడా ఉన్నాయి. వాటిలో జమీన్ (రూ. 18 కోట్లు), సండే (రూ. 32 కోట్లు), సర్కస్ (రూ. 62 కోట్లు)తో రూ. 100 కోట్లు రాబట్టని లిస్ట్‌లో ఆరు సినిమాలు ఉన్నాయి. ప్రతి సినిమా 100 కోట్లే.. తన ప్రతి సినిమా 100 కోట్ల క్లబ్లో చేరిన ఘనత కరణ్ జోహార్ సొంతం. దిల్వాలే దుల్హనియా లే జాయేంగేలో ఆదిత్య చోప్రాకు అసిస్టెంట్‌గా తన ప్రయాణాన్ని ప్రారంభించిన చిత్రనిర్మాత, 1998లో కుచ్ కుచ్ హోతా హైతో దర్శకుడిగా మారారు. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ. 107 కోట్లను రాబట్టి.. ఆ సంవత్సరంలో అత్యధిక వసూళ్లు చేసిన భారతీయ చిత్రంగా నిలిచింది. ఆ తర్వాత కభీ ఖుషీ కభీ గమ్, కభీ అల్విదా నా కెహనా, మై నేమ్ ఈజ్ ఖాన్, స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్, ఏ దిల్ హై ముష్కిల్ రూ.100 కోట్లు దాటాయి. ఇటీవల విడుదలైన రాకీ ఔర్ రాణి కి ప్రేమ్ కహానీతో ఏడో చిత్రం కూడా ఈ లిస్ట్‌లో చేరిపోయింది.. రూ.100 కోట్ల చిత్రాల దర్శకులు వీళ్లే.. ప్రపంచవ్యాప్తంగా రూ. 100 కోట్లకు పైగా వసూలు సాధించిన దర్శకులు కూడా ఉన్నారు. డైరెక్టర్ శంకర్ తెరకెక్కించిన ఐదు చిత్రాలు ఈ లిస్ట్‌లో ఉన్నాయి. ఆ తర్వాత కబీర్ ఖాన్, రాజ్‌కుమార్ హిరానీ ఒక్కొక్కరు నాలుగు సినిమాలు ఉన్నాయి. దర్శకు ధీరుడి నాలుగు చిత్రాలు టాలీవుడ్ దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి రూ.100 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన చిత్రాలు నాలుగు ఉన్నాయి. వాటిలో మగధీర, బాహుబలి-1, బాహుబలి-2, ఆర్ఆర్ఆర్ ఉన్నాయి. అయితే రాజమౌళి తెరకెక్కించిన రెండు సినిమాలు మాత్రం రూ.1000 కోట్ల వసూళ్లను దాటేశాయి. ఈ ఘనత సాధించిన ఏకైక దర్శకుడిగా రాజమౌళి మాత్రమే నిలిచారు . -
అత్యంత ధనవంతులైన డైరెక్టర్ల లిస్ట్‌లో రాజమౌళి
భారతీయ చలనచిత్ర పరిశ్రమలో అత్యంత ధనవంతులైన దర్శకులు ఎవరో తెలుసా? స్క్రీన్‌పై అభిమానులకు వినోదాన్ని అందిస్తూ కోట్లు సంపాదించిన డైరెక్టర్లను వేళ్ల మీదే చెప్పొయొచ్చు. అలాంటి ఇండియాలో ధనవంతులైన దర్శకులెవరో ఓ లుక్కేద్దాం. జీక్యూ ఇండియా తాజాగా దర్శకుల జాబితాను ప్రకటించింది. సోషల్ మీడియా వేదికగా ఈ విషయాన్ని వెల్లడించింది. ఈ జాబితాలో టాలీవుడ్‌కు చెందిన ఎస్ఎస్ రాజమౌళి మాత్రమే ఉన్నారు. బాలీవుడ్ దర్శకుడు కరణ్ జోహార్ గురించి బాలీవుడ్‌తో పాటు దక్షిణాదిలో పరిచయం అక్కర్లేదు. సూపర్ హిట్ సినిమాలతో ఫేమస్ అయ్యారు. ఆయనకు దాదాపు రూ.1640 కోట్ల ఆస్తులతో మొదటిస్థానంలో ఉన్నారు. రెండోస్థానంలో రాజ్‌కుమార్ హిరాణీ రూ.1105 కోట్లతో నిలవగా.. రూ.940 కోట్లతో సంజయ్ లీలా భన్సాలీ మూడోస్థానం పొందారు. ఆ తర్వాత వరుసగా రూ.720 కోట్లతో అనురాగ్ కశ్యప్, రూ.300 కోట్లతో కబీర్ ఖాన్, రూ.280 కోట్లతో రోహిత్ శెట్టి, రూ.158 కోట్లతో ఎస్ఎస్ రాజమౌళి, రూ.76 కోట్లతో జోయా అక్తర్ నిలిచారు. View this post on Instagram A post shared by GQ India (@gqindia) -
'83' సినిమా రివ్యూ
టైటిల్: 83 నటీనటులు: రణ్వీర్ సింగ్, దీపికా పదుకొణె, పంకజ్ త్రిపాఠి, జీవా, హార్దీ సంధు, తాహీర్ భాసిన్, చిరాగ్ పాటిల్, సాకిబ్ సలీమ్ తదితరులు దర్శకుడు: కబీర్ ఖాన్ నిర్మాతలు: రణ్వీర్ సింగ్, దీపికా పదుకొణె, కబీర్ ఖాన్, విష్ణు వర్దన్ ఇందూరి, సాజిద్ నడియడ్వాలా, రిలియన్స్ ఎంటర్టైన్మెంట్, ఫాంటమ్ ఫిల్మ్స్ సినిమాటోగ్రఫీ అసీమ్ మిశ్రా ఎడిటింగ్ నితిన్ బెద్ సంగీతం: జూలియస్ పేకియం స్వరాలు: ప్రీతమ్ విడుదల: డిసెంబర్ 24, 2021 క్రికెట్‌ను గ్రౌండ్లో, టీవీల్లో చూసి ఎంజాయ్ చేయడమే కాదు సినిమాగా వెండితెరపై ఆవిష్కరించిన అంతే ఉత్సాహం చూపిస్తారు అభిమానులు. క్రికెట్.. అంటే కేవలం ఒక ఆట కాదు. ఎందరో అభిమానులకు అది ఒక ఎమోషన్. కుల మతాలకు అతీతంగా ప్రజలను ఏకం చేసిన మతం క్రికెట్. ఈ మతం 1983 భారత క్రికెట్ టీమ్ సాధించిన వరల్డ్ కప్‌తో పునాది వేసుకుందని చెప్పవచ్చు. కపిల్ దేవ్ పాత్రలో రణ్వీర్ సింగ్ నటించిన తాజా సినిమా '83'. ఈ సినిమాలో భారతదేశానికి తొలి ప్రపంచకప్ అందించిన కపిల్ దేవ్ నేతృత్వంలోని టీమిండియా జర్నీని వెండితెరపై ఆవిష్కరించారు. అప్పుడు జరిగిన మ్యాచ్‌ను కొంతమంది టీవీల్లో వీక్షించగా.. మరికొంతమంది రేడియోల్లో విన్నారు. టీమిండియా విజయాన్ని తమ గెలుపుగా భావించి సంబురాలు చేసుకున్నారు. తర్వాతి తరానికి 25 జూన్, 1983 ఒక చరిత్ర. ఆ చరిత్రను వెండితెరపై ఆవిష్కరించారు డైరెక్టర్ కబీర్ ఖాన్. మరీ ఈ రోజు విడుదలైన '83' సినిమా ఎలా ఉందంటే? కథ: 1983లో భారత్ వరల్డ్ కప్ గెలిచిన సంగతి తెలిసిందే. అప్పటివరకు ఇండియా టీమ్‌ను ఒక జట్టుగా కూడా చూడలేదు క్రికెట్ ప్రపంచం. అనేక అవమానాలు అడుగడునా ఎదుర్కొన్న భారత జట్టు వరల్డ్ కప్ ఫైనల్ వరకు ఎలా చేరింది. అప్పటికే రెండు సార్లు ప్రపంచకప్ గెలుచుకున్న వెస్టండీస్‌పై ఎలాంటి అంచనాలు లేని భారత్ గెలిచి వరల్డ్ కప్ ఎలా కొల్లగొట్టింది. ఈ క్రమంలో ఇండియన్ క్రికెటర్లకు కుటుంబ సభ్యులకు ఉన్న రిలేషన్ ఎలా ఉంది. వరల్డ్ కప్ గురించి ఇండియన్ క్రికేట్ టీమ్ సభ్యులు ఏమనుకున్నారు. కప్ గెలవడానికి ముందు క్రికెట్లో ఇండియాను భారతీయులు, విదేశీయులు ఎలా చూశారనేదే 83 చిత్రం కథ(83 movie review). విశ్లేషణ: క్రికెట్లో తమకంటూ ఒక స్థానం ఉండాలని పరితపించిన సగటు భారతీయుడి కథ ఇది. 1983 వరల్డ్ కప్‌ను భారత్ గెలుచుకోవడం ఒక భావోద్వేగపు సంఘటన. అందుకే దీన్ని ఒక సినిమాలా చూడలేం. సగటు సినీ ప్రేక్షకుడిగా కాకుండా క్రికెట్ ఆడే చిన్న పిల్లాడిలా చూస్తే సినిమా అద్భుతమైన అనుభూతిని ఇస్తుంది. 1983లో హర్యనా హరికేన్ కపిల్ దేవ్ సారథ్యంలో ఇండియా ప్రపంచ కప్ సాధించిన సంగతి తెలిసిందే. అయితే ప్రేక్షకుడికి కథ ఎలాగు ముందే తెలుసు. కాబట్టి తెలిసిన కథను ప్రేక్షకుడు తెరపై చూడాలంటే సినిమా బాగా కనెక్ట్ కావాలి. అంటే అప్పుడు జరిగిన సంఘటనలు, అప్పటి ఎమోషన్‌ను కళ్లకు కట్టనట్లు చూపించాలి. ఆ ఎమోషన్‌ను సినిమా ప్రారంభం నుంచి చివరి దాకా కొనసాగించడంలో దర్శకుడు కబీర్ ఖాన్ కొంతవరకు విజయం సాధించాడనే చెప్పవచ్చు. వరల్డ్ కప్ సిరీస్ ప్రారంభం నుంచి కప్ గెలిచే వరకూ భారత్ ఎలా నిలదొక్కుకుందని దర్శకుడు బాగా చూపించాడు. అప్పటివరకు ఇండియాలో మత ఘర్షణలు అనేకంగా జరిగేవి. ఈ మత ఘర్షణలకు ఒక్కసారిగా ముగింపు పలికింది 1983 వరల్డ్ కప్. ఈ అంశాన్ని తెరపై ఆవిష్కరించి విజయం సాధించాడు కబీర్ ఖాన్. ఈ సినిమాలో అప్పటి ప్రధాన మంత్రి ఇందిరా గాంధీ ప్రస్తావన కూడా తీసుకొచ్చారు. వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ రోజున ఇండియా-పాకిస్తాన్ సరిహద్దుల్లో భారత సైన్యానికి పాక్ ఆర్మీ ఒక్క రోజు కాల్పుల విరమణ ఇవ్వడం, ఇంగ్లాండ్‌లో పనిచేస్తున్న భారతీయుల ఎమోషన్, పలు చోట్ల అల్లర్లను సినిమాలో సాధ్యమైనంత వరకూ బాగానే చూపించారు. అయితే కపిల్ భార్య రోమి భాటియా, మదన్ లాల్ భార్య అను మోహన్ ఫైనల్ మ్యాచ్‌లో ఇండియా ఓడిపోతుందని స్టేడియం నుంచి హోటల్‌కు వెళతారు. ఈ దృశ్యాలను మాత్రం ప్రేక్షకుల హృదయాలకు తాకేలా తీయడంలో విఫలమయ్యారనే చెప్పవచ్చు. సినిమా ఫస్టాఫ్ స్లోగా నడిచినట్లు అనిపించినా.. సెకాండాఫ్ మాత్రం బాగుంటుంది. క్యాస్టింగ్, సాంకేతికంగా బాగానే వర్క్ చేసినట్టు కనిపిస్తుంది. అప్పటి కాలాన్ని తెరపై చక్కగా ఆవిష్కరించారు. ఆర్ట్, కమెరా పనితనం మొత్తంగా చిత్ర బృందం ఎఫర్ట్ స్క్రీన్‌పై కనిపించింది. చిత్రంలో 1983 వరల్డ్ కప్‌లో జరిగిన పలు దృశ్యాలను చూపించడం బాగుంది. అప్పటి మ్యాచ్‌ను మళ్లీ లైవ్‌లో చూసిన అనుభూతిని ఇస్తుంది. సినిమాలో అక్కడక్కడ పలువురు ప్రముఖ క్రికెటర్లు కనిపించడం ఆహ్లాదకరంగా ఉంటుంది. ఎవరెలా చేశారంటే ? సినిమాలో రణ్వీర్ సింగ్, దీపికా పదుకొణె, పంకజ్ త్రిపాఠి వంటి భారీ తారగణంతో అప్పటి విజయాన్ని తెరపై చూపించిన ప్రయత్నమిది. కపిల్ దేవ్ పాత్రలో రణ్వీర్ సింగ్ ఎంతో చక్కగా ఒదిగిపోయాడు. గెటప్ దగ్గర నుంచి ఆట ఆడే తీరు వరకు కపిల్‌ను దింపేశాడు రణ్వీర్ సింగ్. ఆ పాత్రకు ఏం చేయాలో అంతా చేసి విజయం సాధించాడు. కపిల్ దేవ్ భార్య రోమి భాటియాగా దీపికా పదుకొణె బాగానే ఆకట్టుకుంది. అయితే ఆమె పాత్ర ప్రభావం సినిమాలో అంతగా కనిపించదు. మాన్ సింగ్‌గా పంకజ్ త్రిపాఠికి మరో ఛాలెంజ్ రోల్ దక్కింది. ఆ పాత్రకు తగిన న్యాయం చేశాడు పంకజ్ త్రిపాఠి. క్రిష్ణమాచారి శ్రీకాంత్‌గా జీవా తన నటనతో మెప్పించాడు. మిగతా నటీనటులు వారి పాత్రలకు తమ పరిధిమేర నటించి ఆకట్టుకున్నారు. ఈ సినిమాకు తెలుగు డబ్బింగ్‌ను అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పించింది. రణ్వీర్ సింగ్‌కు హీరో సుమంత్ డబ్బింగ్ చెప్పగా.. జీవాకు నటుడు, దర్శకుడు రాహుల్ రవీంద్రన్ చెప్పిన డబ్బింగ్ బాగా సూట్ అయింది. మొహిందర్ అమర్నాథ్ పాత్రలో సాకీబ్ నటించగా.. అతడి తండ్రి పాత్ర లాలా అమర్నాథ్గా మొహిందర్ అమర్నాథ్ నటించడం విశేషం. అలాగే సందీప్ పాటిల్ పాత్రలో ఆయన కుమారుడు చిరాగ్ పాటిల్ నటించాడు. 1983 వరల్డ్ కప్ విశేషాలు, హైలెట్స్, అభిమానుల సందడి ఎలా ఉందో చూడాలంటే '83' చిత్రం మంచి ఎంపిక. -
ది ఫర్గాటన్ ఆర్మీ.. గిన్నిస్ రికార్డు
ముంబై: ప్రముఖ ఫిల్మ్‌మేకర్ కబీర్ ఖాన్ దర్శకత్వం వహించిన ‘ది ఫర్గాటన్ ఆర్మీ’ గిన్నిస్ ప్రపంచ రికార్డును సొంతం చేసుకుంది. ఆజాద్ హింద్ ఫౌజ్‌కు చెందిన వెలుగు చూడని వీరులకు నివాళిగా ముంబైలోని సబర్బన్ హోటల్లో శుక్రవారం రాత్రి భారీ సంగీత కార్యక్రమం నిర్వహించారు. ఇందులో దాదాపు 1000 మంది గాయకులు, వాయిద్యకారులు పాల్గొన్నారు. దీంతో భారత సినిమాటిక్ సంగీత బ్యాండ్‌లో నిర్వహించిన అతిపెద్ద కార్యక్రమంగా ఇది నిలిచిందని గిన్నిస్ ప్రపంచ రికార్డుల అడ్జడికేటర్ స్వాప్నిల్ దంగారికర్ ప్రకటించారు. -
వీడియో వైరల్.. రణ్‌వీర్‌పై ప్రశంసల జల్లు
రణ్వీర్ సింగ్ అనగానే మనందరికీ అంతులేని ఎనర్జీ, విభిన్న వేషధారణ.. ఇవన్నీ గుర్తొస్తాయి. స్క్రీన్ మీద, మీడియా ముందు కనపడే సమయాల్లో రణ్వీర్ సింగ్ ఎలా ఉంటారో మనందరికీ తెలుసు. అభిమానులను తరచూ కలుస్తూ వారిని సప్రైజ్ చేస్తుంటారు. అలా అభిమానులను కలిసిన రణ్వీర్ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆ వీడియో చూసిన నెటిజన్లు రణ్‌వీర్‌పై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ఇంతకీ ఆ వీడియో ఏముందంటే.. లండన్‌లో ఉన్న రణ్వీర్ తన అభిమానులను కలిసేందుకు యూకేలోని సౌత్హాల్కు వెళ్లాడు. అభిమానులు ఘనంగా స్వాగతం పలికారు. అభిమానులంతా అతన్ని చూసేందుకు.. అతనితో సెల్ఫీలు దిగేందుకు ఎగబడుతున్నారు. అయితే వారందరినీ కాదని రణ్వీర్ ఒక పెద్దావిడ దగ్గరకు వెళ్లాడు. తనను చూసేందుకు వీల్‌చైర్‌లో వచ్చిన ఆ పెద్దావిడ ముందు మోకాళ్లపై నిలబడి ప్రేమతో పలకరించాడు. తన దగ్గర ఉన్న రోజా పువ్వును పెద్దావిడకు ఇచ్చి ఆప్యాయంగా మాట్లాడాదు. ఆ పెద్దావిడ రణ్వీర్ను ఆప్యాయంగా ముద్దాడింది. రణ్వీర్ కూడా పెద్దవిడ చేతులపై ముద్దు పెట్టి ప్రేమతో నవ్వుతూ అక్కడ నుంచి వెళ్లిపోయాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయింది. అయితే అంత మంది అభిమానుల మధ్య వీల్‌చైర్‌లో ఉన్న పెద్దావిడను గుర్తించి వెళ్లి పకరించడం పట్ల నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.‘ రణ్వీర్ ఓ జెంటిల్మెన్... ప్రతి ఒక్కరిని ఆయన గౌరవిస్తారు’ , ‘ రణ్వీర్ ఓ గొప్ప వ్యక్తి’ , ‘ ఇతనిలా అందరూ ప్రేమగా ఉండేలా చేయి దేవుడా’ అంటూ నెటిజన్లు రణ్‌వీర్‌పై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. 🎥 | Ranveer Singh Spotted with some lucky fans in London 💗 _ Him with Elders ! 😭💗💗 pic.twitter.com/xFIaoD0hkS — RanveerSingh TBT | #83🏏♥️ (@RanveerSinghtbt) August 3, 2019 కాగా రణ్వీర్ ప్రస్తుతం ‘83’ చిత్రంలో నటిస్తున్నారు. 1983 నాటి క్రికెట్ వరల్డ్ కప్ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. కబీర్ ఖాన్ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ చిత్రంలో రణవీర్ సింగ్ అప్పటి జట్టుకు సారథ్యం వ్యవహరించిన కపిల్‌దేవ్ పాత్రలో కనిపించబోతున్నారు. అప్పట్లో క్రికెట్ బృందం మొత్తం ఎలాంటి పెర్ఫార్మెన్స్ ఇచ్చిందో వెండితెరపై ఇప్పుడూ అటువంటి పెర్ఫార్మెన్సే ఇచ్చేందుకు ఈ చిత్రబృందం పూర్తిస్థాయిలో శ్రమిస్తుంది. -
ప్రాక్టీస్ స్టార్ట్
ముంబైలోని జేవీపిడీ గ్రౌండ్స్‌కి వెళ్లారు రణ్వీర్ సింగ్ అండ్ కబీర్‌ఖాన్. సరదాగా ఏదైనా గేమ్ ఆడటానికి కాదు. రణ్వీర్ హీరోగా కబీర్ దర్శకత్వంలో రూపొందనున్న ‘1983’ సినిమా కోసమే. 1983లో ఇండియన్ క్రికెట్ టీమ్ ప్రపంచకప్ సాధించిన సంగతి గుర్తుండే ఉంటుంది. ఈ టీమ్ కెప్టెన్ కపిల్‌దేవ్ జీవితం ఆధారంగా బాలీవుడ్లో రూపొందనున్న ఈ సినిమాలో కపిల్‌దేవ్ పాత్రను రణ్వీర్ పోషించనున్న సంగతి తెలిసిందే. ఇందు కోసమే గ్రౌండ్‌కి వెళ్లి క్రికెట్ ప్రాక్టీస్ చేస్తున్నారట రణ్వీర్ సింగ్. దీన్నిబట్టి ఈ సినిమా త్వరలోనే సెట్స్‌పైకి వెళ్తుందని ఊహించవచ్చు. మరోవైపు జోయా అక్తర్ దర్శకత్వంలో రణ్వీర్ నటించిన ‘గల్లీబాయ్’ ట్రైలర్ రీసెంట్గా విడుదలైంది. ఈ చిత్రం వచ్చే నెల 14న విడుదల కానుంది. ఇంకా ‘తక్త్’ సినిమాలో నటిస్తారు రణ్వీర్. ఇక గతేడాది బాలీవుడ్ అందాలభామ దీపికా పదుకోన్‌తో కలిసి రణ్వీర్ ఏడడుగులు వేసిన సంగతి తెలిసిందే. -
శ్రీమతి అండ్ శ్రీవారిగా!
బాలీవుడ్ నటి దీపికా పదుకోన్‌కి వృత్తిపరంగా, వ్యక్తిగతంగా 2018 ది బెస్ట్ ఇయర్ అనొచ్చు. గతేడాది ‘పద్మావత్’తో సూపర్ హిట్ అందుకుని, కొన్నేళ్లుగా ప్రేమలో ఉన్న రణ్వీర్ సింగ్‌ను పెళ్లాడి కొత్త ఏడాదిని హ్యాపీగా ఆరంభించారు. అంతేకాదు గతేడాది ఫోర్బ్ మేగజీన్‌లో అత్యధికంగా సంపాదించే హీరోయిన్గా టాప్ 5లోను, ఐయండీబీ మోస్ట్ పాపులర్ స్టార్‌గా టాప్ చైర్లోను కూర్చున్నారు. 2019 కూడా బెస్ట్‌గా ఉండాలనుకుం టున్నారామె. ఈ ఏడాది నిర్మాతగా ఎంట్రీ ఇవ్వనున్నారు. జనవరి 5న దీపిక బర్త్‌డే. ఈ సందర్భంగా తన పేరు మీద ‘డబ్ల్యూడబ్ల్యూదీపికాపదుకోన్డాట్కామ్’ అనే వెబ్‌సైట్‌ను ఓపెన్ చేశారు. ప్రస్తుతం యాసిడ్ బాధితురాలు లక్ష్మీ జీవితం ఆధారంగా ‘చప్పక్’ అనే సినిమాలో నటిస్తున్నారు దీపిక. రణ్వీర్ సంకల్పం బలమైనది ‘రామ్‌లీల, భాజీరావ్ మస్తానీ’ సినిమాల్లో రణ్వీర్ సింగ్, దీపికాల కెమిస్ట్రీ గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. తాజాగా మరోసారి జంటగా స్క్రీన్ పంచుకోవాలనుందంటున్నారు ఆమె భర్త రణ్వీర్. ‘‘దీపికాతో కలసి యాక్ట్ చేయడాన్ని ఎంజాయ్ చేస్తాను. నటిగా తన సామర్థ్యాన్ని ఇంకా పూర్తి స్థాయిలో ఉపయోగించలేదనుకుంటున్నాను. దీపిక ఎమోషనల్‌గా ఇంకా బాగా నటించగలదు. మేమిద్దరం మళ్లీ ఎప్పుడు సినిమా చేస్తామో అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నా’’ అని పేర్కొన్నారాయన. రణ్వీర్ అలా సంకల్పించుకున్నారో లేదో దర్శకుడు కబీర్ ఖాన్ తథాస్తు అన్నారని బాలీవుడ్ మీడియా టాక్. ప్రస్తుతం1983 క్రికెట్ ప్రపంచ కప్ ఆధారంగా కబీర్ ఖాన్ ‘83’ పేరుతో ఓ చిత్రాన్ని రూపొందించనున్న సంగతి తెలిసిందే. ఇందులో కపిల్ దేవ్ పాత్రను రణ్వీర్ సింగ్ పోషించనున్నారు. కపిల్ భార్య రోమీ భాటియా పాత్ర కోసం దీపికను సంప్రదించినట్టు సమాచారం. ఇండియా ఓడిపోతుందని భావించి రోమీ భాటియా స్టేడియంను విడిచి బయటకు వెళ్లిపోవడం, మళ్లీ తిరిగొచ్చే సమయానికి ఇండియా గెలిచే స్టేజ్‌లో ఉండటం వంటి సన్నివేశాలు ఈ చిత్రంలో హైలైట్‌గా ఉండబోతాయట. చిన్న పాత్ర అయినప్పటికీ ఎమోషనల్‌గా ఉంటుంది కాబట్టి దీపిక అయితే బావుంటుందని టీమ్ భావించిందట. -
బాలీవుడ్‌కి బన్నీ?
అల్లు అర్జున్ బాలీవుడ్‌కి ఎంట్రీ ఇస్తున్నారా? అంటే అవుననే అంటున్నాయి ఫిల్మ్‌నగర్ వర్గాలు. ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ తర్వాత బన్నీ నటించనున్న చిత్రంపై ఎటువంటి క్లారిటీ లేదు. ‘మనం’ ఫేమ్ విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం చేస్తారని టాక్. ఇప్పుడు మరో టాక్ ఏంటంటే.. మాజీ భారత కెప్టెన్ కపిల్‌దేవ్ బయోపిక్ ‘83’ చిత్రంలో అల్లు అర్జున్ నటించనున్నారట. కపిల్‌దేవ్ సారథ్యంలో 1983లో భారత్ క్రికెట్ జట్టు తొలిసారి ప్రపంచ కప్ గెలుచుకున్న సంగతి తెలిసిందే. కబీర్ ఖాన్ దర్శకత్వం వహిస్తున్న ‘83’లో కపిల్‌దేవ్ పాత్రను రణ్వీర్ సింగ్ చేస్తున్నారు. ప్రపంచ కప్ గెలవడంలో ముఖ్య పాత్ర పోషించిన కృష్ణమాచారి శ్రీకాంత్ పాత్రకు చిత్రవర్గాలు అల్లు అర్జున్‌తో సంప్రదింపులు జరుపుతున్నారట. బన్నీ గ్రీన్ సిగ్నల్ ఇస్తే బాలీవుడ్లో ఆయన చేసే మొదటి చిత్రం ఇదే అవుతుంది. -
ఆ కండీషన్ నెరవేరుస్తేనే నటిస్తా: అగ్ర హీరో
బాలీవుడ్ అగ్రహీరో హృతిక్ రోషన్ ఇప్పుడు ఫుల్ ఖుషీగా ఉన్నాడు. హిట్ కోసం చకోరపక్షిలా ఎదురుచూస్తున్న తరుణంలో అతని తాజా సినిమా ’కాబిల్’ సూపర్‌హిట్ కావడంతో హృతిక్‌లో ఆనందాన్నింపింది. షారుఖ్‌ఖాన్ ’రయీస్’తో పోటీపడి మరీ బాక్సాఫీస్ రేసులో ’కాబిల్’ నెగ్గుకొచ్చింది. ఈ నేపథ్యంలో పలువురు దర్శకులు కొత్త కథలతో హృతిక్ కోసం క్యూ కడుతున్నట్టు తెలుస్తోంది. ఈ జాబితాలో సల్మాన్‌ఖాన్ ఫేవరెట్ దర్శకుడు, ’బజరంరీ భాయ్‌జాన్’రూపకర్త కబీర్ ఖాన్ కూడా ఉన్నట్టు సమాచారం. ప్రస్తుతం సల్మాన్‌తో ’ట్యూబ్‌లైట్’ సినిమా చేస్తున్న కబీర్ ఈ మధ్య హృతిక్‌కు ఓ కొత్త కథ వినిపించాడట. ఈ కథ హృతిక్‌కు నచ్చినప్పటికీ.. ఈ సినిమాలో నటించడానికి ఆయన ఒక షరతు పెట్టినట్టు తెలిసింది. ఈ సినిమాలో తనకు జోడీగా కత్రినా కైఫ్‌ను తీసుకోవాలంటూ హృతిక్ కరాఖండిగా చెప్పాడట. అయితే, ఈ సినిమాలో హృతిక్‌కు జోడీగా కత్రిన సరిపోదని కబీర్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమా కోసం దీపికా పదుకొణే, కృతి సనన్‌లను అడిగినట్టు గతంలో కథనాలు వచ్చాయి. అయితే, కబీర్ కొత్త అమ్మాయిని ఈ సినిమాకు కథానాయికగా తీసుకోవాలని భావిస్తున్నట్టు చెప్తున్నారు. హృతిక్ మాత్రం ’బ్యాంగ్ బ్యాంగ్’లో తనతో జత కట్టిన కత్రిన వైపే మొగ్గుచూపుతున్నారని సమాచారం. -
కపిల్ బయోపిక్‌లో సల్మాన్
బాలీవుడ్ వెండితెర మీద బయోపిక్‌ల సీజన్ నడుస్తోంది. ముఖ్యంగా క్రికెట్ క్రీడాకారుల జీవితాలను తెరకెక్కించేందుకు బాలీవుడ్ మేకర్స్ ఇంట్రస్ట్ చూపిస్తున్నారు. ఇప్పటికే అజారుద్దీన్, ధోని లాంటి క్రికెట్ వీరుల జీవితాలు వెండితెర మీద సందడి చేయగా త్వరలోనే మాస్టర్ బ్లాస్టర్ సచిన్ జీవితకథ రిలీజ్‌కు రెడీ అవుతోంది. ఈనేపధ్యంలో మరో క్రికెట్ లెజెండ్ కథను కూడా వెండితెర మీద ఆవిష్కరించేందుకు రెడీ అవుతున్నారు. ఇండియన్ క్రికెట్ టీంకు తొలి ప్రపంచ కప్‌ను అందించిన క్రికెట్ వీరుడు కపిల్ దేవ్ జీవితాన్ని సినిమాగా రూపొందించేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాలో కపిల్ పాత్రలో బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ నటించే అవకాశం ఉందన్న ప్రచారం జోరుగా జరుగుతోంది. ప్రస్తుతం కబీర్ ఖాన్ దర్శకత్వంలో ట్యూబ్‌లైట్ సినిమాలో నటిస్తున్న సల్మాన్ ఆ తరువాత కపిల్ బయోపిక్‌లో నటించే అవకాశం ఉంది. ఈ బయోపిక్ కూడా కబీర్ దర్శకత్వంలోనే తెరకెక్కించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. -
సల్మాన్ 'ట్యూబ్ లైట్' ఫస్ట్ లుక్
వరుస బ్లాక్ బస్టర్లతో సూపర్ ఫాంలో ఉన్న బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ హీరోగా తెరకెక్కుతున్న కొత్త సినిమా ట్యూబ్ లైట్. గతంలో సల్మాన్ హీరోగా ఏక్తా టైగర్, భజరంగీ బాయిజాన్ లాంటి సూపర్ హిట్స్ అందించిన కబీర్ ఖాన్, ఈ సినిమాకు దర్శకుడు. ప్రస్తుతం పాకిస్థాన్ బార్డర్లో కీలక సన్నివేశాల షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా ఫస్ట్ లుక్‌ను దర్శకుడు కబీర్ ఖాన్ రిలీజ్ చేశారు. సల్మాన్‌ను వెనకనుంచి తీసిన ఫోటోను తన ఇస్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన కబీర్ ఖాన్ ఇదే ఫస్ట్ లుక్ అంటూ అభిమానులకు షాక్ ఇచ్చాడు. టైటిల్ లోగోను కూడా రివీల్ చేయకుండా రిలీజ్ చేసిన ఈ ఫస్ట్ లుక్‌లో సల్మాన్ ఓ సైనికుడిలా కనిపిస్తున్నాడు. భుజానికి తుపాకి తగిలించుకోని యుద్ధ క్షేత్రంలోకి నడుస్తున్న సోల్జర్లా సల్మాన్ ఆకట్టుకుంటున్నాడు. అయితే ఈ సినిమాలో సల్మాన్ పూర్తి స్థాయి సైనికుడిగా నటిస్తున్నాడా.. లేక ఏదైన కీలక సన్నివేశం కోసం ఈ లుక్‌లో కనిపిస్తున్నాడా అన్న విషయాన్ని మాత్రం వెల్లడించలేదు. ఈ ఏడాది ఈద్‌కు సుల్తాన్ గా సత్తా చాటిన సల్మాన్ వచ్చే ఏడాది ఈద్ కోసం ట్యూబ్ లైట్ సినిమాను రెడీ చేస్తున్నాడు. -
'ట్యూబ్ లైట్' షూటింగ్ షురూ
సినిమా టైటిల్ ఎంత ఆకట్టుకునేలా ఉంటే సినిమా మీద అంత హైప్ క్రియేట్ అవుతుంది. స్టార్ హీరోల సినిమాల విషయంలో అయితే టైటిల్స్ చేసే హంగామా కాస్త ఎక్కువే అని చెప్పాలి. తాజాగా బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ 'ట్యూబ్ లైట్' అనే విభిన్నమైన టైటిల్‌తో ఫ్యాన్స్‌ను ఖుషీ చేయనున్నారు. సుల్తాన్ సినిమా బంపర్ హిట్ అయిన తర్వాత.. సల్మాన్ తదుపరి చిత్రం 'ట్యూబ్ లైట్' షూటింగ్ గురువారం మొదలయ్యింది. డైరెక్టర్ కబీర్ ఖాన్ ఈ సినిమాతో సల్మాన్‌తో హ్యాట్రిక్ హిట్ కొట్టేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇదివరకు వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన ఏక్ థా టైగర్, గత ఏడాది బజరంగీ భాయ్ జాన్ సినిమాలు బాక్సాఫీసుని బద్దలుకొట్టగా.. 'ట్యూబ్ లైట్' పేరుతో మరోసారి అలాంటి మ్యాజిక్కే చేసేందుకు కబీర్ ఖాన్ సిద్ధమయ్యారు. 'ట్యూబ్ లైట్' లో భావోద్వేగాలు, హాస్యంతో పాటు కాస్త పొలిటికల్ టచ్ కూడా ఉంటుందని కబీర్ చెప్పారు. లఢక్ ప్రాంతంలో తొలి రోజు షూటింగ్ ప్రారంభించారు. ఈ సినిమాలో సల్మాన్ ఓ విభిన్నమైన పాత్రలో కనిపిస్తారట. సల్మాన్ సరసన దీపికా పదుకొనే నటించే అవకాశం ఉంది. వచ్చే ఏడాది రంజాన్‌కి ఈ సినిమాను రిలీజ్ చేయాలనే ఆలోచనలో చిత్ర యూనిట్ ఉన్నట్లు సమాచారం. -
మూడోసారి సల్మాన్‌తో..
ముంబై: బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్, స్టార్ దర్శకుడు కబీర్ ఖాన్ కాంబినేషన్లో మూడో సినిమా రానుంది. వీరిరువురి కాంబినేషన్లో గతంలో వచ్చిన ఏక్ థా టైగర్, బజరంగీ భాయ్ జాన్ ఘన విజయం సాధించాయి. ఈ సారి కుటుంబ కథాచిత్రంతో వీరు ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ప్రస్తుతం సల్మాన్ ఖాన్ సుల్తాన్ సినిమా షూటింగ్ కార్యక్రమాలలో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా పూర్తవగానే వీరి చిత్రం ప్రారంభం కానుంది. ఇందులో హీరోయిన్లుగా దీపికా పదుకోన్, కత్రినా కైఫ్ ల పేర్లు వినబడుతున్నాయి. రాజ్ కుమార్ సంతోషి, సూరజ్ భాటియాతో సినిమాలు చేయడానికి సల్మాన్ ఒప్పందం కుదుర్చుకున్నాడు. -
మెగా దర్శకుడికి ఎమర్జెన్సీ ఆపరేషన్!
'బజరంగీ భాయ్‌జాన్', 'ఫాంథమ్', 'ఏక్ థా టైగర్', 'న్యూయార్క్' వంటి సక్సెస్ఫుల్ చిత్రాలను తెరకెక్కించిన బాలీవుడ్ మెగా దర్శకుడు కబీర్ ఖాన్ అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయనను వెంటనే ఆస్పత్రికి తరలించి.. అత్యవసర ఆపరేషన్‌ను నిర్వహించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ నెల 13న తీవ్ర కడుపునొప్పి రావడంతో కబీర్ ఖాన్‌ను ముంబైలోని కోకిల బెన్ ఆస్పత్రికి తరలించారు. ఆయన కడుపులో రాళ్లు (స్టోన్స్) ఉన్నట్టు వైద్యులు గుర్తించారు. వాటిని తొలగించేందుకు వెంటనే ఆపరేషన్ నిర్వహించారు. ఆపరేషన్ ముగిసిన తెల్లారే కబీర్ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయినా.. వారంపాటు పూర్తి బెడ్‌రెస్ట్ తీసుకోవాలని ఆయనకు వైద్యులు సూచించినట్టు తెలుస్తోంది. ఇటీవల కబీర్ ఖాన్ పాకిస్థాన్ వెళ్లడం, కరాచీ విమానాశ్రయంలో ఆయనను ఆందోళనకారులు అడ్డుకోవడం తెలిసిందే. 'బజరంగీ భాయ్‌జాన్'లాంటి మెగాహిట్ తర్వాత కబీర్ ఖాన్ తాజాగా మరో చిత్రాన్ని సెట్స్ మీదకు తీసుకెళ్లబోతున్నారు. ఈ చిత్రం కోసం మరోసారి బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్‌తోనే ఆయన జతకడుతున్నారు. 'ట్యూబ్ లైట్' టైటిల్‌గా భావిస్తున్న ఈ సినిమాలో భారత్-చైనా అనుబంధాన్ని చూపించబోతున్నారు. -
దర్శకుడికి వార్నింగ్
కరాచీ: బాలీవుడ్ దర్శకుడు కబీర్ ఖాన్ కు పాకిస్థాన్ లోని కరాచీ విమానాశ్రయంలో చేదు అనుభవం ఎదురైంది. లాహోర్ వెళ్లేందుకు బుధవారం కరాచీ ఎయిర్ పోర్టుకు వచ్చిన 'బజరంగీ భాయిజాన్' దర్శకుడికి వ్యతిరేకంగా కొంతమంది ఆందోళన నిర్వహించారు. భారత్ వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పాకిస్థాన్ లో భారత్ నిఘా సంస్థ 'రా' సాగిస్తున్న గూఢచర్యంపై ఎందుకు సినిమా తీయరని ఆందోళనకారులు నిలదీశారు. ఒక వ్యక్తి బూటు చేత్తో పట్టుకుని ఆవేశంతో ఊగిపోతూ కబీర్ ఖాన్ వెంట పడ్డాడు. పాకిస్థాన్ సైన్యానికి వ్యతిరేకంగా భారత్ కుట్రలు చేస్తోందని, దీన్ని సహించబోమంటూ పదేపదే హెచ్చరించాడు. కరాచీలో ఓ సదస్సులో పాల్గొనడానికి కబీర్ ఖాన్ పాకిస్థాన్ వచ్చారు. కబీర్ ఖాన్ తీసిన పాంటమ్' సినిమా పాకిస్థాన్ లో వివాదాస్పమైంది. ఈ సినిమా విడుదలపై లాహోర్ హైకోర్టు నిషేధం విధించింది. కరాచీ ఎయిర్ పోర్టులో కబీర్ ఖాన్ ను అడ్డుకోవడాన్ని మరో దర్శకుడు మధు భండార్కర్ ఖండించారు. ఇది మంచి పద్ధతి కాదని అన్నారు. -
నా 35 కోట్ల మాటేంటి: సల్మాన్
అత్తారింటికి దారేది సినిమాకు సంబంధించి తనకు ఇంకా రూ. 2 కోట్లు ఇవ్వాలంటూ నిర్మాత బీవీఎస్ఎన్ ప్రసాద్ మీద 'మా'లో ఫిర్యాదు చేశారు హీరో పవన్ కల్యాణ్. కానీ.. 2015 సంవత్సరంలోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్‌గా నిలిచిన బజరంగీ భాయీజాన్ సినిమాకు సంబంధించి సల్మాన్ ఖాన్‌కు ఆ సినిమా నిర్మాత ఇంకా ఏకంగా రూ. 35 కోట్లు బాకీ ఉన్నారట. కబీర్ ఖాన్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా.. బాక్సాఫీసును మోత మోగించి.. మన దేశంలోనే దాదాపు రూ. 300 కోట్లు వసూలు చేసింది. విదేశాల్లో మరో రూ. 300 కోట్లు కలిపి, మొత్తం రూ. 600 కోట్ల గ్రాస్ వసూళ్లు లభించాయి. సినిమా విడుదలై ఆరు నెలలు గడిచినా.. అంత భారీ కలెక్షన్లు వసూలుచేసినా, ఇప్పటికీ తనకు ఇవ్వాల్సిన పారితోషికం ఇవ్వకపోవడంపై సల్లూభాయ్ అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు ప్రేక్షకులు, విమర్శకుల నుంచి ప్రశంసలు లభించాయి. -
డైరెక్టర్‌కు గిప్ట్ ఇచ్చిన సల్మాన్
బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ ఇచ్చే గిప్ట్లంటే యమ క్రేజీ. తను ప్రేమించిన వారి కోసం ఏమైనా చేయగల విశాలమైన మనసు కలవాడనే పేరు సల్లూభాయ్‌కి ఉంది. కెరీర్లో జెట్ స్పీడ్‌లో దూసుకు పోతున్న సల్మాన్ తన విజయాలకు సహకరించిన వారికి మెమరబుల్ బహుమతులు ఇవ్వడం మనకు తెలిసిందే. తాజాగా సల్మాన్ హీరోగా విడుదలైన 'బజరంగీ బాయ్‌జాన్' ప్రపంచవ్యాప్తంగా మంచి టాక్ సొంతం చేసుకుంది. దీంతో ఇంతటి ఘనవిజయాన్ని అందించిన దర్శకుడు కబీర్ ఖాన్‌కు... మరిచిపోలేని గిప్ట్ ఇచ్చాడు. తానే స్వయంగా వేసిన ఓ బ్లాక్ అండ్ వైట్ పొట్రాయిట్ను కబీర్‌కు ప్రెజెంట్ చేశాడు. అంతేకాదు ఈ పొట్రాయిట్కు బజరంగీ బాయ్ జాన్ అని పేరు పెట్టాడు. కండలవీరుడు ఇచ్చిన గిప్ట్‌తో పొంగిపోయిన కబీర్ తన ఆనందాన్ని ట్విటర్ వేదికగా అభిమానులతో పంచుకున్నాడు. సల్మాన్ ప్రజెంట్ చేసిన పెయింటింగ్‌ను షేర్ చేస్తూ తన లైఫ్‌లో ఇదే బెస్ట్ గిప్ట్ అంటూ కామెంట్ చేశాడు. గతంలో 'ఏక్ థా టైగర్' సినిమా కోసం కలిసి పనిచేసిన సల్మాన్, కబీర్లు బజరంగీ బాయ్‌జాన్ సినిమాతో ఇండస్ట్రీ రికార్డ్లను తిరగరాశారు. ఈ మూవీ తరువాత కబీర్ డైరెక్ట్ చేసిన ఫాంటమ్ కూడా మంచి వసూళ్లను రాబడుతున్న నేపథ్యంలో సల్మాన్ గిప్ట్ కబీర్ కు కొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది. Just got the best gift... From my producer, my actor, my friend -
మూవీ రివ్యూ: ఫాంటమ్
టైటిల్: ఫాంటమ్ జానర్: ఫిక్షనల్ యాక్షన్ థ్రిల్లర్ తారాగణం: సైఫ్ అలీ ఖాన్, కత్రినా కైఫ్ రచన, దర్శకత్వం: కబీర్ ఖాన్ నిర్మాత్: సాజిద్ నదియావాలా, సిద్ధార్థ్ రాయ్ కపూర్ రచన: కబీర్ ఖాన్, కౌసర్ మునీర్ స్క్రీన్ ప్లే: కబీర్ ఖాన్, పర్వేజ్ షేక్ మూల కథ: హుస్సేన్ జైదీ రచన 'ముంబై అవెంజర్స్' సంగీతం: ప్రీతమ్, కేకే.. బ్యాక్ గ్రౌండ్ స్కోర్: జూలియస్ పాకియామ్ సినిమాటోగ్రఫీ: అసీమ్ మిశ్రా ఎడిటింగ్: ఆరిఫ్ షేక్ విడుదల: 28 ఆగస్ట్, 2015 నిడివి: 135 నిమిషాలు బడ్జెట్: 55 కోట్లు చరిత్ర పొడవునా ఎన్నోన్నె దురాక్రమణలు, అంతకు రెట్టింపు దాడులను తట్టుకుని తనదైన శైలిలో సాగిపోతున్న భారతావని.. దానికి పశ్చిమాన అరేబియా సముద్రతీరంలో దేశ ఆర్థిక రాజధానిగా వెలుగొందుతున్న ముంబై నగరం.. ఆ నగరానికి మకుటం లాంటి తాజ్ మహల్ హోటల్.. నెరిసిన తల, పొడవాటి గడ్డంతో తాజ్ ముందు ఫుట్‌పాత్‌పై సైకిల్ మీద టీ అమ్మే ముసలాయన ముఖంలో గొప్ప వెలుగు. సంతోషంగా అందరికీ టీ ఇస్తుంటాడు. అక్కడే నిల్చున్న హీరోయిన్ కత్రినా కైఫ్‌కు కూడా టీ ఇస్తాడు. 'క్షమించండి, నా దగ్గర డబ్బుల్లేవ్' అన్న కత్రినాతో... నవ్వుతూ ఇలా అంటాడు.. 'ఫర్లేదమ్మా, ఈ రోజు ఎవరి దగ్గరా డబ్బులు తీసుకోను. ఎందుకో తెలుసా.. (తాజ్‌ను చూపిస్తూ) ఇదిగో ఈ హోటల్లోనే నా కొడుకు వెయిటర్‌గా పనిచేసేవాడు. ఆ రోజు రాత్రి చనిపోయినవాళ్లలో వాడు కూడా ఉన్నాడు. నా కొడుకుతోపాటు వందల మందిని పొట్టనపెట్టుకున్న ఆ రాక్షసులు హతమయ్యారని ఈ రోజు వార్తల్లో చెప్పారు. అది విని నాకు చాలా ఆనందం కలిగింది. ఏడేళ్ల తర్వాతగానీ నా కొడుకు ఆత్మకు శాంతి దొరికిందనిపించింది. అందుకే అందరికీ ఉచితంగా టీ ఇస్తున్నా..' *** *** *** *** ఫాంటమ్ సినిమాలో ఇది ఆఖరు సీన్. ఉన్మాదాన్ని మించిన ఉగ్రవాద కార్యకలాపాలతో భారత్‌ను ఇబ్బందులపాలుచేస్తూ, ఇక్కడి అమాయకులను పొట్టన పెట్టుకుంటున్నపాకిస్థానీ ముష్కర ముఠాల నాయకులను ఏమీ చేయలేమా? సాక్ష్యాధారాలు లేవు. ఉన్నా వాటిని పాకిస్థాన్ కోర్టులు విశ్వసించవు. మరెలా? ఈ మారణహోమం తప్పక కొనసాగాల్సిందేనా? అనే ప్రశ్నలకు దర్శకుడు కబీర్ ఖాన్ చెప్పిన ఊహాజనిత సమాధానమే ఫాంటమ్ సినిమా. హుస్సేన్ జైదీ రాసిన 'ముంబై అవెంజర్స్' పుస్తకానికి వెండితెర రూపం. నిజానికి ఫాంటమ్ ఓ ఊహాజనిత కామిక్ హీరో. తన గురించిన సమాచారాన్ని బయటికి తెలియనివ్వకుండా, సమాజానికి చేటుచేసే కేటుగాళ్ల భరతం పడతాడు. ఈ సినిమా ఫాంటమ్ కూడా అంతే. భారత్‌లో విధ్వంసాలు సృష్టిస్తూ, పాకిస్థాన్, ఇతర దేశాల్లో స్వేచ్ఛగా తిరుగుతున్న 26/11 ముంబై దాడుల మాస్టర్ మైండ్స్‌ను అంతమొందిస్తాడు. కథలోకి వెళితే.. డ్యూటీలో నిర్లక్ష్యంగా వ్యవహరించి, సహచర జవాన్ ప్రాణాలు పోవడానికి కారణమైనందుకు ఇండియన్ ఆర్మీ నుంచి తొలగింపునకు గురవుతాడు ధనియాల్ ఖాన్ (సైఫ్ అలీ ఖాన్). కొద్దికాలానికి ఆర్మీ రికార్డుల్లో అతని పేరు కూడా మాయం అవుతుంది. పాకిస్థాన్‌కు కౌంటర్ ఎటాక్ ఇవ్వడానికి ఓ యువ ఆఫీసర్ చెప్పిన ఐడియాను అతి కష్టం మీద అంగీకరిస్తాడు రా (రీసెర్చ్ అండ్ అనాలసిస్ వింగ్) చీఫ్. ప్లాన్ సిద్ధమవుతుంది. కానీ దాన్ని అమలు చేయగల ధీరోదాత్తుడు కావాలి. అంతటి సమర్థుడి కోసం దేశంలోని అన్ని భద్రతా బలగాల్లో పనిచేస్తున్న జవాన్ల జాబితాను జల్లెడపడతారు. ఆఖరికి ఫాంటమ్లా తన వివరాలను బయటికి తెలియనివ్వకుండా సుదూర ప్రాంతంలో జీవిస్తోన్న ధనియాల్ ఖాన్ పేరును ఫిక్స్ అవుతారు. తీవ్రంగా గాలించి, అతని జాడ తెలుసుకుని, ఈ ఆపరేషన్ నువ్వు మాత్రమే చెయ్యగలవంటారు రా అధికారులు. మొదటి నిరాకరించినా, ఈ పనితో ప్రాణాలు కోల్పోయిన తన సహచరుడి ఆత్మకు శాంతి దొరుకుతుందని, సైన్యంలోకి తిరిగి సగర్వంగా చేరొచ్చనే హామీతో రంగంలోకి దిగుతాడు ధనియాల్ ఖాన్. విదేశాల్లో ప్రతీకార హత్యలు సాజిద్ మిర్.. ప్రస్తుతం లండన్‌లో ఉంటున్న అతడు, ముంబైలో మారణహోమం సృష్టించిన కసబ్ గ్యాంగ్‌కు శిక్షణ ఇవ్వడమేకాక, దాడి సమయంలో ఫోన్ ద్వారా ఆదేశాలు జారీచేసిన వ్యక్తి. అతడి జాడ కనిపెట్టేందుకు లండన్ వెళ్లిన ధనియాల్కు సహాయకారిగా వస్తుంది నవాజ్ మిస్త్రీ (కత్రినా కైఫ్), ఓ రహస్య కన్సల్టెన్సీలో పనిచేసే ఆమె ఇండియన్ పార్సీ. వివిధ దేశాల గూఢచార సంస్థలు ఆ కన్సల్టెన్సీ సేవలను వినియోగించుకూంటూ ఉంటారు. సాజిద్‌ను చంపే క్రమంలో ధనియాల్ ప్రదర్శించిన దూకుడు నచ్చక గుడ్ బై చెప్పి వెళ్లిపోతుంది నవాజ్. కట్ చేస్తే.. చికాగోలోని జైలు. ముంబై దాడుల్లో తనదైన పాత్ర పోషించి, ఆ తరువాత అరెస్టయిన డేవిడ్ హెడ్లీ ప్రస్తుతం ఉంటోన్న జైలు. నాటకీయ రీతిలో ఆ జైలులోకి ప్రవేశించిన ధనియాల్.. హెడ్లీ స్నానం చేసే నీళ్లలో విషం కలిపి వాణ్ని చంపేస్తాడు. ఇక మిగిలిని ఇద్దరు మాస్టర్ మైండ్స్ హఫీజ్ సయ్యద్, సబాహుద్దీన్ ఉమ్వి (అసలు పేరు జకీ ఉర్ రహమాన్ లఖ్వీ)లను అంతం చేసేందుకు పాకిస్థాన్ వెళ్లాలనుకుని, అందుకు సాయం చేయమని నవాజ్ (కత్రినా)ను కోరతాడు ధనియాల్. తాజ్‌పై దాడి ఆమెను కూడా బాధించి ఉంటుంది కాబట్టి హీరోతో కలిసి తాను కూడా పాకిస్థాన్‌కు పయనమవుతుంది నవాజ్. పాక్ వీధుల్లో ధనియాల్ సాహసాలు సినిమా సెకండ్ హాఫ్ మొత్తం పాకిస్థాన్‌లోనే. ఓ భారీ బహిరంగ సభలో పాల్గొనబోతున్న హపీజ్ సయ్యద్‌ను అంతం చేయడానికి.. సభలో అతడు మాట్లాడబోయే మైకులో బాంబు పెడతాడు ధనియాల్. మరోవైపు జైలులో ఉన్న లఖ్వీని చంపేందుకు అతడికి ఎంతో నమ్మకస్తుడైన డాక్టర్ దగ్గర పనిచేసే నర్స్ సహాయం కోరతాడు. నాయకులు నూరిపోసే జీహాద్ మత్తులోపడి ప్రాణత్యాగాలకు సిద్ధపడుతున్న ఎందరో పాకిస్థానీ యువకులు వాళ్ల తల్లులకు గర్భశోకం మిగుల్చుతున్నారు. అలాంటి తల్లులకు ప్రతినిధే ఈ నర్స్. తన కొడుకులాంటి ఇంకొందరు ఉగ్రవాదానికి బలి కాకూడదనే ఉద్దేశంతో ఇంజక్షన్‌ను మార్చేస్తుంది. అలా విషపు ఇంజక్షన్‌తో లఖ్వీ చస్తాడు. ఇటు లాహోర్ బహిరంగ సభకు తాను కూడా వెళ్లిన ధనియాల్.. బాంబును పేల్చేలోగా అతడి ప్లాన్, ఫోటో సహా పూర్తి వివరాలు ఐఎస్ఐకి తెలిసిపోతాయి. దీంతో హఫీజ్ బాంబు దాడి నుంచి తప్పించుకుంటాడు. అతడ్ని వెంటాడి మరీ చంపుతాడు ధనియాల్ ఖాన్. చంపేముందు ఒక్క మాట చెబుతాడు. 'హఫీజ్ సయ్యద్.. ఈ ఇండియాకు ఏం కావాలి? అని పదే పదే ప్రశ్నిస్తావు కదా. సమాధానం చెప్తా విను.. ఇండియాకు కావాల్సింది న్యాయం' చట్టమంటూ ఒకటుంది! బహుశా ఇలాంటి న్యాయాన్నే భారతదేశంలోని అధిక సంఖ్యాకులు కోరుతూ ఉండొచ్చు. కానీ చట్టమంటూ ఒకటుంటుంది. ఎంతటి సముచిత న్యాయమైనా చట్టం పరిధిలోనే జరగాలే తప్ప మరోలా జరగవద్దనేది లిఖిత శాసనం. అందుకే మొత్తం ఆపరేషన్‌ను భారత ప్రభుత్వం అనుమతి తీసుకోకుండానే (అడిగినా ఇవ్వదు కాబట్టి) నిర్వహిస్తారు రా అధికారులు. అంతెందుకు.. ఆపరేషన్ పూర్తి చేసి జల మార్గం గుండా భారత్‌కు తిరిగొస్తూ నడి సముద్రంలో చిక్కుకున్న ధనియార్ ఖాన్, నవాజ్‌లను కాపాడటానికి నేవీ అధికారులు అంగీకరించరు. పాక్ ప్రాదేశిక జలాల్లోకి ప్రవేశించడం చట్ట విరుద్ధం కాబట్టి వారు ఆపని చేయలేరు. చివరికి రా అధికారి ఒత్తిడితో వాళ్లను కాపాడటానికి వెళతారు. కానీ అప్పటికే బుల్లెట్ దెబ్బలు తిన్న ధనియాల్ ఖాన్ చనిపోయి నీటమునుగుతాడు. దటీజ్ పవర్ ఆఫ్ రివేంజ్ సాధారణంగానే రివేంజ్ స్టోరీస్‌లో ఓ కిక్ ఉంటుంది. దాన్ని ప్రేక్షకులకు సమగ్రంగా అందించడంలో సఫలీకృతుడయ్యాడు దర్శకుడు కబీర్ ఖాన్. కథలో ఏం జరగబోతుందో ముందే తెలినప్పటికీ బిగుతైన కథనం ప్రేక్షకుడికి నిమిషం పాటైనా బోర్ కొట్టించదు. ముందే చెప్పుకున్నట్లు ఇది ఫిక్షన్ సినిమా కాబట్టి విదేశాల్లో, శత్రుదేశంలో హీరో చేసే సాహసాలు, ఆర్మీ రికార్డుల్లో అతడి పేరు గల్లంతు, ఐఎస్ఐతో బేరసారాలు తదితర అంశాల్లో లాజిక్ వెతుక్కోవాల్సిన పనిలేదు. పాక్- అమెరికా సంబంధాలు, ధనియాల్ ఫొటోను సాధించడంకోసం భారత్‌లో ఐఎస్ఐ ఏజెంట్లు బాహాటంగా తిరగడం, సిరియాలో యుద్ధవాతావరణం తదితర సీన్లు రియలిస్టిక్‌గా గోచరిస్తాయి. కబీర్ కు పాకిస్థానంటే అంత ప్రేమెందుకు? హైదరాబాదీ అయిన కబీర్ ఖాన్.. పాకిస్థాన్‌పై తనకున్న అదోరకమైన ప్రేమను మరోసారి చాటుకున్నాడు. 2006 నుంచి అతడు తీసిన ఐదు సినిమాలకు బ్యాక్ డ్రాప్ పాకిస్థానే కావడం విశేషం. ఇక ఇప్పటికే వయసు మీదపడిపోయిన హీరో సైఫ్ అలీ ఖాన్‌కు చాలా కాలం తర్వాత మంచి హిట్ దొరికిందని చెప్పొచ్చు. సినిమా చూసిన తర్వాత ధనియాల్ ఖాన్ పాత్రకు అతడే సరైన వ్యక్తి అని ప్రతిఒక్కరు ఫీలవుతారు. ఇక నవాజ్ పాత్రలో హీరోతోపాటు సాహసాలు చేస్తూ కత్రినా కైఫ్ మెప్పించింది. సొంతగా చెప్పుకున్న హిందీ డబ్బింగ్లో ఇంగ్లీష్ యాక్సెంట్ స్పష్టంగా వినబడుతున్నప్పటికీ తెరపై ఆమె అభినయం ముందు అది చాలా చిన్న విషయంగా కనబడుతుంది. సైఫ్, కత్రినా తప్ప మిగతా పాత్రధారులందరూ అంతగా గుర్తింపులేనివారే. కొసమెరుపు పాకిస్థాన్‌లో ఈ సినిమాను నిషేధించడం నూటికి నూరుపాళ్లు న్యాయమే. ఎందుకంటే ఏ దేశమైనాసరే, తాను తప్పుచేస్తున్నప్పటికీ, తనను నిందిస్తూ, తన పౌరులను అంతమొందించే కథాంశంతో రూపొందిన సినిమా (అది ఫిక్షనే అయినప్పటికీ)ను అంగీకరిస్తుందని మనం భావించాల్సిన అవసరంలేదు. ఆ విధంగా సినిమాకు ముందు 'ఈ చిత్రంలోని పాత్రలు, సన్నివేశాలు ఏ వ్యక్తినిగానీ లేదా సంస్థను గానీ ఉద్దేశించినవి కావు. పూర్తిగా కల్పితాలు' అని ఫాంటమ్ రూపకర్తలు చెప్పడం రొటీన్ వ్యవహారమే తప్ప నిజం కాదు. -
సైఫ్ సంచలన వ్యాఖ్యలు
కబీర్ ఖాన్ లేటెస్ట్ మూవీ 'ఫాంతమ్' మరోసారి హెడ్ లైన్ గా మారింది. సినిమా ప్రారంభం అయిన దగ్గరనుంచి ఏదో ఒక వివాదానికి కేంద్రంగా మారుతున్న ఈ సినిమా పై పాకిస్తాన్లో బ్యాన్ విధించటంతో మళ్లీ తెర మీదకు వచ్చింది. అయితే ఫాంతమ్ బ్యాన్పై బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఇంటర్నేషనల్ మీడియాను సైతం ఆకర్షిస్తున్నాయి. సైఫ్‌కు జోడిగా కత్రినా నటించిన ఈ పొలిటికల్ థ్రిల్లర్ చిత్ర కథ అంతా పాక్ తీవ్రవాదం చుట్టూ తిరుగుతుంది. 26/11 ముంబై దాడులు వెనుక ఉన్న మాస్టర్ మైండ్స్‌ను మట్టుపెట్టే పోలీస్ పాత్రలో సైఫ్ ఆకట్టుకున్నాడు. అయితే ఈ సినిమా సక్సెస్ సైఫ్ కెరీర్‌కు కూడా కీలకం కావటంతో సినిమా ప్రమోషన్ విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. అందుకే పాక్‌లో బ్యాన్ విధించిన వెంటనే ప్రెస్ మీట్ పెట్టి మరి స్పందించాడు సైఫ్.. జమాత్ ఉద్ దవా చీఫ్ హఫీజ్ సయ్యద్... ముంబై టెర్రర్ వెనుక అసలు సూత్రధారి అన్న... సైఫ్ ఒక్కసారిగా ఇంటర్ నేషనల్ మీడియాకు షాక్ ఇచ్చాడు.. అంతేకాదు అదే సమయంలో తన ఫ్యామిలీకి సంబందించి కూడా కొన్ని ఇంట్రస్టింగ్ కామెంట్లు చేశాడు సైఫ్. 2012 లో ఐఎస్ఐ చీఫ్‌గా పనిచేసిన మేజర్ జనరల్ అలీఖాన్ తన అంకుల్ అవుతారని, చిన్నతనంలో ఆయన పిల్లలతో కలిసి ఆడుకున్న రోజులు గుర్తు చేసుకున్నారు. అంతేకాదు దేశం కన్నా తనకు ఫ్యామిలీ రిలేషన్స్ ఎక్కువ కాదని, భారత దేశానికి హాని చేసేవారు తన కుటుంబసభ్యులైన వారికి మద్ధతు తెలిపే ప్రసక్తే లేదంటూ ఘాటుగా స్పందించాడు. ప్రస్తుతం పాక్ విదేశీ వ్యవహారాల కార్యదర్శిగా ఉన్న షేర్యార్ ఖాన్ కూడా తన బంధు వర్గం వాడే అన్న సైఫ్, భారత ప్రభుత్వంతో ఆయనకు చాలా మంచి సంబంధాలు ఉన్నాయిని తెలిపారు. ఏది ఏమైనా సినిమా ప్రముఖులు మూవీ ప్రమోషన్స్ కోసం కాంట్రవర్షియల్ కామెంట్స్ నే ఆశ్రయిస్తారన్న మాటని సైఫ్ మరోసారి నిజం చేశారు. ఫాంతమ్ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. -
ఫాంటమ్.. పాక్‌కు వ్యతిరేకంకాదు
ఉగ్రవాదం ప్రధానాంశంగా రూపుదిద్దుకున్న ఫాంటామ్ చలనచిత్రాన్ని పాకిస్థాన్ కోర్టు నిషేధించడంపై ఆ చిత్ర దర్శకుడు కబీర్ ఖాన్ స్పందించారు. ఫాంటమ్ సినిమా.. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా తీసిందేతప్ప పాకిస్థాన్‌కు వ్యతిరేకం కాదని శుక్రవారం మీడియాతో అన్నారు. ఫాంటమ్లో తనను ఉద్దేశించి అసత్యాలు చెప్పారని ఆరోపిస్తూ సినిమా విడుదలను అడ్డుకోవాల్సిందిగా లష్కరే తాయిబా నేత హఫీజ్ సయ్యద్ కోర్టును ఆశ్రయించడం.. విచారించిన కోర్టు పాకిస్థాన్‌లో ఫాంటమ్ సినిమాను నిషేధిస్తున్నట్లు గురువారం ప్రకటించడం తెలిసిందే. 'సినిమా విడుదల కాకముందే.. కనీసం అందులో ఏం చూపించానో తెలుసుకోకుండానే ఫాంటమ్ పై నిషేధం విధించారు. పాకిస్థాన్ కోర్టు నిర్ణయం నన్ను షాక్ కు గురిచేసింది. ఏ వ్యక్తిని కూడా కించపర్చే ఉద్దేశం నాకు లేదు. ఈ సినిమా ఉగ్రవాదానికి వ్యతిరేకమేకానీ, పాకిస్థాన్ కు కాదు' అని కబీర్ ఖాన్ చెప్పుకొచ్చారు. 26/11 ముంబై దాడులు, వాటి వెనకున్న అసలు వ్యక్తులు తదితర ఆసక్తికర అంశాల చుట్టూ తిరిగే ఫాంటమ్ కథలో సైఫ్ అలీఖాన్, కత్రినా కైఫ్ ప్రధాన పాత్రలు పోషించారు. 50 కోట్లతో నిర్మించిన ఈ సినిమా ఆగస్టు 28న ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుంది. -
'అతడు చెడ్డ సినిమా తీయడు'
ముంబై: దర్శకుడు కబీర్ ఖాన్ కు హీరో సల్మాన్ ఖాన్ బాసటగా నిలిచాడు. అతడు చెడ్డ సినిమా తీయడని సమర్థించాడు. కబీర్ ఖాన్ తాజా చిత్రం 'పాంథమ్'ను పాకిస్థాన్ లో నిషేధించాలని కోరుతూ హైకోర్టులో జమాత్-వుద్-దవాహ్ చీఫ్ హఫీజ్ సయీద్ పిటిషన్ వేశాడు. దీనిపై సల్మాన్ ఖాన్ స్పందించాడు. 'పాంథమ్ సినిమా ఇంకా చూడలేదు. దీని గురించి కామెంట్ చేయడం ఇప్పుడు కరెక్ట్ కాదు. కబీర్ ఖాన్ చెడ్డ సినిమా తీయడని నా నమ్మకం. అతడు చాలా నిజాయితీ పరుడు' అని విలేకరులతో సల్మాన్ చెప్పాడు. ఎస్ హుస్సేన్ జైదీ నవల 'ముంబై ఎవెంజర్స్' ఆధారంగా 'పాంథమ్'ను తెరకెక్కించారు. సైఫ్ అలీఖాన్, కత్రినా కైఫ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ఆగస్టు 28న విడుదల కానుంది. కాగా, తన సినిమాను పాకిస్థాన్ లో నిషేధించాలని కోర్టుకు ఎక్కడం ఆశ్చర్యం కలిగించలేదని సైఫ్ అలీఖాన్ అన్నాడు. తన గత చిత్రం 'ఏజెంట్ వినోద్'ను పాకిస్థాన్ లో నిషేధించిన విషయాన్ని గుర్తు చేశాడు. -
ఈ వారం యూట్యూబ్ హిట్స్
ఫాంటమ్ : ట్రైలర్ నిడివి : 2 ని. 41 సె. హిట్స్ : 26,59,944 బజ్రంగీ భాయ్‌జాన్ దర్శకుడు కబీర్ ఖాన్ మళ్లీ ఇంకో సినిమాను తెరపైకి తెస్తున్నారు! 26/11 బాంబు పేలుళ్ల కథాంశంతో కబీర్ తీసిన ‘ఫాంటమ్’ ఈ నెల 28 న విడుదల కాబోతోంది. సయీఫ్ అలీఖాన్, కత్రీనా కైఫ్ నటించిన ఈ చిత్రం ట్రైలర్... ఎంతో ఉత్కంఠభరితంగా, సినిమాపై ఆసక్తిని రేకెత్తించేలా ఉంది. థీమ్ ఒకటే కాబట్టి... హాలీవుడ్ యాక్షన్ థ్రిల్లర్ ‘జీరో డార్క్ థర్టీ’ (2012) కి, ‘ఫాంటమ్’కీ మధ్య కొన్ని పోలికలు కనిపించవచ్చు. బ్లాక్ మాస్ : ట్రైలర్ నిడివి : 2 ని. 31 సె. హిట్స్ : 20,23,216 అమెరికా నేర పరిశోధన సంస్థ ఎఫ్.బి.ఐ.కి, 1970ల నాటి ఆ దేశపు నేరగాడు వైటీ బల్జర్కు మధ్య సాగిన ‘అపవిత్ర’ బంధాన్ని కథాంశంగా తీసుకుని స్కాట్ కూపర్ దర్శకత్వం వహించి, నిర్మించిన చిత్రం ‘బ్లాక్ మాస్’పై ఇది మూడో ట్రైలర్. హాలీవుడ్ చిత్రాలలో తరచు తలపై పక్షితో కనిపించే జానీ డిప్ ఇందులో వైటీ బట్జర్ పాత్రను పోషిస్తున్నారు. (బహుశా మొదటిసారిగా తలపై పక్షి లేకుండా). సినిమా విడుదల సెప్టెంబర్ 18. బజ్రంగి భాయ్‌జాన్ డైరీస్ : హర్షాలీ నిడివి : 3 ని. 18 సె. హిట్స్ : 12,69,633 సెట్స్‌లో ఉన్నప్పుడు బజరంగీ భాయ్‌జాన్ లోని ఆరేళ్ల చిన్నారి హర్షాలీ రకరకాలుగా ప్రవర్తించేది. సాటి పిల్లలతో ఎలా ఉండేదో స్టార్లతో అలా ఉండేది. ఓసారైతే దర్శకుడు ధ్యాన ముద్రలో ఉండి సన్నివేశాలను షూట్ చేస్తున్నప్పుడు మధ్యలోకి వెళ్లి ఆయన జుట్టు పట్టుకుని లాగింది! ఇంకోసారి అనెక్స్పెక్టెడ్గా ఆయనకు ఓ ముద్దు కూడా ఇచ్చింది. ఇలాంటి బిహైండ్ ద సీన్స్ అన్నిటినీ కలిపి కూర్చిన వీడియో ఇది. స్ప్లిట్‌విల్లా సీజన్ 8 ఎపిసోడ్ 6 నిడివి : 44 ని 13 సె. హిట్స్ : 10,66,361 ఈ... ప్రేమ, లాలసల క్రీడ... స్ల్పిట్విల్లాలో మెలికలు, మలుపులు కొనసాగుతూనే ఉన్నాయి. సుబుహీ అనే అమ్మాయి ‘క్వీన్’గా ఎంపికయింది. ఇక చెప్పేదేముంది? అబ్బాయిలకు ప్రేమ గండం. తర్వాత ఎంపిక కావలసింది ‘కింగ్’. ‘థార్న్ అండ్ రోజెస్’ అనే వినూత్నమైన పోటీతో అతడిని ఎన్నుకోవడాన్ని ఈ వీడియోలో మనం వీక్షించవచ్చు. ఎం.టి.వి.లో వస్తున్న ఇండియన్ రియాలిటీ షోనే స్ల్పిట్ విల్లా. అమెరికన్ డేటింగ్ షో ‘ఫ్లేవర్ ఆఫ్ లవ్ ’ ప్రేరణతో రూపొందిన ఈ షో.. ప్రస్తుతం 8వ సీజన్లో ఉంది. అందులోని 6వ ఎపిసోడ్ ఇది. హౌ టు ‘క్రికెట్’ : ఎ.ఐ.బి. అండ్ జెస్ రైన్ నిడివి : 4 ని. 8 సె. హిట్స్ : 4,06,982 క్రికెట్ ఆడడం ఎలా అనే టాపిక్‌తో సరదాగా తయారైన వీడియో ఇది. భారతదేశంలో పేరు మోసిన వివాదాల కామెడీ గ్రూపు అ ఐఛీజ్చీ ఆ్చజుఛిూూూ (అఐఆ), టొరంటో లోని యూ ట్యూబ్ గ్రూపు ‘జెస్ రైన్’ కలిసి క్రియేట్ చేసిన ఈ వ్యంగ్య దృశ్యమాలిక అందర్నీ ఆకట్టుకుంటోంది. నవ్వు తెప్పించే ముఖాలతో ఉన్న ఎనభైల నాటి క్రికెట్ ఆటగాళ్లు కొందరు ఇందులో క్రికెట్లోని బేసిక్స్, స్కిల్స్ చెబుతుంటారు. మచ్చుకి: క్రికెట్లో 11 మంది ప్లేయర్సే ఎందుకు ఉంటారు? అనే ప్రశ్నకు వారి జవాబు: ‘పన్నెండో ప్లేయర్ చచ్చిపోయాడు కనుక’. బ్రదర్స్ యాంథమ్ నిడివి : 2 ని. 22 సె. హిట్స్ : 3,09,057 బ్రదర్స్ చిత్రంలోని సంఘీభావ గేయం ఇది. అక్షయ్ కుమార్, సిద్ధార్థ మల్హోత్రా తమ కండర విన్యాసాలను, వ్యాయామాలను ప్రదర్శిస్తుండగా నేపథ్య గేయంగా వినిపిస్తుంటుంది. గానం విశాల్ దడ్లానీ. సంగీతాన్ని సమకూర్చింది 2012 నాటి అగ్నిపథ్ చిత్రంలోని ఐటమ్ సాంగ్ ‘చిక్నీ చమేలీ’కి సంగీతాన్నిచ్చిన జంట అజయ్, అతుల్. ‘తేరి బారి హై కమర్ కస్ లె / తేరె బస్ మే హై సారే మస్లే / తేరె టూటె హు దిల్కి జమీనొ పే / హిమ్మత్ కి ఉగా లె ఫస్లీ..’ వంటి స్ఫూర్తిదాయకమైన వాక్యాలతో ఈ గేయం యూత్‌ని ఉరకలెత్తిస్తోంది.