లేడీ కమాండో
‘‘మొదటి’’ ప్లేస్‌లో చాలామంది ఉంటారు!ఏకైక అనేది అతికొద్దిమందికే దక్కుతుంది!ఇది అరుదైన అవకాశం.. ప్రత్యేకమైన స్థానం!ఇది దక్కించుకున్న మహిళ డాక్టర్ సీమారావు..ఆ అర్హత ఆమెకు ఆషామాషీగా రాలేదు.వీరగాథలు విన్నది.. వీరోచిత పోరాటాలు చేసింది..సైన్యానికి యుద్ధ విద్యలను నేర్పుతోంది!ఫస్ట్ అండ్ ఓన్లీ ఫీమేల్ కమాండో ట్రైనర్‌గా భారత సాయుధ దళాలు ఆమెకు సెల్యూట్ చేస్తున్నాయి!!
‘‘నాన్న పోయారు’’ ఇంటి నుంచి ఫోన్. ఆ ఫోన్‌కాల్ ఇచ్చిన షాక్ నుంచి తేరుకున్నాక మనసులో పొగిలి పొగిలి ఏడ్వడం తప్ప ఆమె ఉన్న పళంగా బయలుదేరి తండ్రి చివరి చూపుకు నోచుకోలేదు. కారణం.. అప్పుడామె తన సొంతూరుకి వందల కిలోమీటర్ల దూరంలో.. కాలి నడకే దుస్సహాసమైన పర్వతసానువుల్లో ఉంది. ‘‘అమ్... మా...’’ నరాలు తెగిపోతున్న బాధను పంటి వరకు పరిమితం చేసి గొంతు నొక్కేసి పెదువులు బిగించేసింది. ‘‘ఓర్చుకో...’’ఫస్ట్ ఎయిడ్ చేస్తూ చెప్పాడు భర్త. ‘‘ఉమ్...’’ కేకగా బయటకు రాని నొప్పి నీళ్లుగా కళ్లలోంచి జారుతుండగా కళ్లను గట్టిగా మూసుకుంటూ అంది. ‘‘ఇవన్నీ నీకు కొత్తకాదు కదా..’’ భార్య భుజం తడుతూ అన్నాడు. ఆ సున్నితమైన ఆత్మీయ స్పర్శను కూడా భరించే స్థితిలో లేదామే. అర్థమైనవాడల్లే వెంటనే భుజమ్మీద నుంచి చేయి తీసేసాడు భర్త. ‘‘దీపక్.. మనకు పిల్లలు వద్దు’’ అన్నది. భర్తలో ఆశ్చర్యం, ఆవేశం ఏమీ లేదు. ఎందుకు అన్న ప్రశ్న కూడా లేదు. ఎందుకంటే అతనికి తెలుసు అది ఆమె స్థిర నిర్ణయం అని.
‘‘అమ్మాయి పుట్టిందని చెత్తకుప్పలో పడేసిన తండ్రి’’... ‘‘గర్భంలో ఉన్నది ఆడపిల్ల తెలిసి అబార్షన్ చేయించుకొమ్మని అత్తింటివారి బలవంతం’’... ‘‘పుట్టిన అమ్మాయిని పురిట్లోనే చంపేసిన కాసాయి తండ్రి’’.. వార్తాపత్రికల్లో ఒకే రోజు వచ్చిన ఆ వార్తలకు చలించిపోయింది ఆమె. ‘‘మనం ఓ ఆడపిల్లను దత్తత తీసుకుందాం’’ చెప్పింది భర్తతో. ఈసారి మారుమాట లేకుండా ఆనందంగా ఒప్పుకున్నాడు భర్త. ఆమే సీమా రావు. భారతదేశపు మొట్టమొదటి, ఏకైక మహిళా కమెండో శిక్షకురాలు. పైన చెప్పిన సంఘటనలన్నీ సీమా ఎంచుకున్న రంగం వల్ల ఆమెకు ఎదురైన అనుభవాలు, కోల్పోయిన అవకాశాలు!
అయినా కర్తవ్యమే మిన్న అంటారు సీమా. తల్లి కావాలని ఏ స్త్రీ కలకనదు? ఆశ పడదు? కాని కమెండో ట్రైనర్‌గా తన శరీర కష్టం ఎలాంటిదో తెలుసు.. ఎన్నో సార్లు ఆమె మీద దాడులు జరిగాయి. ఆమే ఎదురు దాడి చేసింది. వెన్నుముక విరిగింది. తలకూ తీవ్రగాయలై కొన్ని నెలలపాటు జ్ఞాపకశక్తిని కోల్పోయి తనను తానే మరిచిపోయింది. ఇవన్నీ అనుభవించాకే నిశ్చయించుకుంది అమ్మతనం వద్దని. చేస్తున్న పనిపట్ల అంత నిబద్ధత.. అంకిత భావం.
వారసత్వంలోనే ఉంది..
సీమ తత్వంలో ఉన్న పోరాటపటిమ ఆమెకు వారసత్వంగా వచ్చిందే. ఆమె తండ్రి ప్రొఫెసర్ రమాకాంత్ సినరి స్వాతంత్య్ర సమరయోధుడు. పోర్చుగీస్ ఆక్రమణలో ఉన్న గోవా విముక్తి కోసం పోరాడిన వీరుడు. సీమా చిన్నప్పుడు ఆ వీరోచిత పోరాట సంఘటనలనే కథలుగా చెప్పేవాడు కూతురికి. తర్వాత ఆమె ఎంచుకున్న కెరీర్‌కు అవే స్ఫూర్తి. దేశం కోసం ఏదైనా చేయాలి... సైనికురాలిగా దేశాన్ని కాపాడాలి అనే తపనతోనే పెరిగారు సీమ.
చానెల్..
సీమ శక్తికి, యుక్తికి సరైన చానల్ ఆమె పదహారవ యేట దొరికింది. దీపక్ రావు పరిచయం అయ్యాడు. అప్పటికే ఆయన మార్షల్ ఆర్ట్స్ ట్రైనర్‌గా ఉన్నాడు. ఆయన దగ్గర శిక్షణ తీసుకోవడం మొదలుపెట్టారు ఆమె. అలా దీపక్‌రావుతో పరిచయం, ఆయన దగ్గర శిక్షణ... ఇద్దరూ కలిసి జీవితంలోనూ ప్రయాణించే పరిణయంగా మారింది. పెళ్లి చేసుకున్నారు. తర్వాత ఇద్దరూ కలిసి మిలిటరీ మార్షల్ ఆర్ట్స్‌లోనూ శిక్షణ తీసుకోవడం మొదలుపెట్టారు. ఓవైపు మెడిసిన్ చదువుతూనే ఇంకో వైపు షూటింగ్, వెపన్ డిఫెన్స్‌లలో ట్రైనింగ్ తీసుకోసాగారు. డాక్టర్ అయ్యాక సీమా క్రైసిస్ మేనేజ్మెంట్లో ఏంబీఏ కూడా చేశారు. అయినా ఏదో అసంతృప్తి. చిన్నప్పటి నుంచి తను కలగన్నది వేరు. లక్ష్యం వేరు. అది సాధించాలి. దేశానికి సేవ చేసే అవకాశం పొందాలి అని ఆలోచించి చివరకు దేశ సాయుధ దళ సైనికులకు శిక్షణనివ్వాలని నిర్ణయించుకున్నారు. వెంటనే 1996లో ఆర్మీ, నావీ, బీఎస్ఎఫ్, ఎన్ఎస్జీ ప్రధాన సైనికాధికారులను కలిశారు. తమ ఆశయం గురించి వివరించారు. సీమా దంపతుల అంకితభావం, నిబద్ధత చూసి సైనికాధికారులు చలించారు. అవకాశమిచ్చారు. అంతే మళ్లీ వెనక్కి తిరిగి చూడలేదు సీమా. ఎన్ని అవరోధాలు ఎదరైనా. 22 ఏళ్లుగా పైసా ప్రతిఫలం ఆశించకుండా ఫుల్‌టైమ్ ట్రైనర్‌గా ఉన్నారు ఆమే, ఆమె భర్త మేజర్ దీపక్‌రావు కూడా. ప్రత్యక్ష యుద్ధంలో ప్రతిపక్ష సైనికులను ఎదుర్కొనే విద్యనూ నేర్పిస్తున్నారు.
కమెండోలకు ట్రైనింగ్..
సైనికబలగాల్లోని ఎన్ఎస్జీ బ్లాక్ క్యాట్స్, పారా కమాండోస్, మార్కోస్, గరుడ్, బీఎస్ఎఫ్ కమాండోస్‌కు ట్రైనింగ్ ఇస్తున్నారు సీమా. అయితే మొదట్లో.. ఒక మహిళ దగ్గర మేము శిక్షణ పొందడమేంటీ అన్నట్లుగా తిరస్కార ధోరణితో ఉండేవాళ్లట జవాన్లంతా. అయినా స్థయిర్యం కోల్పోకుండా అదే క్రమశిక్షణ, పట్టుదలతో ముందుకు సాగారు సీమా. చివరకు ఆమెను అనుసరించక తప్పలేదు జవాన్లకు. పురుషులకు మాత్రమే పరిమితమైన ఈ రంగంలో అడుగడుగునా తన సామర్థ్యాన్ని నిరూపించుకుంటునే ఉన్నారు. ఇప్పటికీ ప్రతీ కొత్త బ్యాచ్‌లోని జవాన్లు మహిళ అయిన సీమా దగ్గర శిక్షణ పొందడానికి మొదట్లో ఇబ్బంది పడ్తూనే ఉన్నారు. లెక్క చేయకుండా ముందుకు వెళ్తూనే ఉన్నారు సీమా. ఆమె ఇచ్చే శిక్షణలోని మెళకువలు, నైపుణ్యం చూసి ఆ సేవలను నేషనల్ పోలీస్ అకాడమీ, ది ఆర్మీ ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ అందుకుంటోంది. 2009లో గరుడ కమాండోస్‌కు శిక్షణ తర్వాత ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ పారా జంప్ కోర్స్ శిక్షణ ఇవ్వడం కోసం ఆమెను ఆహ్వానించారు. ఇదీ ఆమె అందుకున్న అరుదైన గౌరవం, అరుదైన విజయం కూడా!
పదిమందిలో ఒకరు..
షూటింగ్.. ఆమె బలం. మార్షల్ ఆర్ట్స్ ఆమె స్టయిల్. బ్రూస్లీ కనిపెట్టిన జీట్ కూన్ డోలో ఎక్స్పర్ట్. ఈ విద్యలో ప్రపంచ వ్యాప్తంగా కేవలం పది మంది మహిళలు మాత్రమే నిష్ణాతులు. అందులో సీమారావు ఒకరు. 20 ఏళ్లకు పైగా భారత సైస్యంలో తాను అందిస్తున్న సేవలకుగాను 2011లో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాస్ ర్యాంక్ అవార్డ్‌ను పొందారు. తన భర్తతో కలిసి నాలుగు సార్లు ఆర్మీ చీఫ్ సైటేషన్స్ అందుకున్నారు. ఇది రికార్డ్. సీమా దంపతులు అనార్మ్డ్ కమాండో కంబాట్ అకాడమీ (యూసీసీఏ), యాన్ ఎలీట్ మిలిటరీ మార్షల్ ఆర్ట్స్ అకాడమీని స్థాపించారు. ఈ అకాడమీలో జీట్ కూన్ డో తోపాటు ఇతర మార్షల్ ఆర్ట్స్‌లో శిక్షణ ఇస్తారు. ౖౖౖౖట్రైనింగ్ మీద సైనికుల కోసం పుస్తకాలు రాస్తున్నారు, ప్రచురిస్తున్నారు. మామూలు పౌరుల కోసమూ అనార్మ్డ్ కాంబాట్ బ్లాక్‌బెల్ట్ ప్రోగామ్‌ను నిర్వహిస్తున్నారు.
డేర్..
మహిళల రక్షణకోసమూ నడుం బిగించారు సీమా. వేధింపులు, లైంగిక దాడులను స్త్రీలు ఎదుర్కొనేలా ఈఅఖఉ (డిఫెన్స్ ఎగైన్స్ట్ రేప్ అండ్ ఈవ్ టీజింగ్) అనే ట్రైనింగ్ ప్రోగ్రామ్‌ను ప్రారంభించారు. మానసికంగా, శారిరకంగా మహిళలను దృఢంగా తయారు చేయడమే ఈ ప్రోగ్రామ్ ధ్యేయం. అంతేకాదు దేశంలోనే మొదటి మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ మీద ‘ఏ్చ్టజ్చిp్చyజీ’ అనే సినిమా నిర్మించి అందులో సీమా నటించారు కూడా. ఈ సినిమాలో తొలిసారిగా జీట్ కూన్ డోను చూపించారు. ఈ చిత్రం దాదాసాహెబ్ ఫాల్కే జ్యూరీ ప్రత్యేక ప్రశంసలను పొందింది.
ఆమె ఓ శక్తి..
ఇప్పటి వరకు దాదాపు పదిహేను వేల మంది సైనికులకు శిక్షణనిచ్చిన సీమారావు 47 దేశవిదేశాల సన్మానపురస్కారాలతోపాటు అత్యంత ప్రతిష్ఠాత్మకమైన వరల్డ్ పీస్ అవార్డ్, ప్రెసిడెంట్స్ వలంటీర్ సర్వీస్ అవార్డ్లనూ అందుకున్నారు. ‘‘భారత సైనికులకు శిక్షణనివ్వడంలో ఉన్న ఆత్మసంతృప్తే నాకు అన్నిటికన్నా గొప్ప అవార్డ్’’ అంటారు సీమారావు వినమ్రంగా. సామాన్యులూ అసాధారణ పనులు చెయ్యొచ్చు అని నిరూపించిన ఈ స్త్రీ శక్తికి సలాం!