మావోయిస్టులపై మహిళా కమాండోల పోరు
అన్ని రంగాల్లో మగాళ్లతో సమానంగా దూసుకుపోతున్న మహిళలకు యుద్ధరంగంలో మాత్రం ఇంకా సరైన అవకాశాలు రావట్లేదు. వారి దేహదారుఢ్యం యుద్ధరంగానికి సరిపోదని విధాన నిర్ణేతలు ఇంతకాలం అన్నారు. అయితే.. మహిళల ఉత్సాహం చూసి విధాన నిర్ణేతల్లో కూడా మార్పు వచ్చింది. అందుకే ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని కాంకర్ జిల్లాలోని 'కౌంటర్ టెర్రరిజం జంగిల్ వార్‌ఫేర్ కాలేజీ' (సీటీజేడబ్లూసీ)లో మహిళల శిక్షణకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. ఈ కాలేజీలో గత ఫిబ్రవరి 28వ తేదీన 44 మంది మహిళలు అన్ని రకాల యుద్ధవిద్యల్లో ఆరితేరి కమాండోలుగా సర్టిఫికెట్లు అందుకున్నారు. నదీనదాలు దాటి కొండలు, గుట్టలు ఎక్కి ఎలాంటి వాతావరణ పరిస్థితుల్లోనైనా గెరిల్లా పోరాటాలకు కఠిన శిక్షణను పూర్తిచేసి పురుషులకు ఏ మాత్రం తీసిపోమని నిరూపించారు. వీరిని ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని మావోయిస్టు ప్రాబల్య ప్రాంతాల్లో నియమిస్తామని అదనపు డీజీపీ (యాంటి మావోయిస్టు ఆపరేషన్స్) ఆర్కే విజ్ తెలిపారు.
ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో మొత్తం 27 జిల్లాలుండగా, 16 జిల్లాల్లో నక్సల్స్ ప్రాబల్యం ఎక్కువగా ఉంది. మావోయిస్టు నాయకుడు ముప్పాళ్ల లక్ష్మణరావు అలియాస్ గణపతి ఇక్కడే ఉన్నారని పోలీసుల అనుమానం. ఆయనకు సుశిక్షితులైన మహిళా మావోయిస్టులే అనుక్షణం రక్షణ వలయంగా ఉంటారని చెబుతుంటారు. అడవుల్లో తలదాచుకునే మావోయిస్టులను ఏరివేసేందుకు ఈ కమాండో మహిళలకు శిక్షణ ఇచ్చారు. తెచ్చుకున్న రేషన్ అడుగంటినప్పుడు ఆకులు, అలములే కాకుండా పాములు, పీతలు, చీమలు ఉడకేసుకొని తినడంలో కూడా వీరికి శిక్షణ ఇచ్చారు.
ఇక ఆయుధ రంగంలో ఇన్సాస్ అసాల్ట్ రైఫిల్స్, లైట్ మషిన్ గన్స్, సెల్ఫ్ లోడింగ్ గన్స్ (ఎస్‌ఎల్‌ఆర్), ఏకే-47 తుపాకులు, అండర్ బ్యారెల్ గ్రెనేడ్ లాంచర్స్, మోర్టార్ల ప్రయోగంలో కూడా శిక్షణ ఇచ్చారు. ఈ బ్యాచ్‌లో శిక్షణ పొందిన 44 మంది మహిళల్లో ఎక్కువ మంది అతిపేద గ్రామాలకు చెందిన యువతులే ఉన్నారు. మావోయిస్టు మహిళా దళాల్లో కూడా ఇలాంటి గ్రామాలకు చెందినవారే ఎక్కువగా ఉండడం వల్ల వ్యూహాత్మకంగానే కమాండో శిక్షణకు వీరిని ఎంపిక చేసినట్టు తెలుస్తోంది. వీరిలో మెజారిటీ యువతులు శారీరకంగా, మానసికంగా మగవారికన్నా బలంగా ఉన్నారని కాలేజీ డెరైక్టర్ బ్రిగేడియర్ (రిటైర్డ్) బీకే పొన్వార్ తెలిపారు. ఎలాంటి పోరాటానికైనా తాము రెడీ అని 23 ఏళ్ల సబ్-ఇన్‌స్పెక్టర్ రష్మీ థామస్ ఆత్మవిశ్వాసంతో మీడియాకు తెలిపారు.