lakshmi haram
-
తిరుమలలో శ్రీవారి లక్ష్మీహారం ఊరేగింపు
సాక్షి,తిరుపతి: తిరుమలలో ఆదివారం ఉదయం శ్రీవారి లక్ష్మీహారాన్ని ఆలయం నుండి వైభవోత్సవ మండపం వరకు ఊరేగించారు. అంతకు ముందు శ్రీవారి పాదాల చెంత లక్ష్మీహారాన్ని ఉంచి ప్రత్యేక పూజలు చేశారు. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలలో భాగంగా గజవాహనం రోజున శ్రీవారి ఆభరణాల ఖజానా నుంచి అత్యంత ప్రధానమైన లక్ష్మీకాసుల హారాన్ని అమ్మవారికి అలంకరించడం ఆనవాయితీ. అందులో భాగంగా ఆదివారం తిరుమల నుంచి అత్యంత భద్రత నడుమ వాహనంలో శ్రీవారి లక్ష్మీహారాన్ని తిరుచానూరుకు తరలించారు. సాయంత్రం గజవాహన సేవలో శ్రీవారి లక్ష్మీహారాన్ని అమ్మవారికి అలంకరిస్తారు. అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పణ తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. గజవాహనసేవకు ప్రభుత్వ విప్ చెవిరెడ్డి భాస్కర్రెడ్డి అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. తుమ్మలగుంట శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయం నుంచి చెవిరెడ్డి దంపతులు పట్టువస్త్రాలు తీసుకొచ్చి అమ్మవారికి సమర్పించారు. ప్రతి ఏటా గజవాహన సేవ రోజు కల్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయం నుంచి పట్టువస్త్రాలను తీసుకెళ్లి సమర్పించడం ఆనవాయితీ.. ఈ సారి భారీ వర్షం కురిసినప్పటికీ ఆ ఆనవాయితీని చెవిరెడ్డి భాస్కర్రెడ్డి దంపతులు కొనసాగించారు. -
పద్మావతీదేవికి లగడపాటి లక్ష్మీహారం
తిరుపతి: తిరుచానూరులో కొలువై ఉన్న శ్రీపద్మావతీ అమ్మవారికి మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ లక్ష్మీహారాన్ని కానుకగా అందజేశారు. నిన్న (ఆదివారం) ఉదయం 9 గంటలకు కుటుంబ సమేతంగా అమ్మవారిని దర్శించుకున్న లగడ పాటి మొక్కులు చెల్లించుకునే క్రమంలో ప్రత్యేకంగా తయారు చేయించిన రూ.7.74 లక్షల విలువ గల లక్ష్మీహారాన్ని అమ్మవారికి కానుకగా సమర్పించారు. మంచి ముత్యాలు, కెంపులు, పచ్చలు, పగడాలను బంగారంలో పొదిగి 235 గ్రాముల బంగారంతో ప్రత్యేకంగా తయారు చేయించిన హారాన్ని రాజగోపాల్ స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ ఈవో మునిరత్నంరెడ్డికి అందజేశారు. ఆలయ ప్రధాన అర్చకుడు బాబూస్వామి వారికి పూలు, కుంకుమ అందజేశారు.