Murali Krishna Goud
-
ఉంటే ఉండండి.. పోతే పోండి
ప్రొద్దుటూరు టౌన్: ‘ఇష్టం ఉంటే పని చేయండి. లేదంటే వెళ్లిపోండి. పొయ్యేవాళ్లు పోతే పని చేసేందుకు చాలా మంది వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారంటూ’ మున్సిపల్ ఉద్యోగులను ఆ శాఖ ఆర్డీఓ మురళీకృష్ణగౌడ్ కడిగిపారేశారు. ప్రొద్దుటూరు మున్సిపల్ కార్యాలయంలోని కమిషనర్ చాంబర్లో మంగళవారం ఏర్పాటు చేసిన ఇంజినీరింగ్, రెవెన్యూ, టౌన్ ప్లానింగ్, శానిటరీ విభాగపు అధికారుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మున్సిపాలిటీలో రూ.53 కోట్లు ఉన్నా ఎందుకు వినియోగించడం లేదని నిలదీశారు. మున్సిపాలిటీ గదులకు సంబంధించి రూ.1.50 కోట్లకు పైగా బకాయిలు ఉన్నాయని, ఎందుకు వసూలు చేయడం లేదని ప్రశ్నించారు. నీటి పన్ను రూ.2.30 కోట్ల దాకా పేరుకుపోవడంపై ఆయన అసహనం వ్యక్తం చేశారు. ఇలాగైతే ఎవరినీ క్షమించేది లేదని హెచ్చరించారు. దీనిపై కమిషనర్ వెంకటకృష్ణ స్పందిస్తూ... ఇప్పటికే బిల్ కలెక్టర్లు, ఆర్ఐలకు మెమో జారీ చేశామన్నారు. జీతాలు నిలబెట్టి సస్పెండ్ చేసి అయినా వసూలు చేయాలని కమిషనర్‌ను ఆదేశించారు. నెలాఖరుకు 80 శాతం పన్ను వసూలు చేయాలని స్పష్టంగా చెప్పారు. అక్టోబర్ 2న సుజల స్రవంతి పథకాన్ని ప్రొద్దుటూరులో ప్రారంభించకపోతే సస్పెండ్ తప్పదని డీఈలు విజయకుమార్‌రెడ్డి, రమణను ఆర్డీఓ హెచ్చరించారు. ప్రభుత్వం 25 వేల మంది జనాభాకు ఒక ప్లాంట్ ఏర్పాటు చేయాలని ఆదేశించిందన్నారు. 168 జీఓ వచ్చి రెండేళ్లు గడుస్తున్నా ఇంత పెద్ద మున్సిపాలిటీలో ఒక్కరిపైనైనా ప్రాసిక్యూషన్ చేశారా అని ఆర్డీ టౌన్ ప్లానింగ్ అధికారులను ప్రశ్నించారు. సీపీ శ్రీనివాసులు ఏం చేస్తున్నారని నిలదీశారు. నెలాఖరు లోపు చార్జిషీట్ ఫైల్ చేయకపోతే జీతాలు ఆపివేయాలని కమిషనర్‌ను ఆదేశించారు. గిడ్డంగి వీధిలో ప్లానింగ్‌కు విరుద్ధంగా సెల్లార్ కడుతున్నా ఎందుకు ఆపలేకపోతున్నారని ఆయన మండిపడ్డారు. అధికారులపై పని తీరు సక్రమంగా లేదంటూ చైర్మన్ గురివిరెడ్డి ఆర్డీకి ఫిర్యాదు చేశారు. -
11 మంది సస్పెన్షన్
నంద్యాల టౌన్: ఆస్తి పన్ను వసూళ్లలో అక్రమాలకు పాల్పడిన మునిసిపల్ ఉద్యోగులపై వేటు పడింది. నంద్యాల మునిసిపాలిటీలో తొమ్మిది మంది బిల్కలెక్టర్లను, ఇద్దరు రెవెన్యూ ఇన్స్పెక్టర్లను సస్పెండ్ చేస్తూ పురపాలక శాఖ రీజనల్ డెరైక్టర్ మురళీకృష్ణగౌడ్ మంగళవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ కుంభకోణంపై విచారణ జరపడానికి ప్రత్యేక అధికారిగా అడిషనల్ డెరైక్టర్ రమేష్‌బాబును నియమించే సూచనలు కనిపిస్తున్నాయి. మునిసిపాలిటీలో కొత్తగా నిర్మించిన దుకాణాలు, భవనాలు, అపార్ట్మెంట్లను కొలిచి కొందరు బిల్ కలెక్టర్లు, రెవెన్యూ ఇన్స్పెక్టర్లు..పన్నును నిర్ధారించారు. యజమానుల నుంచి భారీగా మామూళ్లు దండుకొని ఆస్తి పన్ను తగ్గించి ఆన్లైన్లో నమోదు చేశారు. ఈ వ్యవహారాన్ని గత నెల 29వ తేదీన ‘సాక్షి’ బయట పెట్టింది. నంద్యాల మున్సిపాలిటీలో భారీగా ఆస్తి పన్ను స్వాహా చేశారంటూ వార్తా కథనాన్ని ప్రచురించింది. ఈ కథనం ప్రభుత్వం దృష్టికి వెళ్లగా పురపాలక శాఖ మంత్రి నారాయణ సీరియస్‌గా తీసుకున్నారు. వెంటనే విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని డెరైక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ జనార్దన్‌రెడ్డిని ఆదేశించారు. ఆయన ఆదేశాల మేరకు ఆర్డీ మురళీకృష్ణగౌడ్ విచారణను చేపట్టారు. అక్రమాలు తేలడంతో తొమ్మిది మంది బిల్ కలెక్టర్లను, ఇద్దరు రెవెన్యూ ఇన్స్పెక్టర్లను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. సస్పెండైన వారు వీరే..: అమీర్అలీబేగ్, మద్దిలేటి, ప్రభాకర్, ఫజుల్ రహెమాన్, మల్లికార్జున, బీవీ రామసుబ్బయ్య, రసూల్(నంద్యాల), జీవీ కృష్ణమూర్తి(డోన్), వీసీ ఓబులేసు(ఆదోని), రెవెన్యూ ఇన్స్పెక్టర్లు వెంకటేశ్వరగౌడ్(డోన్), ఏసుదాసు(ఆదోని)లు సస్పెండయ్యారు. ఎంబుక్ అదృశ్యం కేసులో సస్పెండైన రెవెన్యూ ఇన్స్పెక్టర్ లక్ష్మీనారాయణ, రిటైర్డు రెవెన్యూ ఇన్స్పెక్టర్ సుబ్రమణ్యంలపై కూడా చర్యలు తీసుకోవాలని ఆర్డీ మురళీకృష్ణగౌడ్ ఆదేశించారు. ఆర్ఐని తప్పించిన వైనం..: మునిసిపల్ అధికారులు పంపిన నివేదికలో ప్రస్తుత ఆర్ఐ పేరును తప్పించినట్లు ఉన్నతాధికారులు గుర్తించారు. ఆడిట్ అధికారులు పరిశీలించిన ఎంఎల్ రికార్డుల్లోని ఆర్ఐ పేరు కూడా ఉంది. ఇతని పేరును తప్పించాలని అధికార పార్టీకి చెందిన కొందరు నేతల నుండి ఒత్తిళ్లు వచ్చినట్లు తెలిసింది. గతంలో స్టేషనరీ కుంభకోణంలో సస్పెండైన ఇతన్ని రెవెన్యూ ఇన్స్పెక్టర్గా నియమించడం కూడా వివాదాస్పదమైంది. ఇతని పేరును తప్పించడంపై ఉన్నతాధికారులు సీరియస్‌గా తీసుకున్నట్లు తెలిసింది. -
మున్సిపాలిటీలకు రూ.48 కోట్లు
మదనపల్లె, న్యూస్‌లైన్ : రాయలసీమ పరిధిలోని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు రాష్ట్ర ఫైనాన్స్ కార్పొరేషన్(ఎస్ఎఫ్సీ) నిధులు రూ.48 కోట్లు మంజూరైనట్లు మున్సిపల్ రీజనల్ డెరైక్టర్ మురళీకృష్ణగౌడ్ తెలిపారు. గురువారం మదనపల్లె మున్సిపల్ కార్యాలయాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం స్థానిక విలేకరులతో మాట్లాడారు. ఎస్ఎఫ్సీ నిధులతో మున్సిపాలిటీలకు విద్యుత్‌బిల్లులు, వివిధ అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు తెలిపారు. ఇందులో ఒక్కో మునిసిపాలిటీకి రూ.60 లక్షల నుంచి రూ.రెండు కోట్ల వరకు నిధులు వచ్చే అవకాశాలున్నాయన్నారు. రీజనల్ పరిధిలోని మున్సిపాలిటీల్లో ఎస్సీ,ఎస్టీ కాలనీల అభివృద్ధి పనులకు రూ.3 కోట్లు మంజూరైనట్లు తెలిపారు. 2013-14 ఆర్థిక సంవత్సరానికి 42 శాతం ఆస్తిపన్నులు వసూలు చేసినట్లు ఆయన వెల్లడించారు. ఈ ఏడాది మార్చి నాటికి 90 శాతం పన్నులు వసూలు చేసేలా కమిషనర్లు, సిబ్బందిని ఆదేశించినట్లు తెలిపారు. ఇందుకోసం స్పెషల్ డ్రైవ్‌లు నిర్వహించనున్నట్లు చెప్పారు. చెత్తపై కొత్త సమరం కార్యక్రమాన్ని అన్ని మున్సిపాలిటీల్లో నిర్వహిస్తున్నట్టు తెలిపారు. దీనిపై జనవరి 28, 29, 30 తేదీల్లో సదస్సులు నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమాన్ని బాగా అమలు చేసిన మున్సిపాలిటీలకు ప్రోత్సాహక బహుమతులు అందజేయనున్నట్లు తెలిపారు. అనంతరం మున్సిపాలిటీలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్షించారు. సమావేశంలో ఇన్చార్జ్ కమిషనర్ తులసీరామ్, డీఈ నీలకంఠనాయుడు, మేనేజర్ రాంబాబులు పాల్గొన్నారు.