ఉంటే ఉండండి.. పోతే పోండి
ఉంటే ఉండండి.. పోతే పోండి
Published Wed, Sep 17 2014 2:40 AM | Last Updated on Sat, Sep 2 2017 1:28 PM
ప్రొద్దుటూరు టౌన్:
‘ఇష్టం ఉంటే పని చేయండి. లేదంటే వెళ్లిపోండి. పొయ్యేవాళ్లు పోతే పని చేసేందుకు చాలా మంది వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారంటూ’ మున్సిపల్ ఉద్యోగులను ఆ శాఖ ఆర్డీఓ మురళీకృష్ణగౌడ్ కడిగిపారేశారు. ప్రొద్దుటూరు మున్సిపల్ కార్యాలయంలోని కమిషనర్ చాంబర్‌లో మంగళవారం ఏర్పాటు చేసిన ఇంజినీరింగ్, రెవెన్యూ, టౌన్ ప్లానింగ్, శానిటరీ విభాగపు అధికారుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మున్సిపాలిటీలో రూ.53 కోట్లు ఉన్నా ఎందుకు వినియోగించడం లేదని నిలదీశారు. మున్సిపాలిటీ గదులకు సంబంధించి రూ.1.50 కోట్లకు పైగా బకాయిలు ఉన్నాయని, ఎందుకు వసూలు చేయడం లేదని ప్రశ్నించారు. నీటి పన్ను రూ.2.30 కోట్ల దాకా పేరుకుపోవడంపై ఆయన అసహనం వ్యక్తం చేశారు. ఇలాగైతే ఎవరినీ క్షమించేది లేదని హెచ్చరించారు. దీనిపై కమిషనర్ వెంకటకృష్ణ స్పందిస్తూ... ఇప్పటికే బిల్ కలెక్టర్లు, ఆర్‌ఐలకు మెమో జారీ చేశామన్నారు. జీతాలు నిలబెట్టి సస్పెండ్ చేసి అయినా వసూలు చేయాలని కమిషనర్‌ను ఆదేశించారు. నెలాఖరుకు 80 శాతం పన్ను వసూలు చేయాలని స్పష్టంగా చెప్పారు. అక్టోబర్ 2న సుజల స్రవంతి పథకాన్ని ప్రొద్దుటూరులో ప్రారంభించకపోతే సస్పెండ్ తప్పదని డీఈలు విజయకుమార్‌రెడ్డి, రమణను ఆర్డీఓ హెచ్చరించారు. ప్రభుత్వం 25 వేల మంది జనాభాకు ఒక ప్లాంట్ ఏర్పాటు చేయాలని ఆదేశించిందన్నారు. 168 జీఓ వచ్చి రెండేళ్లు గడుస్తున్నా ఇంత పెద్ద మున్సిపాలిటీలో ఒక్కరిపైనైనా ప్రాసిక్యూషన్ చేశారా అని ఆర్డీ టౌన్ ప్లానింగ్ అధికారులను ప్రశ్నించారు. సీపీ శ్రీనివాసులు ఏం చేస్తున్నారని నిలదీశారు.
నెలాఖరు లోపు చార్జిషీట్ ఫైల్ చేయకపోతే జీతాలు ఆపివేయాలని కమిషనర్‌ను ఆదేశించారు. గిడ్డంగి వీధిలో ప్లానింగ్‌కు విరుద్ధంగా సెల్లార్ కడుతున్నా ఎందుకు ఆపలేకపోతున్నారని ఆయన మండిపడ్డారు. అధికారులపై పని తీరు సక్రమంగా లేదంటూ చైర్మన్ గురివిరెడ్డి ఆర్డీకి ఫిర్యాదు చేశారు.
Advertisement