nehru jayanthi
-
బాలల విద్యకు బలమైన పునాదులు వేసిన నెహ్రూ
సాక్షి, అమరావతి: భారత తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ బాలల విద్యకు బలమైన పునాదులు వేసారని గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ కొనియాడారు. పండిట్ నెహ్రూ జయంతిని పురస్కరించుకుని ఏటా నవంబర్ 14న బాలల దినోత్సవం జరుపుకుంటున్నామని, ఈ సందర్భంగా రాష్ట్రంలోని చిన్నారులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నట్టు పేర్కొన్నారు. ఈ మేరకు గవర్నర్ కార్యాలయం శనివారం ప్రకటన విడుదల చేసింది. బాలలు భారతీయ సమాజానికి వెన్నెముకగా పండిట్ నెహ్రూ భావించారన్నారు. నేటి బాలలే రేపటి పౌరులు అనే ఆర్యోక్తిని అనుసరించి దేశ భావిపౌరులుగా మాతృభూమిని కాపాడుతూ, భారతావనికి ఉజ్వల భవిష్యత్తును నిర్మించాల్సిన బాధ్యత బాలలపై ఉందని గవర్నర్ అభిప్రాయపడ్డారు. గవర్నర్‌ను కలిసిన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా శనివారం గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్‌ను కలిశారు. ఢిల్లీ వెళ్లిన గవర్నర్‌ను ఏపీ భవన్లో మర్యాదపూర్వకంగా కలిసిన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి కొద్దిసేపు మాట్లాడారు. -
విద్యార్థులే గురువులుగా..!
రోజు స్కూల్‌కు వస్తున్నాం. ఇంటికి వెళ్తున్నాం. మా గురువులు మాకు పాఠాలు బోధించేందుకు ఎంత శ్రమ పడుతున్నారో మేం బోధన చేస్తే అర్థమయింది. పాఠాలు చెప్పడం ఎంత కష్టమో.. క్రమశిక్షణ అంటే ఏమిటో తెలిసింది. విద్యార్థులందరూ ఒకేచోట ఉన్నప్పడు వారిని ఎలా క్రమశిక్షణలో పెట్టాలో బోధపడింది’ అని అన్నారు విద్యార్థులు. రోజు గురువులు చెప్పే పాఠాలు విన్న విద్యార్థులు బుధవారం టీచర్స్ డే సందర్భంగా వారు పాఠాలు చెప్పడం ఎంత కష్టమో అర్థం చేసుకున్నారు. కాల్వశ్రీరాంపూర్: మండల కేంద్రంతోపాటు మండలంలోని ఆయా గ్రామాల్లో బుధవారం బాలల దినోత్సవం ఘనంగా జరుపుకున్నారు. నెహ్రూ చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. దేశ సౌభాగ్యానికి, సంక్షేమానికి తమవంతు కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేశారు. స్వీట్లు పంచుకున్నారు. అనంతరం తరగతి గదులకు వెళ్లి విద్యార్థులే గురువులుగా మారి పాఠాలు బోధించారు. ఎవరి నైపుణ్యం మేరకు వారు బోధన చేసి గురువులతో శభాష్ అనిపించుకున్నారు. తమకు రోజు పాఠాలు చెప్పే గురువులు ఎలా కష్టపడుతున్నారో అనుభవపూర్వకంగా తెలుసుకున్నారు. ఇంగ్లిషు, సాంఘీకం బోధించా... తొమ్మిదో తరగతి ఇంగ్లిషు, సాంఘిక శాస్త్రం పాఠాలు చెప్పా. మాకు పాఠాలు చెప్పడానికి ప్రతిరోజు మా టీచర్లు ఎంత ఇబ్బందులు ఎదుర్కొన్నారో స్వయంగా అనుభవపూర్వకంగా తెలుసుకున్నా. పాఠాలు చెప్పడం అంటే నేర్పడం కాదు.. మనం కూడా నేర్చుకోవాలన్న విషయం అర్థమయింది. -వంశీ, 10వతరగతి టీచరవుతా... భవిష్యత్తులో టీచరవుతా. తోటి విద్యార్థులకు పాఠాలు చెప్పాలంటే ముందుగా మనం నేర్చుకోవాలి. పుస్తకాలే కాకుండా సమాజంలో నిత్యం జరిగే అనేక విషయాలపై అవగాహన పెంచుకోవాలి. విద్యార్థులు అడిగే కొన్ని ప్రశ్నలకు జవాబులు పుస్తకాల్లో దొరకవు. మన చుట్టూ ఉన్న సమాజంపై అవగాహన కలిగి ఉంటేనే చెప్పగలం. -అభిత, 10వతరగతి సన్నద్ధమయ్యా.. 8వతరగతి ఫిజికల్ సైన్స్ బోధించా. మాకు సార్లు చెప్పినప్పుడు మా దృష్టి మరోవైపు వెళ్లేది. పాఠం చెప్పడానికి రెండు రోజులు సన్నద్ధమయ్యా. విద్యార్థులకు అర్థమయ్యేలా బోధించడం ఎంత కష్టమో అనుభవపూర్వకంగా తెలుసుకున్నా. -సౌమ్య, 9వతరగతి స్నేహితులే చెప్పినట్టు ఉంది.. తోటి స్నేహితులే పాఠాలు చెప్పినట్టు ఉంది. రోజు కలిసి తిరుగుతాం. కలిసి పాఠాలు చెప్పుబున్నట్లు అనిపించింది. ఎలా చెప్తారో అనుకున్నా. బాగానే బోధించారు. మాకు అర్థమయ్యేందుకు మా గురువులు ఎంత కష్టపడుతున్నారో ఇప్పుడు అర్థమయింది. -రాకేశ్, 8వతరగతి శభాష్ అనిపించుకున్నారు ప్రతి క్లాసులో ఎవరికి వారు బాగానే బోధించారు. ముందుగా వారికి కొన్ని విషయాలపై అవగాహన కల్పించాం. బాగా అర్థం చేసుకున్నారు. అందుకు తగ్గట్టుగా తరగతి గదుల్లో వారు ఎంచుకున్న సబ్జెక్టును విద్యార్థులకు బోధించారు. విద్యార్థుల భవిష్యత్తు కోసం ఉపాధ్యాయులు ఎలా ఆరాటపడతారో స్వయంగా తెలుసుకున్నారు. శభాష్ అనిపించుకున్నారు. -రమేశ్, హెచ్ఎం -
ఇదిగో రూ.125 నాణెం
అనకాపల్లిటౌన్ : జవహర్లాల్ నెహ్రూ జయంతిని పురస్కరించుకొని రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా విడుదల చేసిన 125 రూపాయల నాణెంను పట్టణానికి చెందిన కాండ్రేగుల హరికృష్ణ సొంతం చేసుకున్నారు. ఆంధ్రా బ్యాంకు అవార్డు ఎంప్లాయీస్ యూనియన్ డిప్యూటీ జనరల్ కార్యదర్శి హరికృష్ణ గత ఏడాది సెప్టెంబర్ 27న డీడీ రూపంలో 3,450 రూపాయలు పంపించగా గురువారం ఆయనకు 125 రూపాయలు నాణెం అందజేశారు. -
నెహ్రూ సిద్ధాంతం అజరామరం
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: ‘‘దేశ తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ సిద్ధాంతం అజరామరం. ప్రపంచ చరిత్రలోనే అరుదైన, అద్భుతమైన నేతగా గుర్తింపు పొందిన బహుముఖ ప్రజ్ఞాశాలి ఆయన’’ అని కేంద్ర మాజీ మంత్రి సూదిని జైపాల్‌రెడ్డి కొనియాడారు. వచ్చే నవంబర్ 14న నెహ్రూ 125వ జయంతిని పురస్కరించుకుని గురువారం నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్‌లో ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘నెహ్రూ-భారత్‌పై ఆయన దృష్టి’ సదస్సులో ఆయన ప్రసంగించారు. భారతదేశానికి ప్రజాస్వామిక సోషలిజం తప్ప మరో మార్గం లేదని చెప్పిన మహనీయుడు నెహ్రూ అన్నారు. ‘‘దేశానికి గాంధీ పెద్ద దేవుడైతే, నెహ్రూ చిన్న దేవుడు. స్వాతంత్య్ర పోరాటంలో పదేళ్లు జైలు జీవితం గడిపారు. హంసతూలికాతల్పాలు వదిలి చాప మీద పడుకున్నారు. గాంధీతో కలసి దేశానికి నూతన మార్గం చూపారు. దేశానికి పూర్తిస్థాయి స్వాతంత్య్రం కావాలని 1929లోనే గళమెత్తిన నాయకుడు నెహ్రూ యే. పార్లమెంటుకు రోజూ హాజరై, విపక్ష నేతల ప్రసంగాలను శ్రద్ధగా వింటూ చట్టసభ ప్రతిష్టను పెంచారు. ఆయనలో గొప్ప తాత్వికుడు, రచయిత ఉన్నారు’’ అని వివరించారు. తన సమకాలీనుడైన ఇంగ్లండ్ ప్రధాని విన్స్టన్ చర్చిల్ కంటే కూడా నెహ్రూ గొప్ప మేధావి అని అభిప్రాయపడ్డారు. సమాఖ్య వ్యవస్థను గౌరవించేవారని, కేబినెట్లో పరిపూర్ణ ప్రజాస్వామిక చర్చకు అవకాశమిచ్చేవారని చెప్పారు. నెహ్రూ ఆత్మకథ 21వ శతాబ్దంలోనూ అందరికీ మార్గదర్శిగా నిలవగల గ్రంథమన్నారు. నెహ్రూను నిందించతగదు నవ భారత నిర్మాణానికి పాటుపడ్డ మహనీయుడు నెహ్రూ అని ‘సాక్షి’ ఎడిటోరియల్ డెరైక్టర్ కె.రామచంద్రమూర్తి కొనియాడారు. సదస్సులో ఆయన ముఖ్య వక్తగా ప్రసంగించారు. దేశంలో ప్రజాస్వామ్యం వేళ్లూనుకుందన్నా, పార్లమెంటరీ వ్యవస్థకు పటిష్ట పునాదులు పడ్డాయన్నా అందుకు నెహ్రూ విధానాలే కారణమని అభిప్రాయపడ్డారు. ఆయన లేని స్వతంత్ర భారత తొలి 17 ఏళ్ల ప్రయాణాన్ని ఊహించలేమన్నారు. తొలి ప్రధానిగా నెహ్రూను నియమించి గాంధీ గొప్ప పని చేశారన్నారు. నెహ్రూను విస్మృతిలోనికి నెట్టడానికి, ఆయన కంటే ఆయన సహచరులను గొప్పవారిగా చూపేందుకు జాతీయ స్థాయిలో ప్రయత్నం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో పెరిగిపోతున్న మతపరమైన అసహనం దృష్ట్యా నెహ్రూను స్మరించుకోవాల్సిన అవసరముందన్నారు. సర్దార్ వల్లభాయ్ పటేల్‌కు స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ కంటే పెద్ద విగ్రహాన్ని ఏర్పాటు చేస్తూ, నెహ్రూని నిందించడం తగదన్నారు. ‘‘అసలు వారిద్దరూ విరోధులనేలా దేశమంతటా సాగుతున్న చర్చే ఆశ్చర్యకరం. నెహ్రూ, పటేల్ మధ్య సాగిన ఉత్తర ప్రత్యుత్తరాలను చూస్తే, వారిద్దరూ విరోధులని ఎవరూ అనుకోరు. జాతిహితం కోసం ఐకమత్యంగా పని చేశారే తప్ప వారికి వ్యక్తిగత పట్టింపుల్లేవు. నెహ్రూ ఆర్థిక విధానాల వల్లే నవరత్నాల వంటి భారీ పరిశ్రమలు, ఐఐటీల వంటివి వచ్చాయి. ఎంతో ముందుచూపుంటేనే అది సాధ్యం. ప్రధాని నరేంద్రమోదీ ఏ దేశానికి వెళ్లినా వేలాది మంది యువకులు, మధ్యవయస్కులు ఆయన్ను చూసేందుకు వస్తున్నారంటే అందుకు నెహ్రూయే కారణం. వారంతా నెహ్రూ వల్ల వచ్చిన ఐఐటీల్లో చదువుకున్నవారేనన్న విషయాన్ని మోదీ విస్మరించరాదు. నెహ్రూ కూడా కొన్ని పొరపాట్లు చేశారు. కానీ ఆయన తొలి ప్రధాని కాకుంటే భారత్ కూడా ఈజిప్టు, పాకిస్తాన్ల్లా నియంత పాలనలోకో, చీలిపోయిన దేశాల జాబితాలోకో వెళ్లేది’’ అన్నారు. నెహ్రూ సిద్ధాంతాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. నాయకున్ని ప్రశ్నించడమే ప్రజాస్వామ్యమని 1950లోనే చెప్పిన గొప్ప నేత నెహ్రూ అని ప్రొఫెసర్ కె.నాగేశ్వర్ కొనియాడారు. నెహ్రూ సిద్ధాంతాలపై క్రమపద్ధతిలో దాడి జరుగుతున్న ఈ నేపథ్యంలో ఆయన విశిష్టత గురించి చర్చించుకోవాల్సిన అవసరముందన్నారు. సదస్సుకు కాంగ్రెస్ శాసనసభాపక్ష నేత కె.జానారెడ్డి అధ్యక్షత వహించారు. పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టి విక్రమార్క, పార్టీ నేతలు షబ్బీర్ అలీ, వి.హన్మంతరావు, గుత్తా సుఖేందర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ మంత్రులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. -
ప్రారంభమైన కాంగ్రెస్ సదస్సు
నల్లగొండ: మాజీ ప్రధాని నెహ్రో జయంతిని పురస్కరించుకుని కాంగ్రెస్ ఆధ్వర్యంలో నాగార్జున సాగర్ లోని విజయవిహార్ లో ఏర్పాటు చేసిన సదస్సు ప్రారంభమైంది. నెహ్రో యువకుడిగా ఉన్నప్పుడు స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొని చేసిన ప్రసంగాలు, ఆయన జీవితంలో ప్రముఖ ఘట్టాలను ఈ సదస్సులో నెమరువేసుకోనున్నారు. అలాగే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి కొత్త ఉత్తేజాన్ని ఇచ్చే విధంగా ప్రముఖులు ప్రసంగించనున్నారు. అదేవిధంగా వరంగల్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధిని గెలిపించేందుకు అవసరమైన వ్యూహాలపై కూడా చర్చించనున్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్య వక్తలుగా సాక్షి ఎడిటోరియల్ డైరెక్టర్ రామచంద్రమూర్తి, ప్రొఫెసర్ నాగేశ్వర్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు జైపాల్ రెడ్డి హాజరయ్యారు. కాంగ్రెస్ పార్టీ నాయకులతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా 500 మంది అతిధులు హాజరుకానున్నారు.