నెహ్రూ సిద్ధాంతం అజరామరం
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: ‘‘దేశ తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ సిద్ధాంతం అజరామరం. ప్రపంచ చరిత్రలోనే అరుదైన, అద్భుతమైన నేతగా గుర్తింపు పొందిన బహుముఖ ప్రజ్ఞాశాలి ఆయన’’ అని కేంద్ర మాజీ మంత్రి సూదిని జైపాల్‌రెడ్డి కొనియాడారు. వచ్చే నవంబర్ 14న నెహ్రూ 125వ జయంతిని పురస్కరించుకుని గురువారం నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్‌లో ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘నెహ్రూ-భారత్‌పై ఆయన దృష్టి’ సదస్సులో ఆయన ప్రసంగించారు. భారతదేశానికి ప్రజాస్వామిక సోషలిజం తప్ప మరో మార్గం లేదని చెప్పిన మహనీయుడు నెహ్రూ అన్నారు.
‘‘దేశానికి గాంధీ పెద్ద దేవుడైతే, నెహ్రూ చిన్న దేవుడు. స్వాతంత్య్ర పోరాటంలో పదేళ్లు జైలు జీవితం గడిపారు. హంసతూలికాతల్పాలు వదిలి చాప మీద పడుకున్నారు. గాంధీతో కలసి దేశానికి నూతన మార్గం చూపారు. దేశానికి పూర్తిస్థాయి స్వాతంత్య్రం కావాలని 1929లోనే గళమెత్తిన నాయకుడు నెహ్రూ యే. పార్లమెంటుకు రోజూ హాజరై, విపక్ష నేతల ప్రసంగాలను శ్రద్ధగా వింటూ చట్టసభ ప్రతిష్టను పెంచారు. ఆయనలో గొప్ప తాత్వికుడు, రచయిత ఉన్నారు’’ అని వివరించారు.
తన సమకాలీనుడైన ఇంగ్లండ్ ప్రధాని విన్‌స్టన్ చర్చిల్ కంటే కూడా నెహ్రూ గొప్ప మేధావి అని అభిప్రాయపడ్డారు. సమాఖ్య వ్యవస్థను గౌరవించేవారని, కేబినెట్‌లో పరిపూర్ణ ప్రజాస్వామిక చర్చకు అవకాశమిచ్చేవారని చెప్పారు. నెహ్రూ ఆత్మకథ 21వ శతాబ్దంలోనూ అందరికీ మార్గదర్శిగా నిలవగల గ్రంథమన్నారు.
నెహ్రూను నిందించతగదు
నవ భారత నిర్మాణానికి పాటుపడ్డ మహనీయుడు నెహ్రూ అని ‘సాక్షి’ ఎడిటోరియల్ డెరైక్టర్ కె.రామచంద్రమూర్తి కొనియాడారు. సదస్సులో ఆయన ముఖ్య వక్తగా ప్రసంగించారు. దేశంలో ప్రజాస్వామ్యం వేళ్లూనుకుందన్నా, పార్లమెంటరీ వ్యవస్థకు పటిష్ట పునాదులు పడ్డాయన్నా అందుకు నెహ్రూ విధానాలే కారణమని అభిప్రాయపడ్డారు. ఆయన లేని స్వతంత్ర భారత తొలి 17 ఏళ్ల ప్రయాణాన్ని ఊహించలేమన్నారు. తొలి ప్రధానిగా నెహ్రూను నియమించి గాంధీ గొప్ప పని చేశారన్నారు.
నెహ్రూను విస్మృతిలోనికి నెట్టడానికి, ఆయన కంటే ఆయన సహచరులను గొప్పవారిగా చూపేందుకు జాతీయ స్థాయిలో ప్రయత్నం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో పెరిగిపోతున్న మతపరమైన అసహనం దృష్ట్యా నెహ్రూను స్మరించుకోవాల్సిన అవసరముందన్నారు. సర్దార్ వల్లభాయ్ పటేల్‌కు స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ కంటే పెద్ద విగ్రహాన్ని ఏర్పాటు చేస్తూ, నెహ్రూని నిందించడం తగదన్నారు.
‘‘అసలు వారిద్దరూ విరోధులనేలా దేశమంతటా సాగుతున్న చర్చే ఆశ్చర్యకరం. నెహ్రూ, పటేల్ మధ్య సాగిన ఉత్తర ప్రత్యుత్తరాలను చూస్తే, వారిద్దరూ విరోధులని ఎవరూ అనుకోరు. జాతిహితం కోసం ఐకమత్యంగా పని చేశారే తప్ప వారికి వ్యక్తిగత పట్టింపుల్లేవు. నెహ్రూ ఆర్థిక విధానాల వల్లే నవరత్నాల వంటి భారీ పరిశ్రమలు, ఐఐటీల వంటివి వచ్చాయి. ఎంతో ముందుచూపుంటేనే అది సాధ్యం.
ప్రధాని నరేంద్రమోదీ ఏ దేశానికి వెళ్లినా వేలాది మంది యువకులు, మధ్యవయస్కులు ఆయన్ను చూసేందుకు వస్తున్నారంటే అందుకు నెహ్రూయే కారణం. వారంతా నెహ్రూ వల్ల వచ్చిన ఐఐటీల్లో చదువుకున్నవారేనన్న విషయాన్ని మోదీ విస్మరించరాదు. నెహ్రూ కూడా కొన్ని పొరపాట్లు చేశారు. కానీ ఆయన తొలి ప్రధాని కాకుంటే భారత్ కూడా ఈజిప్టు, పాకిస్తాన్‌ల్లా నియంత పాలనలోకో, చీలిపోయిన దేశాల జాబితాలోకో వెళ్లేది’’ అన్నారు.
నెహ్రూ సిద్ధాంతాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. నాయకున్ని ప్రశ్నించడమే ప్రజాస్వామ్యమని 1950లోనే చెప్పిన గొప్ప నేత నెహ్రూ అని ప్రొఫెసర్ కె.నాగేశ్వర్ కొనియాడారు. నెహ్రూ సిద్ధాంతాలపై క్రమపద్ధతిలో దాడి జరుగుతున్న ఈ నేపథ్యంలో ఆయన విశిష్టత గురించి చర్చించుకోవాల్సిన అవసరముందన్నారు.
సదస్సుకు కాంగ్రెస్ శాసనసభాపక్ష నేత కె.జానారెడ్డి అధ్యక్షత వహించారు. పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టి విక్రమార్క, పార్టీ నేతలు షబ్బీర్ అలీ, వి.హన్మంతరావు, గుత్తా సుఖేందర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ మంత్రులు పెద్ద ఎత్తున హాజరయ్యారు.