బీసీ క్రీమీలేయర్ పరిమితి రూ. 10.50 లక్షలు
కేంద్రానికి జాతీయ బీసీ కమిషన్ సిఫార్సు
హిజ్రాలను బీసీలుగా గుర్తిస్తున్నట్లు వెల్లడి
సాక్షి, హైదరాబాద్: ఓబీసీ రిజర్వేషన్ల క్రీమీలేయర్ ఆదాయ పరిమితిని ప్రస్తుతమున్న రూ. 6 లక్షల నుంచి రూ. 10.50 లక్షలకు పెంచాలని కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసినట్లు జాతీయ బీసీ కమిషన్ చైర్మన్ జస్టిస్ వి. ఈశ్వరయ్య వెల్లడించారు. ప్రస్తుతం జీవన ప్రమాణాలు, వేతనాలు పెరిగిన నేపథ్యంలో క్రీమీలేయర్ పరిమితిని పెంచడం వల్ల ఎక్కువ మందికి ప్రయోజనం కలిగే అవకాశం ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ క్రీమీలేయర్ పరిధిలోకి గ్రూపు-1 అధికారులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, జాతీయ కమిషన్ సభ్యులు వస్తారన్నారు. తెలంగాణ, ఏపీలకు జాతీయ కమిషన్ ఆధ్వర్యంలో 3 రోజులపాటు నిర్వహించిన ప్రజావినతుల స్వీకరణ (పబ్లిక్ హియరింగ్) తదితర అంశాలపై శనివారం హైదరాబాద్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కమిషన్ సభ్యులు ఎస్.కె.కర్వేంతన్, డా.షకీల్ ఉల్జమాన్ అన్సారీ, రాష్ట్ర బీసీ సంక్షేమశాఖ ముఖ్యకార్యదర్శి డా.టి. రాధలతో కలసి జస్టిస్ ఈశ్వరయ్య పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జాతీయస్థాయిలో బీసీ కులాలవారీ సమగ్ర సర్వే నిర్వహించాల్సిన అవసరం ఉందన్నారు. హిజ్రాలను తాము బీసీలుగా గుర్తించామని, ఒకవేళ వారు ఎస్సీలైతే ఏ రిజర్వేషన్ వర్తించాలనే దానిపై సమీక్ష పెండింగ్లో ఉందన్నారు. తెలంగాణ, ఏపీలలో అనాథలుగా స్టేట్హౌజ్, ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటున్న వారిని ఓబీసీలుగా గుర్తించేందుకు కమిషన్ సిద్ధంగా ఉందన్నారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు బీసీ కమిషన్లను ఏర్పాటు చేస్తే ఆయా అంశాల పరిశీలనకు సంబంధించి తమ పని సులువు అవుతుందని జస్టిస్ ఈశ్వరయ్య పేర్కొన్నారు. అత్యంత వెనుకబడిన సంచారజాతులు, ఉప సంచారజాతులను గ్రూపు-ఏలో, కుమ్మరి, కమ్మరి, చేతివృత్తుల వారిని బీసీ-బీలో, వ్యవసాయదారులు, చిన్న వ్యాపారులను గ్రూపు-సీలో చేర్చాలనేది తమ ఆలోచన అని జస్టిస్ ఈశ్వరయ్య తెలిపారు.
బీసీ రిజర్వేషన్లు సరిగ్గా అమలవట్లేదు...
దేశంలో ఓబీసీలకు విద్య, ఉద్యోగ రంగాల్లో నిర్దేశించిన 27 శాతం రిజర్వేషన్లు సరిగ్గా అమలు కావట్లేదని జస్టిస్ ఈశ్వరయ్య అభిప్రాయపడ్డారు. జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్ల తరహాలో తమ కమిషన్కు చట్టబద్ధత లేకపోవడంతో ఈ అంశాన్ని పకడ్బందీగా సమీక్షించలేకపోతున్నామన్నారు. అందువల్ల బీసీ కమిషన్కు చట్టబద్ధతను కల్పిస్తూ నిర్ణయం తీసుకోవాలని ఆయన కేంద్రానికి సూచించారు. కమిషన్ ఏర్పాటైన 1993లో ఓబీసీ జాబితాలో 1,400 కులాలుండగా ఇప్పుడు ఆ సంఖ్య 2,500కు చేరిందన్నారు. కాగా, రాష్ట్రంలో నిర్వహించిన పబ్లిక్ హియరింగ్లో వెల్లడైన అభిప్రాయాలు, తమకు అందిన వివరాలను పరిశీలించి నెలలో ఆయా కులాల తీసివేత, అచ్చుతప్పుల్లో మార్పుచేర్పులపై నిర్ణయాన్ని ప్రకటిస్తామని జస్టిస్ ఈశ్వరయ్య చెప్పారు. రాష్ట్రంలో బీసీ-ఈలో ఉన్న ముస్లింలలోని 14 వర్గాలను కేంద్ర బీసీ జాబితాలో చేర్చే విషయంపై సుప్రీంకోర్టులో కేసు పెండింగ్లో ఉన్నందున తీర్పు వెలువడ్డాకే స్పందిస్తామన్నారు.