ఆమె ధైర్యం ముందు నిరాశ నిలబడలేకపోయింది!
పెల్లెట్ గన్‌లో నుంచి పెల్లెట్స్ గంటకి 1100 కి.మీ వేగంతో ఇన్షా రెండు కళ్లలోకి దూసుకెళ్లాయి. అప్పుడా అమ్మాయి 9 చదువుతోంది. 2016లో కశ్మీర్లో గుంపును అదుపు చేయడానికివాడిన పెల్లెట్ గన్స్ అమాయకులకు కూడా శాపంగా మారాయి. ఇన్షా ఓడిపోలేదు. నిరాశ పడలేదు. అంచెలంచెలుగా శ్రమ చేసి చదువుకుంది.మొన్న సీనియర్ ఇంటర్ పరీక్షలలో 500కి 315 మార్కులు సాధించింది. ‘నేను ఐ.ఏ.ఎస్ అవుతాను. అంధులకు ఆత్మవిశ్వాసం ఇస్తాను’ అంటోంది.
అంధులేంటి.. ఓటమి భయంతో ఉన్నవారందరూ ఆత్మవిశ్వాసం పొందగలరు ఇన్షాను చూస్తే.
దక్షిణ కశ్మీర్‌లోని షోపియన్ ప్రాంతంలో సెదౌ అనే చిన్న పల్లె. వేసవి కాలం. అల్లర్లు చెలరేగాయి. భద్రతా దళాలు వారిని అదుపు చేయడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. ఇంట్లో మొదటి అంతస్తు కిటికీలో నుంచి ఏం జరుగుతున్నదో చూద్దామని 16 ఏళ్ల ఇన్షా ముష్టాక్ కిటికీ తెరిచింది. ఆ తర్వాత ఏమైంది అర్థం కాలేదు. క్షణపాటులో ఆమె రెండు కళ్ల నుంచి రక్తం దౌడు తీసింది. విపరీతమైన నొప్పితో ఇన్సా ఆర్తనాదాలు చేసింది. 2016, 2017... రెండు సంవత్సరాల పాటు భద్రతాదళాలు కశ్మీర్లో ప్రయోగించిన పెల్లెట్ గన్స్ వల్ల శాశ్వతంగా అంధులైన వారు 139 మంది. వారిలో ఇన్షా ఒకమ్మాయి.
విఫలమైన డాక్టర్లు
పెల్లెట్లు కళ్లల్లోకి దూసుకెళ్లగానే ఇన్షా చూపు పోయింది. కాని మానవీయ సంస్థలు, ప్రభుత్వం కూడా ఇన్షా చికిత్స కోసం ముందుకు వచ్చింది. ఢిల్లీ ఎయిమ్స్‌లో డాక్టర్లు కూడా ప్రయత్నించి ఆమెకు ఎప్పటికీ చూపు రాదని తేల్చారు. పెల్లెట్లు జీవితాంతం శరీరంలో ఉండిపోతాయి. అవి చాలా ప్రమాదం. ‘అయితే అంతకన్నా ప్రమాదం నిరాశలో కూరుకుపోవడం అని నాకు తెలుసు. నేను చదువుకోవాలనుకున్నాను. నా కంటే ముందు మా అమ్మ అఫ్రోజా, డ్రైవర్‌గా జీవితం గడిపే మా నాన్న ముష్టాక్ అహ్మద్ లోన్ నేను చదువుకోవాలని భావించారు. మరో రెండేళ్ల తర్వాత ఒక లేఖకుని సహాయంతో నేను టెన్త్ పాసయ్యాను’ అని తెలిపింది ఇన్హా.
బ్రెయిలీ నేర్చుకుని...
అయితే ఇంటర్ మాత్రం బ్రెయిలీ నేర్చుకుని పరీక్షలు రాసి పాసవ్వాలని నిశ్చయించుకుంది ఇన్షా. ఇందుకోసం శ్రీనగర్‌లోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో జాయిన్ అయ్యింది. ఇంటర్‌తో పాటు కంప్యూటర్ కోర్సు, ఇంగ్లిష్ స్పీకింగ్ కోర్సు కూడా నేర్చుకుంది. బ్రెయిలీ ద్వారా పాఠాలు నేర్చుకుని పరీక్షలు రాయడం చాలా కష్టమయ్యేది. అయినా సరే ఇన్షా ఆగలేదు. 2011లో ఫస్ట్ ఇయర్ ఇంటర్ పూర్తి చేసింది. ఈ సంవత్సరం సెకండ్ ఇయర్ ఇంటర్ ఏ గ్రేడ్‌లో పాసయ్యింది. ‘చదువు ఒక్కటే నాకు స్వేచ్ఛ, స్వతంత్రం ఇవ్వగలదు. అది నాకు తెలుసు. ఐ.ఏ.ఏస్ చేయాలనుకుంటున్నాను. అంధులకు మన దేశంలో తగినన్ని ప్రత్యేకమైన స్కూల్స్ లేవు. ఆ విషయంలో నేను కృషి చేస్తాను’ అని తెలిపింది ఇన్షా.
సానుభూతి ఇష్టపడదు
ఇంటర్ పాసయ్యిందని తెలిశాక ఆమె తల్లిదండ్రులు ఉద్వేగంతో కన్నీరు కార్చారు. తండ్రి, తల్లి తమ కూతురి పట్టుదలకు గర్వపడ్డారు. ఇన్షా కూడా తన విజయంతో సంతోషంగా ఉంది. జమ్ము కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా, హోమ్ మినిస్ట్రీ అధికారులు ఆమెను మెచ్చుకున్నారు. మంచి కాలేజ్‌లో చదువు కొనసాగడానికి హామీలు దొరికాయి. ఉత్సాహపరిచే వాళ్లను తప్ప సానుభూతి చూపించేవాళ్లను ఇన్షా ఇష్టపడదు. ‘నేను అందరితో సమానంగా జీవించగలను. నాకు సానుభూతి చూపకండి. వీలైతే నా ప్రయాణంలో తోడు నిలవండి’ అంటోందామె.
(చదవండి: ప్రాణం నిలిపే రక్తపు బొట్టు )