Postgraduate
-
Tuktuki Das: ఎం.ఏ ఇంగ్లిష్ చాయ్వాలీ
ఎం.ఏ ఇంగ్లిష్ చదివిన అమ్మాయిలు టీచర్ అవుతారు. లెక్చరర్లు కావాలని ప్రయత్నిస్తారు. ప్రయివేటు ఉద్యోగాలు అన్వేషిస్తారు. కాని టుక్టుకీ దాస్ అలా కాదు. ‘ఎంఏ ఇంగ్లిష్ చాయ్వాలీ’ పేరుతో టీకొట్టు తెరిచింది. నేను ఉపాధి వెతుక్కోవడం కాదు. వ్యాపార రంగంలో ఎదిగి నలుగురికీ ఉపాధి ఇస్తాను అంటోంది. కుతూహలం రేపుతున్న ఈ పోస్ట్‌గ్రాడ్యుయేట్ కథ ఏంటి? ‘ఐయామ్ హ్యాపిలీ సేయింగ్ దట్ ఐయామ్ బిజీ’ అంటుంది 26 ఏళ్ల టుక్టుకీదాస్. ఎంత బిజీ ఆ అమ్మాయి? ఉదయం ఐదు గంటలకు లేచి సైకిల్ మీద తన ఇంటికి రెండు మూడు కిలోమీటర్ల దూరం ఉన్న రైల్వేస్టేషన్‌కు వెళుతుంది. అప్పటికే ఆమె టీ కోసం కస్టమర్లు వెయిట్ చేస్తుంటారు. అప్పటి నుంచి రాత్రి 10 వరకూ తన టీకొట్టులోనే ఉంటుంది. వచ్చిన వారందరికీ టీ ఇస్తుంది. వారితో కబుర్లు చెబుతుంది. టీ అన్నీ చోట్లా ఉంటుంది. మరి ఎందుకు ఆమె దగ్గరికే వచ్చి కొంటారు అనంటే ఆమె టీకొట్టు పేరు ‘ఎంఏ ఇంగ్లిష్ చాయ్వాలీ’. ఎం.ఏ ఇంగ్లిష్ చేసిన ఒక అమ్మాయి తయారు చేసి అమ్ముతున్న టీ కనుక ఇప్పుడు ఈ క్రేజ్. బెంగాల్ అమ్మాయి టుక్టుకీదాస్ది పశ్చిమ బెంగాల్‌లోని 24 పరగణ జిల్లాలోని హాబ్రా. ముగ్గురు పిల్లల్లో తను పెద్దది. తండ్రి వ్యాన్ డ్రైవర్. తల్లికి చిన్న కిరాణాషాపు ఉంది. ‘అందరు ఆడపిల్లల్లాగే నేను కూడా రెండు విషయాలు వింటూ పెరిగి పెద్దదాన్నయ్యా. ఒకటి:గవర్నమెంట్ ఉద్యోగం, రెండు: పెళ్లి’ అంటుంది టుక్టుకీ దాస్. 2020లో రవీంద్రభారతి యూనివర్సిటీ నుంచి ఇంగ్లిష్‌లో పోస్ట్‌గ్రాడ్యుయేషన్ చేశాక కొన్నాళ్లు ట్యూషన్ చెప్పింది. ‘నాకు టీచింగ్ అంటే ఇష్టమే కాని అది ఒకేచోట ఆపేస్తున్నట్టు అనిపిస్తుంది. నేను ఇంకా ఏదో సాధించాలి. నా కాళ్ల మీద నేను నిలబడాలి’ అంటుంది టుక్టుకీ దాస్. ఎం.బి.ఏ చాయ్‌వాలా స్ఫూర్తి ఎం.బి.ఏ చాయ్‌వాలా పేరుతో ప్రఫుల్ బిల్లోర్ అనే ఎంబిఏ కేండిడేట్ తెరిచిన వరుస టీకొట్లు హిట్ అయ్యాయి. అలాగే ఆస్ట్రేలియాలో ఉప్మా విర్ది అనే ఆమె చాయ్వాలీ పేరుతో టీ అమ్ముతూ ఫేమస్ అయ్యింది. ‘నేను కూడా వారిలాగే చాయ్ దుకాణం తెరుద్దామని అనుకున్నాను. నేను ఎం.ఏ ఇంగ్లిష్ చదివాను కనుక ఎం.ఏ ఇంగ్లిష్ చాయ్వాలీ పేరుతో టీకొట్టు తెరిచాను. దీనికి ముందు ఎక్కడ టీకొట్టు పెట్టాలా అని ఆలోచిస్తే కాలేజీల వద్ద, హాస్పిటల్స్ వల్ల లేదా రైల్వే స్టేషన్లో అనే ఆప్షన్స్ కనిపించాయి. కాలేజీలు కరోనా వల్ల సరిగ్గా నడవడం లేదు. హాస్పిటల్స్ దగ్గర మనుషులు తాగడం లేదు. అందుకని రైల్వేస్టేషన్‌ను ఎంచుకున్నాను’ అంటుంది టుక్టుకీ దాస్. ఆ షాపు తెరవడానికి గత సంవత్సరం ట్యూషన్ చెప్పి దాచుకున్న 10 వేల రూపాయలను పెట్టుబడిగా పెట్టింది. ‘అమ్మా నాన్నలకు నేను చాయ్ దుకాణం పెడతానని చెప్తే వద్దనలేదు కాని ఆశ్చర్యపోయారు. పైగా రైల్వేస్టేషన్ అనేసరికి ఎలా ఉంటుందో అనుకున్నారు. కాని వారి మద్దతుతో ముందుకే వెళ్లాను’ అంటుందామె. మొదటిరోజే ఉచితంగా నవంబర్ 1, 2021న హాబ్రా రైల్వేస్టేషన్లో కొంతమంది మిత్రుల మధ్య, మైక్‌లో వినిపిస్తున్న అనౌన్స్మెంట్ల మధ్య ‘ఎంఏ ఇంగ్లిష్ చాయ్వాలీ’ దుకాణాన్ని తెరిచింది టుక్టుకీదాస్. దానికి ముందు నుంచే ఆమె బ్లాగింగ్ కూడా చేస్తుండటం వల్ల తన రోజువారీ అనుభవాలను కూడా వీడియో తీసి బ్లాగ్‌లో ఉంచడం మొదలెట్టింది. ఈ పేరు కొత్తగా ఉండటం, ఫేస్బుక్లో ఆమె రోజూ వీడియోలు పెడుతుండటంతో వెంటనే గుర్తింపు వచ్చేసింది. జనం కుతూహలంతో ఆమె షాపుకు వచ్చి టీ తాగడం మొదలెట్టారు. ‘అక్కా.. టీ ఇవ్వు. అలాగే ఒక సెల్ఫీ కూడా’ అని కాలేజీ పిల్లలు అడగడం మొదలైంది. మొదటి రోజు రెండు గంటల పాటు కస్టమర్లను ఆకర్షించడానికి ఉచితంగా టీ ఇచ్చింది టుక్టుకీ దాస్. ఆ తర్వాత డబ్బులు అవే గల్లాపెట్టెలో పడటం మొదలయ్యాయి. ఏదీ తక్కువ కాదు రైల్వే స్టేషన్లో టీ అమ్మే అమ్మాయిని చూసి అక్కడి పోర్టర్లే మొదట చులకనగా చూశారు టుక్టుకీ దాస్‌ని. ‘ఏ పనైనా గౌరవప్రదమైనదే అని మన దేశంలో గ్రహించరు. అమ్మాయిలు శ్రమ చేసి తమ కాళ్ల మీద తాము నిలబడటాన్ని చూసి హర్షించాలి’ అంటుంది టుక్టుకీ దాస్. అయితే ఇప్పుడు అందరూ ఆమెను ప్రశంసాపూర్వకంగా చూస్తున్నారు. సాయం వద్దు టుక్టుకీ దాస్ చాయ్ దుకాణం పాపులర్ అయ్యేసరికి కొంతమంది పెద్దలు వచ్చి సాయం చేస్తామన్నారు. ‘నేను సున్నితంగా వారించాను. నేను పైకి వస్తే నా వల్లే రావాలి తప్ప వేరొకరి సాయంతో కాదు. నేను ఇప్పుడు నా చాయ్ దుకాణంతో సంతోషంగా ఉన్నాను. ఇంకా నేను ఈ బ్రాండ్‌తో కోల్కటాలో దుకాణాలు తెరవాలి. కాని ఈ దుకాణం మాత్రం మూసేయను. ఇది మొదటిది. నా సెంటిమెంట్‘ అంటుంది టుక్టుకీ దాస్. టుక్టుకీ దాస్ రోజూ చాలా బిజీగా ఉంటోంది. చాలామంది ఫుడ్బ్లాగర్స్ ఆమెతో వీడియోలు చేస్తున్నారు. ఒక అమ్మాయి ఆత్మవిశ్వాసంతో టీ అమ్ముతూ ఉండటం సంతోషంగా ఉండటం అందరికీ ఎందుకు నచ్చదు. భిన్నంగా ఆలోచిస్తే మామూలు టీ కూడా ఇలా బ్రాండ్ అయి కూచుంటుంది. -
అనుకోకుండా కలిశారు స్టార్టప్ అయి విరిశారు!
చెట్టు పచ్చగా ఉంటుంది. పచ్చదనంతో కనువిందు చేసి ఊరుకోదు. మనిషికి జీవితం మీద ప్రేమను కలిగిస్తుంది. రేపటి కోసం ఎదురు చూసేట్టు చేస్తుంది. ఈ రోజు మొక్కకు పాదు చేసి నీరు పోసిన మనిషి రేపు ఆ మొక్కకు చిగురించే కొత్త ఆకు కోసం సూర్యుడికంటే ముందే నిద్రలేచి ఎదురుచూస్తాడు. సరిగ్గా అట్లాంటి ఆసక్తే లక్ష్మిని, గంగను కలిపింది. వాళ్ల ద్వారా ప్రపంచానికి పచ్చ బంగారు లోకాన్ని పరిచయం చేసింది. కేరళ, కొచ్చి నగరంలోని జవహర్‌నగర్‌లో ఉంటారు లక్ష్మి, గంగ. లక్ష్మి మైక్రోబయాలజీలో పోస్ట్‌గ్రాడ్యుయేట్, గంగ అగ్రికల్చర్ ఇంజనీర్. ఇద్దరిదీ ఒక సినిమా కథను పోలిన వాస్తవం. ఇద్దరూ పుట్టింది ఒకటే హాస్పిటల్, పెరిగిందీ ఒకటే నగరం, చదివింది ఒకటే కాలేజి. కానీ ఇద్దరూ ఏనాడూ ఒకరికి ఒకరు తారసపడింది లేదు. చదువయ్యాక ఒకరు జర్మనీకీ, ఒకరు నెదర్లాండ్స్కీ వెళ్లిపోయారు. పెళ్లి చేసుకుని పిల్లలు పుట్టిన తర్వాత కెరీర్లో విరామం వచ్చింది. తల్లి పాత్రలో ఇమిడిపోయారిద్దరూ. ఆ ఇద్దరు తల్లులూ కొచ్చిలోని జవహర్ నగర్ పార్కులో పిల్లలను ఆడించుకుంటూ ఉన్నప్పుడు తొలిసారిగా కలిశారు. మాటల్లో ఇద్దరిలోనూ మొక్కల మీద ఉన్న ప్రేమ కొత్తగా మొగ్గలు తొడిగింది. కాంక్రీట్ జంగిల్లా మారిపోయిన జనారణ్యంలో మొక్కలకు స్థానమేదీ? ఇద్దరిదీ ఒకటే ఆవేదన. అభిరుచికి పాదులు అప్పటికే గంగ ఇంట్లో ఉన్న సీసాలను, పాత షూస్‌ని, పిల్లలు ఆడుకుని చక్రాలు విరగ్గొట్టిన స్కూటర్ బొమ్మలను మొక్కలకు పాదులుగా మార్చింది. గంగ ఇంట్లో వాటిని చూసిన లక్ష్మి... ఇదే ఫార్ములాను తన మైక్రోబయాలజీ కోర్సుతో అనుసంధానం చేసింది. కాలేజీలో గాజు బీకరుల్లో చేసిన ప్రయోగాల రోజుల్లోకి వెళ్లిపోయారిద్దరూ. ఏ మొక్కకు ఎంత పాట్మిక్చర్ (మట్టి, ఎరువు, గులక మిశ్రమం) వేయాలి, ఏ మొక్కకు ఎంత గాలి అవసరం, ఏ రకమైన గాజు పాత్ర ఏ మొక్క పెరగడానికి అనువుగా ఉంటుంది... వంటి ప్రశ్నలు తమకు తామే వేసుకున్నారు. మేధను మదించి ‘బాటిల్ గార్డెన్’ని సృష్టించారు! సీసాల్లో ప్రయోగాలు వీళ్లిద్దరూ మొక్కల మీద ప్రయోగాలు చేస్తున్న రోజుల్లో గంగ ఓ ఫంక్షన్‌కు వెళ్లాల్సి వచ్చింది. ఓ స్నేహితురాలి తల్లికి అరవయ్యవ పుట్టిన రోజు. ఆ పెద్దావిడకు తాను బీరు సీసాలో పెంచిన మొక్కను బహుమతిగా ఇచ్చింది గంగ. సీసా లోపల ఇసుక, గులక రాళ్లకు రంగులు వేసి వరుసలుగా పరిచిన తీరుకు ఫంక్షన్‌కి వచ్చిన వాళ్లు ముగ్ధులయ్యారు. ఆమె దగ్గర ఇంకా అలాంటివి ఉంటే కొనడానికి సిద్ధమయ్యారు ఐదారుగురు అక్కడే. తాను వ్యాపారంగా చేయలేదని అభిరుచిగా మాత్రమే చేశానని చెప్పిందామె. వ్యాపారంగా ప్రారంభించవచ్చు కదా అనే సలహాలు కూడా అప్పుడే అక్కడే వచ్చాయామెకి. అలా ‘గ్రీన్ పీస్ టెర్రారియమ్’ స్టార్టప్ మొదలైంది. అంటే గాజు అద్దాల వనం. రండిరండని ఆహ్వానాలు! ఇప్పుడు గంగ, లక్ష్మి ఇద్దరికీ గార్డెనింగ్ వర్క్‌షాపులకు ఆహ్వానం వస్తోంది. బాటిల్ గార్డెన్లను ఎలా పెంచాలో నేర్పిస్తున్నారు వాళ్లు. ఇందులో సులువు తెలిస్తే పిల్లలు కూడా మొక్కలను పెంచగలుగుతారని చెబుతోంది గంగ. మొక్కను పెంచడంతోపాటు, ఏ మొక్కకు ఎలాంటి గాజు పాత్రను తీసుకోవాలనే ఎంపికలోనూ, బాటిల్లో మొక్క పాదు అందంగా కనిపించేటట్లు ఇసుక, మట్టి ఇతర మెటీరియల్‌ను వేయడం కూడా నైపుణ్యం కనబరచాలంటారామె. పబ్లిసిటీ లేకుండానే నెలకు నలభై వేలు! ‘గృహిణిగా ఖాళీ సమయం అనేదే ఉండదు. అయినప్పటికి మొక్కల కోసం సమయాన్ని సర్దుబాటు చేసుకున్నాం. అదే మమ్మల్ని ఎంట్రప్రెన్యూర్లుగా మార్చింది’ అంటారు గంగ, లక్ష్మి. ఇప్పుడు వీళ్లిద్దరూ బాటిల్ గార్డెనింగ్‌తో నెలకు నలభై వేల రూపాయలు మిగుల్చుకుంటున్నారు. వ్యాపార ప్రచారం కోసం ఒక్క రూపాయి కానీ ఓ గంట సమయాన్ని కానీ ఖర్చు చేసింది లేదు! వీళ్ల దగ్గర ఈ చిట్టి తోటలను కొన్న వాళ్లే వాటిని గర్వంగా నలుగురికీ చూపించుకునే వాళ్లు. తన ప్రేయసికి పుట్టిన రోజు బహుమతిగా టెర్రారియమ్ మొక్కను ఇచ్చిన ప్రియుడు తన అభిరుచికి తానే మురిసిపోతూ గొప్పగా ఆ ఫొటోను ఫ్రెండ్స్‌కి షేర్ చేసేవాడు. అందుకున్న ప్రియురాలు కూడా సోషల్ మీడియాలో షేర్ చేసేది. ఆ ముచ్చట్లే గ్రీన్ పీస్ టెర్రారియమ్కి ప్రచారాలయ్యాయి. – మంజీర -
బెగ్గింగ్ చేస్తున్న పోస్ట్గ్రాడ్యుయేట్లు
బెంగళూరు: నేటి రోజుల్లో అడుక్కోవడం ఆకర్షణీయమైన వృత్తిగా మారిపోయింది. ఉన్నత విద్యను అభ్యసించిన వారు కూడా ఈ వృత్తినే ఆశ్రయించడం మరింత ఆశ్చర్యకర విషయం. ముఖ్యంగా భారత సిలికాన్ వ్యాలీగా ప్రసిద్ధి చెందిన బెంగళూరు నగరంలో పోస్ట్ గ్రాడ్యుయేట్లు, గ్రాడ్యుయేట్లు, డిప్లొమా హోల్డర్లు వీధుల్లో తిరుగుతూ, ఫుట్‌పాత్‌లపై కూర్చొని నిర్మొహమాటంగా అడుక్కుంటున్నారు. ఎందుకని ఆరాతీస్తే... తాను ఓ కంపెనీలో పనిచేసినప్పుడు నెలకు ఆరువేల రూపాయల జీతం వచ్చేదని, ఇప్పుడు అడుక్కోవడం వల్ల నెలకు 12 వేల రూపాయలకుపైగా సంపాదిస్తున్నానని ఓ పోస్ట్‌గ్రాడ్యుయేట్ వెల్లడించాడు. తన కుటుంబం ఎదుర్కొంటున్న దుర్భర పరిస్థితుల గురించి ఏకరవు పెట్టడం ద్వారా తనకు కుటుంబ పోషణానికి సరిపడ సంపాదన వస్తోందని ఆయన వివరించాడు. ఏదైనా కంపెనీల్లో ఎనిమిది గంటలు పనిచేసినా ఇంతకన్నా ఎక్కువ సంపాదిస్తానన్న నమ్మకం లేదని అన్నాడు. ఆధునిక సాంకేతిక విప్లవం పరిఢవిల్లిన నేటి ఐటీ యుగంలో సాధారణ చదువులు పూర్తి చేసిన తమకు సరైన ఆధరణ, సరిపడ ఉద్యోగావకాశాలు లేవని బెగ్గింగ్ ప్రధాన వృత్తిగా చేసుకున్న పోస్ట్ గ్రాడ్యుయేట్లు, గ్రాడ్యుయేట్లు, డిప్లొమా హోల్డర్లు చెబుతున్నారు. అక్షరాస్యులు, ముఖ్యంగా ఉన్నత విద్యావేత్తలు కూడా వీధుల్లో అడుక్కుంటున్నారన్న విషయం ఓ ప్రభుత్వ అధ్యయనంలో వెల్లడవడంతో కర్ణాటక రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ రంగంలోకి దిగి అడుక్కుంటున్న విద్యావేత్తలకు కౌన్సిలింగ్ ప్రారంభించింది. ఈ సందర్భంగా వారు ఇలాంటి విషయాలు వెల్లడించారు. ఉద్యోగార్హులకు ప్రైవేటు కంపెనీల్లో గౌరవప్రదమైన ఉద్యోగాలు ఇప్పిస్తామని అధికారులు చెబుతున్నా వారు వినిపించుకోవడం లేదు. 14, 15 వేల రూపాయల ఉద్యోగం ఇప్పిస్తారా ? అని ప్రశ్నిస్తున్నారు. చిన్నదైన ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పించినా అడుక్కోవడం మానేస్తామని చెబుతున్నారు. వారందరిని జన జీవన స్రవంతిలోకి తీసుకొచ్చేవరకు కౌన్సిలింగ్ ఇస్తామని, ఈ విషయంలో స్వచ్ఛంద సేవా సంస్థల సహాయ సహకారాలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం లెక్కల ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా 10,680 మంది అడుక్కోవడంపైనే జీవిస్తున్నారు. రాజధాని నగరం బెంగళూరులోనే 1,368 మంది ఉన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 2,547 మంది అక్షరాస్యులు అడుక్కుంటుండగా, వారిలో 459 మందిలో గ్రాడ్యుయేట్ల నుంచి పదవ తరగతి వరకు చదువుకున్నవారు ఉన్నారు. 23 మంది వివిధ సాంకేతిక వృత్తి కోర్సుల్లో డిప్లొమా చేసిన వారున్నారు. ఒక్క బెంగళూరు నగరంలోనే 77 మంది పోస్ట్ గ్రాడ్యుయేట్లు, గ్రాడ్యుయేట్లు ఉన్నారు. 25 మంది డిప్లొమా హోల్డర్లు, 206 మంది ఇంటర్మీడియట్, టెన్త్ క్లాస్ చదవుకున్న వారు ఉన్నారు. వీరంతా ఎక్కువ వరకు నగరంలోని ఎంజీ రోడ్డులో, ఇతర వాణిజ్య ప్రాంతాల్లోనే అడుక్కుంటున్నారు. ప్రముఖ చారిత్రక, సాంస్కృతిక నగరంగా ప్రసిద్ధి చెందిన పొరుగు నగరం మైసూరులో కూడా ఉన్నత విద్యావంతులు బెగ్గింగ్నే వృత్తిగా పెట్టుకున్నారు. వారిలో 169 మంది పోస్ట్గ్రాడ్యుయేట్లు, గ్రాడ్యుయేట్లు, డిప్లొమా హోల్డర్లు ఉన్నారు. వారిలో 68 మంది మహిళలు ఉండడం గమనార్హం. తాగుడుకు బానిసలై, పనిచేసే జవసత్వాలు ఉడిగిపోయిన కారణంగా అడుక్కోవడంలో అర్థముంది. కేవలం కుటుంబ పోషణార్థమే అడుక్కుంటున్నారంటే నిజంగా ఆలోచించాల్సిన అంశమే. -
పీజీ వైద్య విద్య కౌన్సెలింగ్ ప్రారంభం
హైదరాబాద్: విజయవాడలో పీజీ వైద్య విద్య కౌన్సెలింగ్ బుధవారం ప్రారంభమైంది. తెలంగాణ విద్యార్థులకు కూడా ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయంలోనే కౌన్సెలింగ్ జరుగుతున్న విషయం తెలిసిందే. తెలంగాణకు చెందిన 3,693 మంది విద్యార్థులు పీజీ ప్రవేశ పరీక్షలో అర్హత సాధించారు. తెలంగాణకు 788 పీజీ సీట్లు ఉండగా అందులో 508 నాన్ సర్వీసు, 280 సర్వీసు సీట్లుగా నిర్ధారించినట్లు వైద్య విద్యా సంచాలకులు పుట్టా శ్రీనివాస్ తెలిపారు. ఏడో తేదీ వరకు కౌన్సెలింగ్ కొనసాగుతుందని, మొదటిరోజు 800 ర్యాంకు వరకు కౌన్సెలింగ్ జరుగుతుందని పేర్కొన్నారు. తెలంగాణ విద్యార్థులకు అన్ని విధాలా న్యాయం జరిగేందుకు ఇద్దరు పరిశీలకులను కౌన్సెలింగ్ కేంద్రం వద్ద ఉంచినట్లు ఆయన చెప్పారు. కౌన్సెలింగ్ కేంద్రం వద్ద ఉండి ఎటువంటి సమస్యలు తలెత్తకుండా సమీక్షిస్తానన్నారు. -
స్వగ్రామంలో ‘వైకుంఠసేవ’
హైదరాబాద్, న్యూస్‌లైన్: ‘సొంతూరు మనకేం చేసింది అని కాదు.. ఊరికి మనమేం చేశామన్నదే ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలి..’ అని తండ్రి చెప్పిన మాటల్ని ఆయన మరిచిపోలేదు. చదువు, ఉద్యోగ రీత్యా వివిధ ప్రాంతాలకు వెళ్లినా ప్రశాంతతకు ఆలవాలమైన తన స్వగ్రామాన్ని మర్చిపోలేదు. అందుకే మనిషిని విజయపథం వైపు నడిపించే ఆధ్యాత్మిక మార్గానికి బాటలు వేశారు. శ్రీవారి ఆలయాన్ని సర్వాంగసుందరంగా నిర్మించి వైకుంఠవాసుడి దర్శనాన్ని ఊరి ప్రజలకందించారు. మరెన్నో సేవాకార్యక్రమాలతో పుట్టిన ఊరి రుణం తీర్చుకుంటున్నారు. ఆయనే తమ్మిడిశెట్టి బసవరాజు. చార్మినార్ డివిజన్ సహాయ వాణిజ్య పన్నుల శాఖ అధికారి. ఆయన స్వగ్రామం విశాఖపట్నం జిల్లా పాయకరావుపేట మండలం మంగవరం. తల్లిదండ్రులు భూదేవి, వీరభద్రరరావు. పదో తరగతి వరకు పాయకరావుపేటలోనే విద్యనభ్యసించిన ఆయన ఇంటర్ నుంచి సొంతూరైన మంగవరానికి దూరమయ్యారు. ఇంటర్, డిగ్రీ కాకినాడలో, ఆ తరువాత ఉద్యోగరీత్యా హైదరాబాద్‌లో స్థిరపడ్డారు. గుడి కట్టించారు..: మంగవరం గ్రామ ప్రజలు దైవ దర్శనం చేసుకోవాలంటే 20 కిలోమీటర్ల పైబడి ప్రయాణం చేయాల్సి వచ్చేది. దీని కోసం తన స్వగ్రామంతో పాటు చుట్టుపక్కల గ్రామాల ప్రజల ఇబ్బందుల్ని గమనించారు బసవరాజు. తన ఇష్టదైవమైన శ్రీవెంకటేశ్వర ఆలయ నిర్మాణానికి పూనుకున్నారు. 500 గజాల విస్తీర్ణంలో దాదాపు 15 లక్షల రూపాయలు వెచ్చించి ‘పద్మావతీ, గోదాదేవి సమేత వెంకటేశ్వర ఆలయాన్ని’ గత ఏడాది మేలో పూర్తి చేశారు. ఆలయంలో విగ్రహాల్ని తిరుమల తిరుపతి దేవస్థానం అందించింది. అలాగే సంక్రాంతి పండుగ రోజుల్లో గోదాదేవి కల్యాణ మహోత్సవం తరువాత మొదటగా ఊరిలో ఎవరైతే పెళ్లి చేసుకుంటారో వారికి తాళిబొట్టుతో పాటు ఇతర సరంజామాను ఉచితంగా ఆలయం తరుఫున అందజేయాలని నిర్ణయించారు. గోదాదేవి కల్యాణం రోజున వందలాది మందికి అన్నదానం చేస్తున్నారు. గుడి ఆదాయాన్ని బట్టి పేదవారికి సహాయ సహకారాలు అందించేందుకు వివిధ సేవా కార్యక్రమాలకు రూపకల్పన చేశారు. భవిష్యత్తులో గ్రామంలో మంచినీటి ప్లాంట్ల నిర్మాణం, ఆరోగ్య కేంద్రం, వెటర్నరీ (పశువుల) ఆస్పత్రి నిర్మించే యోచనలో ఉన్నట్లు బసవరాజు తెలిపారు. ‘మా గ్రామానికి చెందిన చాలా మంది హైదరాబాద్‌తో పాటు విదేశాల్లో కూడా స్థిరపడ్డారు. వారందరూ ఊరిబాగు కోసం సహకారం అందించాలి. గ్రామాన్ని మరింతగా అభివద్ధి చేసేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని నా మనవి’ అని అంటున్నారు బసవరాజు. పేరు: తమ్మిడిశెట్టి బసవరాజు ఉద్యోగం: సహాయ వాణిజ్య పన్నుల శాఖ అధికారి(చార్మినార్ డివిజన్) సొంతూరు: మంగవరం, పాయకరావుపేట మండలం, విశాఖ జిల్లా