public transport system
-
ప్రజా రవాణా వ్యవస్థకు దూరమవుతున్న జనం.. ఎందుకంటే!
ప్రజా రవాణా వ్యవస్థ పట్ల నగర వాసులకు ఆసక్తి సన్నగిల్లుతోందా? అంటే అవుననే సమాధానం వస్తోంది. వేళాపాళలేకుండా రావడం, గంటలకొద్దీ వేచి చూడడం, ప్రయాణం ఆలస్యం కావడం, బస్సుల్లో రద్దీ ఎక్కువగా ఉండడంతో నగర వాసులు ప్రజా రవాణాకు దూరమవుతున్నారు. కేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ నిర్వహించిన సర్వేలో ఈ విషయాలు వెలుగులోకి వచ్చాయి. 46 నగరాల్లో 2 లక్షల మంది పైగా తమ అభిప్రాయాలను సర్వేలో వ్యక్తపరిచారు. 15 వేల మంది పైగా బస్సు డైవర్లు, కండక్టర్ల అభిప్రాయాలను కూడా తెలుసుకున్నారు. రద్దీ ఎక్కువ.. నమ్మకం లేదు విపరీతమైన రద్దీ కారణంగా బస్సులు ఎక్కడానికి భయపడుతున్నామని 68 శాతం మంది ప్రయాణికులు తెలిపారు. ఆర్టీసీ బస్సుల్లో వెళితే సమయానికి గమ్యస్థానానికి చేరతామన్న నమ్మకం లేదని 64 శాతం మంది చెప్పారు. భద్రత పట్ల 36 శాతం మంది ఆందోళన వెలిబుచ్చారు. బస్టాపుల్లో బస్సులు ఆపడం లేదని 27 శాతం మంది ఫిర్యాదు చేశారు. ఆన్లైన్ చేయాలి ప్రజా రవాణా వ్యవస్థలో టెక్నాలజీ వినియోగం పెరగాలని జనం కోరుకుంటున్నారు. బస్సులు ఏయే మార్గాల్లో, ఏ సమయంలో వెళుతున్నాయి.. ఎక్కెడెక్కడ ఆగుతాయనే సమాచారం ఆన్లైన్లో అందుబాటులో ఉండాలని 57 శాతం మంది కోరుకున్నారు. ఎక్కువ ప్రయాణాలు చేసే వారిలో 54 శాతం మంది ఆన్లైన్ ద్వారా డబ్బులు చెల్లించేందుకు మొగ్గు చూపుతున్నారు. సింగిల్ జర్నీ చేసే వారిలో 53 శాతం మంది నగదు చెల్లించేందుకే ఇష్టపడుతున్నారు. ఆటో, క్యాబ్ డ్రైవర్లలో ఎక్కువ శాతం క్యాష్ పేమెంట్లకే ఆసక్తి చూపుతున్నారు. ట్రాఫిక్ జామ్‌లతో తంటా నగరాల్లో ట్రాఫిక్ జామ్‌లతో సతమతమవుతున్నామని 59 శాతం మంది డ్రైవర్లు, కండక్టర్లు వాపోయారు. ట్రాఫిక్ కారణంగానే సమయానుకూలంగా బస్సులు నడపలేకపోతున్నామని చెప్పారు. ఇక బస్సు సిబ్బందిని అనారోగ్య సమస్యలు వెంటాడుతున్నాయి. దాదాపు 50 శాతం మంది రోగాల బారిన పడుతున్నారు. 34 శాతం మంది బస్సు డ్రైవర్లకు బీమా భద్రత లేదు. ఆటో, క్యాబ్ డ్రైవర్లలో 45 శాతం మందికి ఆరోగ్య బీమా సౌకర్యం అందని ద్రాక్షగానే ఉంది. ఒత్తిడి, ఆందోళన, కీళ్లు-ఒళ్లు నొప్పులు ఎక్కువగా వేధించే సమస్యలని వెల్లడించారు. సర్వే ఎందుకంటే.. స్మార్ట్ సిటీ మిషన్ కార్యక్రమంలో భాగంగా ‘ట్రాన్స్‌ఫోర్ట్ ఫర్ ఆల్ చాలెంజ్’ పేరుతో కేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ ఈ సర్వే చేపట్టింది. 2021 అక్టోబర్ నుంచి 2022 ఏప్రిల్ వరకు సర్వే నిర్వహించింది. ప్రజా రవాణా వ్యవస్థలో సమస్యలను గుర్తించి, వాటికి పరిష్కార మార్గాలు అన్వేషించడానికి ఇదంతా చేస్తోంది. ప్రజా రవాణా వ్యవస్థకు సంబంధించి ఇంత పెద్ద ఎత్తున సమాచారం సేకరించడం ఇదే మొదటిసారి అని అధికారులు చెబుతున్నారు. సర్వేలో గుర్తించిన సమస్యల పరిష్కారానికి రెండో దశలో ప్రయత్నాలు చేస్తామన్నారు. అంకుర సంస్థలు ఏమైనా పరిష్కారాలు ఉంటే స్టార్టప్ ఇండియా పోర్టల్‌లో నమోదు చేయాలని సూచించారు. (క్లిక్: కేపీహెచ్‌బీ టూ ఓఆర్ఆర్.. మెట్రో నియో పట్టాలెక్కేనా!) -
Dussehra 2022: కాసులు కురిపించిన దసరా
సాక్షి, హైదరాబాద్: ప్రజా రవాణా సంస్థలకు దసరా పండగ కాసులు కురిపించింది. రెట్టింపు ఆదాయాన్ని తెచ్చిపెట్టింది. దసరా సందర్భంగా నగరం నుంచి సుమారు 30 లక్షల మందికిపైగా సొంతూళ్లకు వెళ్లినట్లు అంచనా. వీరిలో 25 శాతం మంది సొంత వాహనాల్లో వెళ్లగా.. మిగతా 75 శాతం ఆర్టీసీ బస్సులు, రైళ్లలో బయలుదేరారు. ఏపీలోని వివిధ ప్రాంతాలకు ప్రైవేట్ బస్సుల్లో ఎక్కువగా వెళ్లారు. ప్రయాణికుల రద్దీ మేరకు దక్షిణమధ్య రైల్వే సుమారు 40 ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసింది. కొన్ని రైళ్లలో సాధారణ బోగీల సంఖ్యను పెంచింది. మరికొన్ని రైళ్లకు స్లీపర్ బోగీలను అదనంగా ఏర్పాటు చేశారు. ఈ ఏడాది దసరా రద్దీ దృష్ట్యా 4600 అదనపు బస్సులకు ఆర్టీసీ ప్రణాళికలను సిద్ధం చేసింది. మరోవైపు సాధారణ చార్జీలపైనే అదనపు బస్సులను నడపడంతో ప్రయాణికుల నుంచి అనూహ్యమైన ఆదరణ లభించింది. ఆర్టీసీకి ఆదరణ.. సద్దుల బతుకమ్మ, దసరా సందర్భంగా ఎక్కువ శాతం నగరవాసులు ఆర్టీసీ బస్సుల్లోనే ప్రయాణం చేశారు. తెలంగాణలోని అన్ని జిల్లాలకు బస్సులే అందుబాటులో ఉండడంతో ఆర్టీసీ సైతం విస్తృత ఏర్పాట్లు చేసింది. గతేడాది దసరాకు రూ.10 కోట్లు సమకూరగా.. ఈసారి సుమారు రూ.15 కోట్లకుపైగా లభించినట్లు ఓ అధికారి తెలిపారు. సాధారణ రోజుల్లో మహాత్మాగాంధీ, జూబ్లీ బస్స్టేషన్లతో పాటు వివిధ ప్రాంతాల నుంచి ప్రతి రోజు నడిచే 3500 బస్సులతో పాటు రద్దీకి అనుగుణంగా అదనపు బస్సులను ఏర్పాటు చేశారు. నగరవాసులు పూర్తిస్థాయిలో బస్సులను వినియోగించుకుంటే ఆర్టీసీకి మరింత ఆదాయం లభించేదని, ఎక్కువ శాతం సొంత వాహనాలు, టాటాఏస్‌లు, అద్దె కార్లకు ప్రాధాన్యమిచ్చారని అధికారులు భావిస్తున్నారు. బైక్‌లపై కూడా పెద్ద ఎత్తున వెళ్లినట్లు సమచారం. పండగ చేసుకున్న ప్రైవేట్ యాజమాన్యాలు.. హైదరాబాద్ నుంచి ఏపీలోని వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగించే ప్రైవేట్ బస్సుల్లో రెట్టింపు చార్జీలను వసూలు చేశారు. పండగ రద్దీని సొమ్ము చేసుకున్నారు. టూరిస్టు బస్సులుగా నమోదైనవి కూడా స్టేజీ క్యారేజీలుగా రాకపోకలు సాగించాయి. మినీ బస్సులు, ట్రావెల్స్ కార్లు సైతం రెండు రాష్ట్రాల మధ్య పరుగులు తీశాయి. దక్షిణమధ్య రైల్వేకు.. దక్షిణమధ్య రైల్వేకు సుమారు రూ.45 కోట్ల వరకు లభించినట్లు అంచనా. దసరా సందర్భంగా వివిధ మార్గాల్లో ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేశారు. అన్ని రూట్లలోను ప్రయాణికుల రద్దీ పెరిగింది. అన్ని ప్రధాన రైళ్లలో వెయిటింగ్‌లిస్టు 250 దాటిపోయింది. దీంతో రద్దీ ఉన్న మార్గాల్లో అదనపు రైళ్లతో పాటు అదనపు బోగీలను ఏర్పాటు చేయడం వల్ల కొంత మేరకు ఊరట లభించింది. కోవిడ్‌కు ముందు.. అంటే రెండేళ్ల క్రితం నాటి ఆదాయంతో పోల్చితే ఈ ఏడాది చాలా తక్కువే లభించినట్లు అధికారులు చెప్పారు. -
కూకట్పల్లి టూ కోకాపేట్.. త్వరలో లైట్ రైల్ ?
ప్రజా రవాణా వ్యవస్థను మరింత పటిష్టం చేసే దిశగా మరో కొత్త ప్రాజెక్టును హైదరాబాద్‌లో చేపట్టేందుకు సర్కారు సిద్ధమవుతోంది. ఇప్పటికే నగరంలో ఉన్న మల్టీ మోడల్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ (ఎంఎంటీఎస్), హైదరాబాద్ మెట్రోరైల్ (హెచ్ఎంఆర్)లకు తోడుగా లైట్ రైల్ ట్రాన్సిట్ సిస్టమ్ (ఎల్ఆర్టీఎస్)ను తెస్తే ఎలా ఉంటుందనే అంశంపై ప్రతిపాదనలు సిద్ధమవుతున్నాయని అధికార వర్గాలు అంటున్నాయి. నగరంలో గచ్చిబౌలి, రాయదుర్గం, హైటెక్ సిటీ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, కోకాపేట ఏరియాల్లో అనేక బహుళజాతి కంపెనీలు ఇప్పటికే కొలువై ఉన్నాయి. మరిన్ని కంపెనీలు ఈ ఏరియాలో రాబోతున్నాయి. లక్షల మంది ఉద్యోగులు నిత్యం ఇక్కడ పని చేస్తున్నారు. రాబోయే రోజుల్లో వీరంతా ఆఫీసులకు వచ్చి పోయేందుకు ఇబ్బంది రాకుండా ఉండాలనే ప్రస్తుతం ఉన్న రవాణ వ్యవస్థకు అదనంగా మరొకటి తేవాల్సిన అవసరం ఏర్పడింది. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని అతి పెద్ద హౌజింగ్ బోర్డుల్లో ఒకటిగా ఉన్న కూకట్పల్లి నుంచి కోకాపేట వరకు లైట్ రైల్ ట్రాన్సిట్ సిస్టమ్ ఏర్పాటు చేస్తే ఎలా ఉంటుందనే అంశంపై హైదరాబాద్ యునిఫైడ్ మెట్రోపాలిటన్ ట్రాన్‌పోర్ట్ అథారిటీ (హెచ్‌యూఎంటీఏ)లు డిటైల్డ్ ప్రాజెక్టు రిపోర్టును రెడీ చేస్తున్నట్టు సమాచారం. హెచ్‌యేఎంటీఏలో హెచ్ఎండీఏ, హెచ్‌ఎంఆర్‌లు భాగస్వాములుగా ఉన్నాయి. ప్రస్తుత అంచనాల ప్రకారం కూకట్పల్లి హౌజింగ్ బోర్డు నుంచి కోకాపేట వరకు మొత్తం 24.50 కిలోమీటర్ల మేర ఎల్‌ఆర్‌టీఎస్‌ను నిర్మించాలని నిర్ణయించారు. ఈ మార్గం వల్ల ఒకేసారి కేపీహెచ్‌బీ, రాయదుర్గం మెట్రోస్టేషన్లు, హైటెక్ సిటీ ఎంఎంటీఎస్ స్టేషన్ అనుసంధానం అయ్యే అవకాశం ఉంది. నార్సింగి దగ్గర మెట్రో ఫేట్ 2 లైన్ సైతం టచ్ అవుతుంది. తక్కువ ఖర్చుతో ఎక్కువ ప్రయోజనాలు అందుతాయని అధికారులు భావిస్తున్నారు. -
సిటీ బస్సుల పెంపునకు ఆర్టీసీ ప్రణాళిక
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ముఖ్య నగరాల్లో సిటీ సర్వీసులు పెంచేందుకు ఆర్టీసీ ప్రణాళిక రూపొందించింది. కేంద్ర ప్రభుత్వం ‘నేషనల్ బస్ రెజునేషన్’ స్కీం కింద ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్రలను ఎంపిక చేసింది. ఈ పథకం ద్వారా కేంద్రం నిధులు ఇస్తుంది. ఈ నిధులతో ఆర్టీసీ రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో సిటీ సబర్బన్ సర్వీసులు పెంచుకునే అవకాశం ఉంది. సెట్విన్ తరహాలో బస్సులను ప్రవేశపెట్టడం, డిపోల నిర్మాణం తదితర పనులు చేపట్టవచ్చు. కేంద్ర నిధులతో నిరుద్యోగ యువత సెట్విన్ తరహా బస్సులు కొనుక్కుని బస్సు ఆపరేటర్లుగా మారి సొంతంగా నడుపుకొనేందుకు అవకాశముంది. రాష్ట్రంలో విశాఖపట్నం, విజయవాడ నగరాల్లో 1,100 సిటీ సర్వీసులను ఆర్టీసీ నడుపుతోంది. గుంటూరులో సిటీ సర్వీసులు తిప్పేందుకు గతంలో ప్రయత్నించినా.. ఆర్టీసీకి కిలోమీటరుకు భారీ నష్టం వస్తుందని వాటి జోలికి వెళ్లలేదు. మిగిలిన నగరాల్లోనూ సిటీ సర్వీసులు నడిపేందుకు ఆర్టీసీ.. కేంద్ర ప్రభుత్వ పరిధిలోని అర్బన్ మాస్ ట్రాన్స్‌పోర్టు కార్పొరేషన్ (యూఎంటీసీ) ద్వారా అధ్యయనం చేయించనుంది. ఆర్టీసీ ఇప్పటికే కాకినాడ నగరంలో అధ్యయనం చేసింది. ఇక్కడ సిటీ సర్వీసులు పెంచేందుకు కాకినాడకు 20 కి.మీ. పరిధిలో 215 సిటీ సర్వీసులు నడిపేలా ప్రతిపాదనల్ని యూఎంటీసీకి అందించింది. మిగిలిన చోట్ల అధ్యయనం చేసి ప్రతి లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో 20 కి.మీ. వరకు.. మొత్తం పదివేల సిటీ బస్సుల్ని తిప్పడం ఆర్టీసీ లక్ష్యంగా ఉంది. కేంద్రానికి ప్రతిపాదనలు పంపిన ఆర్టీసీ పెరుగుతున్న జనాభా అవసరాలకు అనుగుణంగా ప్రజారవాణాను సామాన్య ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలన్న లక్ష్యంతో కేంద్రం ‘నేషనల్ బస్ రెజునేషన్’ స్కీం ద్వారా ఆర్టీసీలను ఆదుకోవాలని నిర్ణయించింది. దీని ప్రకారం కిలోమీటరుకు రూ.7 వంతున సబ్సిడీ రూపంలో ఆర్టీసీకి ఇవ్వనుంది. రాష్ట్రంలో భారీగా సిటీ సర్వీసులు నడిపేందుకు ఆర్టీసీ కేంద్రానికి ప్రతిపాదనలు పంపింది. విజయవాడలో 650కి పైగా సిటీ సర్వీసులు తిప్పుతున్నా.. ప్రజల అవసరాలకు సరిపోవడం లేదని, ఇక్కడ సర్వీసులు పెంచాలని ప్రతిపాదనలు రూపొందించారు. కేంద్ర పథకం కింద గ్రాంటుగా నిధులిస్తే తొలివిడత రాష్ట్రంలోని ముఖ్య నగరాల్లో మూడువేల బస్సులు నడపాలని ఆర్టీసీ భావిస్తోంది. -
ఏపీఎస్‌ఆర్టీసీకే ఆదరణ!
సాక్షి, అమరావతి: పొరుగు రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలోని ప్రజా రవాణా వ్యవస్థకే ఆదరణ దక్కుతోంది. ఆయా రాష్ట్రాల ఆర్టీసీలతో పోలిస్తే ఏపీఎస్ఆర్టీసీ ఆక్యుపెన్సీనే ఎక్కువగా ఉంది. ప్రస్తుతం ఏపీలో 50% మాత్రమే బస్సు సర్వీసులు నడుస్తున్నాయి. ఆక్యుపెన్సీ 62% వరకు ఉంటోంది. ఏపీఎస్ఆర్టీసీ ద్వారా రోజు వారీగా 22 లక్షల మంది ప్రయాణికులు వారి గమ్యస్థానాలకు చేరుకుంటున్నారు. ఆన్లైన్ టికెట్ బుకింగ్లోనూ ఇతర ఆర్టీసీల కంటే ఏపీఎస్ఆర్టీసీ మెరుగ్గా ఉంది. దూర ప్రాంత సర్వీసుల్లో ఏపీఎస్ఆర్టీసీలో రోజుకు దాదాపు 70 వేల టికెట్లు బుకింగ్ జరుగుతోందని లెక్కలు స్పష్టం చేస్తున్నాయి. కోవిడ్–19 నేపథ్యంలో మే 21 నుంచి ఏపీఎస్ఆర్టీసీ సర్వీసుల్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఇప్పటివరకు 50% సర్వీసులు తిప్పుతున్న ఏపీఎస్ఆర్టీసీ వంద శాతం సర్వీసులు తిప్పేందుకు సిద్ధంగా ఉంది. ► ఏపీఎస్ఆర్టీసీ ఆక్యుపెన్సీ శాతం పెంచుకునేందుకు ప్రైవేట్ ట్రావెల్స్తో పోటీ పడనుంది. ఇందులో భాగంగా రాష్ట్ర పరిధిలోని అంతర్గత రూట్లపై ఇటీవలే ఆర్టీసీ అధికారులు సర్వే చేశారు. ► డిమాండ్ ఉన్న విశాఖ–హైదరాబాద్ రూట్లో ప్రైవేట్ బస్సులు పగటి పూట తిప్పుతున్నాయి. అదే ఆర్టీసీ రాత్రి వేళల్లో మాత్రమే తిప్పుతోంది. ఆర్టీసీ కూడా పగటి పూట బస్సుల్ని నడిపేందుకు యోచిస్తోంది. ఏపీఎస్ ఆర్టీసీలోనే కోవిడ్ వ్యాప్తి తక్కువ ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీఎస్ఆర్టీసీ బస్సుల్లో కోవిడ్ వ్యాప్తి అతి తక్కువగా నమోదైనట్టు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన అసోసియేషన్ ఆఫ్ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండర్ టేకింగ్స్ పేర్కొంది. కరోనా సమయంలో ఇతర రాష్ట్రాల కంటే ఏపీలోనే ప్రజా రవాణా వ్యవస్థ మెరుగ్గా ఉందని తేల్చింది. వంద శాతం బస్సుల్ని నడిపేందుకు సిద్ధం రాష్ట్రంలో ప్రయాణికుల సౌలభ్యం కోసం కోవిడ్ నిబంధనలను అనుసరించి వంద శాతం బస్సుల్ని నడిపేందుకు సిద్ధంగా ఉన్నాం. మిగిలిన ఆర్టీసీల కంటే ఏపీఎస్‌ఆర్టీసీకే ఆదరణ ఎక్కువగా ఉంది. ఏ రాష్ట్రంలో లేని విధంగా ఏపీఎస్ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం వల్ల మెరుగైన సామర్థ్యంతో పనిచేసే అవకాశం దక్కింది. – కె.బ్రహ్మానందరెడ్డి, ఈడీ (ఆపరేషన్స్), ఏపీఎస్ఆర్టీసీ -
ఏపీఎస్ ఆర్టీసీకి ఆదరణ
సాక్షి, అమరావతి: కరోనా వేళ.. ఏపీఎస్ఆర్టీసీ ప్రయాణికుల ఆదరణ చూరగొంటోంది. పొరుగున ఉన్న తెలంగాణ, కర్ణాటకలతో పోలిస్తే ఏపీఎస్ఆర్టీసీలోనే రోజు వారీ 2 లక్షల మంది ప్రయాణికులు వారి గమ్యస్ధానాలకు చేరుకుంటున్నారు. మే 21 నుంచి ఆర్టీసీ సర్వీసుల్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. టీఎస్ఆర్టీసీ.. ఏపీఎస్ఆర్టీసీ కంటే వారం ముందుగానే సర్వీసుల్ని తిప్పుతోంది. తమిళనాడులో ఆర్టీసీ ఆపరేషన్స్ ఇంకా ప్రారంభం కాలేదు. ► దూర ప్రాంత సర్వీసుల్లో ఏపీఎస్ఆర్టీసీలో దాదాపు 60 వేల టికెట్లు, తెలంగాణ ఆర్టీసీలో 1,492, కర్ణాటక ఆర్టీసీలో 4,843 టికెట్ల బుకింగ్ జరుగుతోంది. ► తెలంగాణ ఆర్టీసీతో ఇంకా చర్చలు కొలిక్కి రాకపోవడంతో హైదరాబాద్‌కు ఏపీఎస్ఆర్టీసీ రాకపోకలు ప్రారంభించలేదు. కర్నాటక రాష్ట్రానికి గత నెల 17 నుంచి బస్సుల్ని తిప్పుతోంది. ► ఏపీఎస్ఆర్టీసీలో 76 శాతం ఆక్యుపెన్సీ నమోదవుతోంది. అదే తెలంగాణలో 20 శాతం ఆక్యుపెన్సీ దాటడం లేదు. ► ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీఎస్ఆర్టీసీ బస్సుల్లో కోవిడ్ వ్యాప్తి అతి తక్కువగా నమోదైనట్లు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన అసోసియేషన్ ఆఫ్ స్టేట్ రోడ్ ట్రాన్స్‌పోర్టు అండర్ టేకింగ్స్ పేర్కొంది. కరోనా సమయంలో ఇతర రాష్ట్రాల కంటే ఏపీలోనే ప్రజా రవాణా వ్యవస్థ మెరుగ్గా ఉందని తేల్చింది. ► ఆన్లైన్ టికెట్ బుకింగ్లోనూ ఇతర ఆర్టీసీల కంటే ఏపీఎస్ఆర్టీసీ మెరుగ్గా ఉంది. -
‘లాక్ డౌన్’ ఉల్లంఘిస్తే 6 నెలల జైలు
సాక్షి, అమరావతి: కరోనా వైరస్‌ను కట్టడి చేయడంలో భాగంగా రాష్ట్రంలో ఈనెల 31వ తేదీ వరకు ‘లాక్ డౌన్’ను అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని ప్రభుత్వం హెచ్చరించింది. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై ఐపీసీ సెక్షన్ 188 ప్రకారం ఆరు నెలల పాటు జైలుకు పంపించడంతో పాటు వెయ్యి రూపాయల జరిమానా విధించే అధికారం సంబంధిత అధికారులకు కల్పించింది. లాక్డౌన్ నుంచి మినహాయింపు ఉన్న సేవలు తప్ప మిగతావన్నీ ఆపేయాలని స్పష్టం చేసింది. 1897 అంటువ్యాధుల నియంత్రణ చట్టాన్ని అమలులోకి తెస్తూ జీఓఆర్టీ నంబర్ 209 ద్వారా ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాల ప్రకారం ఈనెల 31 వరకూ రాష్ట్ర మంతటా లాక్ డౌన్ ప్రకటించింది. మినహాయింపు సేవలు.. - పోలీస్, వైద్య ఆరోగ్యం, పట్టణ స్థానిక సంస్థలు, అగ్నిమాపక, విద్యుత్, తాగునీరు, పురపాలక సేవలు, బ్యాంకులు, ఏటీఎం, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా, సామాజిక మాధ్యమాలు - ఆహారం, సరుకులు, పాలు, బ్రెడ్, పండ్లు, కూరగాయలు, మాంసం, చేపల రవాణా, గిడ్డంగులు, ఆసుపత్రులు, మందుల దుకాణాలు, కళ్ల జోళ్ల దుకాణాలు, ఔషధ తయారీ, వీటికి సంబంధించిన రవాణా. - టెలికాం, ఇంటర్నెట్ సేవలు, ఐటీ సేవకులు. - నిత్యావసర వస్తువుల తయారీ యూనిట్లు, వాటి సరఫరాదారులు, కరోనా నియంత్రణ కార్యకలాపాల్లో పాల్గొనే ప్రవేట్ సంస్థలు. - పెట్రోల్ పంపులు, ఎల్పీజీ గ్యాస్, ఆయిల్ ఏజెన్సీల రవాణా, గిడ్డంగుల్లో కార్యకలాపాలు. - ఆహారం, ఔషధాలు ,వైద్య పరికరాలు సరఫరా చేసే ఈ కామర్స్ సైట్లు. - జిల్లా కలెక్టర్ అనుమతితో ఇతరత్రా ఉత్పత్తి, తయారీ సంస్థలు మిగతా సేవలన్నీ 31 వరకు లాక్డౌన్ - అంతర్రాష్ట్ర రవాణా సేవలు సహా ప్రజారవాణా వ్యవస్థ పూర్తిగా రద్దు. - విదేశాల నుంచి తిరిగి వచ్చిన వారందరూ 14 రోజుల పాటు కఠినమైన గృహ నిర్బంధంలో ఉండాలి. - వ్యక్తికి వ్యక్తికి మధ్య కనీసం మూడు అడుగుల దూరం (సోషల్ డిస్టెన్స్) విధిగా పాటించాలి. - బహిరంగ ప్రదేశాలలో 10 మందికి మించి గుమిగూడటం నిషేధం. - రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాల అమలు, పర్యవేక్షణ అధికారం జిల్లా కలెక్టర్లు, సంయుక్త కలెక్టర్లు, పోలీస్ కమిషనర్లు, ఎస్పీలు, డీఎం అండ్ హెచ్ఓలు, సబ్ కలెక్టర్లు, ఆర్డీవోలు, తహసీల్దార్లు, మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీఓలకు కట్టబెట్టింది. -
ఆర్టీసీలో అన్ని సర్వీసులూ నిలిపివేస్తున్నాం
-
31 వరకు ప్రజారవాణా బంద్
సాక్షి, మచిలీపట్నం: కరోనా ఉధృతికి అడ్డుకట్ట వేసేందుకు రాష్ట్రంలో ఈ నెల 31వ తేదీ వరకు లాక్డౌన్ ప్రకటించిన నేపథ్యంలో ప్రజా రవాణా వ్యవస్థనూ బంద్ చేసినట్లు రాష్ట్ర రవాణా, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) వెల్లడించారు. ఈ నెల 31 వరకు ఆర్టీసీ సర్వీసులతోపాటు ఇతర రాష్ట్రాలకు నడిపే అంతర్రాష్ట్ర సర్వీసులనూ నిలిపి వేస్తున్నామన్నారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే బస్సులతో పాటు ఇతర వాహనాలన్నీ రాష్ట్రంలోకి రానీయకుండా సరిహద్దుల్లో ఆపేస్తామని, ఇందుకోసం రాష్ట్ర సరిహద్దులన్నీ మూసివేస్తున్నామన్నారు. ఆదివారం బందరులో మంత్రి మీడియాతో మాట్లాడారు. లాక్డౌన్ సందర్భంగా తీసుకుంటున్న చర్యలను వివరించారు. - వారం పాటు ఏపీలో ఆటోలు, ట్యాక్సీలు, క్యాబ్‌లు,టెంపోలు సహా ప్రయాణికులను చేరవేసే వాహనాల రాకపోకల న్నీ నిలిపివేత. ప్రభుత్వ నిర్ణయానికి అంతా కట్టుబడి ఉండాలి. - ప్రైవేటు రవాణా వ్యవస్థను నియంత్రించే బాధ్యతను పోలీసు, రవాణా శాఖలకు అప్పగించాం. - ఎవరైనా వైద్యావసరాల కోసం అత్యవసరంగా వెళ్లాల్సి వస్తే ఆటోల్లో కానీ ఇతర వాహనాల్లో కాని ఒక్కరే వెళ్లాలి. - 31 వరకు రాష్ట్రంలో ప్రతిఒక్కరూ స్వీయనిర్బంధంలో ఉండాలి. అత్యవసరమైతే తప్ప ఇల్లు విడిచి బయటకు రావద్దు. - విదేశాల నుంచి వచ్చిన వారే కాదు వారి ఇంట్లో, చుట్టుపక్కల వారి ఇళ్లల్లో కూడా దగ్గు, గొంతునొప్పి, జలుబు, జ్వరంతో ఎవరైనా బాధపడుతుంటే వెంటనే అందుబాటులో ఉన్న ప్రభుత్వ సిబ్బంది సహకారంతో ఆస్పత్రిలో చేరాలి. -
31వరకు ఏపీ లాక్డౌన్
సాక్షి, అమరావతి: ‘దేశాన్ని భయపెడుతున్న కరోనా వైరస్ కట్టడికి ప్రజలందరం కలిసికట్టుగా పోరాడదాం’ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపునిచ్చారు. ప్రజల రాకపోకలను కట్టడి చేయడం ద్వారానే కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టవచ్చని ఆయన చెప్పారు. అందుకోసం ఈనెల 31 వరకు రాష్ట్రవ్యాప్తంగా లాక్‌డౌన్‌ను ప్రకటించారు. అత్యవసర, నిత్యావసర వస్తువులు, సేవలు మాత్రం యథావిధిగా ప్రజలకు అందుబాటులో ఉంటాయని చెప్పారు. అంతర్రాష్ట్ర సరిహద్దులను మూసివేయడంతోపాటు రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేటు ప్రజా రవాణా వ్యవస్థను నిలిపివేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. అదే సమయంలో పేదలకు ఇబ్బంది కలగకుండా ఆదుకునేందుకు ప్రతి ఇంటికి రూ.వెయ్యితోపాటు ఉచితంగా రేషన్, కిలో పప్పు సరఫరా చేస్తామని తెలిపారు. కరోనా కట్టడి చేయడానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు ప్రజలు పూర్తిగా సహకరించి ఈ పోరాటంలో భాగస్వాములు కావాలని విజ్ఞప్తి చేశారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని తన క్యాంప్ కార్యాలయంలో ఆదివారం మీడియా సమావేశంలో సీఎం వైఎస్ జగన్ మాట్లాడారు. కరోనా కట్టడికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వివరించారు. ఆ వివరాలు.. అందరికీ అభినందనలు - గ్రామస్థాయి నుంచి దేశం మొత్తం ఒక భయానక వాతావరణంలో కదులుతోంది. కానీ, రాష్ట్రం మాత్రం అటువంటి పరిస్థితిలోకి వెళ్లకుండా సురక్షితమైన స్థానంలోనే ఉంచిన ప్రతి గ్రామ వలంటీరుకు, గ్రామ, వార్డు సచివాలయంలోని ప్రతి మెడికల్ అసిస్టెంట్, ఆశా వర్కర్లు, పీహెచ్సీలలోని డాక్టర్లు, నర్సులు, మొత్తంగా ఆరోగ్యశాఖ, కలెక్టర్లు, అధికారులకు మనస్ఫూర్తిగా అభినందనలు. - దేవుడి దయతో మిగిలిన రాష్ట్రాలు అన్నింటికంటే మన రాష్ట్రం మెరుగ్గా ఉంది. - దేశంలో దాదాపు 341 కేసులు నమోదై ఐదుగురు చనిపోయారు. కానీ, మన రాష్ట్రంలో కేవలం ఆరు కేసులు మాత్రమే నమోదయ్యాయి. అందులో నెల్లూరుకు చెందిన వ్యక్తి పూర్తిగా కోలుకుని డిశ్చార్జి అయి ఇంటికి కూడా వెళ్లిపోయారు. - ఈ పరిస్థితులు ఇంత మెరుగ్గా ఉండటానికి కారణం.. 2.50 లక్షల పైచిలుకు ఉన్న గ్రామ వలంటీర్లు ప్రతి ఇంటికి వెళ్లి విదేశాల నుంచి వచ్చిన వారిని సర్వే చేయడమే. ప్రతీ 50 ఇళ్లకు వెళ్లి విదేశాల నుంచి వచ్చినవారి డేటా యాప్ ద్వారా నమోదు చేశారు. ఎప్పటికప్పుడు వైద్య ఆరోగ్య శాఖకు సమాచారమిచ్చారు. తద్వారా గ్రామ సచివాలయంలోని హెల్త్ అసిస్టెంట్లు, ఆశా వర్కర్లు పీహెచ్సీ డాక్టర్లు మొత్తం పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించారు. - ఇలా గ్రామ వలంటీర్లు విదేశాల నుంచి వచ్చిన 11,670 మందిని ట్రాక్ చేశారు. వాళ్ల కదలికలపై పూర్తి నిఘా పెట్టారు. - ఆ 11,670 మందిలో 10,091 మందిని ఐసోలేషన్‌లో ఉంచాం. - 24 మందిని ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నాం. - మరో 1,555 మందిని 28 రోజులపాటు హోం ఐసొలేషన్‌లో ఉంచాం. వైద్యులు, అత్యవసర సేవల సిబ్బందికి చప్పట్లతో మద్దతు తెలుపుతున్న గవర్నర్ హరిచందన్,సీఎం వైఎస్ జగన్, మంత్రి ఆళ్ల నాని,సీఎస్ నీలం సాహ్ని తదితరులు మీ సేవలకు సెల్యూట్: సీఎం కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా 24 గంటలూ అకుంఠిత దీక్షతో పనిచేస్తున్న మా ఆరోగ్య కార్యకర్తలు, ఆర్మీ సిబ్బంది, పోలీసులతో పాటు మిగిలిన వారందరికీ సెల్యూట్ చేస్తున్నా. మీ అందరి కృషి వల్లే మేమంతా ఇంటి వద్ద సురక్షితంగా ఉన్నాం. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో పనిచేస్తున్న మీ అందరికీ మేం రుణపడి ఉన్నాం. ప్రజలకు విన్నపం - ఈ నెల 31వరకు ప్రజలందరూ బయటకు రాకుండా ఇళ్లలోనే ఉండాలని విజ్ఞప్తి చేస్తున్నాం. కేంద్రం కూడా ప్రయాణికుల రైళ్లు రద్దు చేసింది. - అలా 14రోజులు చేస్తే పరిస్థితి చక్కబడుతుంది. - మరీ అవసరమైతే తప్ప బయటకు రావద్దు. అది కూడా కనీస అవసరాల కోసమే బయటకు రండి. వచ్చినప్పుడు కూడా రెండు మీటర్ల దూరం పాటించండి. - ప్రజలంతా సహకరించాలని కోరుతున్నాం. రాష్ట్రంలో పరిస్థితి అదుపులోనే ఉంది. భయాందోళన వద్దు. పేదలకు ప్రభుత్వ సాయం - రాష్ట్రం లాక్డౌన్ అంటే మొదట పేదల గురించే ఆలోచించాను. వాళ్లు ఇబ్బంది పడతారు. కానీ చేయకతప్పదు. కరోనా కట్టడి కోసం అందరం కలిసి కట్టుగా పనిచేయాలి. మొత్తం మీద ఎక్కువ చేయలేకపోయినా కూడా కొద్దోగొప్పో వారి నష్టంలో భాగస్వామిని అవుతాను. అందులో భాగంగా.. - ఈనెల 29 నాటికి రేషన్ పూర్తిగా అందుబాటులో ఉంచుతాం. - రేషన్ సరుకులు ఉచితంగా ఇస్తాం. దాంతో పాటు ఒక కేజీ పప్పు ఉచితంగా ఇస్తాం. - అంతేకాక.. రూ.వెయ్యి చొప్పున ప్రతి పేద కుటుంబానికి ఏప్రిల్ 4న వలంటీర్ల ద్వారా పంపిణీ చేస్తాం. - అందుకు రూ.1,500కోట్లు ఖర్చు అవుతోంది. ఆసుపత్రులు సిద్ధం చేస్తున్నాం - రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువ చర్యలు తీసుకుంటాం. అత్యవసర సేవల కోసం అన్ని జిల్లాల్లో ఆస్పత్రులు సిద్ధం చేస్తున్నాం. - ప్రతి నియోజకవర్గంలో 100 పడకలతో ఐసోలేషన్ సెంటర్ ఏర్పాటు చేయాలని అధికారులకు చెప్పాం. - ప్రతి జిల్లా కేంద్రంలో కనీసం 200 పడకలతో ఐసోలేషన్ సెంటర్ ఏర్పాటు చేయాలని ఆదేశించాం. - గొంతునొప్పి, జలుబు, జ్వరం వంటి లక్ష ణాలుంటే.. అలాంటి వారికి విదేశాల నుంచి వచ్చిన వారితో సంబంధం ఏమైనా ఉందా అని సరిచూసుకోవాలని చెబుతున్నాం. - విదేశాల నుంచి వచ్చిన వారితో సంబంధం ఉంటే 104కు ఫోన్‌చేస్తే వెంటనే డాక్టర్ హాజరవుతారని ప్రజలకు చెబుతున్నాం. ఇవీ లాక్డౌన్.. - రాష్ట్ర సరిహద్దులు మూసివేతతో అంతర్రాష్ట్ర ప్రజా రవాణా వ్యవస్థ, రాష్ట్రంలో బస్సులు, ఆటోలు, ఇతర ప్రజా, ప్రైవేట్ రవాణా వాహనాలు, పాఠశాలలు, కళాశాలలు, అన్ని విద్యా సంస్థలు, సినిమా థియేటర్లు, మాల్స్, స్విమ్మింగ్ పూల్స్, జిమ్ క్లబ్‌లు, సోషల్ ఈవెంట్ సెంటర్లు, పెద్ద పెద్ద ఆలయాల్లో దర్శనాలు, వస్త్రదుకాణాలు, జ్యూయలరీ షాపులు, అత్యవసరం కాని అన్ని ఇతర షాపులు, అత్యవసర సర్వీసులు అందించేవి మినహా ఇతర ఆఫీసులు, గోదాములు,మార్కెట్ యార్డులు. - 31వ తేదీ వరకు రాష్ట్రంలో ప్రతిఒక్కరూ స్వీయనిర్బంధంలో ఉండాలి. అత్యవసరమైతే తప్ప ఇల్లు విడిచి బయటకు రాకూడదు. ఇవి ఓపెన్.. - పెట్రోల్ బంకులు, గ్యాస్ ఏజెన్సీలు, మందుల షాపులు, పాలు, కూరగాయలు, కిరాణా షాపులు. - అత్యవసర సేవలకు మాత్రమే ఆటోలు, ట్యాక్సీలకు అనుమతి. అప్పుడు కూడా కేవలం ఇద్దరికి మాత్రమే అనుమతి. ప్రభుత్వ ఆఫీసులు స్కెలెటిన్ స్టాఫ్‌తో రొటేషన్ పద్ధతిలో పనిచేయాలి. విద్యాసంస్థలు, మాల్స్ మూసివేత - కరోనా కట్టడికి ఇప్పటికే అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నాం. రాష్ట్రంలో పాఠశాలలు, కాలేజీలు, యూనివర్సిటీలు అన్నింటినీ మార్చి 31వరకు మూసివేయించాం. ఆ తరువాత పరిస్థితిని సమీక్షించి తదుపరి నిర్ణయం తీసుకుంటాం. - టెన్త్ పరీక్షలు మాత్రం యథావిధిగా జరుగుతాయి. అక్కడ కూడా విద్యార్థుల మధ్య కనీసం రెండు మీటర్లు దూరం ఉండేలా చూడాలని ఆదేశించాం. ఎవరైనా జ్వరం, జలుబు, దగ్గు వంటి వాటితో బాధపడుతుంటే వారిని ప్రత్యేక గదిలో ఉంచి పరీక్షలు రాయించాలని అధికారులకు చెప్పాం. - రాష్ట్రంలో అన్ని సినిమా థియేటర్లు, మాల్స్, స్విమ్మింగ్ పూల్స్, జిమ్స్, సోషల్– కల్చరల్ సెంటర్లను ఈ నెల 31వరకు మూసివేయాలని ఇదివరకే ఆదేశించాం. - పెద్ద పెద్ద ఆలయాలు, ఆధ్యాత్మిక కేంద్రాల్లో భక్తులకు దర్శనాలు నిలిపివేశాం. ఆ ఆలయాల్లో నిత్య పూజలు మాత్రం యథావిధిగా జరుగుతాయి. ధరలు పెంచితే కఠిన చర్యలు - నిత్యావసరాల ధరలు పెంచకుండా కలెక్టర్లు తగిన చర్యలు తీసుకుంటారు. - ఈ పరిస్థితిని ఆసరాగా చేసుకుని వ్యాపార దృక్పథంతో ధరలు పెంచితే కఠిన చర్యలు తీసుకుంటాం. జైలుకు పంపించడానికి కూడా వెనుకాడం. - ఏ వస్తువు ఎంత ధర అని కలెక్టర్లు నోటిఫికేషన్ ఇస్తారు. కూరగాయలు, సరకులు అన్నింటికీ తగిన ధర నిర్ణయిస్తారు. - కలెక్టర్లు టోల్ ఫ్రీ నంబరు ఇస్తారు. ఎవరైనా ఎక్కువ ధరకు అమ్మితే ఆ నంబరుకు ఫోన్ చేస్తే పోలీసులు, అధికారులు వెంటనే స్పందించి తగిన చర్యలు తీసుకుంటారు. విదేశాల నుంచి వచ్చిన వారిపై నిఘా - విదేశాల నుంచి వచ్చిన వారు 14రోజుల పాటు తప్పనిసరిగా హోం క్వారంటైన్లో ఉండాలని కోరుతున్నాం. ఇళ్ల నుంచి అస్సలు బయటకు రావద్దు. - ఇలాంటి వారిపై గట్టి నిఘా పెట్టాలని పోలీసులను ఆదేశించాం. - వీరికి పోలీసులను అటాచ్ చేయమని చెప్పాం. పోలీసులు, మహిళా కానిస్టేబుళ్లు, గ్రామ వలంటీర్లు అందరూ కూడా విదేశాల నుంచి వచ్చిన వారు ఇళ్లలో ఉండేటట్లు చూడాలి. - తమ స్టేషన్ పరిధిలో ఏం జరుగుతోందీ పోలీసులు చెప్పాలి. సామాజిక దూరం.. చాలా ముఖ్యం - ఇప్పుడు ఇంకో కీలకమైన దశకు వచ్చాం. దేశం మొత్తం మీద కరోనాను శాశ్వతంగా అరికట్టాలంటే ఐసోలేషన్, సామాజిక దూరం పాటించాలన్నది చాలా ముఖ్యం. - ప్రతి రాష్ట్రంలోనూ ప్రజల రాకపోకలు పూర్తిగా ఆగిపోవాలి. అప్పుడే కరోనాను కట్టడి చేయగలం. - కొన్ని రోజులపాటు అలా కట్టడి చేస్తేనే ఈ వ్యాధి వ్యాప్తి చెందదని వైద్య నిపుణులు చెబుతున్నారు. - అందుకే 12 రాష్ట్రాలు ఇప్పటికే అంతర్రాష్ట ప్రజా రవాణాను నిలిపివేస్తూ సరిహద్దులు మూసివేశాయి. - మనం కూడా ఆ దిశగా అడుగులు వేయకతప్పదు. త్వరలో ఉగాది వస్తోంది. సంతోషమే. కానీ, ప్రజలు మళ్లీ అటూ ఇటూ తిరిగితే కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడం కష్టమవుతుంది. కొంచెం కష్టమైనా కూడా ప్రజలు అర్థం చేసుకోవాలని కోరుతున్నాం. మన రాష్ట్ర సరిహద్దులను కూడా మూసివేయాల్సిన పరిస్థితి వచ్చింది. - ఈ రోజు నుంచీ 31 వరకు అంతర్రాష్ట్ర ప్రజా రవాణాను కట్టడి చేస్తున్నాం. రాష్ట్ర సరిహద్దులను మూసివేస్తున్నాం. ప్రజా రవాణాను పూర్తిగా ఆపేస్తున్నాం. ప్రభుత్వ, ప్రైవేటు రవాణా సర్వీసులు నిలిపివేస్తున్నాం. - ఆటోలు, ట్యాక్సీలు తప్పదు అనుకుంటే అత్యవసరాలకే తిరగాలి. అదీ కూడా ఒక దాంట్లో ఇద్దరి కంటే ఎక్కువమందిని ఎక్కించుకోవద్దు. - తప్పనిసరి కాని దుకాణాలు అంటే బంగారం, బట్టల దుకాణాల వంటి వాటిని మార్చి 31 వరకు మూసివేయాలని కోరుతున్నాం. - అత్యవసర, నిత్యావసరాలు.. పెట్రోల్, గ్యాస్, ఔషధాల షాపులు, పాలు, కూరగాయలు, కిరాణ షాపులు అందుబాటులో ఉంటాయి. - ఆఫీసులు, ఫ్యాక్టరీలు, గోడౌన్లు, మొదలైనవి కనీస సిబ్బందితో మాత్రమే నిర్వహించాలని కోరుతున్నాం. - ప్రభుత్వ ఆఫీసులు కనీస సిబ్బందితో రొటేషన్ విధానంలో వాడుకుంటూ నిర్వహించాలని ఆదేశించాం. ఎవరూ ఆందోళన చెందవద్దు - ఎవరూ భయపడాల్సిన అవసరంలేదు. ఈ వ్యాధితో చనిపోయిన వారు కేవలం 2 శాతం మించి లేరు. - అది కూడా వయస్సు ఎక్కువ ఉండడంతో పాటు, తీవ్ర అనారోగ్యం ఉన్న వారే చనిపోయారు. - ప్రపంచంలో 80.90 శాతం మంది ఇళ్లలో ఉండే నయం అయ్యారు. కేవలం 13.80 శాతమే ఆసుపత్రుల్లో చేరారు. వారిలో కూడా 4.70 శాతమే ఐసీయూలో చికిత్స పొందారు. - అదే సమయంలో జాగ్రత్తలు తీసుకోకపోతే ఈ వ్యాధి ఏ స్థాయికి వెళ్తుందో అన్న భయం కూడా పొంచి ఉంది. - మన ఇళ్లల్లో పెద్దవాళ్లను కాపాడుకోవాలంటే జాగ్రత్తలు పాటించాలి. - అవ్వాతాతలు బయటకు వెళ్లొద్దు. 10 ఏళ్లలోపు పిల్లలను బయటకు పంపొద్దని తల్లిదండ్రులను కోరుతున్నాను. - అందరూ కూడా 31 వరకు దయచేసి ఇళ్లలోనే ఉండండి. ఎక్కడికీ కదలొద్దని మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తున్నాం. - మరీ ముఖ్యంగా విదేశాల నుంచి వచ్చిన వారు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కోరుతున్నాం. వారు కచ్చితంగా 14రోజులపాటు హోం ఐసోలేషన్‌లో ఉండాలి. వాళ్లు పొరపాట్లు చేస్తే తీవ్ర దుష్పరిణామాలు తలెత్తుతాయి. చైనా నుంచి దక్షిణ కొరియా వచ్చిన ఒకే ఒక్క వ్యక్తి బాధ్యతాయుతంగా లేకపోవడంతో వైరస్ ఆ దేశం అంతటా వ్యాపించింది. - ఎవరికైనా కూడా హోం ఐసోలేషన్‌లో ఉన్నప్పుడు జలుబు, దగ్గు, గొంతు నొప్పి, జ్వరం ఏదన్నా ఉన్నా కూడా 104కు ఫోన్ చేయండి. విదేశాల నుంచి వచ్చిన వారితో సంబంధం లేకపోయినాసరే ఇలాంటి లక్షణాలు వస్తే 104కు ఫోన్ చేయండి. పీహెచ్సీ డాక్టర్, ఆశా వర్కర్లు వచ్చి పరీక్షలు చేస్తారు. రైతులు జాగ్రత్తలు తీసుకోవాలి - రైతులు, రైతు కూలీలు కూడా తప్పదు అనుకుంటేనే పొలం పనులకు వెళ్లాలి. - వీలైతే వెళ్లకుండా ఉండండి. తప్పదు అనుకుంటే అక్కడ కూడా కనీసం 2 మీటర్లు దూరం పాటించండి. అసెంబ్లీ తక్కువ రోజులే - పది మంది మించి గుమిగూడొద్దు. అందుకోసం నిషేధాజ్ఞలు కూడా జారీ చేస్తాం. - కానీ, అసెంబ్లీ పెట్టక తప్పదు. బడ్జెట్‌ను ఆమోదించాలి కదా. - అందుకు అసెంబ్లీ సమావేశాలు తక్కువ రోజులే నిర్వహిస్తాం. అందరం కలిసి అడుగులు వేద్దాం.. కరోనాను కట్టడి చేద్దాం - ప్రజలు పరిస్థితులను గమనిస్తున్నారు కాబట్టి అర్ధం చేసుకుంటారని ఆశిస్తున్నాను. - అందరం ఒకటి కావాలి. దేశమంతా ఏకమవుతుంది. - ఇప్పటికే కర్ణాటక, తెలంగాణ సహా పలు రాష్ట్రాలు సరిహద్దులు మూసివేశాయి. రాకపోకలు ఆపేస్తేనే వైరస్‌ను అరికట్టవచ్చు. సంపూర్ణంగా చేయాలితప్ప సగం సగం చేయకూడదు. సరిహద్దుల మూసివేత కేవలం ఒక్క రాష్ట్రం మాత్రం చేయలేదు. దేశమంతా ప్రయాణికుల రైళ్లు ఆపేస్తున్నారు. అంతర్రాష్ట్ర బస్సుల రాకపోకలు ఆపాలంటే అందరూ ఒకేసారి చేయాలి. అందుకే ఈనెల 31వరకు రాష్ట్రమంతా లాక్డౌన్ అమలుచేద్దాం. తరువాత కేంద్రం సలహాలు సూచనలుచూసి పరిస్థితిని సమీక్షిద్దాం. - అందరూ ఒకే రకమైన అడుగులు వేస్తున్నారు. - అవే అడుగులు మనం కూడా వేయగలిగితేనే దీన్ని ఎక్కడికక్కడ కట్టడి చేయగలుగుతాం. - ఇందుకు ప్రజలందరూ భాగస్వాములు కావాలని విజ్ఞప్తి చేస్తున్నా. -
బస్సెక్కితే బహుమతి
సాక్షి, అమరావతి: ప్రజారవాణారంగంలోని పోటీని ఎదుర్కొనేందుకు ఆర్టీసీ వినూత్న ఆలోచనలు చేస్తోంది. పల్లెవెలుగు బస్సుల్లో ప్రయాణిస్తే లక్కీడిప్ ద్వారా రూ. 200 నుంచి రూ. 500 వరకు విలువైన బహుమతులు ఇవ్వనుంది. నెలలో రెండు సార్లు డ్రా తీసి ఎంపికైన ప్రయాణికులకు వరుసగా ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు అందించనున్నారు. తొలుత ప్రయోగాత్మకంగా గుంటూరు, కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాల్లో ఈ విధానం అమలు చేయనున్నారు. వరుసగా మూడు నెలల పాటు లక్కీడిప్ ద్వారా ఎంపిక చేసిన ప్రయాణికులకు బహుమతులు అందిస్తారు. ఈ విధానం ద్వారా సత్ఫలితాలు వస్తే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో అమలు చేయాలని ఆర్టీసీ నిర్ణయించింది. గ్రామీణ ప్రాంతాల్లో ఎంపిక చేసిన రూట్లలో ప్రయాణించేవారికి ఈ బహుమానాలు అందజేస్తారు. పల్లెవెలుగు బస్సుల్లో ఆక్యుపెన్సీ రేషియో 60 శాతానికి మించడం లేదు. ఈ బస్సుల్లో ఆక్యుపెన్సీ రేషియో 80 శాతానికి పెంచేందుకు ఈ వినూత్న ఆలోచన ఆర్టీసీ అధికారులు అమలు చేస్తున్నారు. పల్లెవెలుగు ద్వారా నష్టాల్ని అధిగమించేందుకు ఆర్టీసీ ఈ ప్రయోగం చేస్తోంది. సత్ఫలితాలు వస్తే అన్ని సర్వీసుల్లో ఆక్యుపెన్సీ పెంచేందుకు ఆర్టీసీ ప్రణాళికలు రూపొందించింది. ప్రయాణికులు ఏం చేయాలి? - పల్లెవెలుగు బస్సులో ప్రయాణించి టికెట్ వెనుక ఫోన్ నంబర్, అడ్రస్ రాసి బస్సులో ఉంచిన బాక్సులో వేయాలి. నెలలో రెండుసార్లు లాటరీ తీసి ప్రయాణికుల్ని ఎంపిక చేస్తారు. - ప్రతి జిల్లాలో 150 బస్సుల్లో ఈ లక్కీడిప్ ద్వారా ప్రయాణికులకు బహుమతులు అందించనున్నారు. - రాష్ట్రంలో నిత్యం రెండున్నర కోట్ల మంది వివిధ మార్గాల్లో ప్రయాణిస్తున్నట్లు రవాణా శాఖ అంచనా. - ప్రయాణికుల తరలింపులో ఆర్టీసీది 25 శాతం వాటా. రైల్వే, సొంత వాహనాల ద్వారా 30 శాతం, 45 శాతం ప్రైవేటు వాహనాల ద్వారా ప్రయాణిస్తున్నారు. - గత ప్రభుత్వ హయాంలో దూర ప్రాంత రూట్లపైనే కాకుండా.. గ్రామీణ రూట్లలోనూ ప్రైవేటు ఆపరేటర్లు ఆధిపత్యం చెలాయించారు. ఫలితంగా పల్లెవెలుగు సర్వీస్ ద్వారా ఆర్టీసీ నష్టాలు మూటకట్టుకుంది. ప్రస్తుతమున్న పోటీని తట్టుకుని ప్రయాణికుల్ని ఆకట్టుకునేందుకు ఆర్టీసీ వినూత్న ఆలోచనలు చేస్తోంది. -
దారి దోపిడీ
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో ప్రైవేటు ఆపరేటర్లు తెరతీసిన దారి దోపిడీ పర్వం సోమవారం కూడా కొనసాగింది. దసరాకు సొంతూళ్లకు బయలుదేరిన వారి నుంచి ప్రైవేటు బస్సులు, ట్రావెల్స్ నిర్వాహకులు వందశాతం అదనపు చార్జీలు వసూలు చేశారు. యథావిధిగా విజయవాడ, గుంటూరు, వైజాగ్, రాజమండ్రి, భీమవరం, తిరుపతి ప్రాంతాలకు వెళ్లేవారి నుంచి సాధారణ టికెట్ ధరపై రెట్టింపు చార్జీలు వసూలు చేసి జేబులు గుల్ల చేశారు. నగరం నుంచి తెలంగాణా రాష్ట్రంలోని జిల్లాలతో పాటు ఏపీ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలకు సుమారు 1400 బస్సులు తరిగినట్టు ఆర్టీసీ అధికారులు తెలిపారు. గ్రేటర్లో 1500 బస్సులు.. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని 29 ఆర్టీసీ డిపోల్లో మొత్తం 3800 బస్సులకుగాను.. సోమవారం సుమారు 1600 మంది తాత్కాలిక సిబ్బంది సాయంతో 1500 బస్సులు తిప్పారు. వీటిలో 500 వరకు ఆర్టీసీ అద్దె బస్సులు ఉన్నాయని అధికారులు ప్రకటించారు. ఈ బస్సుల్లోనూ తాత్కాలిక కండక్టర్లు చేతివాటం ప్రదర్శించి ప్రయాణికుల జేబులు గుల్లచేశారు. రూ.10 చార్జీకి రూ.20 వసూలు చేసి జేబులు నింపుకోవడం గమనార్హం. ప్రయాణికులు విధిలేక వారు అడిగినంత సమర్పించుకున్నారు. సీఎం ప్రకటన నేపథ్యంలో పలు ఆర్టీసీ డిపోల వద్ద రెగ్యులర్ కార్మికులు బతుకమ్మ ఆడి తమ నిరసన వ్యక్తం చేశారు. ఆటోలు, క్యాబ్‌లు సైతం ప్రయాణికులపై దోపిడీకి తెగబడ్డాయి. నగరంలో వివిధ రూట్లలో రాకపోకలు సాగించిన సెవన్‌సీటర్ ఆటోలు, సాధారణ ఆటో డ్రైవర్లు సైతం ప్రయాణికుల అవసరాన్ని సొమ్ముచేసుకున్నారు. పలు ప్రధాన రూట్లలో స్వల్ప దూరాలకే రెట్టింపు చార్జీలు ముక్కుపిండి మరీ దోచుకున్నారు. క్యాబ్ సర్వీసులు సైతం అదనపు శ్లాబు రేట్లు, సర్‌చార్జీల పేరిట నిలువునా ముంచేశాయి. ఎంఎంటీఎస్, మెట్రో రైళ్లు కిటకిట సమ్మె ప్రభావంతో నగరంలో ఎంఎంటీఎస్ రైళ్లు కిక్కిరిశాయి. సోమవారం 125 సర్వీసుల్లో సుమారు 1.50 లక్షల మంది రాకపోకలు సాగించినట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఎల్బీనగర్–మియాపూర్, నాగోల్–హైటెక్‌సిటీ రూట్లలో రద్దీని బట్టి ప్రతి మూడు.. ఐదు నిమిషాలకో మెట్రో రైలును నడిపారు. సుమారు వంద అదనపు సర్వీసులను నడిపినట్లు మెట్రో అధికారులు ప్రకటించారు. ఈ సర్వీసుల్లో సోమవారం సుమారు 3 లక్షల మంది ప్రయాణించినట్టు తెలిపారు. పండగకు మెజార్టీ సిటీజన్లు పల్లెబాట పట్టడంతో మెట్రో రద్దీ కాస్త తగ్గింది. దూరప్రాంత రైళ్లు బిజీబిజీ.. సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ రైల్వే స్టేషన్ల నుంచి దూర ప్రాంతాలకు బయలుదేరి వెళ్లిన 80 ఎక్స్‌ప్రెస్.. మరో 100 ప్యాసింజర్ రైళ్లు సైతం ప్రయాణికుల రద్దీతో కిటకిటలాడాయి. రైళ్లలో సీట్లు, బెర్తులు దొరక్క నానా అవస్థలు పడ్డారు. చిన్నపిల్లలు, మహిళలు, వృద్ధులు రైళ్లలో నానా ఇబ్బందులు పడ్డారు. -
సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుస్తాం
సాక్షి, మంచిర్యాల: ప్రజా రవాణా వ్యవస్థకు ఇబ్బందులు లేకుండా ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చడమే తమ లక్ష్యమని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా రవాణా శాఖా డిప్యూటీ కమిషనర్ (డీటీసీ) డాక్టర్ పుప్పాల శ్రీనివాస్ అన్నారు. ఆదివారం మంచిర్యాల ఆర్టీసీ డిపోకు విచ్చేసిన ఆయన ఆర్టీసీ బస్సుల బంద్ సందర్భంగా రవాణా శాఖా, రెవెన్యూ, పోలీస్ శాఖా ఆధ్వర్యంలో రవాణా ఏర్పాట్లను సమీక్షించారు. రవాణా శాఖా ఆధ్వర్యంలో బస్టాండ్‌లో ప్రయాణికుల కోసం చేపడుతున్న సౌకర్యాలు, ఆర్టీసీ అధికారుల ఆధ్వర్యంలో చేపడుతున్న సౌకర్యాలను డీటీసీ దృష్టికి తీసుకువచ్చారు. డీటీసీ శ్రీనివాస్ మాట్లాడుతూ, మంచిర్యాల డిపో నుంచి జిల్లా వ్యాప్తంగా మొత్తం 176 వాహనాలను సమకూర్చి ప్రయాణికులను వారి గమ్యస్థానాలకు చేరుస్తున్నామని అన్నారు. ఆర్టీసీ నుంచి 40 బస్సులు, 50 అద్దె బస్సులు, 18 ప్రైవేట్ బస్సులు, 20 విద్యా సంస్థల బస్సులు, 60 వరకు టాటా ఏస్‌లు, మ్యాక్సీ క్యాబ్‌లు, సెవెన్ సీటర్ ఆటోలు నడుస్తున్నాయని తెలిపారు. బస్సులు నడిపేందుకు 300 మంది డ్రైవర్లు, 200 మంది కండక్టర్ పోస్టుల కోసం దరఖాస్తు చేసుకోగా 60 మంది డ్రైవర్లు, 40 మంది కండక్టర్లను ఎంపిక చేశామని అన్నారు. హెవీ లైసెన్స్, డ్రైవింగ్‌లో ఉన్న సీనియారిటీ ఆధారంగా డ్రైవర్ల ఎంపిక చాలా పారదర్శకంగా చేపట్టామని తెలిపారు. నిబంధనల మేరకే రవాణా చార్జీలు వసూలు చేసేలా ఆదేశాలు ఇచ్చామన్నారు. డ్రైవర్లు, కండక్టర్లు అసభ్యకరంగా ప్రవర్తించినా, రాష్ డ్రైవింగ్ చేసినా, ఓవర్ స్పీడ్‌తో వాహనాలు నడిపినా ప్రయాణికులు వెంటనే పోలీస్ 100తో పాటు కంట్రోల్ రూం హెల్ప్‌లైన్ 9959226004 నంబర్‌కు సమాచారం అందించవచ్చని తెలిపారు. మంచిర్యాల జిల్లా రవాణా శాఖా అధికారి(డీటీఓ) ఎల్. కిష్టయ్య, సీనియర్ మోటార్ వెహికిల్ ఇన్స్పెక్టర్(ఎంవీఐ) గుర్రం వివేకానంద్‌రెడ్డి, పెద్దపల్లి ఎంవీఐ అల్లె శ్రీనివాస్, రామగుండం ఎంవీఐ రంగారావు, అసిస్టెంట్ ఎంవీఐలు కొమ్ము శ్రీనివాస్, నల్ల ప్రత్యూషారెడ్డి, మంచిర్యాల డివిజినల్ మేనేజర్ సురేశ్‌చౌహాన్, డిపో మేనేజర్ మల్లేశ్, హాజీపూర్ తహసీల్దార్ మహ్మద్ జమీర్ పాల్గొన్నారు. -
మెట్రో నగరాల్లో 350 ఎలక్ట్రిక్ బస్సులు
సాక్షి, అమరావతి : రాష్ట్రంలోని మెట్రో నగరాల్లో త్వరలో 350 ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెడుతున్నట్టు రవాణాశాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) ప్రకటించారు. ఆర్టీసీని అన్ని విధాలా ఆదుకుంటామని, దేశంలోనే అత్యుత్తమ ప్రజా రవాణా వ్యవస్థగా తీర్చిదిద్దుతామని చెప్పారు. రవాణా, సమాచారశాఖ మంత్రిగా ఆయన గురువారం వెలగపూడి సచివాలయం ఐదో బ్లాక్‌లోని తన చాంబర్లో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం బాధ్యతలు స్వీకరించారు. దివ్యాంగులు ఒకసారి బస్‌పాస్ తీసుకుంటే మూడేళ్ల పాటు చెల్లుబాటయ్యే ఫైలుపై తొలి సంతకం చేశారు. అనంతరం నాని మీడియాతో మాట్లాడుతూ రవాణాశాఖ కార్యాలయాల్లో కూడా లైసెన్సులకు దరఖాస్తు చేసుకునేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. కొత్త వాహనాల కొనుగోలు సమయంలో డీలర్ వద్దే రిజిస్ట్రేషన్ చేయాలని, 24 గంటల్లోగా ఆర్టీవో అనుమతులివ్వాలని ఆదేశించారు. రాష్ట్రంలోని జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలిచ్చేందుకు సీఎం సూత్రప్రాయంగా అంగీకరించినట్టు మంత్రి చెప్పారు. ఫిట్నెస్ లేకుంటే సీరియస్‌గా పరిగణిస్తాం .. ఈ నెల 13 నుంచి ఫిట్నెస్ లేని వాహనాల విషయంలో తనిఖీలు చేపట్టి 624 స్కూల్ బస్సులపై కేసులు నమోదు చేశామని.. ఇప్పటిదాకా 357 బస్సులను సీజ్ చేసినట్లు తెలిపారు. ఫిట్నెస్ లేకుండా విద్యా సంస్థల బస్సులు పట్టుబడితే ఇకపై సీరియస్‌గా పరిగణిస్తామని మంత్రి స్పష్టం చేశారు. విద్యా సంస్థల యాజమాన్యాలు విద్యార్థుల తల్లిదండ్రులను తప్పుదోవ పట్టిస్తున్నాయని, తమ బస్సులకు ఫిట్నెస్ లేదని చెప్పకుండా రవాణాశాఖ అధికారులపై తప్పులు నెడుతున్నాయన్నారు. ఫిట్నెస్ లేని విద్యా సంస్థల బస్సుల విషయంలో తల్లిదండ్రులు తమకు సహకరించాలని మంత్రి కోరారు. -
బకాయిల గుదిబండతో ఆర్టీసీ విలవిల
సాక్షి, అమరావతి: మూలిగే నక్కపై తాటిపండులా అసలే పీకల్లోతు కష్టాల్లో ఉన్న ఆర్టీసీని పోలవరం విహార యాత్రలు, సీఎం చంద్రబాబు సభలకు బస్సుల తరలింపు ద్వారా టీడీపీ సర్కారు కోలుకోలేని విధంగా నష్టాల్లోకి నెట్టేసింది. ఆ బకాయిలను రాబట్టుకోలేక ఆర్టీసీ ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతోంది. సీఎం సభలకు డ్వాక్రా మహిళల తరలింపు, పోలవరం సందర్శన కోసం బస్సులను సమకూర్చిన ఆర్టీసీకి రూ.225 కోట్ల దాకా బకాయిలు చెల్లించాల్సి ఉంది. ఇందులో సీఎం సభలకే రూ.150 కోట్ల బకాయిలు ఉండగా, పోలవరం యాత్రలకు చెల్లించాల్సింది రూ.75 కోట్ల దాకా ఉంది. కలెక్టర్లు ఇచ్చిన ఇండెంట్ల ప్రకారమే బస్సులను సిద్ధం చేసినట్లు ఆర్టీసీ చెబుతోంది. ఇప్పటివరకు పైసా కూడా రాకపోవడంతో నిర్వహణ భారమై ఆర్టీసీ ఆర్ధిక పరిస్థితి దయనీయంగా మారింది. సీఎం సభల కోసం 5 వేల బస్సులు రాష్ట్రంలోని పలు గ్రామీణ ప్రాంతాలకు బస్సు సదుపాయం లేకపోయినా ఆర్టీసీ యాజమాన్యం ప్రయాణికుల ఇబ్బందులను ఏ మాత్రం పట్టించుకోకుండా ప్రభుత్వ పెద్దల సేవలో తరించింది. రాష్ట్రంలో 3,669 గ్రామాలకు పల్లెవెలుగు సర్వీసులు అందుబాటులో లేవు. పల్లెవెలుగు బస్సుల వల్ల ఏటా రూ.740 కోట్ల నష్టాలు వస్తున్నట్లు చెబుతున్న ఆర్టీసీ సీఎం ప్రచార కార్యక్రమాలు, సభలకు పెద్ద ఎత్తున సమకూర్చింది. ముఖ్యమంత్రి సేవలో నిమగ్నమై లక్షల మంది ప్రయాణికులను అవస్థల పాల్జేసింది. ఎన్నికలకు ముందు విశాఖ, గుంటూరు, కడపలో డ్వాక్రా మహిళలతో సీఎం చంద్రబాబు సభలు నిర్వహించారు. దీనికి ఆర్టీసీ 5 వేల బస్సులను ఏర్పాటు చేసింది. గత ఏడాది నుంచి పోలవరం సందర్శన పేరిట కూడా ఆర్టీసీ పెద్ద సంఖ్యలో బస్సులను తిప్పుతోంది. ధర్మపోరాట దీక్షలు, జ్ఞానభేరికి కూడా... టీడీపీ సర్కారు నిర్వహించిన ధర్మపోరాట దీక్షలు, జ్ఞానభేరి తదితర కార్యక్రమాల కోసం కూడా పెద్దఎత్తున ఆర్టీసీ బస్సులను మళ్లించారు. డబ్బులు చెల్లించకుండా ప్రజా రవాణా వ్యవస్థను సర్కారు అడ్డగోలుగా వినియోగించుకుంది. విజయనగరం, విజయవాడ, నెల్లూరు, కడప ఆర్టీసీ జోన్ల పరిధిలో నిత్యం 72 లక్షల మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరవేస్తున్నారు. కానీ సీఎం చంద్రబాబు సభలు నిర్వహించిన రోజు సగటున 15 లక్షల మంది ప్రయాణికులు అవస్థలు ఎదుర్కొన్నట్లు అంచనా. సీఎం సభలకు సమకూర్చే ఒక్కో ఆర్టీసీ బస్సుకు కిలోమీటరుకు రూ.25 నుంచి రూ.30 వరకు చెల్లించాలి. అయితే బస్సులను వాడుకున్న టీడీపీ సర్కారు ఆర్టీసీకి నయాపైసా కూడా చెల్లించడం లేదు. విహార యాత్రలకు పైసా విదల్చ లేదు.. టీడీపీ కార్యకర్తలను ప్రభుత్వ ఖర్చులతో పోలవరం విహార యాత్రలకు పంపడం గత ఏడాది మొదలైంది. ఇందుకోసం అమరావతి, ఇంద్ర, సూపర్ లగ్జరీ బస్సులను ఏర్పాటు చేశారు. గత ఏడాదిగా వివిధ ప్రాంతాల నుంచి సుమారు వెయ్యి బస్సులను తిప్పారు. పోలవరం సందర్శనకు ఇరిగేషన్ శాఖ నిధులు చెల్లిస్తుందని చెప్పి నెలలు గడుస్తున్నా ఆర్టీసీకి ఇంతవరకు పైసా కూడా చెల్లించలేదు. - రాష్ట్రంలో ఆర్టీసీ బస్సుల సంఖ్య : 11,687 - గత ఆర్నెల్ల వ్యవధిలో సీఎం చంద్రబాబు సభలు, దీక్షలకు మళ్లించిన బస్సులు : 2,620 - డ్వాక్రా సభలకు వినియోగించుకున్న బస్సులు : 5,000 - ప్రతి కిలోమీటరుకు చెల్లించాల్సింది : రూ.25 30 వరకు - ప్రభుత్వ కార్యక్రమాలు, పోలవరం యాత్రలకు ఆర్టీసీకి బకాయి పడ్డ సొమ్ము : సుమారు రూ.225 కోట్లు - ఇందులో పోలవరం విహార యాత్రల బకాయిలు : రూ.75 కోట్లు -
ప్రజా రవాణాకే ప్రాధాన్యం
సాక్షి, సిటీబ్యూరో: ప్రజా రవాణా సదుపాయాలకే మహిళలు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. పారదర్శకమైన, సురక్షితమైన, చివరి గమ్యం వరకు చేర్చే రవాణా సదుపాయాలు మరింత విస్తృతం కావాలని వారు కోరుకుంటున్నారు. నగరంలోని రవాణా సదుపాయాల తీరుపై ఓలా మొబిలిటీ ఇన్స్టిట్యూట్ నిర్వహించిన సర్వేలో 77 శాతం మంది మహిళలు, విద్యార్థినులు లాస్ట్‌మైల్ కనెక్టివిటీ రవాణా సదుపాయాలకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు వెల్లడించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా హైదరాబాద్‌తో పాటు దేశంలోని 11 నగరాల్లో ఓలా సంస్థ ఈ సర్వేను చేపట్టింది. మొత్తం 9,935 మంది నుంచి అభిప్రాయాలను సేకరించారు. వారిలో అత్యధిక మంది బస్సులు, మెట్రో రైళ్లు, ఆటో రిక్షాలు, క్యాబ్‌లు వంటి ప్రజా రవాణ సదుపాయాలతో పాటు, లాస్ట్‌మైల్ కనెక్టివిటీని కోరుకున్నట్లు సర్వే వెల్లడించింది. 59 శాతం మంది ఏదైనా పబ్లిక్ ట్రా న్స్‌పోర్టును కోరగా, 38 శాతం మంది బస్సులను వినియోగిస్తున్నట్లు చెప్పారు. మరో 35 శాతం మంది ఎంఎంటీఎస్, మెట్రో వంటి సర్వీసులను వినియోగిస్తున్నట్లు పేర్కొన్నారు. 40 నుంచి 45 శాతం మంది ఆటో రిక్షాలు, షేరింగ్ వాహనాలు, క్యాబ్‌లను ఎంపిక చేసుకుంటున్నారు. చార్జీలు తక్కువ వ్యక్తిగతంగా వాహనాల వినియోగానికయ్యే ఖర్చు కంటే ప్రజా రవాణా వాహనాల్లో చార్జీలు భరించగలిగే స్థాయిలో ఉండడం వల్లనే వాటిలో ప్రయాణం చేస్తున్నట్టు 96 శాతం మంది మహిళలు పేర్కొన్నారు. పైగా అన్ని రూట్లలో ఇవి అందుబాటులో ఉండడం, సమయపాలన, భద్రత వంటి అంశాలను దృష్టిలో ఉంచుకొని పబ్లిక్ ట్రాన్స్‌పోర్టును ఎంపిక చేసుకుంటున్నట్లు తెలిపారు. మరోవైపు చాలా మంది మహిళలు పర్యావరణహిత రవాణా సదుపాయాల ప్రాధా న్యతను గుర్తించారు. పర్యావరణానికి వాహన కాలుష్యం ముప్పుగా పరిణమించిన నేపథ్యంలో పర్యావరణ రక్షణకు దోహదం చేసే రవాణా సదుపాయాలు ఎంతో అవసరమని 95 శాతం మంది మహిళలు, అమ్మాయిలు తెలిపారు. బైస్కిల్స్ వినియోగం పెరగాలని, నాన్‌మోటార్ ట్రాన్స్‌పోర్టు విరివిగా అందుబాటులోకి రావాలని అభిప్రాయపడ్డారు. మరో 74 శాతం మంది ఫుట్‌ఫాత్‌లను అభివృద్ధి చేయాలని సూచించారు. మహిళలు రవాణాకు తాము మరింత నాణ్యమైన, మెరుగైన రవాణ సదుపాయాలను అందజేసేందుకు చర్యలు చేపడుతున్నట్లు ఓలా మొబిలిటీ ఇన్స్టిట్యూట్ వైస్ ప్రెసిడెంట్ ఆనంద్ షా తెలిపారు. -
ఆర్టీసీ, మెట్రో, ఉబర్‌లతో ప్రత్యేక యాప్
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ ప్రజలను ప్రజా రవాణా వ్యవస్థ వైపు మళ్లించేందుకు ఆర్టీసీ, మెట్రో, ఉబర్, ఓలా, ఇతర ప్రైవేటు మినీ వాహనాలతో ఓ యాప్‌ను తీసుకురానున్నట్లు ఆర్టీసీ ఇన్చార్జి ఎండీ సునీల్ శర్మ చెప్పారు. మంగళవారం ఆయన బస్‌భవన్‌లో మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తదితరులతో కలసి విలేకరులతో మాట్లాడారు. నగరంలో సౌకర్యవంత ప్రయాణానికి పరిష్కారాలు అన్వేషించటం కోసం మెట్రో రైలు, ఆర్టీసీ, ఎంఎంటీఎస్ తదితర సంస్థల అధికారులతో కలసి ఒక టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేశారు. తొలిసారిగా ఈ టాస్క్‌ఫోర్స్ సమావేశమైంది. ఈ సందర్భంగా సునీల్ శర్మ మాట్లాడుతూ.. ఒక ప్రత్యేక యాప్‌ను రూపొందించి మెట్రో, ఆర్టీసీ, ఉబర్, ఓలా తదితరాలను దాని పరిధిలోకి తీసుకువస్తామని చెప్పారు. వీటన్నిటికి కలిపి ఒకే కామన్ టికెట్ ఉండేలా చూస్తామన్నారు. అయితే ఈ ఆలోచన ప్రస్తుతానికి తొలిదశలోనే ఉందని, నెల రోజుల్లో ఈ విధానాన్ని అందుబాటులోకి తెస్తామని వెల్లడించారు. భవిష్యత్‌లో మెట్రోరైలుతో ఆర్టీసీకి పోటీ ఉండదని, రెండు ప్రజా రవాణా సంస్థల మధ్య సమన్వయం ఉంటుందన్నారు. కాలనీ ప్రాంత ప్రయాణికులకు మైట్రో స్టేషన్ వరకు తీసుకువచ్చే విధంగా బస్సులను ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఆర్టీసీ–మెట్రో అనుసంధానంపై రెండు నెలల్లో ప్రణాళిక రూపొందిస్తామని తెలిపారు. ప్రజా రవాణా వ్యవస్థ పెరిగితే వ్యక్తిగత వాహనాలు, కాలుష్యం తగ్గుతుందని మెట్రో రైలు ఎండీ ఎన్వీఎస్ రెడ్డి అన్నారు. -
ఫోర్డ్‌తో హెచ్ఎండీఏ ఒప్పందం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర రాజధానిలో ప్రయాణికులకు అనువుగా ఉండే సమీకృత రవాణా వ్యవస్థను రూపొందించేందుకు ఫోర్డ్ కంపెనీతో హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ (హెచ్ఎండీఏ) ఎంవోయూ కుదుర్చుకుంది. శుక్రవారం ఈ మేరకు రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ సమక్షంలో మున్సిపల్ శాఖ కార్యదర్శి నవీన్ మిట్టల్, ఫోర్డ్ కంపెనీ డైరెక్టర్ ఆర్.మహదేవన్ ఈ ఒప్పందంపై సంతకాలు చేశారు. ప్రయాణికుల రద్దీని తట్టుకునేలా రవాణా సదుపాయాలను ఎంచుకోవటం, అందుకు అనుగుణంగా సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించాలనే లక్ష్యంతో ఈ ప్రయత్నం సాగనుంది. అనంతరం కేటీఆర్ మాట్లాడుతూ, మౌలిక వసతులు, రవాణా సదుపాయాల దృష్ట్యా హైదరాబాద్‌కు ఇప్పటికే ప్రత్యేక గుర్తింపు ఉందని, సిటీలో ప్రజా రవాణా వ్యవస్థను మెరుగుపరిచేందుకు ఈ ఒప్పందం మరింత మేలు చేస్తుందని అభిప్రాయపడ్డారు. ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా రవాణా వ్యవస్థను అభివృద్ధి చేయటం సవాలుగా మారుతోందని, ఫోర్డ్ కంపెనీ ఈ దిశగా సేవలు అందించేందుకు సిద్ధంగా ఉందని ఆ కంపెనీ డైరెక్టర్ ఆర్.మహదేవన్ అభిప్రాయపడ్డారు. ఇప్పటికే మెట్రో రైలు, దాదాపు ఎనిమిది వందల బస్సులు ప్రతిరోజు సిటీలో ప్రయాణికుల రాకపోకలకు అందుబాటులో ఉన్నాయి. అయితే ప్రయాణాన్ని మరింత సుగమం చేసే దిశగా రవాణా సదుపాయాలన్నింటా డిజిటల్ క్యాష్‌లెస్ వన్ టైమ్ పేమెంట్స్, మొబైల్ టికెటింగ్, స్మార్ట్ కార్డ్ పేమెంట్స్ జరిగే దిశగా అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించటం, ప్రయాణ సమయాన్ని తగ్గించేలా రవాణాను అందుబాటులో ఉంచేందుకు ఫోర్డ్ కంపెనీ అధ్యయనం చేయనుంది. ఫోర్డ్ కంపెనీ ఇప్పటికే ఇండోర్, ముంబై సిటీల్లో రవాణా సేవలను అందిస్తోంది. -
మారనున్న హైదరాబాద్ రూపురేఖలు
మెట్రోరైలు ప్రారంభంతో నగరంలో నవశకం ఆరంభం కానుంది. మెట్రో రైలు కేవలం ప్రజా రవాణా పరంగానే కాక నగరాభివృద్ధిలోనూ కొత్త మార్పులకు నాంది పలకనుంది. ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లోనే ఇబ్బడిముబ్బడిగా జరుగుతోన్న అభివృద్ధి నగరం నలుచెరుగులా...అన్ని ప్రాంతాలకూ విస్తరించనుంది. సమతుల అభివృద్ధి సాధ్యంకానుంది. ఇప్పటి వరకు దూరాభార ప్రయాణం, ట్రాఫిక్ సమస్యలు, వాహన కాలుష్యం తదితరమైనవి పరిగణనలోకి తీసుకొని ఎక్కడ ఉపాధి, పరిశ్రమలు ఉంటే ప్రజలు అక్కడే నివాసాలుంటున్నారు. మెట్రోతో ప్రయాణం సులువుగా మారడంతో ఇకపై ఈ పరిస్థితి మారుతుందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఎక్కడ ఉద్యోగం చేస్తున్నా...ఇష్టమైన చోటే నివాసం ఉంటూ..ఈజీగా జర్నీ చేయవచ్చని నగరవాసులు భావిస్తున్నారు. సాక్షి, సిటీబ్యూరో: మెట్రోరైలు ప్రారంభంతో నగరంలో నవశకం ఆరంభం కానుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. నగరంలో గచ్చిబౌలి, శేరిలింగంపల్లి, మియాపూర్ తదితర ప్రాంతాల్లో ఐటీ రంగంలో ఎక్కువ అవకాశాలుండటంతో అంతా అటే మొగ్గుచూపుతున్నారు. ఉద్యోగులు పెరగడంతో వారిని దృష్టిలో ఉంచుకొని ఇతరత్రా వ్యాపారాలు, హోటళ్లు తదితరమైనవి పెరిగాయి. ఇలా అన్ని రంగాల్లోనూ కొన్ని చోట్లే అభివృద్ధి కేంద్రీకృతమవుతోంది. మెట్రో రైలు రాకతో ఎక్కడినుంచి ఎక్కడికైనా 45 నిమిషాల్లో చేరుకునే సదుపాయం ఉండటంతో ప్రజలు ఎక్కడ నివాసమున్నప్పటికీ సకాలంలో విధులకు చేరుకోగలుగుతారు. మహా అయితే గంట పట్టొచ్చు. అంతకు మించి సమయం పట్టదు కనుక ఎక్కడ నివాసం ఉన్నప్పటికీ ప్రయాణ ఇబ్బందులుండవు. మెట్రోరైల్లో సుఖవంతమైన ఏసీ ప్రయాణం. కాలుష్యం ఉండదు. గంటల తరబడి జర్నీ తిప్పలు, ట్రాఫిక్ చిక్కులు తప్పుతాయి. కాబట్టి సదుపాయవంతంగా నివాసం దొరికితే ఎక్కడ ఉండేందుకైనా ప్రాధాన్యతనిస్తారు. సొంతంగా ఇల్లు కొనుక్కోవాలనుకున్నా, అద్దెలకుండాలనుకున్నా తక్కువ ధరలకు దొరికే ప్రాంతాలకు ప్రాధాన్యమిస్తారు. తద్వారా ఆయా ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయి. జనాభా పెరిగినా.. 2011 జనాభా లెక్కల మేరకు గ్రేటర్ పరిధిలో 67.31 లక్షల జనాభా ఉండగా, ప్రస్తుతం కోటి దాటినట్లు అంచనా. అయినప్పటికీ కొన్ని ప్రాంతాల్లోనే జనాభా విపరీతంగా పెరుగుతోంది. ఐటీ ప్రాంతాల్లో సాఫ్ట్వేర్ రంగంలోనివారు, కూలికి ఢోకా ఉండని ప్రాంతాల్లో శ్రామికులు నివాసాలుంటున్నారు. అందువల్లే కార్పొరేటర్ డివిజన్లలోనూ ఒక డివిజన్లో 30 వేల జనాభా ఉంటే మరో డివిజన్లో 70 వేల జనాభా ఉంది. ఇకపై ఇలాంటి పరిస్థితి ఉండదు. అన్ని ప్రాంతాల్లోనూ నగరం అభివృద్ధి చెందే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. 2018 డిసెంబర్ నాటికి మూడు కారిడార్లలోనూ.. ప్రస్తుతం మియాపూర్ నుంచి అమీర్‌పేటకు 13 కి.మీ, అమీర్ పేట నుంచి నాగోల్‌కు 17 కి.మీ. వెరసి మొత్తం 30 కి.మీ.ల మేర మెట్రో సదుపాయం అందుబాటులోకి వచ్చింది. మరో సంవత్సరంలో..అంటే 2018 డిసెంబర్ నాటికి మూడు కారిడార్లలోనూ మెట్రో సదుపాయం అందుబాటులోకి రానుంది. ఎల్బీనగర్ నుంచి అమీర్‌పేటకు, అమీర్‌పేట నుంచి రాయదుర్గం, అలాగే జూబ్లీ బస్టేషన్ నుంచి మహాత్మాగాంధీ బస్టేషన్ వరకు వివిధ మార్గాల్లో 66 కి.మీ.ల మేర మెట్రో సదుపాయం కలుగనుంది. తదుపరి దశలో మరో వంద కి.మీ.ల మేర మెట్రో పొడిగించే అవకాశాలున్నాయి. ఈ నేపథ్యంలో కొత్తగా ఇళ్లు కొనుక్కునే వారు అందుబాటు ధరలు, ఇతర సదుపాయాలనే పరిగణనలోకి తీసుకుంటారు. ఇదే తరుణంలో మెట్రో స్టేషన్లకు సమీపంలోని ఇళ్లు, అద్దెల ధరలు భారీగా పెరగనున్నాయి. మెట్రో స్టేషన్ల నుంచి కాలనీలకు సెకండరీ రవాణాను అభివృద్ధి చేస్తే అన్ని ప్రాంతాలూ సమానంగా అభివృద్ధి చెందుతాయని నిపుణులు చెబుతున్నారు. మెట్రో వల్ల అన్ని ప్రాంతాల్లో అభివృద్ధి మెట్రో రైలు ప్రయాణం వల్ల ఎన్నో ప్రయోజనాలున్నాయి. వాహన కాలుష్యం , ట్రాఫిక్ చిక్కులుండవు. ప్రజలకు మెట్రో సంస్కృతి అలవడుతుంది. అంటే మెట్రో స్టేషన్ల వద్ద మాల్స్‌లో కొనుగోళ్లు తదితరమైనవి. అయితే మెట్రో స్టేషన్ల వద్ద తగినంత పార్కింగ్ సదుపాయం కల్పించాలి. మెట్రో స్టేషన్ల నుంచి కాలనీలకు వెళ్లేందుకు ప్రతి 15 నిమిషాలకో బస్సు ఉండేలా ఏర్పాట్లు చేయాలి. ప్రజలు కూడా మెట్రోరైలును తమదిగా భావించి పరిశుభ్రంగా ఉంచాలి. ఉన్నతాధికారులు, సెలబ్రిటీలు మెట్రోల్లో ప్రయాణం చేయడం ద్వారా మిగతా వారూ మెట్రోరైల్లోనే ప్రయాణిస్తారు. తద్వారా రోడ్లపైకి వచ్చే వాహనాలు తగ్గుతాయి. – పద్మనాభరెడ్డి, ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ -
ప్రణాళికతోనే సులభతర ప్రజా రవాణా
సాక్షి, హైదరాబాద్: సులభతర ప్రజా రవాణాకు పక్కా ప్రణాళిక తప్పనిసరి అని రాష్ట్ర పట్టణాభివృద్ధి, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారకరామారావు పేర్కొన్నారు. హైటెక్స్‌లో 3 రోజులపాటు జరిగిన పదో అర్బన్ మొబిలిటీ ఇండియా–2017 సదస్సు సోమవారంతో ముగిసింది. కార్యక్రమ ముగింపు వేడుకలకు కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, దేశంలో 33 శాతం జనాభా పట్టణాల్లో ఉంటుండగా.. తెలంగాణలో 43 శాతం నగర జనాభా ఉందని చెప్పారు. 2030 నాటికి పట్టణ జనాభా 50 శాతానికి చేరుతుందని, భవిష్యత్ అవసరాలు దృష్టిలో ఉంచుకుని ఆ మేరకు చర్యలు చేపట్టాలన్నారు. రోడ్ల విస్తరణ, మెట్రో రైల్, ఫ్లై ఓవర్లు, స్కైవేలు మెరుగైన ప్రజా రవాణాకు పరిష్కారం కాదని, అవసరాలకు అనుగుణంగా వీటిని ఏర్పాటు చేయాలన్నారు. హైదరాబాద్‌లో మురికివాడల ప్రజలకు మెరుగైన జీవితాన్ని అందించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని తెలిపారు. ప్రత్యేక చొరవ తీసుకుని 560 చదరపు అడుగుల విస్తీర్ణం గల ఇంటిని రూ.8.7 లక్షల వ్యయంతో నిర్మించి ఇస్తుందని పేర్కొన్నారు. లబ్ధిదారుల వాటా సున్నా శాతమని స్పష్టం చేశారు. త్వరలో హైదరాబాద్ రోడ్లపై ఎలక్ట్రిక్ బస్సులు, వాహనాలు రానున్నాయని పేర్కొన్నారు. సమగ్ర ప్రణాళికే ఏకైక మార్గం ఈ సదస్సులో 56 దేశీయ నగరాలు, 30 విదేశీ నగరాల్లో ప్రజా రవాణా వ్యవస్థ తీరుతెన్నులపై ఆయా నగరాల ప్రతినిధులు ప్రదర్శనలిచ్చారు. పట్టణీకరణ వేగవంతంగా అభివృద్ధి చెందుతున్న తరుణంలో ప్రజా రవాణాపై ప్రణాళిక లేకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నట్లు వక్తలు అభిప్రాయపడ్డారు. ప్రజా రవాణా సమస్యలను అధిగమించే అంశంపై కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మాజీ ఉన్నతాధికారి ఓపీ అగర్వాల్ ఇచ్చిన ప్రజెంటేషన్.. ప్రతినిధులను ఆలోచింపజేసింది. నగర పాలక సంస్థలు, ప్రభుత్వ విభాగాలన్నీ సమగ్ర ప్రణాళికను రూపొందించాలని అగర్వాల్ పేర్కొన్నారు. హోదా ప్రదర్శనలో భాగంగా కార్ల సంఖ్య విపరీతంగా పెరుగుతోందని విమర్శించారు. ప్రతి నగరం ప్రజా రవాణాపై సమగ్ర ప్రణాళిక రూపొందించాలని పేర్కొన్నారు. మధ్యప్రదేశ్‌లో భోపాల్, ఇండోర్, జబల్పూర్, ఉజ్జయినీ పట్టణాల్లో మెరుగైన ప్రజా రవాణా వ్యవస్థను అమలు చేస్తున్నట్లు ఆ రాష్ట్ర ఉన్నతాధికారి వివేక్ అగర్వాల్ పేర్కొన్నారు. హైదరాబాద్ మెట్రో రైల్ నిర్మాణంపై హెచ్ఎంఆర్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈనెల 28న ప్రధాని చేతులమీదుగా ఈ ప్రాజెక్టును ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ కార్యదర్శి డీఎస్ మిశ్రా మాట్లాడుతూ ‘ఈరోజు ఉదయం హైటెక్ సిటీ నుంచి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కలిసేందుకు వెళ్లా. 10 కిలోమీటర్ల దూరం కూడా లేదు. కానీ వెళ్లడానికి గంట.. తిరిగి రావడానికి గంట పట్టింది’అంటూ హైదరాబాద్ ట్రాఫిక్ సమస్యను ఉటంకించారు. గ్రీన్ అర్బన్ మొబిలిటీ ఇండియా–2018 వచ్చే ఏడాది నవంబర్ 2 నుంచి 4 వరకు నాగపూర్‌లో నిర్వహించనున్నట్లు వెల్లడించారు. పట్టణ ప్రాంతాల్లో ప్రజా రవాణాపై వివిధ కేటగిరీల్లో అవార్డులు బెస్ట్ సిటీ: సూరత్ మున్సిపల్ కార్పొరేషన్ బెస్ట్ నాన్ మోటరైజ్డ్ ట్రాన్స్పోర్ట్: మైసూర్ బెస్ట్ అర్బన్ ట్రాన్స్పోర్ట్ ప్రాక్టీసెస్: జీహెచ్ఎంసీ, చిత్తూరు మున్సిపల్ కార్పొరేషన్. వీటితో పాటు భోపాల్, లక్నో, నోయిడా, పుణె, తిరువనంతపురం నగరాలు అవార్డులు దక్కించుకున్నాయి. -
ఆర్టీసీకి జాతీయ స్థాయి ప్రతిభా పురస్కారం
ఏఎస్ఆర్టీయూ నుంచి అవార్డు అందుకున్న ఎండీ మాలకొండయ్య సాక్షి, అమరావతి: ఆర్టీసీకి జాతీయ స్థాయి రవాణా ప్రతిభ పురస్కారం దక్కింది. ప్రజా రవాణా వ్యవస్థలో నూతన ఆవిష్కరణలు అనే అంశంపై ఆల్ ఇండియా స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండర్ టేకింగ్స్ (ఏఎస్ఆర్టీయూ) అంతర్జాతీయ సదస్సు నిర్వహించింది. ఈనెల 10, 11 తేదీల్లో ఢిల్లీలోని మాణిక్ షా సెంటర్లో జరిగిన సదస్సులో వాహన తయారీదారులు, వాహన విడి భాగాల తయారీ దారులు పాల్గొన్నారు. జాతీయ, అంతర్జాతీయ రవాణా రంగంలో వివిధ అంశాలపై నివేదికలు సమర్పించారు. ‘టెస్ట్ బ్రాండింగ్’, మార్కెటింగ్ అండ్ కమ్యూనికేషన్స్ విభాగంలో నూతన అల్ట్రా డీలక్స్ బ్రాండ్‌ను ఏపీఎస్ఆర్టీసీ ప్రవేశపెట్టినందుకుగాను ఈ పురస్కారం దక్కింది. పురస్కారం కింద ట్రోఫీ, ప్రశంసా పత్రం, రూ.2.50 లక్షల నగదు బహుమతి, ఏపీఎస్ఆర్టీసీకి దక్కాయి. అవార్డును ఎండీ మాలకొండయ్య, డిప్యూటీ ఛీఫ్ మెకానికల్ ఇంజనీర్లు నాగేశ్వరరావు, శ్రీనివాసరావులు అందుకున్నారు. -
‘ఏప్రిల్ 15 నుంచి రెండో విడత సరి-బేసి’
సాక్షి, న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో కాలుష్యాన్ని నివారించేందుకు చేపట్టిన సరి-బేసి వాహన విధానం రెండో దశను ఏప్రిల్ 15 నుంచి 30వ తేదీ వరకూ చేపట్టనున్నట్టు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు. రెండో దశలోనూ మహిళలు, వీఐపీలు, ద్విచక్ర వాహనాలకు మినహాయింపు కొనసాగుతుందన్నారు. జనవరి 1 నుంచి 15వ తేదీ వరకూ ప్రయోగాత్మకంగా సరి-బేసి విధానాన్ని ఢిల్లీలో ప్రవేశపెట్టడం తెలిసిందే. గురువారం ఢిల్లీలో విలేకరులతో మాట్లాడిన కేజ్రీవాల్ సరి-బేసి రెండో దశ తేదీలను ప్రకటించారు. సరి-బేసి విధానానికి మంచి స్పందన లభించిందని, మెజారిటీ ప్రజలు ఈ విధానాన్ని కొనసాగించాలని కోరారని చెప్పారు. ప్రతి నెలా పదిహేనుల రోజుల పాటు ఈ విధానాన్ని అమలు చేసే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోందన్నారు. ఢిల్లీలోని ప్రజా రవాణా వ్యవస్థ ప్రయాణికులను పూర్తి స్థాయిలో చేరవేసేందుకు అనువుగా లేదన్నారు. ప్రజా రవాణా వ్యవస్థను మెరుగు పరిచేందుకు సుమారు 3 వేల బస్సులను(వెయ్యి లగ్జరీ బస్సులతో పాటు) అందుబాటులోకి తీసుకురానున్నట్టు చెప్పారు. -
‘సరి-బేసి’ సాధించింది ఏమిటి?
తగ్గిన వాహనాల రద్దీ కాలుష్యంలో తగ్గింపుపై అస్పష్టత న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో కాలుష్యానికి కళ్లెం వేయడానికి సీఎం అరవింద్ కేజ్రీవాల్ సర్కారు తీసుకొచ్చిన ‘సరి-బేసి’ విధానాన్ని ఈ నెల 1 నుంచి 15వరకు ప్రయోగపూర్వకంగా అమలు చేశారు. సరి, బేసి సంఖ్యలున్న నాలుగు చక్రాల వాహనాలను రోజు మార్చి రోజు రోడ్లపైకి అనుమతించారు. ఈ పక్షం రోజుల్లో ‘సరి-బేసి’తో ఎలాంటి ఫలితాలు వచ్చాయి? రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్నట్లు కాలుష్యం దాదాపు 40 శాతం తగ్గిందా? ట్రాఫిక్ రద్దీ మాయమైందా? అని ప్రశ్నిస్తే సానుకూల ఫలితాలే వచ్చాయని చెప్పొచ్చు. అయితే ఈ విధానం వల్ల మాత్రమే కాలుష్యం తగ్గదని, ప్రజా రవాణా వ్యవస్థ మెరుగుపడాలని నిపుణులు చెబుతున్నారు. డీజిల్ వాహనాల సంఖ్య తగ్గించి, కాలుష్య కారక పరిశ్రమలపై చర్యలు తీసుకోవాలని, సైకిల్, ఎలక్ట్రిక్ వాహనాలు వంటి ప్రత్యామ్నాయాలపై దృష్టి సారించాలని అంటున్నారు. తగ్గిన ట్రాఫిక్ రద్దీ .. సరి-బేసి రోజుల్లో చాలా రోడ్లపై వాహనాల సంఖ్య తగ్గింది. ట్రాఫిక్ జామ్‌లూ చాలా వరకు తగ్గాయి. అయితే ప్రధాన కూడళ్లలో రద్దీ తగ్గలేదు. నగరం చుట్టుపక్కలున్న గుర్గావ్, ఫరీదాబాద్, ఘజియాబాద్ వంటి చోట్లనుంచి వాహనాలు ఎప్పట్లాగే పెద్దసంఖ్యలో వచ్చాయి. ఫోర్టిస్ హాస్పిటల్ నుంచి 10కి.మీ దూరం వెళ్లడానికి ఇదివరకు 35 నిమిషాలు పట్టేదని, ‘సరి-బేసి’తో 18 నిమిషాల్లో వెళ్లగలుతున్నానని ఓ అంబులెన్స్ డ్రైవర్ చెప్పారు. వాహనాల సంఖ్య తగ్గడం వల్ల ప్రయాణికులు గమ్యస్థానాలు చేరుకోడానికి నలుగురు, ఐదుగురు కలసి కారులో(కార్ పూలింగ్) వెళ్లారు, బస్సులు, రైళ్లను కూడా ఆశ్రయించారు. ప్రభుత్వ విధానాల్లో ప్రజల భాగస్వామ్యానికి సరి-బేసి ఒక ఉదాహరణ అని, దీన్ని మిగిలిన రంగాల్లోనూ అమలు చేయాలని పాలనా నిపుణులు చెబుతున్నారు. కాలుష్యం తగ్గిందా?.. ఢిల్లీలో కాలుష్యానికి వాహనాలు మాత్రమే కారణం కాదని నిపుణులు చెబుతున్నారు. పక్షం రోజుల్లో కాలుష్య స్థాయిలు తగ్గాయని రాష్ట్ర సర్కారు చెబుతున్నా, చాలాచోట్ల ఇంతకుముందున్న స్థాయిలే కొనసాగాయని అంటున్నారు. అయితే గతంతో పోలిస్తే కాలుష్యం తగ్గిందని మరికొందరు అంటున్నారు. కస్తూర్బా నగర్‌లోని ద్యాల్సింగ్ కాలేజీ ప్రాంతంలో పీఎం10(10 మైక్రోమీటర్ల వరకు ఉన్న పదార్థం) క్యూబిక్ మీటరుకు 149 మైక్రోగ్రాములుగా నమోదైంది. తూర్పు ఢిల్లీలోని పత్పర్గంజ్లో 500 మైక్రోగ్రాములకు చేరింది. జాతీయ వాయు నాణ్యత సూచీ(ఏక్యూఐ) ప్రకారం పీఎం10 స్థాయి 100 మైక్రోగ్రాములు ఉంటేనే సురక్షితం. అతిసూక్ష్మ కణాలైన పీఎం2.5 (2.5 మైక్రోమీటర్ల కంటే చిన్నది) పరిమిత స్థాయి క్యూబిక్ మీటరుకు 66 మైక్రోగ్రాములు కాగా కమలానెహ్రూ కాలేజీ వద్ద 226 మైక్రోగ్రాములు, ఢిల్లీ పబ్లిక్ స్కూల్(కైలాస్) వద్ద 217 గ్రాములుగా నమోదైంది. ప్రభుత్వం మాత్రం పీఎం10 స్థాయి 450 నుంచి 250 వరకు తగ్గిందని చెబుతోంది. కాలుష్య స్థాయిలు వాహనాల వల్లే కాకుండా గాలి, వాతావరణం, ఇతర స్థానిక ఉద్గారాలపై ఆధారపడి ఉంటుందని సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్(సీఎస్ఈ) చెప్పారు. తగ్గింపుపై ఇంకా స్పష్టత రావాలని, పక్షం రోజుల్లో ఫలితాలపై తుది అంచనాకు రాలేమని నిపుణులు చెబుతున్నారు. కార్ల కాలుష్యం 40% తగ్గింది: సీఎస్ఈ ‘సరి-బేసి’తో ఢిల్లీలో కార్ల నుంచి వచ్చే ఉద్గారాలు 30- 40 శాతం వరకు తగ్గాయని సీఎస్ఈ తెలిపింది. వీధుల్లో కార్ల సంఖ్య తగ్గడమే దీనికి కారణమని సంస్థ ప్రతినిధి వివేక్ ఛటోపాధ్యాయ చెప్పారు. త్వరలో మెరుగైన విధానం: కేజ్రీ సరి- బేసి వాహన వినియోగం విధానం విజయవంతమైందని సీఎం కేజ్రీవాల్ పేర్కొన్నారు. ఢిల్లీ ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొన్నారన్నారు. విధానంలో లోటుపాట్లను అధ్యయనం చేసి.. మెరుగుపర్చిన విధానాన్ని త్వరలో ప్రకటిస్తామన్నారు. ‘సరి-బేసి’కి సహకరించిన పౌరులకు కృతజ్ఞతలు చెప్పేందుకు ఆదివారం నిర్వహించిన ఒక కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ‘సరి-బేసి’కి మద్దతుగా మరి కొందరితో కలిసి తన వాహనాన్ని పంచుకున్న సీజేఐ జస్టిస్ టీఎస్ ఠాకూర్‌ను ప్రశంసిస్తూ.. ఆయన చర్య లక్షలాది మందికి స్ఫూర్తిగా నిలిచిందన్నారు. -
మరింత చేరువగా...
ఏడు జిల్లా కేంద్రాలను బెంగళూరుతో కలుపుతూ రైలు సౌకర్యం 23 పట్టణ, నగరాల మధ్య 105 రైల్వే స్టేషన్లు 15 లక్షల మందికి ప్రయోజనం {పాజెక్టు వ్యయం రూ.8 వేల కోట్లు బెంగళూరు : ప్రజారవాణా వ్యవస్థను పెంపొందించడంతో పాటు బస్సు సర్వీసులపై ఒత్తిడిని తగ్గిం చడానికి కర్ణాటక ప్రభుత్వం ృహత్ ప్రణాళికను చేపట్టనుంది. దాదాపు రూ.8వేల కోట్ల వ్యయం కాగల ఈ ప్రాజెక్టును మూడు దశల్లో పూర్తి చే యనుంది. ఇందుకు సంబంధించిన నివేదికకు కేంద్రం నుంచి ప్రాథమిక అంగీకారం లభించినట్లు సమాచారం. బెంగళూరుకు దగ్గరగా ఉన్న ద్వితీయ శ్రేణి నగరాలు, పట్టణాల నుంచి నిత్యం ఉద్యోగ, వ్యాపార, ఉపాధి నిమిత్తం 15 లక్షల మంది రాకపోకలు సాగిస్తున్నట్ల్లు పట్టణాభివృద్ధి శాఖ గణాంకాలు చెబుతున్నాయి. వీరు ప్రధానంగా సొంతవాహనాలు, లేదా బస్సుల ద్వారా బెంగళూరుకు వస్తుంటారు. రానున్న పదేళ్లలో ఇది మరింతగా పెరిగే అవకాశం ఉం ది. అదే కనుక జరిగితే ఇప్పటికే బెంగళూరు వా సులకు తలనొప్పిగా మారిన ట్రాఫిక్ సమస్య రెట్టింపు అవుతుంది. అందుకే ఈ సమస్యను పరిష్కరించే దిశగా బెంగళూరుకు వంద కిలోమీటర్ల పరిధిలోని ఏడు జిల్లా కేంద్రాలను వాటి మధ్య ఉన్న 23 చిన్ననగరాలు, పట్టణాలకు రైలు వ్యవస్థను ఏర్పాటు చేయనుంది. ఈ ప్రాజెక్టులో భాగంగా మొత్తం 440 కిలోమీటర్ల రైలు మార్గం అందుబాటులోకి వస్తుంది. అంతేకాకుండా నూతనంగా 43 రైల్వే స్టేషన్లతో పాటు మొత్తం 105 రైల్వే స్టేషన్లు ఏర్పడుతాయి. ఇందులో కొన్నింటిని గ్రామీణ ప్రాంతాల్లో కూడా నిర్మించనున్నారు. ప్రతి స్టేషన్ నుంచి కనిష్టంగా 60 నిమిషాలు, గరిష్టంగా 90 నిమిషాల్లో బెంగళూరుకు చేరుకునేలా ప్రాజెక్టు రూపకల్పన జరి గింది. ఈ ప్రాజెక్టులో సగటున ప్రతి 15 నిమిషాలకు ఒకటి చొప్పు నా 24 గంటలూ రైలు సౌకర్యం అందుబాటులో ఉంటుంది. ప్రతి రైలులో 15 బోగీలు ఉండగా 3వేల ప్రయాణికులు ప్రయాణించడానికి అవకాశం ఉంటుంది. రూ.3,400 కోట్లు ఖర్చుకాగల మొదటి దశలో బెంగళూరు-బంగారుపేట, రెండోవిడతలో రూ.2,300 కోట్ల నిధులతో బెంగళూరు-రామనగర, మండ్య, రూ.2,300 కోట్లు ఖర్చుతో మూడో విడతలో బెంగళూరు-చిక్కబళ్లాపుర,దొడ్డబళ్లాపుర మధ్యలో ఉన్న అన్ని చిన్నచిన్న నగరాలకు రైలు సౌకర్యం కల్పించబడుతుంది. ప్రస్తుతం ఉన్న ఫ్లాట్‌ఫామ్, రైల్వే స్టేషన్ల ఉన్నతీకరణతో పాటు సిగ్నల్ వ్యవస్థకు కూడా ఆధునిక పరిజ్ఞానాన్ని జోడించనున్నారు. ఈ విషయమై రాష్ట్ర పట్టణాభివృద్ధి శాఖ ఉన్నతాధికారి ఒకరు మాట్లాడుతూ...‘మెట్రోతో పోలిస్తే ఈ నూతన ప్రాజెక్టుకు అయ్యే ఖర్చు తక్కువ. మెట్రోకు కిలోమీటరుకు సగటున రూ.300 కోట్లు ఖర్చవుతుంది. అయితే నూతన ప్రాజెక్టులో కిలోమీటరుకు అయ్యే ఖర్చు రూ. 18 కోట్లు మాత్రమే. అంతేకాక మెట్రోకు భూ సేకరణ కూడా అవసరం. నూతన ప్రాజెక్టుకు కొత్తగా భూమిని సేకరించాల్సిన అవసరం లేదు. ఆధునికత సాంకేతిక పరిజ్ఞానంతో పాటు మానవ వనరులను పెంచితే సరిపోతుంది. ఏడాది పాటు కృషిచేసి రూపొందించిన ఈ ప్రాజెక్టుకు కేంద్రం నుంచి సూత్రప్రాయంగా అనుమతి లభించింది.’ అని పేర్కొన్నారు. -
‘విశ్వ’మంత సేవకు...
ప్రణాళికలు సిద్ధం చేసిన గ్రేటర్ ఆర్టీసీ 11 బస్ టెర్మినళ్లు, 55 డిపోలకు ప్రతిపాదనలు సాక్షి, సిటీబ్యూరో: విశ్వనగరం దిశగా గ్రేటర్ హైదరాబాద్ అడుగులు వేస్తోంది. అదే స్థాయిలో సేవలను అందించేందుకు గ్రేటర్ ఆర్టీసీ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. భవిష్యత్తులో నగర అవసరాలకు అనుగుణంగా సర్వీసులు పెంచేందుకు ప్రతిపాదనలు రూపొందిస్తోంది. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ను పెంచే విధంగా, బలమైన ప్రజా రవాణా వ్యవస్థగా ఇప్పుడున్న స్థానాన్ని నిలబెట్టుకునే దిశగా దృష్టి సారిస్తోంది. నగరం చుట్టూ 11 భారీ టెర్మినల్స్, అదనంగా 55 బస్ డిపోలు ఏర్పాటు చేయనుంది. నగరంలో ప్రస్తుతం 34.02 లక్షల మంది ప్రయాణికులు ఆర్టీసీ సేవలను వినియోగించుకుంటున్నారు. 2019 నాటికి ఈ సంఖ్య రెట్టింపయ్యే అవకాశం ఉంది. ఘట్కేసర్ , పెద్ద అంబర్పేట్, శామీర్‌పేట్, గండిమైసమ్మ, శంకర్పల్లి, మొయినాబాద్, తదితర ప్రాంతా ల్లో, ఔటర్ రింగురోడ్డు చుట్టూ వందలాది కాలనీలు కొత్తగా ఆవిర్భవించే అవకాశం ఉంది. ఇందుకనుగుణంగా సిటీ సర్వీసులను పెంచేందుకు ఆర్టీసీ ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ప్రస్తుతం గ్రేటర్లో 28 డిపోలు ఉన్నాయి. మొత్తం 1239 రూట్లలో 3,798 బస్సులు ప్రజలకు రవాణా సదుపాయాన్ని అందజేస్తున్నాయి. ఇప్పుడు ఉన్న డిపోల సంఖ్యను వచ్చే ఐదేళ్లలో 83కు పెంచాలని, 8 వేలకు పైగా బస్సులను అందుబాటులోకి తేవాలని ఆర్టీసీ భావిస్తోంది. రానున్న ఐదేళ్లలో ప్రయాణికుల సంఖ్య 60 లక్షల నుంచి 70 లక్షల వరకు పెరిగే అవకాశం ఉన్నట్లు అంచనా వేస్తోంది. ప్రవేశ మార్గాల్లో 11 భారీ టెర్మినల్స్.. వాహనాల రద్దీ, రోజు రోజుకు పెరుగున్న నగర జనాభా, ఇరుకైపోతోన్న రహదారులు, దూరప్రాంతాల నుంచి వచ్చే బస్సులు నగరంలోకి ప్రవేశించేందుకు ఇబ్బందుంలు ఎదువరుతున్నాయి. భవిష్యత్తు అవ సరాలను దృష్టిలో ఉంచుకొని నగరానికి నాలుగువైపులా ప్రధాన ముఖద్వారాల్లో 11 భారీ టెర్మినల్స్‌ను ఏర్పాటు చేయాలని యోచిస్తోంది. వీటి నుంచి ప్రయాణికులు నగరంలోకి వచ్చి, వెళ్లేందుకు లోకల్ సర్వీసులు అందుబాటులో ఉంటాయి. ఈ మేరకు బెంగళూరు మార్గంలో ఆరాంఘర్, వికారాబాద్ మార్గంలో మొయినాబాద్, శంకర్పల్లి, ముంబయి నుంచి వచ్చే బస్సులకు సుల్తాన్పూర్ వద్ద, మెదక్ మార్గంలో గండిమైసమ్మ వద్ద, నాగ్‌పూర్ మార్గంలో రాకపోకలు సాగించే బస్సులకు గౌడవెల్లి వద్ద, కరీంనగర్ మార్గంలో శామీర్‌పేట్, వరంగల్ వైపు ఘట్కేసర్ వద్ద, విజయవాడ మార్గంలో పెద్ద అంబర్పేట్ , నాగార్జున్‌సాగర్ మార్గంలో ఇబ్రహీంపట్నం, శ్రీశైలం మార్గంలో తుక్కుగూడ వద్ద భారీ టెర్మినళ్ల నిర్మాణాలకు ప్రతిపాదనలు సిద్ధం చేసింది. 55 కొత్త డిపోలు అవసరం ... ప్రస్తుతం జంటనగరాల పరిధిలో ఉన్న 28 డిపోలను ఐదేళ్లలో 83 కు పెంచేవిధంగా ఆర్టీసీ ప్రతిపాదనలు చేస్తోంది. ఇందుకు స్థలాలు అవసరం. ప్రస్తుతం ఉన్న డిపోల్లో పార్కింగ్ సామర్ధ్యానికి రెట్టింపు బస్సులు ఉన్నాయి. వంద బస్సులకు మాత్రమే పార్కింగ్ స్థలం అందుబాటులో ఉన్న డిపోల్లో 150 నుంచి 200 బస్సులను పార్క్ చేస్తున్నారు. ఐదేళ్లలో బస్సుల సంఖ్య 8 వేలు దాటే అవకాశం ఉంది. ఆ దృష్ట్యా డి పోల సంఘ్య పెంపు తప్పనిసరని భావిస్తోంది. నగరం చుట్టూ ఉన్న రేడియల్ రోడ్లలో సైతం బస్సు డిపోలను ఏర్పాటు చేయాలనుకుంటోంది. కొత్తగా బాలాజీనగర్, భూదాన్‌పోచంపల్లి, బోరబండ, ఏదులనాగులపల్లి, కోహెడ, కెపీహెచ్బీ ఫోర్త్ ఫేస్, మంకాల్, మొయినాబాద్, ముత్తంగి, పోచారం, కుత్భుల్లాపూర్, ఉప్పర్‌పల్లి, కామారెడ్డిగూడ, కొండాపూర్, గచ్చిబౌలి కాంటినెంటల్ హాస్పిటల్, గచ్చిబౌలి ఫైనాన్షియల్ హబ్, గచ్చిబౌలి క్యూ సిటీ, సర్దార్‌నగర్, నాదర్‌గూల్, శంషాబాద్, చేవె ళ్ల, కాటేదాన్ మధుబన్ కాలనీలలో కొత్త డిపోలకు ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ప్రభుత్వం స్థలాలను కేటాయిస్తే రేడియల్ రోడ్ల చుట్టూ మరో 33 డిపోలు ఏర్పాటు చేసి, రవా ణా సదుపాయాలు పెంచాలని ఆర్టీసీ భావిస్తోంది.