Regod
-
కరెంటు కష్టాలు పట్టించుకోరా?
రేగోడ్: రైతన్న కష్టాలను ఎవరూ పట్టించుకోవడం లేదు. మాది రైతు రాజ్యమని చెప్పుకునే పాలకులు వారి క్షేమాన్ని గాలికొదిలేస్తున్నారు. తమ సమస్య పరిష్కరించాలని పలుమార్లు అధికారులకు చెప్పినా, ప్రజావాణిలో మొరపెట్టుకున్నా కనికరించేవారు కరువయ్యారని రైతులు వాపోతున్నారు. రేగోడ్లోని ఊరకుంట ప్రాంతంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ ఉంది. దీనికింద సుమారు పది మంది రైతులకు చెందిన ఇరవై ఎకరాల భూమి ఉంది. ఇందులో ఎక్కువ మంది రైతులు వరి సాగు చేస్తారు. ఎనిమిది నెలల క్రితం ట్రాన్స్ఫార్మర్ చెడిపోయింది. చెడిపోయిన ట్రాన్స్ఫార్మర్కు మరమ్మతులు చేయాలని ఇక్కడి రైతులు సంబంధిత అధికారులను కోరినా స్పందించలేదు. బోర్లు పనిచేయక ఇదివరకే చెరుకు పంట పాడైంది. ట్రాన్స్ఫార్మర్కు మరమ్మతులు చేయాలని గతనెల 11న స్థానిక తహసీల్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణిలో రైతులు ఫిర్యాదు చేశారు. ఎట్టకేలకు స్పందించిన అధికారులు ట్రాన్స్ఫార్మర్కు డైరెక్ట్‌గా కనెక్షన్ ఇచ్చి ఆన్ ఆఫ్ సిస్టం మాత్రం ఏర్పాటు చేయలేదు. దీంతో రైతు శేరి శివన్న బోరుమోటారు, స్టార్టర్, కేబుల్ కాలిపోయింది. ఫలితంగా రూ.8వేలు నష్టం జరిగింది. అధికారుల నిర్లక్ష్యం కారణంగా పెసర, పత్తి వంటి పంటలు సాగు చేశారు. ఆన్ఆఫ్ లేకపోవడంతో ఎప్పుడు మోటార్లు చెడిపోతాయోనని రైతులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏదైనా ప్రమాదం జరిగితే కరెంటును ఆపేసేందుకు కూడా వీలులేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కరెంట్ సరఫరాలో ఇబ్బందులు ఎదురైతే వెంటనే స్పందించాల్సిన అధికారులు రైతులపట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఉన్నతాధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. మోటారు కాలిపోయింది విద్యుత్ ట్రాన్స్ఫార్మర్కు ఆన్ఆఫ్ ఏర్పాటు చేయకపోవడంతో బోరుమోటారు కాలిపోయింది. రూ.10వేలు నష్టం జరిగింది. వేసిన చెరుకు పాడైపోతోంది. - శేరిశివన్న, రైతు ఆన్ఆఫ్ ఏర్పాటు చేయాలి ట్రాన్స్ఫార్మర్కు డైరెక్ట్‌గా కనెక్షన్ ఇచ్చారు. కానీ ఆన్ఆఫ్ ఏర్పాటు చేయలేదు. దీంతో మోటార్లు కాలిపోతున్నాయి. వరిపంటలు వేయాల్సిన రైతులు పెసర పంటలు వేసుకుంటున్నారు. - నాగప్ప, రైతు -
రేగోడ్ ను సంగారెడ్డిలోనే ఉంచాలని ధర్నా
రేగోడ్: మెదక్ జిల్లాలోని రేగోడ్ మండలాన్ని సంగారెడ్డి జిల్లాలో కలపాలని.. పెంచిన విద్యుత్, బస్సు చార్జీలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్, బీజేపీ ఆధ్వర్యంలో శనివారం రేగోడ్ మండల కేంద్రంలో మహాధర్నా నిర్వహించారు. అనంతరం తహసీల్ కార్యాలయం ఎదుట బైఠాయించారు. రేగోడ్ మండలాన్ని సంగారెడ్డి జిల్లాలో కలపాలని, చార్జీలను తగ్గించాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. -
అర్హులందరికీ పంట రుణాలు
రేగోడ్: రుణమాఫీ పొందిన అర్హులైన రైతులందరికీ పంట రుణాలు రీషెడ్యూల్ చేస్తామని జిల్లా వ్యవసాయశాఖ జాయింట్ డెరైక్టర్ (జేడీఏ) హుక్యానాయక్ తెలిపారు. మండలంలోని మేడికుంద గ్రామ శివారులో రైతులు సాగు చేసిన పత్తి పంటలను మంగళవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా జేడీఏ మాట్లాడుతూ.. వరిలో కాండం తొలుచు పురుగు నివారణకు కార్బోఫ్యురాన్ త్రీజీ గుళికలను ఎకరాకు పది కిలోల చొప్పున పొలంలో చల్లుకోవాలని సూచిం చారు. పత్తిలో రసంపీల్చే పురుగు నివారణకు లీటరు నీటిలో 1.5 గ్రాముల ఎసిపేట్ మ ందును పిచికారీ చేయాలని తె లిపారు. పత్తి గూడ రాలకుండా ఉండేందుకు మల్టీ కే మం దును స్ప్రే చేసుకోవాలని తెలిపారు. పచ్చ పురుగు నివారణకు లీటరు నీటిలో 1.6 మిల్లీలీటర్ల మోనోక్రొటోఫాస్ ముందును పిచి కారీ చేయాలని చెప్పారు. కందిలో ఆకుముడత పురుగు నివారణకు లీటరు నీటిలో ఒక గ్రాము ఎసిపేట్ మందును లేదా 2.5 మిల్లీలీటర్ల క్లోరోపైరిఫాస్ మందును కలుపుకుని పిచికారీ చేయాలని తెలిపారు. పంటల సాగులో క్రమం తప్పకుండా వ్యవసాయ శాఖ అధికారుల సలహాలు, సూచనలు పాటించాలన్నారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. రుణాలను రీషెడ్యూల్లో రైతులకు ఇబ్బందులు కలిగించవద్దని బ్యాంకర్లకు సూచించారు. వట్‌పల్లిలోని బ్యాంక్ అధికారులు తమకు రుణాలు మంజూరు చేయడంలో ఇబ్బందులకు గురిచేస్తున్నారని రైతులు ఆయనతో తెలిపారు. అధికారులతో మాట్లాడి రుణాలు మంజూరు చేయించేం దుకు చర్యలు తీసుకుంటానని జేడీఏ చెప్పారు. దీనిపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నదాతలకు సూచించారు. ఈ కార్యక్రమంలో డాట్ సెంటర్ శాస్త్రవేత్త డాక్టర్ శ్రీనివాస్, ఏడీఏ శ్రీనివాస్ ప్రసాద్, ఏఈఓ ఇంద్రయ్య, ఎంపీటీసీ అప్పారావ్, నాయకులు టి.శంకరప్ప, రైతులు ఉన్నారు.