ఆన్‌ఆఫ్‌కు నోచుకోని విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్
రేగోడ్: రైతన్న కష్టాలను ఎవరూ పట్టించుకోవడం లేదు. మాది రైతు రాజ్యమని చెప్పుకునే పాలకులు వారి క్షేమాన్ని గాలికొదిలేస్తున్నారు. తమ సమస్య పరిష్కరించాలని పలుమార్లు అధికారులకు చెప్పినా, ప్రజావాణిలో మొరపెట్టుకున్నా కనికరించేవారు కరువయ్యారని రైతులు వాపోతున్నారు.
రేగోడ్‌లోని ఊరకుంట ప్రాంతంలో విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ ఉంది. దీనికింద సుమారు పది మంది రైతులకు చెందిన ఇరవై ఎకరాల భూమి ఉంది. ఇందులో ఎక్కువ మంది రైతులు వరి సాగు చేస్తారు. ఎనిమిది నెలల క్రితం ట్రాన్స్‌ఫార్మర్ చెడిపోయింది. చెడిపోయిన ట్రాన్స్‌ఫార్మర్‌కు మరమ్మతులు చేయాలని ఇక్కడి రైతులు సంబంధిత అధికారులను కోరినా స్పందించలేదు.
బోర్లు పనిచేయక ఇదివరకే చెరుకు పంట పాడైంది. ట్రాన్స్‌ఫార్మర్‌కు మరమ్మతులు చేయాలని గతనెల 11న స్థానిక తహసీల్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణిలో రైతులు ఫిర్యాదు చేశారు. ఎట్టకేలకు స్పందించిన అధికారులు ట్రాన్స్‌ఫార్మర్‌కు డైరెక్ట్‌గా కనెక‌్షన్ ఇచ్చి ఆన్ ఆఫ్ సిస్టం మాత్రం ఏర్పాటు చేయలేదు. దీంతో రైతు శేరి శివన్న బోరుమోటారు, స్టార్టర్, కేబుల్ కాలిపోయింది. ఫలితంగా రూ.8వేలు నష్టం జరిగింది.
అధికారుల నిర్లక్ష్యం కారణంగా పెసర, పత్తి వంటి పంటలు సాగు చేశారు. ఆన్‌ఆఫ్ లేకపోవడంతో ఎప్పుడు మోటార్లు చెడిపోతాయోనని రైతులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏదైనా ప్రమాదం జరిగితే కరెంటును ఆపేసేందుకు కూడా వీలులేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కరెంట్ సరఫరాలో ఇబ్బందులు ఎదురైతే వెంటనే స్పందించాల్సిన అధికారులు రైతులపట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఉన్నతాధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.
మోటారు కాలిపోయింది
విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్‌కు ఆన్‌ఆఫ్ ఏర్పాటు చేయకపోవడంతో బోరుమోటారు కాలిపోయింది. రూ.10వేలు నష్టం జరిగింది. వేసిన చెరుకు పాడైపోతోంది. - శేరిశివన్న, రైతు
ఆన్‌ఆఫ్ ఏర్పాటు చేయాలి
ట్రాన్స్‌ఫార్మర్‌కు డైరెక్ట్‌గా కనెక‌్షన్ ఇచ్చారు. కానీ ఆన్‌ఆఫ్ ఏర్పాటు చేయలేదు. దీంతో మోటార్లు కాలిపోతున్నాయి. వరిపంటలు వేయాల్సిన రైతులు పెసర పంటలు వేసుకుంటున్నారు. - నాగప్ప, రైతు