Swabhimani Shetkari Sanghatana
-
మహారాష్ట్ర పాడి రైతుల నిరసన
-
నిరసన: పాలన్నీ రోడ్లపాలు
ముంబై : పాల సేకరణ ధరను ఒక లీటరుకు రూ.ఐదు పెంచాలని డిమాండ్ చేస్తూ మహారాష్ట్ర రైతులు సోమవారం ఆందోళనకు దిగారు. ఇందులో భాగంగా స్వాభిమానీ శేత్కారీ సంఘటన (ఎస్ఎస్ఎస్) ముంబైకి సరఫరా అయ్యే పాల ట్యాంకర్లను నిలిపివేసింది. పాల ప్యాకెట్లు, టెట్రా ప్యాకెట్లను చించేసి నిరసన తెలిపింది. పుణే, సతారా, సంగ్లీ, సోలాపూర్, వైజాపూర్, అమ్రావతి తదితర నగరాల్లోని రోడ్లపై దాదాపు రెండు లక్షల లీటర్ల పాలను పారబోసి ఆందోళన చేపట్టారు. స్వాభిమానీ శేత్కారీ సంఘటన చీఫ్, ఎంపీ రాజ్ శెట్టి మాట్లాడుతూ.. ప్రైవేట్, కో ఆపరేటీవ్ పాల సంఘాలు జూలై 21నుంచి పాల సేకరణ ధరను లీటరుకు రూ. 3 పెంచనున్నాయి. దాని వల్ల రైతుకు లాభమేమి లేదు. రైతుకు తాత్కాలిక ఉపశమనం కోసం పాల ఉత్పత్తికి రూ. ఐదు రాయితీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఎస్ఎస్ఎస్ ప్రతినిధి యోగేశ్ పాండే, కొంతమంది నిరసనకారులతో కలిసి పుణేలో పాల వాహనాలను అడ్డుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ తమ ఆందోళనను గుర్తించాలని కోరారు. చాలా డైరీలు ఆవుపాలకు రూ.17 మాత్రమే చెల్లిస్తున్నారని, ఇది లీటర్ నీళ్ల బాటిల్ కంటే తక్కువేనని మండిపడ్డారు. పాడి రైతులకు లీటర్ పాలకు రూ.35 అందేలా ప్రభుత్వం రాయితీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. కాగా, ఎస్ఎస్ఎస్ ఆందోళన నేపథ్యంలో ప్రభుత్వం తగిన చర్యలు తీసుకున్నట్లు పాడి అభివృద్ధి శాఖ మంత్రి మహాదేవ్ జంకర్ పేర్కొన్నారు. ముంబైకి కావాల్సిన పాలను ముందే తరలించామని, ఆందోళన జరిగే రెండు రోజుల పాటు ప్రభావం ఉండదని చెప్పారు. శెట్టి ఈ ఆందోళనను రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. ఎస్ఎస్ఎస్ కార్యకర్తలు చట్టాన్ని చేతుల్లోకి తీసుకోకూడదని సూచించారు. కాగా, ఎస్ఎస్ఎస్ ఆందోళనకు ప్రతిపక్షాలు మద్దతు పలికాయి. ప్రతిపక్ష నేత రాధాకృష్ణ మాట్లాడుతూ.. ఇతర ప్రతిపక్ష పార్టీలతో కలిసి కాంగ్రెస్ ఈ అంశంపై అసెంబ్లీలో అవిశ్వాస తీర్మాణం పెట్టనున్నట్లు పేర్కొన్నారు. ఎన్పీపీ కూడా రైతుల ఆందోళనకు మద్దతు తెలిపింది. -
రెండో రోజు మిశ్రమ స్పందన
సాక్షి, ముంబై/ షోలాపూర్, న్యూస్‌లైన్: చెరకు కనీస మద్దతు ధర రూ.మూడు వేలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ స్వాభిమాన్ శేత్కారీ సంఘటన్ పిలుపునిచ్చిన 48 గంటల బంద్‌కు మిశ్రమ స్పందన లభించింది. గురువారం ఉదయం నుంచి షోలాపూర్, సాంగ్లీతో పాటు కొల్హాపూర్ జిల్లాల్లోని పండర్పూర్, సాంగోలా, మంగళవెడ, కర్మాలా, మాల్‌శిరస్ తదితర తాలూకాలో సంఘటన కార్యకర్తలు షాపులు మూసివేయించారు.అయితే వారు వెళ్లిపోగానే యజమానులు మళ్లీ యథాతథంగా షాపులు తెరిచారు. గురువారం మధ్యాహ్నం మాల్‌శిరస్ తాలూకాలోని సాల్ముఖ్ చౌక్‌వద్ద రహదారిపై టైర్లకు నిప్పంటించి భయానక వాతావరణం సృష్టించారు. కొద్దిసేపు రాస్తారోకో నిర్వహించారు. కర్మాల పట్టణంలో శాహూ చౌక్ వద్ద కార్యకర్తలు వాహనాలను అడ్డుకున్నారు. సాంగోల, మంగళవెడ ప్రాంతాల్లో కొద్దిసేపు షాపులన్నీ మూసివేసినప్పటికీ జిల్ల్లాలో మాత్రం ఎలాంటి హింసాత్మక సంఘటనలు చోటుచేసుకోలేదని పోలీసు సూపరింటెండెంట్ రాజేశ్ ప్రధాన్ తెలిపారు. గతేడాది చెరకు ైరె తుల ఆందోళనలో రణరంగంగా మారిన ఇందాపూర్ తాలూకా ఈసారి ప్రశాంతంగా ఉందన్నారు. ‘ఉదయం నుంచి వ్యాపార లావాదేవీలు, విద్యా సంస్థలు ఎప్పటిలాగే కొనసాగాయి. సహకార మంత్రి హర్షవర్ధన్ పాటిల్ అధ్యక్షుడిగా ఉన్న కర్మయోగీ, నీరా బీమా చక్కెర ఫ్యాక్టరీలు యథాతథంగా నడిచాయ’ని తెలిపారు. 70 వాహనాలు ధ్వంసం... గురువారం ఉదయం నుంచి కొనసాగుతున్న చెరకు రైతుల ఆందోళనలో జిల్లాలో దాదాపు 70 వాహనాలు ధ్వంసమయ్యాయి. ఆర్టీసీకి అపార నష్టం కలిగిందని షోలాపూర్ జిల్లా అధికారి ప్రవీణ్ గెడం చెప్పారు. దీంతో ఆర్టీసీ యాజమాన్యం బస్సులన్నీ డిపోలకే పరిమితం చేసిందన్నారు. ‘ఇచల్ కరంజీలో పాలను రవాణాచేస్తున్న ట్యాంకర్‌ను అడ్డుకుని అందులోని పాలను నేలపాలు చేసేందుకు రైతులు ప్రయత్నించారు. ఆ వెంటనే పోలీసులు రంగంలోకి దిగి ఆందోళన కారులను చెదరగొట్టారు. ఇందులో 30 మంది గాయపడ్డార’ని ఆయన తెలిపారు. పుణే-బెంగళూర్ రహదారిని దిగ్బంధించారు. ఆస్తులకు నష్టం వాటిల్లకుండా జిల్లా పోలీసు యంత్రాంగాన్ని మరింత అప్రమత్తంచేసినట్లు ప్రవీణ్ చెప్పారు. ముందు జాగ్రత్త చర్యలన్నీ తీసుకుంటున్నామని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.