ఆందోళనకారులు చించేసిన పాల ప్యాకెట్లు
ముంబై : పాల సేకరణ ధరను ఒక లీటరుకు రూ.ఐదు పెంచాలని డిమాండ్ చేస్తూ మహారాష్ట్ర రైతులు సోమవారం ఆందోళనకు దిగారు. ఇందులో భాగంగా స్వాభిమానీ శేత్కారీ సంఘటన (ఎస్‌ఎస్‌ఎస్) ముంబైకి సరఫరా అయ్యే పాల ట్యాంకర్లను నిలిపివేసింది. పాల ప్యాకెట్లు, టెట్రా ప్యాకెట్లను చించేసి నిరసన తెలిపింది. పుణే, సతారా, సంగ్లీ, సోలాపూర్, వైజాపూర్, అమ్రావతి తదితర నగరాల్లోని రోడ్లపై దాదాపు రెండు లక్షల లీటర్ల పాలను పారబోసి ఆందోళన చేపట్టారు.
స్వాభిమానీ శేత్కారీ సంఘటన చీఫ్, ఎంపీ రాజ్ శెట్టి మాట్లాడుతూ.. ప్రైవేట్, కో ఆపరేటీవ్ పాల సంఘాలు జూలై 21నుంచి పాల సేకరణ ధరను లీటరుకు రూ. 3 పెంచనున్నాయి. దాని వల్ల రైతుకు లాభమేమి లేదు. రైతుకు తాత్కాలిక ఉపశమనం కోసం పాల ఉత్పత్తికి రూ. ఐదు రాయితీ ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ఎస్‌ఎస్‌ఎస్ ప్రతినిధి యోగేశ్ పాండే, కొంతమంది నిరసనకారులతో కలిసి పుణేలో పాల వాహనాలను అడ్డుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ తమ ఆందోళనను గుర్తించాలని కోరారు. చాలా డైరీలు ఆవుపాలకు రూ.17 మాత్రమే చెల్లిస్తున్నారని, ఇది లీటర్ నీళ్ల బాటిల్ కంటే తక్కువేనని మండిపడ్డారు. పాడి రైతులకు లీటర్ పాలకు రూ.35 అందేలా ప్రభుత్వం రాయితీ ఇవ్వాలని డిమాండ్ చేశారు.
కాగా, ఎస్‌ఎస్‌ఎస్ ఆందోళన నేపథ్యంలో ప్రభుత్వం తగిన చర్యలు తీసుకున్నట్లు పాడి అభివృద్ధి శాఖ మంత్రి మహాదేవ్ జంకర్ పేర్కొన్నారు. ముంబైకి కావాల్సిన పాలను ముందే తరలించామని, ఆందోళన జరిగే రెండు రోజుల పాటు ప్రభావం ఉండదని చెప్పారు. శెట్టి ఈ ఆందోళనను రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. ఎస్‌ఎస్‌ఎస్ కార్యకర్తలు చట్టాన్ని చేతుల్లోకి తీసుకోకూడదని సూచించారు.
కాగా, ఎస్‌ఎస్‌ఎస్ ఆందోళనకు ప్రతిపక్షాలు మద్దతు పలికాయి. ప్రతిపక్ష నేత రాధాకృష్ణ మాట్లాడుతూ.. ఇతర ప్రతిపక్ష పార్టీలతో కలిసి కాంగ్రెస్ ఈ అంశంపై అసెంబ్లీలో అవిశ్వాస తీర్మాణం పెట్టనున్నట్లు పేర్కొన్నారు. ఎన్పీపీ కూడా రైతుల ఆందోళనకు మద్దతు తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment